మీ డివిడెండ్‌ మీకు చేరిందా? | Did you have your dividend? | Sakshi
Sakshi News home page

మీ డివిడెండ్‌ మీకు చేరిందా?

Published Mon, Mar 19 2018 1:09 AM | Last Updated on Mon, Mar 19 2018 2:48 AM

Did you have your dividend? - Sakshi

లేదంటే కంపెనీ   దగ్గరే ఉండి ఉంటుంది వివరాలు కంపెనీవెబ్‌సైట్లో ఉంటాయి  ఏడేళ్ల వరకూ కంపెనీ డివిడెండ్‌ ఖాతాలోనేఆ తర్వాత ఇన్వెస్టర్‌  ప్రొటెక్షన్‌ ఫండ్‌కు బదిలీ ఈ లోపు ఎప్పుడైనా  క్లెయిమ్‌ చేసుకోవచ్చు  

వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగించే కంపెనీలన్నీ దాదాపుగా తమ వాటాదారులకు ఏటా కొంత లాభాన్ని డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ప్రతి మూడు నెలలకూ ఎంతో కొంత డివిడెండ్‌ చెల్లిస్తాయి కూడా. ఇప్పుడు ఆన్‌లైన్‌ డీమ్యాట్‌ ఖాతాలు వచ్చాయి కనక దాదాపు అన్ని కంపెనీలూ డివిడెండ్లను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఇంకా డివిడెండ్‌ వారెంట్లను జారీ చేయటం జరుగుతోంది. ఈ డివిడెండ్‌ వారెంట్లు వాటాదారు చిరునామాకు నేరుగా వెళతాయి. వాటిని బ్యాంకులో జమ చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా మారినా కొత్తది తెలియజేయని వారు... మరణించిన వాటాదారుల పేరిట జారీ అయిన డివెండ్‌ వారెంట్లు క్లెయిమ్‌ చేసుకోకుండా అలాగే ఉండిపోతాయి. ఏడేళ్ల తరవాత ఆ మొత్తాన్ని కంపెనీలు ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌కు (ఐఈపీఎఫ్‌) బదిలీ చేస్తాయి. ఈ ఫండ్‌ను సెబీ ఏర్పాటు చేసింది. ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడమే కాక వారి ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం తమకు రావాల్సిన డివిడెండ్‌ను పొందడం ఎలాగో ఒకసారి చూద్దాం...     

లిస్టెడ్‌ కంపెనీలు డివిడెండ్‌ను క్లెయిమ్‌ చేసుకోని వాటాదారుల వివరాలను కచ్చితంగా తమ వెబ్‌సైట్లలో ప్రదర్శించాలి. పేరు, రికార్డుల్లో నమోదై ఉన్న వారి చిరునామా, ఎంత మేర డివిడెండ్‌ పెండింగ్‌లో ఉంది తదితర వివరాలను ప్రతి కంపెనీ ఏటా వార్షిక వాటాదారుల సమావేశం ముగిసిన తర్వాత 90 రోజుల్లోపే వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఇలా క్లెయిమ్‌ చేసుకోని వాటాదారుల వివరాలను వరుసగా ఏడేళ్ల పాటు వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ వివరాలను సరిచూసుకుని తమ పేరు గనక ఉంటే సంబంధిత డివిడెండ్‌ కోసం క్లెయిమ్‌ చేసుకోవాలి. లేదంటే ఏడేళ్ల తర్వాత ఆ మొత్తం ఐఈపీఎఫ్‌కు బదిలీ అవుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కె.వి.సునీల్‌ కుమార్‌ చెప్పారు.

డివిడెండే కాదు, రిఫండ్లు కూడా...
ఒక్క డివిడెండే కాదు, షేర్ల కోసం ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లించిన మొత్తాన్ని ఒకవేళ ఆ మేరకు షేర్లు అలాట్‌ చేయలేకపోతే కంపెనీలు వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది. అలా చెల్లించాల్సి ఉన్న నిధులు, కాల వ్యవధి తీరిన డిపాజిట్లు, డిబెంచర్లు, వాటిపై వడ్డీ సైతం కంపెనీ వద్దే ఉండిపోతే ఆ  నిధులను కూడా నిబంధనల మేరకు ఐఈపీఎఫ్‌కు బదిలీ చేయాలని సునీల్‌ వెల్లడించారు. ‘‘సెక్షన్‌ 124(5) ప్రకారం ఏడు సంవత్సరాల వ్యవధిలోపు ఎప్పుడు ఇన్వెస్టర్‌ క్లెయిమ్‌ చేసుకున్నా ఆ మొత్తం వారికి చెల్లించడం జరుగుతుంది’’ అని ఆయన తెలిపారు.

క్లెయిమ్‌ ప్రక్రియ ఇలా...
ఐఈపీఎఫ్‌–5 అనే డాక్యుమెంట్‌ను (జ్టి్టp://ఠీఠీఠీ.జ్ఛీpజ.జౌఠి.జీn) వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు లేదా డివిడెండ్‌ ఆదాయం కోసం క్లెయిమ్‌ చేసుకునే వారు దరఖాస్తులో అన్ని వివరాలనూ పొందు పరచాల్సి ఉంటుంది. ఇందులో క్లెయిమ్‌ చేసుకుంటున్న వారి పేరు, కంపెనీ పేరు, షేర్లకు సంబంధించిన వివరాలు, ఆధార్‌ నంబర్, ఎన్ని క్లెయిమ్‌లు, బ్యాంకు ఖాతా, డీమ్యాట్‌ ఖాతా వివరాలు అన్నీ ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ దరఖాస్తును తిరిగి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఎంసీఏ21కు పేజీ రీడైరెక్ట్‌ అవుతుంది. ఇక్కడ సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ జారీ అవుతుంది. దీన్ని భవిష్యత్తులో విచారణల కోసం సేవ్‌ చేసుకోవడం మంచిది. ఇక్కడే పేమెంట్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఫీజు ఉన్నా, లేకపోయినా గానీ పే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ఆన్‌లైన్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ అందుతుంది. ఆ తర్వాత క్లెయిమ్‌ ఫామ్, అక్నాలెడ్జ్‌మెంట్‌ కాపీలను, ఇండెమ్నిటీ బాండ్‌తో కలిపి ఐఈపీఎఫ్‌ నోడల్‌ ఆఫీసర్‌కు అందజేయాలి. క్లెయిమ్‌ అందిన తర్వాత కంపెనీ 15 రోజుల్లోపు ఐఈపీఎఫ్‌కు వెరిఫికేషన్‌ రిపోర్ట్‌ అందచేస్తుందని సునీల్‌కుమార్‌ తెలిపారు. ఒకవేళ షేర్లు బకాయి ఉంటే వాటిని డీమ్యా ట్‌ ఖాతాకు బదిలీ చేయడం లేదా ఫిజికల్‌ సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. వెరిఫికేషన్‌ రిపోర్ట్‌ అందిన తేదీ నుంచి 60 రోజుల్లోపు తిరిగి చెల్లించడం పూర్తవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement