‘సాగరమాల’లో 12 స్మార్ట్‌సిటీలు
పలుచోట్ల తీర ప్రాంత ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తాం
జీడీపీలో 2% పెరుగుదల నమోదవుతుందని గడ్కారీ వెల్లడి
న్యూఢిల్లీ: తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు ద్వారా 12 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తామని, పలు తీరప్రాంత ఆర్థిక మండళ్ల(సీఈజెడ్)ను ఏర్పాటు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 2 శాతం పెరుగుదల నమోదవుతుందని చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. గురువారమిక్కడ గడ్కారీ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ప్రాజెక్టు కింద ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సమీపంలోని ఎస్‌ఈజెడ్‌కు రూ.4 వేల కోట్లు కేటాయించాం. గుజరాత్‌లోని కండ్లా పోర్టు తీరప్రాంత ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తాం. ఈ పోర్టు ఆధీనంలో 2లక్షల ఎకరాల భూమి ఉంది. 12 స్మార్ట్ సిటీలతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు 1,208 దీవులను అభివృద్ధి చేస్తాం.
189 లైట్‌హౌస్‌లను నెలకొల్పుతాం’’ అని మంత్రి వివరించారు. తీరప్రాంతాల్లో సాగరమాల ప్రాజెక్టు అమలుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఆరునెలల్లోగా రూపొందిస్తామని చెప్పారు. ఇందులో ఎస్‌ఈ జెడ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామన్నారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టు ల సామర్థ్యం మరింత పెంచుతామని, ఎగుమతులు-దిగుమతులను పెంచడం, తీరప్రాంతా ల్లో దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీరప్రాంతాల్లో 12స్మార్ట్‌సిటీలను ఒక్కోదాన్ని రూ.50 వేలకోట్లతో అభివృద్ధి చేస్తామని గతం లో గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో 2 జాతీయ జల మార్గాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా చట్టం చేయాలని కేంద్రం నిర్ణయించింది. గడిచిన 30 ఏళ్లలో కేవలం ఐదింటిని మాత్రమే జాతీయ జల రవాణా మార్గాలను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో 1,078 కి.మీ. మేర జల మార్గం ఒకటి. కేంద్రం తాజాగా మరో 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు మార్గాలకు చోటు దక్కింది. కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఒక జాతీయ జల మార్గం, మంజీరా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా మరో మార్గాన్ని కేంద్రం అభివృద్ధి చేయనుంది.