ఇది ఈక్విటీ నామ సంవత్సరం
ఇపుడున్నవన్నీ మంచి శకునాలే...
గత రెండేళ్లు వర్షాలు సరిగా లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఏడాది వర్షాలు బాగా కురిస్తే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై రానున్న కాలంలో కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయంటూ మొన్న పరపతి విధాన సమీక్షలో సంకేతాలివ్వడం శుభపరిమాణం. అలాగే బ్యాంకులు నిరర్థక ఆస్తుల్ని గుర్తించి వాటికి తగిన కేటాయింపులను చేయడంతో రానున్న త్రైమాసికాల్లో బ్యాంకుల లాభాలు తిరిగి పెరిగే అవకాశాలున్నాయి.
ప్రతీ త్రైమాసికానికి అంతర్జాతీయంగా ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నా... ఇప్పుడిప్పుడే సమస్యలు ఒక కొలిక్కి వస్తున్న సంకేతాలు వస్తున్నాయి. కరెన్సీ, కమోడిటీలు, వడ్డీరేట్లు, వృద్ధిరేట్లకు సంబంధించి మధ్య మధ్యలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ ఏడాది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి.
బ్యాంకింగ్ మినహా మెరుగైన ఫలితాలు
ఇక రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ రంగాన్ని మినహాయించి మిగిలిన అన్ని రంగాలకు చెందిన కంపెనీల ఆదాయాలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత తొమ్మిది నెలలుగా నిరర్థక ఆస్తుల వల్ల బ్యాంకుల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి, ఇప్పుడు చివరి త్రైమాసిక ఫలితాలు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది.
బ్యాంకులు ఎన్‌పీఏలను రైట్ ఆఫ్ చేయడం ఒక కొలిక్కి వస్తే కానీ బ్యాంకుల ఆదాయాలు పెరిగే అవకాశాలు లేవు. మొత్తం మీద చూస్తే బ్యాంకింగ్ ఆదాయాల్లో మూడు నుంచి నాలుగు శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ఇదే సమయంలో లో బేస్ ఎఫెక్ట్ వల్ల కమోడిటీస్ కంపెనీల ఆదాయాల్లో ఈ ఏడాది గణనీయమైన వృద్ధి నమోదు కానుంది.
రోడ్లు, ఇతర నిర్మాణ రంగాల్లో కొత్త ప్రాజెక్టులు మొదలు కావడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల గత నాలుగు నెలల నుంచి సిమెంట్ డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో రానున్న కాలంలో నిర్మాణ రంగానికి చెందిన యంత్రసామగ్రి, మైనింగ్ వర్క్‌లు బాగా పెరిగే అవకాశం ఉంది. వడ్డీరేట్లు దిగొస్తుండటంతో ఎన్‌బీఎఫ్‌సీల ఆదాయాల్లో కూడా పెరుగుదల ఉంటుంది. కొత్త బ్యాంకులు రావడంతో, మొండి బకాయిలను క్లీన్ చేయడంతో వచ్చే ఆరు నెలల తర్వాత ప్రైవేటు బ్యాంకుల ఆదాయాలు బాగుంటాయి.
ఇక ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహ విషయానికి వస్తే.. కొంత భిన్న వాతావరణం నెలకొని ఉంది. ఒక ఈటీఎఫ్‌ల రూపంలో నిధులు వస్తుంటే... ఇదే సమయంలో దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేసినవారు మంచి కంపెనీల నుంచి వైదొలుగుతున్నారు.
మొత్తం మీద చూస్తే ఆదాయాలు పెరిగే దశలోకి కంపెనీలు వచ్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో పయనించనుంది అనడానికి స్పష్టమైన సంకేతాలు మనకు కనపడుతున్నాయి. వడ్డీరేట్లు దిగిరానుండటంతో దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.ఈ ఏడాది ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడిని అందిస్తాయని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది ఈక్విటీలు 10 నుంచి 15 శాతం రాబడిని ఇవ్వొచ్చు. ఏదైనా బయట పరిణామాలు జరిగితేనే మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయి.
- అనూప్ మహేశ్వరి
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్