స్టాక్ మార్కెట్‌కు ఆకాశమే హద్దు
ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది..
- ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనాలు
న్యూఢిల్లీ: రానున్న కాలంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగనున్నాయని బిగ్‌బుల్‌గా పిలిచే ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా వేశారు. సీఐఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన రాకేష్ దేశీ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండియా ఆర్థిక వ్యవస్థ కొత్త వృద్ధి బాటలో అడుగుపెట్టిందని వ్యాఖ్యానించారు.
2017-18కల్లా జీడీపీ 9% స్థాయిలో పురోగమిస్తుందని అంచనా వేశారు. ఆపై ఏడాది 10% వృద్ధిని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.రానున్న ఐదేళ్లలో రిటైల్ రంగంలో అద్భుత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత రిటైల్ రంగ పరిమాణం ఐదు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. భవిష్యత్‌లో దేశీ స్టాక్ మార్కెట్లో పటిష్టమైన బూమ్‌కు అవకాశమున్నదని, అయితే బలమైన యాజమాన్యం, పారదర్శక నిర్వహణ కలిగిన కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిం చారు.
వృద్ధి అవకాశాలున్న రంగాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. వీటిలో రిటైల్ రంగం ఒకటని పేర్కొన్నారు. భారీ స్థాయిలో విస్తరించగలిగే కంపెనీలను ఎంపిక చేసుకోవడం మేలని తెలిపారు. పెట్టుబడులకు ముందుగా అవకాశాలపై కన్నేయాలని చెప్పారు. అవకాశంలేనిదే ఆర్థిక చైతన్యం ఉండదని, ఆర్థిక పురోగతి లేకపోతే లాభదాయకతకూ వీలుచిక్కదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆలోచనతో కాల్గేట్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీగా లాభపడినట్లు వెల్లడించారు.
ఇక దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం 500 బిలియన్ డాలర్లుకాగా, ఆర్గనైజ్డ్ రంగం వాటా 8% మాత్రమేనని చెప్పారు. ప్రత్యేకత చూపే రిటైల్ సంస్థలకు భారీ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. రియల్టీ, రిటైల్ నుంచే..: ఏ దేశానికి చెందిన సంపన్నుల జాబితాను చూసినా రియల్టీ, రిటైల్ రంగాల నుంచి వచ్చిన వారికి తప్పకుండా చోటు లభిస్తుంటుందని వివరించారు.
వీటిలో రిటైల్ రంగంలో పలు అవకాశాలున్నాయని చెప్పారు. ఇలాంటి ఆలోచన నుంచే టైటాన్ షేర్లలో ఇన్వెస్ట్‌చేసినట్లు పేర్కొన్నారు. టైటా న్‌లో ఇకపై కూడా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు చెప్పారు. వీటి తరువాత కంపెనీల పోటీతత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇదే విధంగా భవిష్యత్‌లో లార్జ్ క్యాప్‌గా మారగల సత్తా ఉన్న మిడ్ క్యాప్ షేర్లను పెట్టుబడులకు పరిశీలించవచ్చన్నారు.