
నిత్యం కాలుష్యంతో సతమతవుతున్న దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ కాలుష్య కోరల్లో నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఒకటి సంప్రదాయ ఇంధన వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది సఫలమైనట్టుగానే కనిపిస్తోంది. వాహనాల ఉద్గారాలను తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశ రాజధాని ఢిల్లీ డిసెంబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఢిల్లీలో మొత్తం వాహన విక్రయాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా నవంబర్ 2023లో 9.5 శాతం ఉండగా డిసెంబర్‌లో 19.5 శాతానికి పెరిగింది. ఢిల్లీలో డిసెంబరు నెలలో అమ్ముడుపోయిన ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం. 2020 ఆగస్ట్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వల్లే ఇది సాధ్యమైందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
ఢిల్లీ ప్రభుత్వం ఈ పాలసీ కింద ఈవీల కొనుగోలుదారులు, తయారీదారులకు వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. వీటిలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లకు రూ. 1.5 లక్షల వరకు క్యాష్‌బ్యాక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఈ-రిక్షాలు, సరుకు రవాణా వాహనాలకు రూ. 30,000 వరకు రాయితీ ఇస్తోంది. దీంతోపాటు పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చుకోవాలనుకునే వారికి స్క్రాపింగ్ ఇన్సెంటివ్‌లు సైతం ప్రకటించింది.
ఒక సంవత్సరంలో నగరం అంతటా 200 ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడం, పాలసీ అమలును పర్యవేక్షించడానికి 'స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్'ని ఏర్పాటు చేయడం కూడా ఈ పాలసీ లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలోని వాటాదారులందరి మధ్య సమన్వయం, సహకారం కోసం త్వరలో ఢిల్లీ ఈవీ ఫోరమ్‌ను ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.