- 25వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 6.49 లక్షలయ్యింది
- మధ్యలో భారీగా పడినా ఆందోళన చెందలేదు
- ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ
ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ పేరుతో ప్రవేశపెట్టిన కొత్త శీర్షిక మాలాంటి ఎంతోమంది ఇన్వెస్టర్లకు స్ఫూర్తినిస్తోంది. దీంతో నా సక్సెస్ స్టోరీ కూడా ‘ప్రాఫిట్’ పాఠకులతో పంచుకోవాలనిపించింది.’’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ. ఆయన ఇన్వెస్ట్‌మెంట్ స్టోరీ ఆయన మాటల్లోనే...
రాష్ట్ర ప్రభుత్వరంగ కంపెనీలో పనిచేస్తున్న నేను 1994 సెప్టెంబర్‌లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రైమా ప్లస్ (నాకు తెలిసినంతవరకు ఫ్రాంక్లిన్ ఇండియాకి ఇది తొలి పథకం)లో రూ.25,000 ఇన్వెస్ట్ చేశాను. అది న్యూ ఫండ్ ఆఫర్ కావడంతో ఒక్కొక్క యూనిట్ రూ. 10 చొప్పున 2,500 యూనిట్లు వచ్చాయి. కాని ఇన్వెస్ట్ చేసిన రెండేళ్ళలోనే నా ఇన్వెస్ట్‌మెంట్ విలువ సగానికి సగం ఆవిరైపోయింది. 1996 డిసెంబర్‌లో యూనిట్ విలువ రూ.5.88 పడిపోయింది. ఆ సమయంలో కాస్త భయపడ్డాను. అయితే దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం కాబట్టి వైదొలగలేదు.
ఇలా ధైర్యంగా ఎదురుచూసినందుకు ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం నా పెట్టుబడి రూ.25,000 కాస్త ఇప్పుడు ఇంచుమించుగా రూ.6.49 లక్షలకు చేరింది. అంటే ఈ పథకం సగటున 17 శాతం వార్షిక రాబడిని అందించింది. అలాగే నా పెట్టుబడి 26 రెట్లు వృద్ధి చెందినట్లు లెక్క. 2008 ఆర్థిక సంక్షోభంలో ఈ విలువ రూ.3 లక్షలకు పడిపోయింది. అప్పుడు కూడా నేను భయపడలేదు.
కాని ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. 1996లో భారీగా పడిపోయినప్పుడు చేతిలో డబ్బులుండి మరో రూ.25,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేదని. ఇలాంటి ఆలోచనలు మానవ సహజమే అయినా నా అనుభవంతో ఇన్వెస్టర్లకి చెప్పేది ఒక్కటే. ఇన్వెస్ట్ చేసిన మర్నాటి నుంచి ఎంత పెరిగింది అన్నది చూడకుండా మంచి పథకంలో ఇన్వెస్ట్ చేసి కనీసం 10 నుంచి 20 ఏళ్ళు ఎదురుచూస్తే తప్పక లాభాలు వస్తాయి.
- జి.మురళీకృష్ణ, హైదరాబాద్