సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీటిపై తేలియాడే విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిపై వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సముద్ర ఆధారిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటర్ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర నౌకాయాన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఏపీ మారిటైమ్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణ పరిధిలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఒక్కొక్క వాటర్ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.450 కోట్లతో వాటర్ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సీ ప్లేన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని అభివృద్ధి చేస్తారు.
తొలి దశలో 28 రూట్లలో సీ ప్లేన్స్
దేశవ్యాప్తంగా సీ ప్లేన్ సర్వీసులు నడపడానికి మొత్తం 78 రూట్లను ఎంపిక చేయగా.. తొలి దశలో 14 చోట్ల నుంచి 28 రూట్లలో సర్వీసులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను తయారు చేసే బాధ్యతను నేషనల్ టెక్నాలజీ ఫర్ పోర్ట్స్, వాటర్ వేస్ అండ్ కోస్ట్ (ఎన్‌టీసీపీడబ్ల్యూసీ), ఐఐటీ మద్రాస్‌లకు అప్పగించారు. విజయవాడలోని భవానీ ఐలండ్ నుంచి సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్రం ఇంతకుముందే ప్రతిపాదించినా కోవిడ్–19 వల్ల ముందడుగు పడలేదని ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో బీఎం రవీంద్రనాథ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సముద్ర ఆథారిత పర్యాటక రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా మెరైన్ మ్యూజియం, ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో ఫ్లోటింగ్ జెట్టీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment