ఉక్రెయిన్ సంక్షోభం రష్యాను ఆర్థికంగా ఇరకాటంలో పెట్టేందుకు పాశ్చాత్య దేశాలకు ఒక అవకాశం కల్పించింది. ఇప్పటికే రికార్డు స్థాయి ఆంక్షలతో రష్యాను.. అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నిరసన పేరిట ప్రముఖ కంపెనీలెన్నో రష్యాను వీడాయి. అయితే..
ఆ కంపెనీలకు ఇప్పుడు సాలిడ్ షాక్ ఇచ్చింది రష్యా. విదేశీ కంపెనీలు రష్యాకు తిరిగి రావడానికి డెడ్‌లైన్ విధించింది పుతిన్ ప్రభుత్వం. మే 1వ తేదీలోపు తిరిగి తమ దేశానికి రాకుంటే, కార్యకలాపాలను మొదలుపెట్టకుంటే.. ఆయా కంపెనీలపై పదేళ్లపాటు నిషేధం విధిస్తామని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా డూమా డిప్యూటీ యెవ్‌గెని ఫెడోరోవ్ సదరు కీలక ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ‘‘ ఇది పూర్తిగా వాళ్లకు సంబంధం లేని వ్యవహారం. వాళ్ల జోక్యం అక్కర్లేనిది. వేలమంది రష్యన్ పౌరుల పౌరులను వాళ్లు(ఆ కంపెనీలను ఉద్దేశించి) అనిశ్చితిలోకి నెట్టేశారు. వాళ్ల భవిష్యత్తు, బాగోగుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు’’. అని ఆ ప్రకటన చదివి వినిపించారు ఆయన.
మే 1, 2022లోపు వారి(ఆ కంపెనీలు) కార్యకలాపాలను పునరుద్దరించుకోవడానికి అనుమతిస్తున్నాం. ఒకవేళ అది జరగకుంటే.. వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవడమే కాదు.. పదేళ్ల పాటు రష్యాలో కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిషేధం కూడా విధిస్తాం అని స్పష్టం చేశారు యెవ్‌గెని.
అంతకుముందు, రష్యాను విడిచిపెట్టిన విదేశీ కంపెనీలకు బాహ్య నిర్వహణను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారు. దీని ప్రకారం.. అధికారులు దీనికి తగినంత చట్టపరమైన మార్కెట్ సాధనాలను కలిగి ఉంటారు. అయితే వ్యాపారాలను నేరుగా జాతీయకరణ చేయడం కంటే.. విదేశీ కంపెనీల్లో తాత్కాలిక పాలన విభాగం ఏర్పాటు చేసుకోవడం మంచిదనే సూచనను ఎప్పటి నుంచో చేస్తున్నారు రష్యా ఆర్థిక మేధావులు.
Comments
Please login to add a commentAdd a comment