అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు! | Here is success story of kedia securities Vijay Kedia who struggled for Rs 14 | Sakshi
Sakshi News home page

అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!

Published Wed, Jun 14 2023 11:33 AM | Last Updated on Wed, Jun 14 2023 12:05 PM

Here is success story of kedia securities Vijay Kedia who struggled for Rs 14 - Sakshi

ఉలి దెబ్బలు తింటేనే.. శిల శిల్పంగా మారుతుంది. నిప్పుల కొలిమిలో కాలితేనే ఇనుము కరిగేది.  దాదాపు మనిషి జీవితం కూడా అంతే.. కష్టాల కడిలిని ఈదితేనే...జీవితంలో పైకి రావాలనే  కసి పట్టుదల పెరుగుతుంది. మనసు పెడితే... దానికి సంకల్పం తోడైతే కాలం కూడా కలిసి వస్తుంది.  విజయం దాసోహమంటుంది.  దాదాపు  ఇపుడు మనం చదవబోయే కూడా అలాంటిదే. ఒకపుడు బిడ్డకు పాలుకొనడానికి 14  రూపాయలకు వెతుక్కోవాల్సిన  దుర్భర పరిస్థితి. మరిపుడు 800కోట్లకు అధిపతి. ప్రముఖ పెట్టుబడిదారుడు విజయ్ కేడియా సక్సెస్‌ స్టోరీ చూద్దాం రండి..!

కోల్‌కతాకు విజయ్ కేడియా ఐఐటీ, ఐఐఎం లాంటి ఫ్యాన్సీ డిగ్రీలేమీ లేవు. ఉన్నదల్లా స్మార్ట్‌ బ్రెయిన్‌  జీవితంలో ఎదగాలనే సంకల్పం. మార్కెట్‌పై లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిలియనీర్‌గా అవతరించాడు.  విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్. 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చని పోయాడు. తండ్రిని కోల్పోయిన షాక్‌తో 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు.  దీనికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. వెంటనే ఒక బిడ్డ కూడా పుట్టింది. అలా ఒక్కో బాధ్యత, అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కష్టాల్లోకి నెట్టేసింది. కుటుంబం గడవడానికి తల్లి బంగారు ఆభరణాలను అమ్ముకున్నారు. కానీ అది మాత్రం ఎన్నాళ్లు ఆదుకుంటుంది. కనీసం కుమారుడికి పాలు కొనేందుకు రూ.14 కూడా  లేక ఇబ్బందులు పట్టాడు. ఏదో ఒకవిధంగా ఒక్కో పైసా వెతికి అతని భార్య బిడ్డకు పాలు పట్టేది ఇది చూసి చలించిపోయిన విజయ్‌ కేడీ. కోల్‌కతా వదిలి ముంబైకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

తండ్రి ఇచ్చిన వారసత్వ నేపథ్యం, పరిస్థితులతో   షేర్ మార్కెట్‌లో మెల్లిగా పెట్టుబడులు పెట్టాడు.  బుర్రకు  పదును  బెట్టి, మార్కెట్‌ను స్టడీ చేశాడు.  దలాల్ స్ట్రీట్‌లో బుల్లిష్‌రన్‌ కారణంగా  1992లో అదృష్టం కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలకషేర్లలో పెట్టుబడల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్‌ సక్సెస్‌ జర్నీ)

ఆ తర్వాత ముంబైలో ఇల్లు కొని కోల్‌కతా నుంచి తన కుటుంబాన్ని  మార్చుకున్నాడు. అయితే  షేర్ మార్కెట్‌ పెట్టుబడులు అంటే వైకుంఠపాళి. నిచ్చెనలూ ఉంటాయి, కాటేసే పాములూ ఉంటాయి. అచ్చం ఇలాగే మళ్లీ మార్కెట్‌ కుప్పకూలడంతో సర్వం కోల్పోయాడు. అయినా ధైర్యం కోల్పో లేదు. 2002-2003లో మార్కెట్ మరో బుల్లిష్ రన్‌. చక్కటి పోర్ట్‌ఫోలియోతో  లాభాలను ఆర్జించాడు. ఫలితంగా విజయ్‌ నికర విలువ ఇప్పుడు రూ. 800 కోట్లకు చేరుకుంది. దేశంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడిదారులలో ఒకడిగా నిలిచాడు.  కేడియా సెక్యూరిటీస్ అనే కంపెనీని ప్రారంభించి కోటీశ్వరుడిగా రాణిస్తున్నాడు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్‌ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్‌ ట్వీట్‌)

పెట్టుబడి ప్రపంచంలో విజయ్ కేడియాది ప్రతిష్టాత్మకమైన పేరు. అనేక ఆటుపోట్లతోనిండి వున్న విజయ్‌ జర్నీ ఇన్వెస్టింగ్ కెరీర్‌లో విజయం సాధించాలని ఆలోచిస్తున్న వారికి ఆయన స్ఫూర్తి. స్టాక్ మార్కెట్‌లో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. ఓపిక ముఖ్యం. అలాగే మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు  రిస్క్‌ తీసుకునే ధైర్యం,సామర్థ్యం  ఉండి తీరాలి. 

నోట్‌: ముందే చెప్పినట్టుగా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు అంటే అంత ఆషామాషీ కాదు. సరియైన అవగాహన, లోతైన పరిజ్ఞానం చాలా అవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement