ఆర్థిక అనిశ్చితే పసిడికి దన్ను!
పసిడి..
న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరగదన్న అంచనాలు, పలు దేశాల్లో ఈక్విటీ మార్కెట్ల బలహీనతలు, క్రూడ్ ధరల పతనం వెరసి ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కొనసాగే అవకాశాలు పసిడిని మరింత మెరిసేట్లు చేస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే ఏర్పడిన ఈ తరహా సంకేతాలతో బంగారం ధర అనూహ్యంగా పెరిగిన సంగతిని వీరు ఉదహరిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు అంతర్జాతీయంగా పసిడిని ఇన్వెస్టర్‌కు ఆకర్షణీయం చేస్తాయన్నది ఈ రంగంలో నిపుణుల అంచనా.
ఫెడ్ ఫండ్ రేటు మొదటి దఫా పెంపు అనంతరం పసిడి క్రమంగా నెమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందని గత డిసెంబర్‌లో నిపుణులు అంచనావేసినా... ‘ఆర్థిక అనిశ్చితి అంచనాల తీవ్రత వల్ల’ దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. గడచిన వారంలో నెమైక్స్‌లో ఔన్స్ ధర అంతక్రితం వారంతో ధర 1,158 డాలర్లతో పోల్చితే అనూహ్యంగా 81 డాలర్ల లాభంతో 1,239 డాలర్లకు ఎగసింది. నెమైక్స్‌లో వరుసగా నాలుగువారాల నుంచీ పసిడి బలపడుతోంది.
దేశీయంగా ఒకేవారం రూ.1,680 అప్...
అంతర్జాతీయ ధోరణిని కొనసాగడంతోపాటు రూపాయి బలహీనత, పెళ్లిళ్ల సీజన్ వంటికి అంశాలు దేశీయంగా పసిడిని బలోపేతం చేస్తున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గత శుక్రవారం అంతక్రితం వారం ఇదే రోజుతో పోలిస్తే భారీగా రూ.1,680 పెరిగి రూ.29,260కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో ఎగసి రూ.29,110కి చేరింది.