
న్యూఢిల్లీ: సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు ట్రస్టు చేసిన 12 ప్రాజెక్ట్ ప్రతిపాదనలను చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయం వెల్లడించారు. సాగరమాల పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.412 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈ నిధులను సాగరమాల ప్రాజెక్ట్‌లు చేపట్టే మేజర్ పోర్టులు, నాన్-మేజర్ పోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ఇతర ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సాయం కింద కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ పురోగతిని బట్టి మూడు విడతలుగా నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సాగరమాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్ట్‌లలో ఇప్పటి వరకు అయిదు ప్రాజెక్ట్‌లు పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. విజయవాడ భవానీ ద్వీపంలో పాసింజర్ జెట్టీ నిర్మాణ పనులు, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు, కోస్తా జిల్లాల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ రెండో దశ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కాకినాడలో ప్రస్తుతం ఉన్న జెట్టీని మెరుగుపరచి సీ ప్లేన్ జెట్టీ అభివృద్ధి చేయడం, భీమునిపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం, కళింగపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం పనులను ఆయా నిర్మాణ సంస్థలకు అప్పగించామని రెండేళ్లలోగా పూర్తవుతాయని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment