బ్యాలెన్స్ సరే... మరి రీబ్యాలెన్సో? | balance Well ... More Re balance | Sakshi
Sakshi News home page

బ్యాలెన్స్ సరే... మరి రీబ్యాలెన్సో?

Published Mon, Oct 19 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

balance Well ... More Re balance

* పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అత్యవసరం
* అలాగైతేనే పొందిన లాభాలు చేతికొస్తాయ్
ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పొచ్చంటారు. అలాగే పోర్టుఫోలియో చూసి కూడా సదరు ఇన్వెస్టర్ తెలివైన వాడా? కాదా అని చెప్పొచ్చు. పోర్ట్‌ఫోలియో ఎల్లప్పుడు డైవర్సిఫైడ్‌గా ఉండాలి. రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీతో పాటు తక్కువ రిస్క్ ఉండే డెట్ సాధనాల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే మీ పోర్ట్‌ఫోలియో చాలా బలంగా ఉన్నట్లు అర్థం. ఒకదానిలో నష్టం వచ్చినా...

ఇంకొక దానిలో లాభం వస్తే వచ్చిన నష్టం సమానం అవుతుంది. అప్పుడు రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. ఫోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో... దాన్ని రీ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది ఎలాగో చూద్దాం..
 
పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అంటే?
పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్‌డ్‌గా ఎలా ఉంచుకుంటామో... అలాగే దాన్ని నిర్ణీత సమయాల్లో క్రమబద్ధంగా రీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పోర్ట్‌ఫోలియో, ఫండ్స్ విలువ ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా అసెట్స్ కేటాయింపులు కూడా మారుస్తూ ఉండాలి. దీన్నే  ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్‌గా పేర్కొంటారు. సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లు పెరుగుతున్నపుడు వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి, పతనమవుతున్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు.

కానీ ఇక్కడ రీ-బ్యాలెన్స్ విధానంలో మార్కెట్లు పడుతున్నప్పుడు అందులో ఇన్వెస్ట్‌చేసి... పెరుగుతున్నప్పుడు లాభాలు పొంది బయటకు వస్తారు. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ కొన్ని పెరగవచ్చు... అలాగే కొన్ని తగ్గొచ్చు. పెరిగిన స్టాక్స్ అలాగే పెరుగుతూ వె ళ్తాయని చెప్పలేం. అవి కూడా కొంత పెరిగిన తర్వాత తగ్గొచ్చు. ఇలా స్టాక్స్ పెరిగి మళ్లీ తగ్గితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్‌లకు కేటాయించిన ఇన్వెస్ట్‌మెంట్లను మార్చుకుంటూ వెళ్లాలి.

ఉదాహరణకు 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈక్విటీ మార్కెట్ పతనమైంది. ఇలాంటి సమయాల్లో అందరి పోర్ట్‌ఫోలియోలో డెట్‌పై ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువగా, ఈక్విటీపై తక్కువగా ఉంటాయి. కానీ రీ బ్యాలెన్స్ విషయానికి వస్తే.. ఈక్విటీ పైనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ తక్కువ ధరల వద్ద ఉంటాయి. అప్పుడు స్టాక్స్ కొంటే అవి వాటి అసలు ధర వద్ద మనకు లభిస్తాయి. అలాగే 2013లో మార్కెట్లు మందగమనంలో ఉన్నాయి.

ఇలా స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ కొనడం వల్ల ఈక్విటీ అసెట్స్‌ను బాగా పెంచుకోవచ్చు. ఈ విధంగా తక్కువ ధరల వద్ద కొన్న స్టాక్స్ తర్వాతి కాలంలో బాగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మీ స్టాక్స్‌ను విక్రయించి లాభాలను పొందొచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ లక్ష్యంగా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను అందిస్తోంది.
 
పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మారాలి...
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. అప్పుడు మీరు కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలను మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు మీ మిగులు సంపదను ఈక్విటీపై 70 శాతం, డెట్ సాధనాలపై 30 శాతం ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నారు. కానీ అప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా ఊపుమీద ఉంది. అలాంటప్పుడు మీరు ఈక్విటీపై 70 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ను 80 శాతానికి పెంచుకోవచ్చు. డెట్ సాధనాలపై ఇన్వెస్ట్‌మెంట్‌ను 20 శాతానికి తగ్గించుకోవచ్చు. ఈక్విటీపై లాభాలను పొందిన తర్వాత తిరిగి మీ ఇన్వెస్ట్‌మెంట్లను ఈక్విటీపై 70 శాతంగా, డెట్‌పై 30 శాతంగా ఉంచుకోవచ్చు. ఇదే రీబ్యాలెన్స్ వ్యూహం.
 
రీబ్యాలెన్స్ సులువే కానీ..
రీబ్యాలెన్స్ వ్యూహం సులభంగానే కనిపిస్తుంది. కానీ దీనికి క్రమశిక్షణ కావాలి. అనుకున్న వ్యూహాలను అమలు చేయడానికి సరైన సమయం కావాలి. ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు పతనమౌతుందో తెలియదు. స్టాక్స్ ధరలు ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉంటాయో ట్రాక్ చేయడం కష్టం. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎంట్రీ ఇవ్వడం సులువైన పనికాదు. అలాగే ప్రాఫిట్స్‌ను బుక్ చేసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

- నిమేష్ షా
 సీఈఓ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement