అప్పు చేసైనా రోడ్లేస్తాం: తుమ్మల
మా హయాంలోనే పూర్తి చేస్తాం
మంజూరు చేసిన రోడ్లపై మంత్రి వ్యాఖ్యలు
హైదరాబాద్: అనుమతులిచ్చిన రోడ్లను తమ హయాంలోనే, రెండున్నరేళ్లలోనే పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. నిధుల విషయంలో ఆందోళన అవసరం లేదని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం చెప్పారని, ఎంతైనా ఇస్తామన్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారులుగా (ఎన్‌హెచ్) అభివృద్ధి చేసేవన్నీ టోల్ రోడ్లేనని, వాటి విషయంలో ఆందోళనే అవసరం లేదని వివరించారు. మరీ అవసరమైతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులెలా వచ్చాయో.. అలాగే రోడ్లకూ తీసుకొస్తామని, అప్పు చేసైనా రోడ్లను వేస్తామని స్పష్టం చేశారు.
‘రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జి’లు అంశంపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 21 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని, అందులో రూ. 13,360 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో వేసిన రోడ్లు తొందరగా దెబ్బతిన్నాయని, అందుకే రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్ ప్రమాణాలతో వేసేందుకు చర్యలు చేపట్టడం వల్ల మొదటి ఏడాది ఆలస్యమైందన్నారు. పక్క రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్రంలో రోడ్లు వేయాలన్నదే తమ ఆలోచనని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తామని మంత్రి వివరించారు.
రూ.100 కోట్లతో హైదరాబాద్ ఎన్‌హెచ్‌ల అభివృద్ధి
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర మంత్రి గడ్కరీ సుముఖంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించారని, ఇంకా రూ. 2,500 కోట్ల రోడ్లకు ప్రతిపాదనలను పంపిస్తామన్నారు. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రైపోర్టు అధ్యయనాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించామని.. ఇప్పటివరకు భువనగిరి, జహీరాబాద్, జడ్చర్లను పోర్టుల కోసం గుర్తించారని తెలిపారు. ఇంకా ఒకటీ రెండు ప్రాంతాలు ఉంటాయని, తుది నివేదిక రాగానే చర్యలు చేపడతామని చెప్పారు. గోదావరిపై అన్ని బిడ్జిలను జల రవాణకు అనుగుణంగా నిర్మిస్తున్నామని, భద్రాచలం నుంచి మహారాష్ట్రకు జల రవాణాపై కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. బీటీ వేసిన పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బీ రోడ్లుగా మార్చుతామని, మండల కేంద్రాల నుంచి కొత్త జిల్లాలకు భవిష్యత్తులో నాలుగు లేన్ల రోడ్లు వేస్తామన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో మాత్రం డబుల్ రోడ్లను వేస్తామని మంత్రి వివరించారు.