భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే! | Nitin Gadkari: Govt has a crystal clear policy to reduce imports, curb pollution | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే!

Published Fri, Sep 8 2017 12:20 AM | Last Updated on Wed, Sep 5 2018 3:47 PM

భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే! - Sakshi

భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే!

పర్యావరణహిత ఇంధనాలకు మళ్లండి...
లేకుంటే మీరు తీవ్రంగా నష్టపోతారు...
పెట్రోల్, డీజిల్‌ వాహనాలకు భవిష్యత్తు లేదు
దిగుమతులకు, కాలుష్యానికి చెక్‌ పెడదాం
ఎలక్ట్రికల్‌ వాహనాలపై కేబినెట్‌ నోట్‌ సిద్ధం
బ్యాటరీ చార్జింగ్‌ కేంద్రాల వ్యవహారమూ దాన్లో ఉంటుంది
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ వ్యాఖ్యలు  


న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహన తయారీదారులకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కారీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులు, ట్యాక్సీలు, బైక్‌లదేనని, దేశం ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌ కార్ల తయారీ నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కార్ల తయారీవైపు మళ్లాలని ఆటోమొబైల్‌ కంపెనీలకు సూచించారు. లేకుంటే వాటికి భవిష్యత్తు లేదని, వాటిని పక్కన తీసి పారేయటానికి కూడా తాము వెనకాడబోమని నిష్కర్షగా చెప్పారు. కాలుష్యంతోపాటు దిగుమతులకూ చెక్‌ పెడతామన్నారు. ‘‘ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు మనం అడుగులు వేయాలి.

 వేసి తీరాలి. మీకు ఇష్టమున్నా, లేకున్నా నేను దీన్ని అమలు చేయబోతున్నాను. దీనికి మీ ఆమోదం కూడా అవసరం లేదు. దిగుమతులను తగ్గించడం, కాలుష్యానికి చెక్‌ పెట్టడంపై మాకు స్పష్టమైన విధానం ఉంది’’ అని గురువారం ఢిల్లీలో జరిగిన ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారుల(సియామ్‌) వార్షిక సమావేశంలో గడ్కారీ ప్రకటించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకునే వారికి ప్రయోజనం ఉంటుందన్న ఆయన, అలా కాకుండా పైసలే పరమావధిగా పనిచేసుకుపోయేవారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘మేం నిర్ణయం తీసుకుంటాం.

ఆ తరవాత... అయ్యో! మా దగ్గర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడవని వాహనాల నిల్వలు చాలా ఉండిపోయాయంటూ ప్రభుత్వం దగ్గరకు రావద్దు. ముందే మేల్కొంటే మంచిది’’ అని స్పష్టంచేశారు. ప్రభుత్వం త్వరలోనే ఎలక్ట్రికల్‌ వాహనాలకు సంబంధించిన విధానాన్ని తీసుకురానుందని గడ్కారీ చెప్పారు. ‘‘కేబినెట్‌ నోట్‌ సిద్ధంగా ఉంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నాం. దీన్ని సాధ్యమైనంత త్వరలో అమల్లోకి తీసుకువస్తాం’’ అని గడ్కారీ వివరించారు. పాత వాహనాలను తొలగించే విధానం జీఎస్టీ అంశాల కారణంగా నిలిచిపోయిందని, త్వరలోనే వాటిని పరిష్కరించి అమల్లోకి తెస్తామని గడ్కారీ హామీ ఇచ్చారు.  

ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి పెట్టండి
‘‘నేను మిమ్మల్ని (కార్ల తయారీదారులు) గౌరవంగా కోరేదేమంటే ముందు ఎలక్ట్రికల్‌ వాహనాలను తయారు చేయండి. బ్యాటరీ ఖరీదైన వ్యవహారమంటూ మీరు నాకు చెప్పారు. ఇప్పుడు మీరు తయారీ ప్రారంభిస్తే బ్యాటరీ తయారీ వ్యయాన్ని భారీ ఉత్పత్తితో తగ్గించొచ్చు. ప్రారంభంలో ఇబ్బందులనేవి ఎక్కడైనా ఉండేవే’’ అని గడ్కారీ కార్ల కంపెనీలకు హితవు చెప్పారు. దిగుమతులు, కాలుష్యం రెండు సమస్యలన్న ఆయన ఏటా దిగుమతులపై రూ.7 లక్షల కోట్లు వ్యయం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక రంగానికి పెద్ద గుదిబండగా దీన్ని వర్ణించారు. ప్రత్యామ్నాయ ఇంధనమే దీనికి పరిష్కారమన్నారు. ప్రభుత్వం రెండో తరం ఎథనాల్‌ తయారీకి 15 పరిశ్రమలను ప్రారంభించనుందని చెప్పారు. పత్తి, గోధు మ, వరి గడ్డి నుంచి కూడా ఎథనాల్‌ను సులభంగా తయారు చేయొచ్చన్నారు. ఇక, ప్రభుత్వం 2,000 డ్రైవింగ్‌ స్కూళ్లను ఒక్కోటీ 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు గడ్కారీ వెల్లడించారు.

ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం: సియామ్‌
సియామ్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న వినోద్‌ దాసరి మంత్రి గడ్కారీ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వం దిగుమతులు, కాలుష్యం తగ్గింపు దిశగా అడుగులు వేయడం పట్ల ప్రశంసించారు. ఇందుకు పరిశ్రమ సైతం మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘మూడేళ్లలోనే బీఎస్‌–4 నుంచి బీఎస్‌–6కు మళ్లబోతున్నాం. ప్రపంచంలోనే ఇది అత్యంత తక్కువ వ్యవధి. అయితే, విధానంలో నిలకడ ఉండాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఒకసారి విధానాన్ని రూపొందించిన తర్వాత దాన్ని మార్చొద్దు.

 కోర్టులు జోక్యం చేసుకున్నా దాన్ని సమర్థించుకోవాలి’’ అని దాసరి ప్రభుత్వానికి సూచించారు. పరిశ్రమ సిద్ధంగానే ఉన్నప్పటికీ పదేళ్లుగా బీఎస్‌–4 ఉద్గార ప్రమాణాలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంధన లభ్యత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ... బీఎస్‌ –6 ప్రమాణాల అమలు సమయంలోనైనా ఈ ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటే పాత వాహనాలను నిషేధించడంపై దృష్టి పెట్టాలని దాసరి సూచించారు. అంతేకానీ కొత్త కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకోరాదన్నారు.

15 ఏళ్లు దాటిన వాహనాల్ని నిషేధించాలి
కేంద్రానికి సియామ్‌ సూచన
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్‌... 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను నిషేధించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. ఇలాంటి వాహనాలను రోడ్లపై తిరగనివ్వకుండా చట్టాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. ‘కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహన పరిశ్రమ చాలా చేస్తోంది. బీఎస్‌–6 ఉద్గార నిబంధనలకు మారడంపై పనిచేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కూడా 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను నిషేధించాలి’ అని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ కె దాసరి వ్యాఖ్యానించారు.

ఆయన ఇక్కడ జరిగిన సియామ్‌ వార్షిక సమావేశంలో మాట్లాడారు. నేషనల్‌ ఆటోమోటివ్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. తరచూ మారుతున్న పాలసీ విధానాల కారణంగా ప్రస్తుతం దేశీ వాహన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ బలమైన వాహన పరిశ్రమను కలిగి ఉన్నాయని, భారత్‌ కూడా ఆటోమోటివ్‌ రంగ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన  అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ మాన్యుఫాక్చరింగ్‌ జీడీపీలో వాహన పరిశ్రమ దాదాపు 50 శాతం వాటా కలిగి ఉందని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement