
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన మూడు సంస్థలకు భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) లైసెన్సును జారీ చేసింది. మాస్కో కేంద్రంగా పనిచేసే ఆల్ఫా క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీతో పాటు విసెవిలోద్ రోజానోవ్ అనే ఇన్వెస్టరు ఈ లైసెన్సులను పొందిన జాబితాలో ఉన్నారు. మూడేళ్ల పాటు 2026 వరకు ఇది వర్తిస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు అమలవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఐ మార్గాన్ని ఎంచుకోవడం ఇదే ప్రథమం కావచ్చని పరిశమ్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వారు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించాయి. డాలరును ఆయుధంగా చేసుకుని రష్యాపై ఆంక్షలను ప్రయోగిస్తుండటమనేది కొత్త ఆర్థిక పరిస్థితులకు దారి తీస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా తాజా ధోరణి ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment