
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన విపరీతంగా వచ్చింది. రూ.15,436 కోట్ల విలువ మేర బిడ్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం సేకరించాల్సిన దానికి రెట్టింపు ఇది. 22 కంపెనీల్లో ప్రభుత్వం తనకున్న వాటాల్లో కొంత మేర భారత్–22 ఈటీఎఫ్ రూపంలో వేరు చేసి ఇన్వెస్టర్లకు విక్రయిస్తోంది. పెట్టుబడుల ఉససంహరణ ద్వారా నిధుల సమీకరణ కార్యక్రమంలో ఇదీ ఒక భాగమే. ప్రభుత్వం రూ.6,000 కోట్లను ఈటీఎఫ్‌ల జారీ ద్వారా, గ్రీన్‌షూ ఆప్షన్ ద్వారా (అవసరాన్నిబట్టి అదనపు కేటాయింపులు) రూ.2,400 కోట్లను సమీకరించాలనుకుంది. అంటే మొత్తం మీద రూ.8,400 కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉంది. బేస్ ఇష్యూ లక్ష్యమైన రూ.6,000 కోట్ల ప్రకారం చూస్తే 2.57 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయింది.
ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ చూస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన ఆఫర్ 22న ముగిసింది. అన్ని విభాగాల్లోనూ భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన అనూహ్యమనిఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో, ఎండీ నిమేష్ షా అన్నారు. భారత అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఈ ఈటీఎఫ్ ఓ మార్గమని తాము నమ్ముతున్నట్టు చెప్పారు. అధిక డివిడెండ్ ఈల్డ్‌తో తక్కువ విలువకు లభిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment