అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఏకపక్షంగా అమలు చేసిన ఆంక్షల అవరోధాలను అధిగమించి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఇరాన్‌తో స్నేహ సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలమధ్యా అత్యంత కీలకమైన చబహర్ ఒప్పందంతోసహా 12 ఒప్పందాలపై సంతకాలయ్యాయి. ఉగ్రవాదంపై సమష్టి పోరుకు ఇరు దేశాలూ ప్రతినబూనాయి.
భవిష్యత్తులో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి అనువైన అజెండాను ఖరారు చేసుకున్నాయి. మోదీ పర్యటన దౌత్యపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్నది. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, ఇరాన్‌లు పోటీ పడుతున్న తరుణంలో ఆయన ఈ పర్యటన జరిపారు. నెలక్రితం సౌదీ వెళ్లినప్పుడూ ఆయనకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
ఇరాన్‌తో మన దేశానికున్న సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలకు ఎంతో చరిత్ర ఉంది. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత రెండు దేశాలమధ్యా భౌగోళిక సాన్నిహిత్యం దూరమైనా శతాబ్దాలనాటి సాంస్కృతిక సంబంధాలుగానీ, అవి ఏర్పర్చిన సుహృద్భావంగానీ చెక్కుచెదరలేదు. అయితే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మన దేశం అలీన పంథాను అనుసరిస్తే అప్పటి ఇరాన్ షా ప్రభుత్వం అమెరికాతో చెలిమి చేసేది. ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసిన ఇస్లామిక్ విప్లవ అనంతరం కూడా పరిస్థితులు పెద్దగా మారలేదు.
ప్రచ్ఛన్నయుద్ధం ముగిశాక, ఇరాన్‌లో ఖొమేనీ మరణించాక రెండు దేశాలూ మళ్లీ సన్నిహితం కావడం మొదలుపెట్టాయి. ఇలా ఎన్నో అవరోధాలు ఎదురైనా, అప్పుడుప్పుడు ఇరుదేశాల సంబంధాల్లోనూ అపశ్రుతులు వినిపించినా భారత్, ఇరాన్‌లు రెండూ ఎడమోహం, పెడమొహంగా ఎప్పుడూ లేవు.
ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)లో సభ్యదేశంగా ఉన్నా, అందువల్ల పాకిస్తాన్‌కు కాస్త దగ్గరైనా మన దేశంతో స్నేహ సంబంధాలకు మొదటినుంచీ ఇరాన్ ప్రాధాన్యతనిచ్చేది. అయినా అలాంటి దేశంలో మన ప్రధాని ఒకరు పర్యటన జరిపి పదిహేనేళ్లయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 2001లో నాటి ప్రధాని వాజపేయి ఇరాన్‌ను సందర్శించారు.
2012లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇరాన్ వెళ్లినా అది అలీన దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఉద్దేశించిన పర్యటన మాత్రమే. పశ్చిమ దేశాలతో మన దేశం సన్నిహితమైనకొద్దీ భారత్-ఇరాన్ సంబంధాలు ఆమేరకు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదుర్చు కోవడం కోసం 2004లో మన దేశం చర్చలు మొదలుపెట్టాక ఇరాన్‌తో పొర పొచ్చాలు రావడం మొదలైంది.
2005లో ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా తొలిసారి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)లో మన దేశం ఓటేయడం ఆ దేశానికి ఆగ్రహం కలిగించింది. 1994లో ఓఐసీ సమావేశంలో కశ్మీర్‌పై తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసిన ఇరాన్...2005 తర్వాత కశ్మీర్ విషయంలో అందుకు భిన్నమైన వైఖరిని తీసుకోవడం మొదలెట్టింది. అంతర్జాతీయ అణు సహకారం లభించాలంటే అమెరికాతో పౌర అణు ఒప్పందం అవసరమని మన దేశం భావించింది. ఆ ఒప్పందం సాకారమయ్యాక 2006నాటి హైడ్ చట్టం ప్రకారం ఇరాన్ అణు వివాదం విషయంలో అమెరికాను సమర్ధించక తప్పని స్థితి కలిగింది.
పశ్చిమాసియాలో పరిస్థితి చక్కబడాలంటే ఇరాన్ సహకారం తప్పనిసరని అమెరికా గ్రహించడం... అణు సమస్య విషయంలో సర్దుబాటుకు సిద్ధపడకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడుతుందని ఇరాన్ భావించడం పర్యవసానంగా పరిస్థితులు మారాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య అణు ఒప్పందం కుదరడంతో ఇరాన్‌తో మన సంబంధాలు మెరుగుపడటానికి అవకాశం ఏర్పడింది.
ఆంక్షల కాలంలో ఇరాన్‌తో మన దేశానికి కుదిరిన ఒప్పందాల దుమ్ము దులిపే స్థితి వచ్చింది. అయినా అమెరికా మన దేశానికి మోకాలడ్డుతూనే ఉంది. ఆ దేశంతో సాధారణ సంబంధాల పున రుద్ధరణకు మరికొన్నాళ్లు వేచిచూడండంటూ ఒత్తిళ్లు తెచ్చింది. 2013 చివరిలో ఇరాన్‌తో తాత్కాలిక అణు ఒప్పందం కుదిరినా ఆ దేశంనుంచి ముడి చమురు దిగుమతుల్ని పెంచుకోవడానికి తొందరపడొద్దని మనకు సలహా ఇచ్చింది.
2014లో ముడి చమురుపై భారత్-ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ముందుకు కదలనివ్వలేదు. తమతో కుదుర్చుకున్న అణు ఒప్పందం విషయంలో ఇరాన్ చిత్తశుద్ధి ఎంతో తేలేవరకూ వేచిచూడాలని కోరింది. పర్యవసానంగా ఇరాన్‌నుంచి మన దేశానికి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2010-11 మధ్య మన చమురు అవసరాలను తీర్చడంలో రెండో స్థానంలో ఉన్న ఇరాన్ ఇప్పుడు అయిదో స్థానానికి పడిపోయింది. అంతేకాదు...ఆంక్షలనుంచి విముక్తమైన ఇరాన్ భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధపడగా ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో మన దేశం వెనకబడిపోయింది.
మొన్న జనవరిలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇరాన్ వెళ్లి అనేక అంశాల్లో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతక్రితమే అనేక రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. మనం మాత్రం ఇరాన్‌తో కుదిరిన సహజవాయు క్షేత్ర అభివృద్ధి(ఎల్‌ఎన్‌జీ) ప్రాజెక్టు కాంట్రాక్టును సైతం అమలు చేయలేకపోయాం. తన పొరుగునున్న అఫ్ఘానిస్తాన్‌లో పాకిస్తాన్ పోకడలను గమనిస్తున్నది గనుక చబహర్ ఓడరేవు అభివృద్ధి విషయంలో భారత్‌తో ఒప్పందానికి ఇరాన్ ముందుకొచ్చింది.
అఫ్ఘాన్‌లో పాక్ ఆటలు సాగనిస్తే తనకు కూడా ముప్పు కలుగుతుందని ఆ దేశం భావిస్తోంది. అదే సమయంలో ఆ ఓడరేవు వల్ల పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండానే అఫ్ఘాన్ మార్కెట్‌కూ, తూర్పు యూరప్ దేశాల మార్కెట్‌కూ చేరువయ్యేందుకు మన దేశానికి మార్గం ఏర్పడుతుంది. మోదీ పర్యటన పర్యవసానంగా ఇరాన్‌తో ఇప్పుడు ఏర్పడిన ద్వైపాక్షిక బంధాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇటు ఇరాన్‌తో, అటు దాని శత్రుదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలతో దౌత్య సంబంధాలు సమతూకంలో ఉండేలా చూసుకోవడం కత్తిమీద సామే. దీన్ని మోదీ చాకచక్యంతో నిర్వర్తించ గలరని ఈ పర్యటన రుజువు చేసింది.