హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కి ఇచ్చిన అప్పులు మొత్తాన్ని ఈక్వి టీగా మార్చుకోవాలని బ్యాంకులు నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని బ్యాంకులూ కలసి దాదాపు రూ.7,350 కోట్లను ఐవీఆర్‌సీఎల్‌కు రుణాలుగా ఇచ్చాయి. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చుకోవటం ద్వారా, తమ ఖాతా పుస్తకాల నుంచి ఈ కంపెనీకి సంబంధించి ఎన్‌పీఏలు ఏమీ లేకుండా చూసుకోవాలని ఈ మధ్యనే జరిగిన సీనియర్ లెండర్స్ సమావేశంలో బ్యాంకులు ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలియవచ్చింది.
డిసెంబర్ 19న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బ్యాంకులు దీన్ని ఈక్విటీగా మార్చుకున్నట్లయితే వాటి ఖాతా పుస్తకాల్లో ఇది ఇక ఎన్‌పీఏగా కనపడదు. దీంతో సాంకేతికంగా ఎన్‌పీఏలను తగ్గించుకున్నట్లుగా చూపించే అవకాశం ఉంటుంది. నిజానికి ఐవీఆర్‌సీఎల్‌లో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్‌డీఆర్) నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి.
ఎస్‌బీఐ నేతృత్వంలో అప్పులిచ్చిన బ్యాంకులన్నీ కలిసి ఎస్‌డీఆర్‌ను అమలు చే యనున్నాయి. తదుపరి కార్యాచరణలో భాగంగా అప్పులు, వడ్డీని ఈక్విటీగా మార్చుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకుల వాటా ఇప్పటికే 49%కి చేరింది. మొత్తం అప్పుల్ని ఈక్విటీగా మార్చుకుంటే ఇది 75% దాటుతుందని అంచనా.
ఇదే సమయంలో ప్రమోటర్ల వాటా 8.28% నుంచి 5% దిగువకు పడిపోతుందని అంచనా. కాగా కంపెనీలో మెజారిటీ వాటా బ్యాంకులు చేతికి వెళ్ళినా పాత యాజమాన్యాన్నే కొనసాగిస్తారన్న నమ్మకాన్ని ఐవీఆర్‌సీఎల్ చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఎస్‌డీఆర్ అమలుతో కంపెనీ పనితీరు మెరుగవుతుందని, ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కొరత తీరుతుందని చెప్పారు.
75% వాటా తీసుకుందాం!
Published Wed, Dec 16 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM
Advertisement