
‘‘మేము ఇలా ఇన్వెస్ట్ చేశాము, అలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాము, రాబోయే రోజుల్లో ఇలా జరగొచ్చు’’ అంటూ ప్రముఖ ఇన్వెస్టర్లు అన్యాపదేశంగా సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే ఇవన్నీ నిజం కావాల్సిన పనిలేదని, ప్రముఖ ఇన్వెస్టరయినంత మాత్రాన వారు చెప్పేవన్నీ జరుగుతాయని అనుకోవద్దని ప్రముఖ అనలిస్టు అశ్వత్ధ్ దామోదరన్ సూచిస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే వారెన్ బఫెట్ ఏమీ గొప్ప వాల్యూ ఇన్వెస్టర్ కాదని, కానీ సాధారణ ఇన్వెస్టర్లు ఆయన్ని పెట్టుబడులకు సంబంధించి దేవుడిలా చూస్తుంటారని చెప్పారు. ఆయన ఏది చెబితే అది జరుగుతుందని నమ్మేవాళ్లు ఎక్కువన్నారు. కానీ ఆయన మాటలన్నీ 90ఏళ్ల వృద్ధుడి చాదస్తపు మాటల్లాగా ఉంటాయని దామోదరన్ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలన్నీ సందిగ్ధతతో ఉంటాయని, ప్రస్తుతం జరిగే ఏ అంశంపైనా ఆయనకు స్థిరమైన అభిప్రాయం ఉన్నట్లు కనిపించదని చెప్పారు. ఆయన చెప్పేవి అసహజంగా ఉంటాయని చెప్పారు.
ఉదాహరణకు ఆయన తాజా మాటలు వింటే ప్రజలు ఇక ఎక్కువగా విమానయానం చేయరనే భావన వస్తుందన్నారు. దీన్ని నమ్మి సాధారణ మదుపరి ఎయిర్‌లైన్స్ షేర్లన అమ్ముతాడన్నారు. కానీ నిజానికి విమానయానం కాస్త మందగించినంత మాత్రాన ఎయిర్‌లైన్స్ షేర్లన్నీ చెత్తని చెప్పలేమని దామోదరన్ చెప్పారు. ప్రస్తుతం విమానయాన రంగంలో ఉన్న కంపెనీల్లో కొన్నైనా మూతబడితే అప్పుడీ వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పవచ్చని, అంతేకానీ కేవలం బఫెట్ అభిప్రాయపడ్డాడని ఉన్న ఎయిర్‌లైన్ షేర్లు అమ్ముకోవడం మంచిది కాదని వివరించారు. అంతమాత్రాన ప్రముఖ ఇన్వెస్టర్లంతా మంచి ఇన్వెస్టర్లు కాదని తాను చెప్పడం లేదని, ఎంత ప్రముఖుడైనా.. ఏమి చెప్పినా.. దాన్ని తరచి ప్రశ్నించుకొని నిర్ణయం తీసుకోవాలన్నదే తన సూచనని చెప్పారు. మంచి ఇన్వెస్టర్ కావాలంటే ఎవరికి వారికి సొంత అధ్యయనం ఉండాలని దామోదరన్ సలహా ఇచ్చారు. అంతేకానీ ఎంత గొప్ప ఇన్వెస్టరు సలహా ఇచ్చినా గుడ్డిగా ఫాలో కావద్దని, ‘‘పదిమంది చెప్పింది విను.. సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో’’ అనేది తన సూత్రమని చెప్పారు.