Value Investing
-
ప్రముఖ ఇన్వెస్టర్లు చెప్పేది జరుగుతుందా?
‘‘మేము ఇలా ఇన్వెస్ట్ చేశాము, అలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాము, రాబోయే రోజుల్లో ఇలా జరగొచ్చు’’ అంటూ ప్రముఖ ఇన్వెస్టర్లు అన్యాపదేశంగా సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే ఇవన్నీ నిజం కావాల్సిన పనిలేదని, ప్రముఖ ఇన్వెస్టరయినంత మాత్రాన వారు చెప్పేవన్నీ జరుగుతాయని అనుకోవద్దని ప్రముఖ అనలిస్టు అశ్వత్ధ్ దామోదరన్ సూచిస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే వారెన్ బఫెట్ ఏమీ గొప్ప వాల్యూ ఇన్వెస్టర్ కాదని, కానీ సాధారణ ఇన్వెస్టర్లు ఆయన్ని పెట్టుబడులకు సంబంధించి దేవుడిలా చూస్తుంటారని చెప్పారు. ఆయన ఏది చెబితే అది జరుగుతుందని నమ్మేవాళ్లు ఎక్కువన్నారు. కానీ ఆయన మాటలన్నీ 90ఏళ్ల వృద్ధుడి చాదస్తపు మాటల్లాగా ఉంటాయని దామోదరన్ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలన్నీ సందిగ్ధతతో ఉంటాయని, ప్రస్తుతం జరిగే ఏ అంశంపైనా ఆయనకు స్థిరమైన అభిప్రాయం ఉన్నట్లు కనిపించదని చెప్పారు. ఆయన చెప్పేవి అసహజంగా ఉంటాయని చెప్పారు. ఉదాహరణకు ఆయన తాజా మాటలు వింటే ప్రజలు ఇక ఎక్కువగా విమానయానం చేయరనే భావన వస్తుందన్నారు. దీన్ని నమ్మి సాధారణ మదుపరి ఎయిర్‌లైన్స్ షేర్లన అమ్ముతాడన్నారు. కానీ నిజానికి విమానయానం కాస్త మందగించినంత మాత్రాన ఎయిర్‌లైన్స్ షేర్లన్నీ చెత్తని చెప్పలేమని దామోదరన్ చెప్పారు. ప్రస్తుతం విమానయాన రంగంలో ఉన్న కంపెనీల్లో కొన్నైనా మూతబడితే అప్పుడీ వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పవచ్చని, అంతేకానీ కేవలం బఫెట్ అభిప్రాయపడ్డాడని ఉన్న ఎయిర్‌లైన్ షేర్లు అమ్ముకోవడం మంచిది కాదని వివరించారు. అంతమాత్రాన ప్రముఖ ఇన్వెస్టర్లంతా మంచి ఇన్వెస్టర్లు కాదని తాను చెప్పడం లేదని, ఎంత ప్రముఖుడైనా.. ఏమి చెప్పినా.. దాన్ని తరచి ప్రశ్నించుకొని నిర్ణయం తీసుకోవాలన్నదే తన సూచనని చెప్పారు. మంచి ఇన్వెస్టర్ కావాలంటే ఎవరికి వారికి సొంత అధ్యయనం ఉండాలని దామోదరన్ సలహా ఇచ్చారు. అంతేకానీ ఎంత గొప్ప ఇన్వెస్టరు సలహా ఇచ్చినా గుడ్డిగా ఫాలో కావద్దని, ‘‘పదిమంది చెప్పింది విను.. సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో’’ అనేది తన సూత్రమని చెప్పారు. -
వాల్యూ ఇన్వెస్టింగ్ పనిచేయదు!
షేర్లను పీఈ నిష్పత్తి ఆధారంగా పరిశీలించి పెట్టుబడి పెట్టే వాల్యూ ఇన్వెస్టింగ్ విధానం ఇకపై ఏమాత్రం సత్ఫలితాలివ్వదని ప్రముఖ అనలిస్టు అశ్వత్థ్ దామోదరన్ అభిప్రాయపడ్డారు. వాల్యూ ఇన్వెస్టింగ్ 20వ శతాబ్దానిదని, 21వ శతాబ్దిలో పనిచేయదని చెప్పారు. నిజానికి పెట్టుబడిని వాల్యూ, గ్రోత్ అని వర్గీకరించడం సబబుకాదని అభిప్రాయపడ్డారు. వీటి నిర్వచనాలకు అనుగుణంగా పెట్టుబడులు తగిన రాబడులు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యంగా వాల్యూ ఇన్వెస్టింగ్ అనేదానికి అర్ధంలేకుండా పోయిందని, దశాబ్ద కాలంగా చూస్తే స్వల్ప పీఈ, అధిక డివిడెండ్ ఈల్డ్స్ ఉన్న షేర్లు అధిక నష్టాలను ఇన్వెస్టర్లకు మిగిల్చాయని చెప్పారు. ఇదే సమయంలో అధిక వాల్యూషనున్న షేర్లు మంచి రాబడినిచ్చాయని గుర్తు చేశారు. దీన్నిబట్టి బుక్ వాల్యూ అనేదానికి పూర్తిగా విలువ లేకుండా పోయిందన్నారు. వాల్యూ ఇన్వెస్టర్లు అల్ప పీఈ, బుక్‌వాల్యూ లాంటివాటితో విశ్లేషణ జరుపుతారని, గ్రోత్ఇన్వెస్టర్లు ఎర్నింగ్స్ ఆధారంగా విశ్లేషణ జరుపుతారని చెప్పారు. అయితే వాస్తవంలో వాల్యూ ఇన్వెస్టింగ్ క్రమంగా గ్రోత్ ఇన్వెస్టింగ్‌తో పోలిస్తే ప్రభ కోల్పోతుందన్నారు. ఒక గ్రోత్ కంపెనీ అండర్వాల్యూతో ఉండొచ్చని చెప్పారు. ఉదాహరణకు ఫేస్బుక్, టెస్లా షేర్లు వాల్యూ ఇన్వెస్టర్ల నిర్వచనానికి సరిపోవని, కానీ ఇవి మంచి రాబడినిస్తున్నాయని చెప్పారు. వాల్యూ ఇనె్వస్టర్లు మాత్రం ఇంకా పాత విధానాలను పట్టుకొని వేళాడుతూ, మరో పదేళ్లు వేచిచూస్తే మంచి లాభాలు వస్తాయనే భ్రమలో ఉంటున్నారన్నారు. కానీ అల్పపీఈ స్టాకులే అధికంగా దెబ్బతింటున్నాయని, అందువల్ల ఇకనైనా మదుపరులు ఈ వాల్యూ ఇన్వెస్టింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలని సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలేవైనా కరోనా కారక నష్టం నుంచి 100 శాతం కోలుకోవడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్షోభానంతర ఎకానమీ భిన్నంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో అప్పులున్న కంపెనీలు, అనుభవం తక్కువున్న కంపెనీలు డిఫాల్టయ్యే అవకాశాలు పెరిగాయన్నారు. ఇకపై కంపెనీల విలువ మదింపు చేయాలంటే వాల్యూషన్ల కన్నా వాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కరోనాతో హోటల్స్, ఏవియేషన్, రవాణా, టూరిజం రంగాలు భారీగా దెబ్బతింటాయని, చిన్నా చితక స్టార్టప్స్‌ను ఆయా రంగాల్లోని బడా కంపెనీలు మింగేస్తాయని చెప్పారు. ఇదే సమయంలో అమెజాన్ లాంటి కంపెనీలు మరింతగా ఎదుగుతాయన్నారు. ఈవిధంగా ప్రపంచమంతా షట్‌డౌన్ పాటించే స్థితి ఇటీవల కాలంలో ఎప్పుడూ రాలేదన్నారు. -
చౌకలో షేర్లను కనుక్కొనేదెలా?
ప్రపంచవ్యాప్తంగా షేర్లను ఎంపిక చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు అనేక విధానాలు అందుబాటులో ఉన్నా రెండు విధానాలనే ఎక్కువగా అవలంబిస్తుంటారు. వీటిని గ్రోత్ ఇన్వెస్ట్మెంట్, వేల్యూ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారు. ఈ రెండు విధానాల్లో షేర్ల ఎంపిక అనేది పీఈ నిష్పత్తి ఆధారంగానే జరుగుతుంది. కాని ఈ రెండు పూర్తి విభిన్నమైనవి. గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో పీఈ రేషియో ఎక్కువ ఉన్న షేర్లను ఎంచుకుంటే, వేల్యూ ఇన్వెస్ట్మెంట్లో తక్కువ పీఈ నిష్పత్తి ఉన్న షేర్లను ఎంపిక చేసుకుంటారు. వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే.. ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉండి కూడా మార్కెట్లోని పరిస్థితుల దృష్ట్యా తక్కువ రేటు వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే వాస్తవ విలువ కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతూ భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఈ విధానంలో ముఖ్యంగా ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో వ్యాపార పరంగా వృద్ధికి అవకాశం ఉన్నా వివిధ పుకార్లు, లేదా మార్కెట్ సెంటిమెంట్ వంటి వాటి వల్ల షేర్లు బాగా పతనమవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాటిని గుర్తించి ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటారు. కంపెనీల సగటు పీఈ నిష్పత్తి కంటే ఎంత తక్కువగా ఉంటే అంత చౌకగా ఈ షేర్లు లభిస్తున్నట్లు. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే.. రూ.100 వస్తువు రూ.70కే లభిస్తుంటే దాన్ని కొనడం అనేది తెలివైన నిర్ణయమేనా... కాదా? తెలియడం లేదా?... కంపెనీ ఫండమెంటల్స్, పీఈ రేషియో అనేవి సాధారణ ఇన్వెస్టర్లు అందరికీ అర్థం కావు. ఇవి తెలుసుకోవాలంటే రోజువారీ స్టాక్ మార్కెట్ కదలికలపై పట్టు ఉండాలి. వీటిపై అవగాహన లేని వారి కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టాయి. ఇవి తక్కువ పీఈలో ఉన్న షేర్లను కొనుగోలు చేసి అవి అధిక ధరకు చేరిన తర్వాత విక్రయించడం జరుగుతుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌తో పాటు ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాయి.