సాక్షి, అమరావతి: పెరిగిపోతున్న కాలుష్యం బారినుంచి ప్రజలను, పర్యావరణాన్ని కాపాడాలంటే 2040 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కంపెనీ ‘కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్‌ఎల్)’ ఏపీ సహా దేశంలోని 18 రాష్ట్రాలకు ఎలక్ట్రానిక్ వాహనాలను సమకూర్చనుంది.
ఇందుకోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. 3 నుంచి 5 ఏళ్ల కాలానికి 3,500 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, హరియాణ, అస్సాం, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ–కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ విభాగాలకు అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని భావిస్తోంది.
అదేవిధంగా ఏపీ సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 4,675 విద్యుత్ బస్సుల్ని నడిపేందుకు కూడా సీఈఎస్‌ఎల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు సొంతంగా చార్జింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు అవసరమైన అనుమతులను అందించాల్సి ఉంటుంది. సీఈఎస్‌ఎల్ ఇప్పటికే దాదాపు 2 వేల విద్యుత్ కార్లను ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు సమకూర్చింది.
చార్జింగ్ స్టేషన్లతో ఏపీ తోడ్పాటు
విద్యుత్ వాహనాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలంటే రాష్ట్రాలకు వివిధ రాయితీలను అందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)లను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించాయి. 2019–22 మధ్య మూడేళ్ల కాలానికి ఫేమ్ పథకం కింద రూ.10 వేల కోట్లను కేటాయించగా.. ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.
ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై టాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది. ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌కు రూ.15 వేలను, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.10 వేలను, బస్సులకు రూ.20 వేలను రాయితీగా అందిస్తోంది. విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం 7 వేల ఈ–బస్సులు, 5 లక్షల త్రీ వీలర్లు, 55 వేల పాసింజర్ కార్లు, 10 లక్షల ద్విచక్ర వాహనాలను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఏపీలో 15,865, దేశ వ్యాప్తంగా 4.08 లక్షల విద్యుత్ వాహనాల విక్రయం జరిగింది.
తద్వారా రోజుకి 3,76,801 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతోంది. 8,57,441 కేజీల కార్బన్‌డైయాక్సైడ్ తగ్గుతోంది. 2021తో పోలిస్తే విద్యుత్ వాహనాల అమ్మకాలు 2022లో 110 శాతం పెరిగాయి. 2030 నాటికి దేశంలోని మొత్తం వాహనాల్లో దాదాపు 49 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని అంచనా.
వీటికోసం 2 మిలియన్ల పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయి. దేశవ్యాప్తంగా పెరగనున్న విద్యుత్ వాహనాల కోసం మన రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు 4 వేల ప్రదేశాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment