Iran tour
-
నూతన అధ్యాయం
అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఏకపక్షంగా అమలు చేసిన ఆంక్షల అవరోధాలను అధిగమించి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఇరాన్‌తో స్నేహ సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలమధ్యా అత్యంత కీలకమైన చబహర్ ఒప్పందంతోసహా 12 ఒప్పందాలపై సంతకాలయ్యాయి. ఉగ్రవాదంపై సమష్టి పోరుకు ఇరు దేశాలూ ప్రతినబూనాయి. భవిష్యత్తులో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి అనువైన అజెండాను ఖరారు చేసుకున్నాయి. మోదీ పర్యటన దౌత్యపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్నది. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, ఇరాన్‌లు పోటీ పడుతున్న తరుణంలో ఆయన ఈ పర్యటన జరిపారు. నెలక్రితం సౌదీ వెళ్లినప్పుడూ ఆయనకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇరాన్‌తో మన దేశానికున్న సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలకు ఎంతో చరిత్ర ఉంది. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత రెండు దేశాలమధ్యా భౌగోళిక సాన్నిహిత్యం దూరమైనా శతాబ్దాలనాటి సాంస్కృతిక సంబంధాలుగానీ, అవి ఏర్పర్చిన సుహృద్భావంగానీ చెక్కుచెదరలేదు. అయితే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మన దేశం అలీన పంథాను అనుసరిస్తే అప్పటి ఇరాన్ షా ప్రభుత్వం అమెరికాతో చెలిమి చేసేది. ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసిన ఇస్లామిక్ విప్లవ అనంతరం కూడా పరిస్థితులు పెద్దగా మారలేదు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిశాక, ఇరాన్లో ఖొమేనీ మరణించాక రెండు దేశాలూ మళ్లీ సన్నిహితం కావడం మొదలుపెట్టాయి. ఇలా ఎన్నో అవరోధాలు ఎదురైనా, అప్పుడుప్పుడు ఇరుదేశాల సంబంధాల్లోనూ అపశ్రుతులు వినిపించినా భారత్, ఇరాన్‌లు రెండూ ఎడమోహం, పెడమొహంగా ఎప్పుడూ లేవు. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)లో సభ్యదేశంగా ఉన్నా, అందువల్ల పాకిస్తాన్‌కు కాస్త దగ్గరైనా మన దేశంతో స్నేహ సంబంధాలకు మొదటినుంచీ ఇరాన్ ప్రాధాన్యతనిచ్చేది. అయినా అలాంటి దేశంలో మన ప్రధాని ఒకరు పర్యటన జరిపి పదిహేనేళ్లయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 2001లో నాటి ప్రధాని వాజపేయి ఇరాన్‌ను సందర్శించారు. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇరాన్ వెళ్లినా అది అలీన దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఉద్దేశించిన పర్యటన మాత్రమే. పశ్చిమ దేశాలతో మన దేశం సన్నిహితమైనకొద్దీ భారత్-ఇరాన్ సంబంధాలు ఆమేరకు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదుర్చు కోవడం కోసం 2004లో మన దేశం చర్చలు మొదలుపెట్టాక ఇరాన్‌తో పొర పొచ్చాలు రావడం మొదలైంది. 2005లో ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా తొలిసారి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)లో మన దేశం ఓటేయడం ఆ దేశానికి ఆగ్రహం కలిగించింది. 1994లో ఓఐసీ సమావేశంలో కశ్మీర్‌పై తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసిన ఇరాన్...2005 తర్వాత కశ్మీర్ విషయంలో అందుకు భిన్నమైన వైఖరిని తీసుకోవడం మొదలెట్టింది. అంతర్జాతీయ అణు సహకారం లభించాలంటే అమెరికాతో పౌర అణు ఒప్పందం అవసరమని మన దేశం భావించింది. ఆ ఒప్పందం సాకారమయ్యాక 2006నాటి హైడ్ చట్టం ప్రకారం ఇరాన్ అణు వివాదం విషయంలో అమెరికాను సమర్ధించక తప్పని స్థితి కలిగింది. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కబడాలంటే ఇరాన్ సహకారం తప్పనిసరని అమెరికా గ్రహించడం... అణు సమస్య విషయంలో సర్దుబాటుకు సిద్ధపడకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడుతుందని ఇరాన్ భావించడం పర్యవసానంగా పరిస్థితులు మారాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య అణు ఒప్పందం కుదరడంతో ఇరాన్‌తో మన సంబంధాలు మెరుగుపడటానికి అవకాశం ఏర్పడింది. ఆంక్షల కాలంలో ఇరాన్‌తో మన దేశానికి కుదిరిన ఒప్పందాల దుమ్ము దులిపే స్థితి వచ్చింది. అయినా అమెరికా మన దేశానికి మోకాలడ్డుతూనే ఉంది. ఆ దేశంతో సాధారణ సంబంధాల పున రుద్ధరణకు మరికొన్నాళ్లు వేచిచూడండంటూ ఒత్తిళ్లు తెచ్చింది. 2013 చివరిలో ఇరాన్‌తో తాత్కాలిక అణు ఒప్పందం కుదిరినా ఆ దేశంనుంచి ముడి చమురు దిగుమతుల్ని పెంచుకోవడానికి తొందరపడొద్దని మనకు సలహా ఇచ్చింది. 2014లో ముడి చమురుపై భారత్-ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ముందుకు కదలనివ్వలేదు. తమతో కుదుర్చుకున్న అణు ఒప్పందం విషయంలో ఇరాన్ చిత్తశుద్ధి ఎంతో తేలేవరకూ వేచిచూడాలని కోరింది. పర్యవసానంగా ఇరాన్నుంచి మన దేశానికి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2010-11 మధ్య మన చమురు అవసరాలను తీర్చడంలో రెండో స్థానంలో ఉన్న ఇరాన్ ఇప్పుడు అయిదో స్థానానికి పడిపోయింది. అంతేకాదు...ఆంక్షలనుంచి విముక్తమైన ఇరాన్ భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధపడగా ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో మన దేశం వెనకబడిపోయింది. మొన్న జనవరిలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇరాన్ వెళ్లి అనేక అంశాల్లో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతక్రితమే అనేక రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. మనం మాత్రం ఇరాన్‌తో కుదిరిన సహజవాయు క్షేత్ర అభివృద్ధి(ఎల్ఎన్జీ) ప్రాజెక్టు కాంట్రాక్టును సైతం అమలు చేయలేకపోయాం. తన పొరుగునున్న అఫ్ఘానిస్తాన్‌లో పాకిస్తాన్ పోకడలను గమనిస్తున్నది గనుక చబహర్ ఓడరేవు అభివృద్ధి విషయంలో భారత్‌తో ఒప్పందానికి ఇరాన్ ముందుకొచ్చింది. అఫ్ఘాన్‌లో పాక్ ఆటలు సాగనిస్తే తనకు కూడా ముప్పు కలుగుతుందని ఆ దేశం భావిస్తోంది. అదే సమయంలో ఆ ఓడరేవు వల్ల పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండానే అఫ్ఘాన్ మార్కెట్‌కూ, తూర్పు యూరప్ దేశాల మార్కెట్‌కూ చేరువయ్యేందుకు మన దేశానికి మార్గం ఏర్పడుతుంది. మోదీ పర్యటన పర్యవసానంగా ఇరాన్‌తో ఇప్పుడు ఏర్పడిన ద్వైపాక్షిక బంధాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇటు ఇరాన్‌తో, అటు దాని శత్రుదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలతో దౌత్య సంబంధాలు సమతూకంలో ఉండేలా చూసుకోవడం కత్తిమీద సామే. దీన్ని మోదీ చాకచక్యంతో నిర్వర్తించ గలరని ఈ పర్యటన రుజువు చేసింది. -
‘చబహర్’తో పాక్‌కు చెక్
- ఇరాన్‌తో ఓడరేవు అభివృద్ధికి భారత్ ఒప్పందం - వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్ - మోదీ, ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ సమక్షంలో సంతకాలు - కొత్త చరిత్రకు సాక్షులుగా నిలిచామన్న ప్రధాని మోదీ - ఉగ్ర పోరుకు సహకారం..వాణిజ్య, రక్షణ, పెట్టుబడులపై 12 ఒప్పందాలు టెహ్రాన్: ఇరాన్‌తో భారత్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. వ్యూహాత్మకంగా కీలకమైన చబహర్ ఓడరేవు అభివృద్ధి కోసం ఒప్పందంపై సంతకం చేసింది. దీనివల్ల పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, యూరప్‌లతో అనుసంధానత వస్తుంది. ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీలు ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత చబహర్తోసహా ఇరు దేశాలు 12 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదంపై పోరాటానికి పరస్పర సహకారం అందించుకుంటామని అంగీకరించాయి. భారత ఇంధన దిగుమతి అవసరాలకు ఇరాన్‌లోని చబహర్ కీలకం. చబహర్ ఓడరేవు అభివృద్ధి కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్న భారత్... రవాణా, ట్రాన్సిట్ కారిడార్ కోసం ఇరాన్, అఫ్గానిస్తాన్‌తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. మోదీ, రౌహానీ, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. 2001లో వాజపేయి ఇరాన్లో పర్యటించగా, ఆ తర్వాత 15 ఏళ్లకు ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీనే. చబహర్ ఒప్పందం ఈ ప్రాంతం చరిత్రను మార్చివేస్తుందని, కొత్త చరిత్రకు మనమంతా సాక్షులుగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు. రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ ఒప్పందం ఒకవైపు దక్షిణ ఆసియాను, మరోవైపు యూరప్‌ను కలుపుతుంది. అమాయకులను చంపడం, చిత్రవధ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వారిపై పోరాటానికి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా పర్షియా కవి హఫీజ్ కవితను ఉటంకిస్తూ మోదీ పర్షియా భాషలో మాట్లాడారు. ‘విభజన రోజులు ముగిశాయి. నిరీక్షించే రాత్రులు ముగింపునకు చేరాయి. మా స్నేహం చిరస్థాయిలో ఎప్పటికీ నిలిచిఉంటుంది’ అని చెప్పారు. ఇరాన్‌తో ఒప్పందాల వల్ల ఆర్థిక, వాణిజ్య, రవాణా, ఓడరేవు అభివృద్ధి, నాగరికత, సైన్స్, విద్యా అంశాల్లో సహకారం పెరుగుతుందన్నారు. ఉగ్ర ముప్పును ఎదుర్కోడానికి.. రౌహానీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్, సైబర్ నేరాలపై పోరాటం చేసేందుకు, నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఉగ్ర ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు గూఢచర్య సమాచారం బదిలీ చేసుకోవాలని నిర్ణయించడంతోపాటు పలు రాజకీయ అంశాలపై చర్చించామన్నారు. కాగా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద శక్తుల్ని వాడుకోవడం, ప్రోత్సహించడాన్ని అన్ని దేశాలు పూర్తిగా వ్యతిరేకించాలని, ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు సహకారం, ఆశ్రయానికి తక్షణం ముగింపు పలకాలని భారత్, ఇరాన్‌లు కోరాయి. మోదీ, రౌహనీల మధ్య విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం మోదీ ఆ దేశ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీతోనూ భేటీ అయ్యారు. రెండు రోజుల ఇరాన్ పర్యటన ముగించుకొని మోదీ భారత్‌కు బయలుదేరారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు చబహర్ ఓడరేవు అభివృద్ధి, అల్యూమినియం ప్లాంటు స్థాపన, అఫ్తానిస్తాన్, మధ్య ఆసియాకు అనుసంధానం కుదిరేలా రైల్వే లైన్ ఏర్పాటు, దీనికోసం 150 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్‌తో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం, మేధావుల సంప్రదింపులు-విధాన రూపకల్పనపైనా భారత్ ఒప్పందం చేసుకుంది. స్కూల్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫ్ ఇరాన్‌తో భారత విదేశీ సంస్థ ఒప్పందం, ఇరాన్ ఎగుమతి గ్యారంటీ నిధితో భారత ఎగుమతి గ్యారంటీ కార్పొరేషన్ ఒప్పందం, సైన్స్, పరిశోధన రంగంలో, ప్రాచీన పత్రాలు, సాంస్కృతిక సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకుంది. ఖమేనీకి అరుదైన బహుమతి మోదీ ఇరాన్ అగ్రనేత ఖమేనీకి అరుదైన బహుమతి ఇచ్చారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఖమేనీతో భేటీ అయ్యారు. కుఫిక్(అతి పురాతన అరబిక్ భాష) లిపిలో రాసిన 7వ శతాబ్ధి నాటి ఖురాన్‌ను ఆయనకు ఇచ్చారు. ఇది ఉత్తరప్రదేశ్ సాంస్కృతికశాఖకు చెందిన రామ్‌పూర్ రాజా లైబ్రరీలోనిది. ఇరాన్ విదేశాంగ విధానం, ఇతర కీలక అంశాల్లో ఖమేనీదే తుది నిర్ణయం. ‘చబహర్’ ఎందుకు కీలకమంటే... ఇరాన్లో భారత ప్రభుత్వం అభివృద్ధి చేసే కీలకమైన ఓడరేవు చబహర్. పాక్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్ మీదుగా, అలాగే తూర్పు యూరప్‌తో అనుసంధానానికి వీలు కల్పిస్తుంది. పాక్‌లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వదర్ ఓడరేవు నుంచి చబహర్ ఓడరేవు కేవలం 100 కి.మీ దూరంలో ఉంది. చబహర్ నుంచి అఫ్గాన్‌తో రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం ఏర్పడుతుంది. ఇది పాక్‌లోని కరాచీ ఓడరేవుకు ప్రత్యామ్నాయం. ఇరాన్-పాక్-భారత్ పైప్‌లైన్ నిర్మాణానికి పాక్ పెద్దగా సహకరించట్లేదు. అదీగాక ఇరాన్-పాక్ మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. దీంతో చబహర్ చాలా కీలకమవుతుంది. ఇరాన్ పొరుగుదేశమైన అఫ్గాన్‌కు చబహర్ నుంచి రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. చబహర్, జహెదాన్ మధ్య 500 కి.మీ. రైల్వే లైను ఏర్పాటుచేస్తామని, దీంతో మధ్య ఆసియాకు అనుసంధానం ఏర్పడుతుందని రోడ్డు రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. -
త్వరలో ఇరాన్‌కు ప్రధాని మోదీ
టెహ్రాన్: మొన్నటి వరకు వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మరో విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇరాన్లో ఆయన రెండు రోజులపాటు పర్యటించనున్నారు. మే 22న ఆయన ఇరాన్ వెళ్లి ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకోవడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించే ఉద్దేశంతో మోదీ పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా ఆర్థిక, వాణిజ్య, పెట్టుపడులు, రవాణా, నౌకాదళ విభాగాలతోపాటు శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల విషయంలో ఇరు దేశాల నేతల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. -
సుష్మ ‘ముసుగు’పై విమర్శలు
న్యూఢిల్లీ: ఇరాన్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు రౌహానీతో భేటీ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తలనిండా కప్పుకున్న ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారత ఇంధన అవసరాల విషయంలో ఇరాన్‌ను సంతృప్తిపరిచేందుకే మంత్రి ఆ దేశ వేషాధారణలో కనిపించారని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇరాన్ సాంప్రదాయం, చట్టాల ప్రకారం అక్కడ పర్యటించే వారెవరైనా తలను పూర్తిగా కప్పుకోవాల్సిందే. 2014లో స్కార్ఫ్ ధరించేందుకు యురోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రిబొనీనో నిరాకరించటంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి ఉంటుందని ఇరాన్ పేర్కొంది.