న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌లో మిగిలిన 29.54 శాతం వాటా విక్రయానికి వీలుగా ప్రభుత్వం యూఎస్‌లో రోడ్‌షోలకు ఈ నెలలో తెరతీయనుంది. ప్రమోటర్ సంస్థ వేదాంతా.. తమ గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్‌కు విక్రయించేందుకు నిర్ణయించింది. ఇది కంపెనీవద్ద గల భారీ నగదు నిల్వలను వినియోగించుకునేందుకు తీసుకున్న నిర్ణయంగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో మిగిలిన వాటాను విక్రయించాలని గతేడాదిలోనే నిర్ణయించింది. అయితే ప్రభుత్వం వేదాంతా ప్రణాళికలను వ్యతిరేకించింది. కాగా.. వేదాంతా జింక్ ఆస్తుల విక్రయ ప్రతిపాదన గడువు గత నెలలో ముగిసిపోయింది. దీంతో ప్రభుత్వం సొంత కార్యాచరణకు సన్నాహాలు ప్రారంభించింది. వెరసి ప్రభుత్వ వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైలర్లకు విక్రయించేందుకు వీలుగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)ను పరిశీలిస్తున్నట్లు దీపమ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం హిందుస్తాన్ జింక్‌లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది.
గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్‌కు 298.1 కోట్ల డాలర్లకు విక్రయించాలని వేదాంతా గతంలో ప్రతిపాదించింది. అయితే సంబంధిత పార్టీ లావాదేవీగా ఈ డీల్‌ను పరిగణించాలని, ఫలితంగా నగదురహిత బదిలీ చేపట్టాలని అభిప్రాయపడింది. ఈ అంశంలో ప్రభుత్వం న్యాయ సంబంధ అవకాశాలనూ పరిశీలించేందుకు నిర్ణయించుకుంది. గతేడాదిలోనే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ).. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల 29.54 శాతం వాటాకు సమానమైన 124.79 కోట్ల షేర్ల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment