Beliefs
-
నకిలీ బాబాకు దేహశుద్ధి
మనూరు(నారాయణఖేడ్): గ్రామాల్లోని ప్రజల ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని అమాయక జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ బాబాకు స్థానిక బోరంచ గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. గత ఆదివారం బోరంచలో గ్రామంలో ఓ యువకుడు ఫకీరు వేషధారణలో గ్రామంలో పర్యటిస్తూ మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని నిమ్మకాయలు, నీళ్లు చల్లుతూ తిరుగుతూ గ్రామానికి చెందిన రజాక్ ఇంటికి వెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తానని వారిని నమ్మబలికి వారి నుంచి రూ.5 వేలు నగదుతోపాటు ఒక సెల్‌ఫోను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించి గ్రామం చివరికి వచ్చి వేషం మార్చుకుని వెళ్లిపోయాడు. కాగా మళ్లి బోరంచ గ్రామం పక్కనే ఉన్న దుదగొండ గ్రామంలో సోమవారం ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా గ్రామస్తులకు నమ్మబలికే ప్రయత్నం చెయ్యగా ఈ విషయం ముందే తెలుసుకున్న గ్రామస్తులు సదురు వ్యక్తిని బంధించి బోరంచ గ్రామస్తులకు అప్పగించారు. దీంతో వారు నకిలీ బాబాను చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా యువకుడు కర్ణాటకలోని గుల్బర్గకు చెందిన మనోజ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. మారు వేషాలువేస్తూ అమాయక జనం ముఢనమ్మకాలను ఆసరా చేసుకుని బురిడి బాబాగా తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా సంబంధిత యువకుడిని మనూరు పోలీసులకు అప్పగించారు. -
రెండు పైసలు దక్షిణ అడిగారు నా గురువు
రాధాబాయ్ దేశ్‌ముఖ్ అనే భక్తురాలు బాబా వద్ద మంత్రోపదేశం పొందాలనే ఆత్రుతతో షిరిడీ వచ్చింది. బాబాకు తన మనసులోని మాట చెప్పి తన చెవిలో మంత్రం ఊదాల్సిందేనని మొండిపట్టు పట్టింది. మంత్రం చెప్పకపోతే ఉపవాసాలుండి చచ్చిపోతానంది. బాబా ఆమెతో ఇలా అన్నారు. ‘‘అమ్మా! నాకు తల్లివంటి దానివి. నేను చెప్పేది శ్రద్ధగా విను. నా గురువు మిక్కిలి దయార్ద్ర హృదయులు. చాలాకాలం ఆయనకు సేవ చేశాను. వారి వద్ద ఉపదేశం పొందాలనేది నా ఆశ. అలా పన్నెండేళ్లు గురుసేవలో తరించాను. కానీ వారు నా చెవిలో ఏ మంత్రమూ ఊదలేదు. వారి సాంగత్యంలో నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. వారు నన్ను అడిగినది రెండే రెండు పైసల దక్షిణ. అందులో ఒక పైసా నిష్ఠతో కూడిన భక్తి. దీనినే శ్రద్ధ అంటారు. రెండోపైసా సబూరి. అంటే సంతోష స్థైర్యాలతో కూడిన సహనం. ఈ ప్రపంచమనే సాగరాన్ని ఓర్పు అనే ఓడ సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాల్ని తొలగిస్తుంది. కష్టాలను ఎడబాపుతుంది. సబూరి అనేది సుగుణాలకు గని. మంచి ఆలోచనలకు పెన్నిధి. శ్రద్ధ, సబూరి అక్కచెల్లెళ్ల వంటివి. నా గురువు నా నుంచి ఏమీ ఆశించలేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ కేవలం దృష్టి చేతనే నన్ను అనుగ్రహించేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున, పిల్ల తాబేళ్లు మరో ఒడ్డునా ఉంటాయి. తల్లి పిల్లలకు పాలివ్వడం, ఆహారం పెట్టడం చేయదు. కేవలం తల్లి ప్రేమాస్పద దృష్టి సోకి పిల్లలు పెద్దవుతాయి. నా గురువు నాపై అదే ప్రేమ చూపేవారు. తల్లీ! నా గురువు నాకే మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకెట్లు మంత్రం ఊదగలను? గురువు మయమైన తాబేలు చూపే మనకు సంతోషాన్నిస్తుందని గుర్తుంచుకో. మంత్రం కాని, ఉపదేశం కాని ఎవరి నుంచీ పొందాలని ప్రయత్నించకు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నీ వైపు నేనట్లే చూస్తాను. నీవు తప్పక పరమార్థం పొందుతావు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అబద్ధం చెప్పను. నిజం కానిది మాట్లాడను. ఆరు శాస్త్రాల్లో ప్రావీణ్యం, అష్టాంగ యోగాల్లో సాధన అవసరం లేదు. గురువుపై సంపూర్ణ ప్రేమ, విశ్వాసాలను ఉంచు. సర్వమూ చేయువాడు గురువే. అతనే కర్త అని నమ్ము. ఎవరైతే గురువును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారో వారు ధన్యులు’’అని బాబా తన ఉపదేశాన్నిచ్చారు. రాధాబాయి బాబా మాటలను శ్రద్ధగా వింది. అర్థమైందన్నట్లుగా భక్తితో చేతులు జోడించింది. – డా. కుమార్ అన్నవరపు -
పత్రహరిత
నా ఫ్రెండ్ హన్మంతరావు మెసేజ్ చూసి దిమ్మతిరిగిపోయింది నాకు. ఏమైందో ముందు అర్ధం కాలేదు. కానీ ప్రాబ్లం ఎంతో సీరియస్ అని మెసేజ్ పూర్తిగా చదివాక అర్థమై కొంతసేపు అయోమయం అనిపించింది. ఆమధ్యే కదా తను ఎమ్మెస్సీ కంప్లీట్ చేసింది. ఇంతలోనే ఇలా ఎలా అయుంటుంది? ఎంత నాకు నేను ప్రశ్నించుకున్నా సమాధానం దొరకదని, నేరుగా వాడిని కలిస్తే తప్ప ఏదీ తేలదని అనిపించింది. అంత కష్టంలో ఉన్న వాడిని కలిసి ఓదార్చడం కనీస బాధ్యత అని నిర్ణయించుకున్నాను.రేపు హైదరాబాద్ వెళ్తున్నానని రెండుమూడు రోజులదాకా రానని నా సహచరికి చెప్పాను. తెల్లారి పట్నానికి బయల్దేరాను. మాకు పట్నం అని పిలవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మాది ఒకప్పటి ఖమ్మం జిల్లా. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల ప్రాంతం. పేర్చినట్టుండే కొండలు, గుట్టల మధ్య మా ఊరుంటుంది. ఊరిని కాపాడుతున్నాయా అన్నట్టు గంభీరంగా నిలబడి నాలుగు దిక్కులూ జాగ్రత్తగా పహారా కాసే తాళ్లు. చుట్టూ రకరకాల పూలు, పళ్ళ తోటలు. నా అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందీ ఊరు. ఇక్కడికి ట్రాన్స్‌ఫరైన దగ్గర్నుంచీ నేను మరే ఊరికీ వెళ్ళలేదు. నా ఇన్ఫ్లుయన్స్ అంతా ఉపయోగించి ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకుంటాను. బహుశా నేను నా జీవితంలో చేసిన ఒకే ఒక్క అవినీతి పని ఇదే. మా ఊరు నుంచి హెడ్‌క్వార్టర్‌కు అక్కడి నుంచి పట్నం బస్ దొరికి వాడింటికి వెళ్ళేసరికి సాయంత్రమైంది. పోష్ ఏరియా. గేటెడ్ కమ్యునిటీలో మంచి అపార్ట్మెంట్. అందమైన ఫ్లాట్. అద్భుతమైన ఫర్నిచర్. మంచి పెయింటింగ్స్‌తో అలంకరించిన గోడలు. వాడి సంపాదన ఇల్లు కట్టడంలో అడుగడుగునా, అంగుళం అంగుళంలో వాడు తీసుకున్న శ్రద్ధలో ఉట్టిపడుతోంది. కుటుంబ సభ్యులందరికీ తలా ఓ గది. రూమ్స్ అన్నింటికీ గ్లాస్ డోర్స్. టీపాయ్లతో సహా అంతా గాజుమయం. నాకు చిన్నప్పుడు చదువుకున్న మయసభ గుర్తొచ్చింది. చాలా సేపు వాడేం మాట్లాడలేదు. తరువాత నేనే ‘‘ఎక్కడుంది తను’’ అని అడిగాను. ‘‘ఇంక ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకొచ్చేశాం. తన గదిలోనే ఉంది. మీ చెల్లెలు తనను కంటికి రెప్పలా చూసుకుంటోంది’’ అన్నాడు దుఃఖం తోడు వచ్చిన గొంతుతో. ‘‘చూద్దాం పద’’ అంటూ తన గదిలోకి వెళ్లాం.జిట్రేగుతో చేయించిన డబుల్‌కాట్ బెడ్‌మీద అచేతనంగా పడి ఉంది ఆద్య. చూస్తూనే ఉంది, కానీ ఆ చూపులో కాంతి లేదు. చూడ్డానికి బానే ఉంది కానీ ఎవరితోనూ మాటామంతీ లేదు. దాదాపు నాలుగైదు నెలలుగా ఇదే పరిస్థితట. మమ్మల్ని చూడగానే హన్మంతుగాడి భార్య లక్ష్మి కళ్ళంబడి నీళ్లు. కుర్చీలోంచి లేచి నుంచుంది– ‘‘మీకిష్టమయిన ఆద్య అన్నయ్యా! బొమ్మలా ఉంటుంది అనేవారు కదా అన్నయ్యా.. చివరికిలా బొమ్మలా అయిపోయింది.’’ అంటూ వెక్కిళ్లు పెట్టింది. ‘‘ఊర్కోమ్మా. అంతా సర్దుకుంటుంది’’ అంటూ ఆమెను నామ్కేవాస్తే ఓదార్చి, అలా సాధ్యం కాదేమోనని లోపల మనసు మొత్తుకుంటుంటే బయటికొచ్చేశాం.‘‘అసలేమయిందిరా..’’ బాధ నిండిన వాయిస్‌తో అడిగాను నేను. ఆద్యను అలా చూసిన షాక్‌లోనే ఉన్నాను.‘‘నాకూ అర్థం కాలేదురా. హాస్టల్ వార్డెన్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళాను. తీరా చూస్తే ఇలా ఉంది పరిస్థితి. ఎందుకిలా అయిందో తెలీడం లేదు. అక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను, లవ్ ఎఫైర్ లాంటిదేమన్నా ఉందేమోనని. కానీ అది కూడా కాదని తెలిసింది. ఇంకా ఏం జరిగిందో తెలీదు. మీ చెల్లెలేమో ఎవరైనా ఏదైనా చేశారేమోనండీ అంటుంది. నాకలాంటి నమ్మకాలు లేవు.’ అంటూ ఆగాడు కళ్ళు తుడుచుకుంటూ. ‘‘మరి ట్రీట్మెంట్?’’ అంటూ ఆగాను. ‘‘హైదరాబాద్‌లో అన్నిచోట్లా తిప్పాం. మంచి సైకియాట్రిస్ట్లందరికీ చూపించాం. చివరికి మా కజిన్ వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటే అక్కడకు కూడా తీసుకెళ్లాం. రెండు నెలలు ఉంచి ట్రీట్మెంట్ చేయించి వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఇంక ఏం చేయాలో కూడా తెలీని పరిస్థితి. ఇక మీ చెల్లెలు చెప్పినట్లు బాబాలకు, మంత్రగాళ్ళకు చూపించడం ఒకటే మిగిలింది’’ అంటూ నిట్టూర్చాడు.‘‘అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోకురా. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం దారి తెలుసుకోగలగాలి అంతే..’’ అంటూ వాణ్ణి సముదాయించాను కానీ నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోయాను. అసలేం జరిగుంటుంది? అన్న ప్రశ్న నన్ను ఆ రాత్రంతా తొలిచేసింది.తెల్లారి లేచింతరువాత వాణ్ణి అడిగాను – ‘‘ఆద్య గురించి నాకింకా వివరంగా చెప్పరా..’’ అని.వాడు చెప్తూనే ఉన్నాడు గంట వరకూ. ‘‘అందరికంటే ముందుండాలని ఆద్య అని పేరు పెట్టుకున్నాంరా. నీకు తెలుసు కదా, తను చిన్నప్పటి నుంచి ఎంత యాక్టివో. చదువు మీద ఎంత శ్రద్ధో. ఏది చేసినా మనసు పెట్టి చేసేది. పైపైన చేసి అయిపోయిందనే మనస్తత్వం కాదు తనది. పూర్తిగా తెలుసుకుని చేసేది. అయితే నాకు తెలీని విషయం ఏంటంటే, ఆద్య ఆర్ట్ బాగా వేస్తుందని. ఎప్పుడూ నాకు చెప్పలేదు, తన పెయింటింగ్సేవి నాకు చూపించనూ లేదు. హాస్టల్ ఖాళీ చేసినప్పుడు దాదాపు యాభై అరవై పెయింటింగ్స్ దొరికాయి. చాలా ఆశ్చర్యమేసింది. అవన్నీ తీసుకొచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టాం. ఇప్పుడిక వాటితో పనేం ఉంది?’’ అన్నాడు హన్మంతు బాధగా. నాకు ఆద్య గీసిన బొమ్మలు చూడాలని అనిపించింది. హన్మంతుని అడిగాను చూపించమని. వాడు నాకేసి ఆశ్చర్యంగా చూసి ‘పద’ అన్నాడు. అక్కడ అల్మారా కనిపిస్తే డోర్ తీసి చూశాను. డైరీ కనిపించింది. దాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టోర్‌రూమ్‌లో నుంచి పెయింటింగ్స్ హాల్లోకి తీసుకొచ్చాం ఇద్దరం. నన్ను చూస్తుండమని చెప్పి వాడు లోపలికెళ్ళాడు. నేను ఒక్కొక్కటి తీసి చూశాను.పచ్చని ప్రకృతినంతా పెయింటింగ్స్‌గా మార్చేసింది ఆద్య. నాకు చాలా అపురూపంగా అనిపించాయి. దట్టమైన మబ్బులు, వాటి మధ్యలో చిక్కిన స్పష్టాస్పష్టమైన చంద్రుడు, రకరకాల పక్షులు, తుమ్మెదలు, రంగురంగు పూలు, తోటలు, పళ్ళు, పచ్చని చిలకలు వాలిన చెట్లు, చెట్లమీద నుంచి ఆకాశంలోకి ఎగరబోతున్న పక్షుల గుంపులు... ఇంకా నాకు బాగా నచ్చిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి అందులో. చిన్న సన్నజాజి పందిరి దానిమీద పిట్టగూడు, పక్కనే వాలిన పిట్టలు, మొక్కజొన్న తోటలు, కాల్వల్లో ఈత కొడుతున్న పిల్లలు, నాకొక విషయం అర్థం కాలేదు – సిటీలో పెరిగిన అమ్మాయికి ఇవన్నీ ఎలా పరిచయం?ఒక పెయింటింగ్ మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా చూస్తుండిపోయాను దానివైపు! ఆ తరువాత ఆద్య డైరీ తిరగేశాను. జూన్ 14. శుక్రవారం.‘వేసవి సెలవులొస్తే అంతా హైదరాబాద్‌కో, పక్కన ఉన్న ఏదో ఒక సిటీకో వెళ్ళిపోతారు. కానీ అదే సిటీవాళ్ళు పిల్లల్ని తీసుకుని పల్లెలకు వెళ్ళి అక్కడి వాతావరణాన్ని, పంటల్ని వాటి ప్రాముఖ్యతని ఎందుకు పరిచయం చెయ్యరు?’జూలై 20. ఆదివారం.‘అసలు ఈ సిటీలో నాకు ఊపిరాడ్డం లేదు. ఎటు చూసినా సిమెంట్, లేదంటే గ్లాస్..! ఎవరికి వారు వేసుకుంటున్న ఛేదించలేని పరదాలు..! ఓజోన్ పలచబడుతోంది. యూవీ రేస్‌ని రాకుండా ఆపగలిగేది ఒక్క ఓజోనే. ఊపిరితిత్తుల్లో పేరుకుంటున్న కాలుష్యం. ఇక్కడే కొన్నాళ్ళు ఉంటే బహుశా తెలియని రోగాలు కూడా అంటుకుంటాయేమో. అకిరో డ్రీమ్స్ ఎంత బాగా తీశాడు! అణుబాంబు పడ్డ దేశం మళ్లీ మామూలు స్థితికి రావాలంటే ఎంత కష్టం! కాలుష్యం కూడా మనకు మనమే సృష్టించుకుంటున్న అణుబాంబు! దీని ఫలితం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇదెవడికీ పట్టదు.’ఆగస్టు 4. శనివారం.‘ఇంత పచ్చని ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. భవిష్యత్తరాలు ఎలా మనుగడ సాగిస్తాయి? ఎక్కడ చూసినా అడవులని నాశనం చేస్తున్నారు. సిమెంట్ కట్టడాలతో నింపేస్తున్నారు. కాలుష్యంతో పాడు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో భూమి సర్వనాశనం అవుతోంది. యాసిడ్ రెయిన్స్. ఇదంతా మనిషి భూమికి చేస్తున్న రాచపుండు. ఇది నయమవాలంటే భూమికి ఆకుపచ్చని పసరు పూయాలి. అదే మందు. అది కేవలం అడవుల్ని సంరక్షిస్తేనే సాధ్యం! కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎంతసేపూ సంతానం సాఫ్ట్వేర్ ఉద్యోగులయ్యారా లేదా! దేశాంతరం వెళ్తున్నారా లేదా! అనే కానీ కనీసం ఇంట్లోనయినా రెండు మొక్కల్ని నాటుదాం అనుకునే వారెంతమంది? కొన్నాళ్లకి ఆక్సిజన్ సిలిండెర్లు కొనుక్కుని బతకాలి, వాటర్‌ని కొంటున్నట్లు.’ఆగస్టు 31. గురువారం. ‘విశ్వంలో జీవగ్రహం అంటే లివింగ్ ప్లానెట్ ఒక్క భూమే! దాన్ని కూడా నిర్జీవం చేస్తున్నాం. ఒక్క జీవం పుట్టుకకు ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో తెలుసుకున్న మనిషి ఎందుకింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు? ఈ భూమి కాలుష్యం వల్ల నాశనమైతే మళ్ళీ ఒక జీవం పుట్టడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికి తెలుసు? అన్నీ తెలిసిన మనిషి ఎందుకింత దిగజారిపోయాడు? పనికిరాని డబ్బుని కూడబెట్టుకుంటున్న మనుషులకు భూమిని కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? భూమ్మీద ఇన్ని కోట్ల జీవరాశులుంటే కేవలం తన గురించి, తన వంశం గురించి మాత్రమే ఎందుకాలోచిస్తున్నారు? ప్రకృతిలో మనం భాగం అయినపుడు మరి మనల్ని మనమే కాదు, అన్ని జీవరాశుల్ని కాపాడుకోవడం మన కనీస బాధ్యత కదా? అందరూ గ్రీన్ కార్డు కలలే కంటే గ్రీన్ ప్లానెట్కలలు ఎవరు కనాలి?’ ఇలా సాగింది డైరీ! నిజానికి అది ఆద్య ఒక్కరి డైరీ కాదు. కాకూడదు. పట్నం బతుకుల సామూహిక డైరీ కావాలి కదా అనిపించింది.ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అస్పష్టంగా ఏవేవో ఆలోచనలు. నా మెదడు నాకేవో సంకేతాలివ్వసాగింది. చివరికి నేనో నిర్ణయానికి వచ్చాను. తెల్లారగానే హన్మంతుగాణ్ణి పిలిచి నా నిర్ణయం గురించి చెప్పాను. వాడు షాక్ అయ్యాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. నామీద వాడికి నమ్మకం కలగలేదు. వాడి ముఖంలో అది స్పష్టంగా కనిపించింది. వాడు లక్ష్మితో మాట్లాడి చెప్తానన్నాడు. సరేనన్నాను. ఇద్దరూ కలిసి చాలాసేపు చర్చించి, హాస్పిటల్స్‌తో విసిగిపోయి ఉండటంతో చివరికి ఓకే అన్నారు నా ప్రతిపాదనకు. నాకు సంతోషం వేసింది. ‘‘ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఎందుకు, ఏమిటి అని అడగొద్దు. మా ఊరికి ఆద్యను తీసుకెళదాం. రెండు లేదా మూడు నెలలు నా ప్రయత్నం నేను చేస్తాను. ఫలితం ఉంటే మన అదృష్టం’’ అన్నదే నా నిర్ణయం.పట్నం నుంచి బయల్దేరిన కారు మా ఊరిలో మా ఇంటిముందు ఆగింది. ముందు నేను దిగి వీధి గేటు తీసుకుని మొక్కల మధ్యలోంచి మా ఇంటి తలుపు తట్టాను. నా సహచరి వచ్చి తలుపు తీసింది. ఇంటి ముందు కారు ఆగి ఉండటంతో సందేహంగా ఆగిపోయింది. ‘‘మనింటికి గెస్ట్లొచ్చారు. ఇక్కడే రెండు మూడు నెలలు ఉంటారు.’’ అన్నాను. కారులోంచి దిగిన హన్మంతు, లక్ష్మిలను చూసి ఆనందంగా పలకరిస్తూ లక్ష్మిని ఆలింగనం చేసుకుంది నా సహచరి. దాదాపు శవంలా ఉన్న ఆద్యను చూసి కంటతడి పెట్టింది. ఆద్యను హాల్లో ఉన్న పక్క మీద పడుకోబెట్టాం అందరం కలిసి. అనుకున్న ప్రకారం వీల్‌చైర్, అంతకు ముందు ఆద్యకు డాక్టర్ రాసిన కొన్ని మందులు.. అన్నీ తీసుకుని వచ్చాం మా ఊరికి.పాలతనికి చెప్పాను, రోజూ ఎక్కువ పాలు తీసుకురమ్మని. ఉంటే జున్నుపాలు కూడా తెచ్చివ్వమ్మని. ఊర్లో ఉన్న బంతిపూల తోటకి, చెరుకు తోటకి, మామిడి తోటకి, ఇలా రోజుకో చోటుకి వెళుతున్నాం మేమంతా. ఆద్యను ఆ తోటల మధ్యలో ఆ పూల మధ్యలో వీల్‌చైర్‌లో తిప్పుతున్నాం. కనకాంబరాలు, లిల్లీలు, పొద్దుతిరుగుడు పూలు, ఎన్నో రకాల పూలు, తీగలు, మొక్కలు.. ఓహ్.. దేవలోకం అంటే ఇదేనేమో అన్నట్లుగా వాతావరణం.. ముందు హన్మంతు, వాడి భార్యలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకటి నీరసం కనిపించడంలేదు. ఉత్సాహం కనపడుతోంది ఇద్దరిలో. పెరట్లో కూరగాయలు కోయడం వాళ్లకు ఇష్టమైన వ్యాపకం అయింది. హన్మంతు భార్య, నా సహచరి కలిసి ఇంటిముందు ఉన్న పూలు కోసి మాలలు అల్లి పెట్టుకోవడం.. కబుర్లు చెప్పుకోడం.. యజ్ఞం చేస్తున్నంత ఏకాగ్రతతో మేము ఆద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకోరోజు ఒకో తోటలో తిప్పుతున్నాం. ఇరువైపులా చెట్లున్న కాలిబాటలో వీల్ చైర్‌ను తీసుకుని వెళ్తున్నాం. అలా అలా రెండు నెలలు గడిచిపోయాయి. మెల్లమెల్లగా హన్మంతు, లక్ష్మిల్లో ఈ ఆశ కూడా సన్నగిల్లింది. ఇక వెళ్ళిపోతాం అన్నారొకసారి. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. మరో నాలుగు రోజులు చూద్దామన్నాను. సరేనన్నారు.ఆ తర్వాత ఒక రోజు–బంతిపూల తోటలో స్వేచ్ఛగా తిరుగుతున్న సీతాకోక చిలుకతో పాటు ఆద్య చూపు కొద్దికొద్దిగా ఆకాశంలోకి ఎగిరింది. అంతే. మా ఆనందానికి హద్దులు లేవు. మా మనసులు అంబరాన్ని తాకాయి సంతోషంతో. మా ఆవిడ గడ్డితో నిండిన భూమే జానిమాజ్గా భావించి అక్కడే దువా చేసింది. చాలా చిన్న కదలికే. కానీ అదే బహుశా కొద్దిరోజుల్లో సీతాకోక చిలుక వేగం పుంజుకుంటుందని నాకు బలమైన ఆశ కలిగింది. ఇదెలా సాధ్యమయ్యిందని ఆరోజు అడిగారు, హన్మంతు, లక్ష్మి.నేను ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టాను–‘‘నాకు ఆద్య పెయింటింగ్స్ చూశాక, అందులోనూ నన్ను బాగా డిస్టర్బ్ చేసిన ఒక పెయింటింగ్ పరిశీలించాక ఆద్య వ్యాధి సగం అర్థమయినట్టు అనిపించింది. ఆ పెయింటింగ్‌లో – గాజు పలకల పంజరంలో ఒక సీతాకోక చిలుక పడి ఉంది. అది చనిపోయిందో, బతికి ఉందో చెప్పడం కష్టం. అర్థం కావడం లేదు. నిస్తేజంగా ఉంది. ఆ గాజు పలకల పంజరం చుట్టూ పచ్చదనం పరుచుకుని ఉంది. నన్ను బాగా కలవరపెట్టింది ఆ పెయింటింగ్. నాకెందుకో బెడ్ మీదున్న ఆద్య కళ్ళముందు మెదిలింది. తరువాత ఆద్య డైరీ చదివాను. ఒక్కో పేజీ తీస్తుంటే ఆద్య మనసు ఆవిష్కృతమవుతూ వచ్చింది. ఆమె ఆలోచనలు ఒక్కొక్కటిగా విశదమవుతూ వచ్చాయి.హన్మంతుతో జరిగిన చర్చల్లో చెప్పాడు, ఆద్య చాలాసార్లు ఊర్లకు పోదాం డాడీ అని అడిగిందని. కానీ ఊళ్ళో ఎవరూ లేకపోవడంతో తీసుకెళ్లలేకపోయాడని. కానీ ఆద్య సినిమాల్లో, కథల్లో చదివి ప్రకృతిపైన ప్రేమ పెంచుకుంది. ఆమె మిగతా పెయింటింగ్స్ చూసినప్పుడు కూడా నాకర్థమైంది ఇదే. అంటే ఆమెని ఆమె ప్రేమించింది. ప్రకృతిని ప్రేమించింది. తనని తాను ప్రకృతితో పోల్చుకున్నప్పుడు తానూ ఓ గాజుగదిలో బందీగా ఉన్నట్లు అనిపించి ఉంటుంది ఆమెకు. ఆ గాజు పలకల్ని బద్దలు కొట్టాలి. అప్పుడు సీతాకోక చిలుకకు ఆక్సిజన్ అందుతుంది. బటర్‌ఫ్లై బతుకుతుంది.ఎస్, ఆమె ‘నేచర్ మిíస్సింగ్ డిజార్డర్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అనిపించింది. మీరు ఇన్ని ప్రయోగాలు చేశారు కదా! నాకు ప్రకృతి వైద్యం చేసి చూద్దామనిపించింది. అంటే మనిషికి ప్రకృతిని పరిచయం చేయడం. నిజానికి ఇద్దరూ ఒకటే అనుకుంటాం, అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నామని ఆద్యని చూస్తే తెలిసింది. ఆమెకు ప్రకృతి వైద్యం చేస్తే కోలుకుంటుందేమోనని నా మనసులో ఏదో మూల ఆశ మొలకెత్తింది. ఈ విషయం చెబితే మీరు నవ్వుతారేమోననిపించింది. అందుకే మీకివేమీ చెప్పకుండా మిమ్మల్ని ఒప్పించి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చింది. మొత్తానికి నా ఆశ ఫలించింది!’’ అన్నాను సంతోషంగా.హన్మంతు లేచి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. చూస్తే ఏడుస్తున్నాడు వాడు – ‘‘నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదురా!’’ అన్నాడు గొంతు పెగుల్చుకొని. లక్ష్మి కూడా దగ్గరికొచ్చి నిలుచుంది. తన కళ్ళ నుండి కూడా కన్నీళ్లు కారిపోతున్నాయి! పగిలిపోయిన గాజుబొమ్మ ప్రాణం పోసుకున్న సంతోషంలో ఉన్నారిద్దరు. కొంతసేపటికి హన్మంతు అన్నాడు – ‘‘అరేయ్ యూసుఫ్! నాక్కూడా ఇక్కడొక ఇల్లు చూడరా! తరువాత చిన్నగా తోటలూ అవీ ప్లాన్ చేద్దాం’’. వాడి గొంతులో నిజాయితీతో కూడిన ఉద్వేగం. ట్రీట్మెంట్ చేసింది ఆద్యకా? హన్మంతుకా?! అన్న సందేహం కలిగింది నాకు. - షాజహానా -
అసలే 13...ఆపైన శుక్రవారం
జనాలకు కొన్ని వింత నమ్మకాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వంటివి. ఇలానే ప్రజల్లో ఇంకా చాలా మూఢ నమ్మకాలే ఉన్నాయి. ఒక్కోసారి ఏమైనా సంఘటనలు యాధృచ్చికంగా ఏర్పడినా.. అవి ఈ మూఢ నమ్మకాల వల్లే ఏర్పడ్డాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంది, కొన్ని సార్లు చెడు జరుగుతుంది. అలాంటి ఒక వింత నమ్మకమే 13ను దురదృష్టంగా భావించడం. అవును ప్రపంచంలో చాలా దేశాల్లో 13ను దురదృష్ట సంఖ్యగా నమ్ముతారట. అలాంటి 13 వ తారీఖు కనుక శుక్రవారం వస్తే దానంత దరిద్రమైన రోజు మరొకటి ఉండదని అనుకుంటారట. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఈ రోజు శుక్రవారం 13వ తేదీ. 13వ తేదీని ఎందుకు దురదృష్ట సంఖ్యగా చెబుతారో సరైన కారణాలు తెలియదు కానీ, ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. ఏసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు రోజు జరిగిన ముఖ్య ఘట్టం లాస్ట్ సప్పర్. దీనిలో పాల్గొన్నవారు 13 మంది. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం క్రీస్తును సిలువ వేశారు. ఆ రోజున ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇటువంటి బాధకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టే ఏ నెలలోనైనా ఈ రెండు కలిసి వస్తే అంటే 13వ తేదీ శుక్రవారం వస్తే ఆ రోజు తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని బఫ్ఫేలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆంత్రాపాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫిల్ స్టివెన్స్ తెలిపారు. ఏజేసీ.కామ్‌లోని యూదుల ఇస్కారియట్ ప్రకారం క్రీస్తును మోసం చేసి సైనికులకు అప్పగించిన శిష్యుడు భోజన బల్ల వద్ద 13వ స్థానంలో కూర్చున్నాడని.. అందుకే 13 అనే అంకెను చెడు సంఖ్యగా భావిస్తారని తెలిసింది. కారణాలు ఏవైనా చాలా మంది మాత్రం 13 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. ఆ తేదీన ఎవ్వరూ గృహప్రవేశం చేయరు. పెద్ద పెద్ద భవనాలలో కూడా 13వ నంబరు అంతస్తు ఉండదు. ఒకవేళ 13వ అంతస్తు ఉన్నా.. ఆ మొత్తం అంతస్తును ఖాళీగా ఉంచుతారు. ఆ రోజున ఎవరూ వివాహం కూడా చేసుకోరు. గతంలో కూడా 13వ తేదీ శుక్రవారం వచ్చిన సందర్భాల్లో అనేక అనూహ్యమైన చెడు సంఘటనలు సంభవించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కొంతమంది 13వ తేదీ, శుక్రవారం రెండు కలసిరావడం చాలా అదృష్టంగా భావిస్తారట. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందని, కాబట్టి ఈ రోజంతా మంచి జరగాలని ఆశించి, రోజు చివరలో ఏం జరిగిందో విశ్లేషించుకోండని అంటున్నారు న్యూమరాలజిస్ట్‌లు. మరో విషయం ఏంటంటే నేడు శుక్రవారం 13వ తేదీ అనంతరం ఈ ఏడాదిలో జూలై నెలలో కూడా 13వ తేదీ శుక్రవారంతో కలిసి రాబోతోంది. మరి ఈ రెండు రోజుల్లో ఏమైనా వింత విశేషాలు జరుగుతాయేమో చూడాలి. -
యోగా.. ‘మత విశ్వాసానికి విరుద్ధం’
కొట్టాయం : యోగ, క్రైస్తవ మతాచారాలు రెండు వేర్వేరని కేరళలోని సైరో మలబార్ చర్చ్ ప్రకటించింది. యోగా ఏకత్వాన్ని విశ్వసిస్తుందని, కానీ క్రైస్తవ మత విశ్వాసాలు సృష్టికర్తకు, సృష్టింపబడినవారు మధ్య తేడా ఉంటుందని విశ్వసిస్తుంది. యోగాను వ్యాయామంగా మాత్రమే చూడవచ్చు తప్ప యోగా సాధన వల్ల భగవంతుడిని చేరుకోలేమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయడంతో ఈ విషయం గురించి మతసంస్థలు ఏమనుకుంటాన్నాయో విచారించడానికి సైరో మలబార్ చర్చ్ ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం యోగా క్రైస్తవ విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధం అని తెలిపింది. యోగా వల్ల ఆరోగ్యం పరంగా లాభాలు ఉంటాయి కానీ దేవుడిని చేరడానికి మార్గం చూపదు అన్నారు. యోగా ద్వారా ఎటువంటి ఆధ్యాత్మికతను పొందలేము, అలానే యోగాలోని కొన్ని భంగిమలు కూడా క్రైస్తవ మతాచారాలకు విరుద్ధంగా ఉంటాయి అని కమిషన్ విడుదల చేసిన రికార్డులో వెల్లడించింది. సంఘ్ పరివార్ తన హిందూత్వ ఎజెండాను, హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వం కూడా పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయడం, యోగాను భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన అంశంగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తుండటంతో ఇప్పుడు ఈ అంశం గురించి పరిశీలించవలసి వచ్చింది అని చర్చి అధికారులు అన్నారు. కేరళలోని సైరో మలబార్ చర్చ కాథలిక్ చర్చ్. దీనిపై పూర్తి అధికారం పోప్‌కే ఉంటుంది. వీటి కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. -
సీరమేను కూర
ఇపుడొక చిక్కొచ్చి పడింది. పైగా స్వయంకృతాపరాధం. దీన్నుండి ఎలా బయట పడాలి? సమస్యను ఎలా తీర్చాలి?అసలు ఆ రోజు సీరమేను ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది. ఇపుడీ ఇబ్బంది ఉండకపోను. అలా అనుకుంటాం గానీ ఒకానొక ఉబలాటం ఊరుకుంటుందా? బురదలో కాలు పెట్టినట్లయ్యింది. కడుక్కోక తప్పదు. ఈ కథంతా మా తాత గారైన వెంకటపతిరాజుగారి గురించే. వెంకటపతి తాత మహా చాదస్తుడు. పుట్టి బుద్ధెరిగి నీసు మాంసాలు తినలేదు. జీవుల్ని చంపుకు తినడం పాపం అనేవాడు. సృష్టిలో అవి మనకు ఆహారం కోసం ఎప్పట్నుంచో కేటాయింపబడ్డాయంటే ఊరుకునేవాడు కాదు. తిట్టేవాడు. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి ఇంట్లో వండుకుంటే ఏనాడూ వద్దనలేదు. ఇదే కాదు దేవుడు గురించి కూడా ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారివి అన్నట్టే ఉండేవాడు. ఎవరి అభిప్రాయం ఎలాంటిదైనా గౌరవించేవాడు. వెంకటపతి తాత పొదుపుగా బతికేడు. బోలెడు సంపాదించాడు. పొలాలు కొన్నాడు. అదను పాటించి సేద్యం చేసి పంటలు బాగా పండించాడు. ఊళ్ళో వాళ్ళకు సరిపడే ధాన్యం ఆడే చిన్న మిల్లు కట్టాడు. పిల్లల్ని చదివించాడు. అందరికీ ఏరికోరి మంచి సంబంధాలు చేశాడు. ఏ విధమైన లోటు పాట్లు లేవు. అంతా బాగానే ఉంది... అంతా బాగానే ఉంది... ‘‘బాగుందా? బాగానే ఉందా?’’ ఇది మాత్రం రుచి గురించే. ఈ రెండు ప్రశ్నలూ బావుండటంలో హెచ్చుతగ్గులు తెలుసుకోడానికే. ఇంట్లో భోజనం సమయంలో తరచు ఎదురయ్యే ప్రశ్నలే. ఒక రుచి. అన్నట్టు ఏ రుచైనా గొంతు దాకానే కదా. గొంతు దాటింతర్వాత దాని ప్రభావం నాలుక మీద కొంచెంసేపు ఉంటుందేమో. అవునా? అలాగే అనుకుంటే ఈ తాపత్రయం ఎందుకు? జిహ్వ చాపల్యం ఎలా పుట్టింది?అకస్మాత్తుగా సీతారాముడు గుర్తుకొచ్చాడు. ‘వివాహ భోజనంబు... వింతైన వంటకంబు.. అహహ్హా...’’ పాట విన్నపుడూ వాడే గుర్తుకొస్తాడు. సీతారాముడు సన్నగా ఉండేవాడు. ఇపుడు లేడు. రెండేళ్ళ క్రితం పోయాడు. కొద్దిగా గొంతు గరగరతో మాట్లాడేవాడు. బొంగురు గొంతు అన్నమాట. వాడి తిండి కనులార చూస్తే ఎవరికైనా మతిపోతుంది. బకాసురుడే. పొరుగూరులో ఉండి నాలుగు రోజులు వరసాగ్గా తినాల్సి వస్తే రోజుకో హోటలు మారేవాడు. మా ఊళ్ళో కుర్రాళ్ళకు ఓ వింత సరదా ఉండేది. ఆడపిల్లోళ్ళ ఇంటికి పెళ్లికి తరలి వెళ్ళినపుడు మర్యాదలు సరిగ్గా జరగకపోతే... భోజనాల్లో ఏదో ఒక పదార్థం లేదనిపించే పని పెట్టుకునేవారు. రెచ్చగొట్టి గొడవ తెచ్చుకునేవారు. అపుడు సీతారాముడ్ని ముందు పెట్టి సవాలు విసిరేవారు. అడిగినంత వడ్డించకపోతే అవమానం కదా. వాళ్ళు కిందా మీదా పడుతుంటే మా కుర్రాళ్ళకు గొప్ప ఆనందం. నిజం చెప్పొద్దూ... వాడు ఉన్నంత కాలమూ తినడం కోసమే జీవించడంలా బతికాడు. అంతెక్కువ తినడం రోగమని వాడికి తెలీదు. తనే కదా ఇంతటి మొనగాడ్ని అనుకునేవాడు. వైద్యం చేసుంటే మరికొన్నాళ్ళు బతికేవాడేమో. మరి... మరి... తక్కువ తినడం కూడా రోగమేనా?ఈ ఎక్కువ తక్కువ మీమాంస అలా ఉంచితే సరిగ్గా ఇప్పుడే... జ్ఞాపకాల్లోంచి ఓ పాత కథొకటి రాలిపడింది. ఇది అనగనగా ఒక రాజు కథే. రాజు కాస్తంత తమాషా అయినవాడు. ఎవర్నీ సలహా అడక్కుండా నేరం చేసి కొత్తగా బందీ అయినవాడికి ఒక వింత శిక్ష వేశాడు. ‘‘ప్రతిరోజు జైలులో వాడికి పెట్టే తిండి కొంచెం కొంచెం తగ్గించి పెట్టండి’’ అని ఆదేశించాడు. అలాగే చేశారు. పది రోజులయ్యాక ఖైదీ ఎలా ఉన్నాడో అని చూడ్డానికెళ్ళాడు. నేరస్తుడి ముఖం ఎంతో కాంతివంతంగా తేటగా కళకళలాడుతూ కనపడింది. వచ్చేసాడు వెనక్కి. మరో పదిరోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు రాజు. ఖైదీ ముఖం మరింత తేజస్సుతో వెలిగిపోతూంది. రాజుకి మతిపోయింది. అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ‘ఇదేమిటీ...’ అని మంత్రిని అడిగాడు. ‘‘కంగారుపడకండి, మహాప్రభూ... ఒక పని చేయండి... రోజురోజుకూ పెంచుకుంటూ తిండి పెట్టించండి’’ మంత్రి సలహా చెప్పాడు నెమ్మదిగా నవ్వుతూ. అంగీకారంగా తల ఊపాడు రాజు. కొన్ని రోజులకు నేరçస్తుడు చచ్చి ఊరుకున్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ‘‘జనాల్ని ఎపుడూ అర్ధాకలితోనే ఉంచాలి. అపుడే మన రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లు లెక్క. చూశారు కదా తిండి ఎక్కువ అయితే చచ్చి పోవడాన్ని’’ వివరించాడు మంత్రి. అయితే మా తాత కోరిక విడ్డూరమైందీ, ఆక్షేపణీయమైందీ కాదు. ఊహించనిది. అకాలమైనది. అంతే కాదు. ఒక రకంగా మా మేనత్త కొడుకు రామం తెచ్చి పెట్టిన తంటా ఇది. కోరికలు అనంతమైనవి. కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. ఋతుధర్మంగా లభ్యమయ్యే దాన్నైతే ఎలాగోలా తీర్చేయవచ్చు. ఆ రోజు – వెంకటపతి తాతకు ఒంట్లో బాగోలేదు. పొద్దుట్నుంచీ నీరసంగా పడుకున్నాడు. ఎనభై ఏడేళ్ళ తాతకు తిండి సయించడం లేదు. అపుడే చూడ్డానికి మా మేనత్త కొడుకు రామం వచ్చాడు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినపుడు ముడుచుకుని పడుకుంటాడు. సహజంగా తెలిసినవాళ్ళు వచ్చినపుడు కళ్ళల్లో కాంతితో... ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఈవేళ ఆ ప్రయత్నం లేదు. రామం మంచం అంచున కూచుని తను తెచ్చిన కమలాఫలం తొనలు తీసి తినిపించాడు. పలకరిస్తుంటే ముభావంగా సమాధానాలు చెబుతున్నాడు తాత. మాట స్పష్టత లేదు. కాసేపటికి వెంకటపతి తాత వెర్రి చూపులు చూస్తున్నాడు. ‘‘డాక్టరు... డాక్టరు...’’ నెమ్మదిగా అంటున్నాడు. వసారా ఆనుకుని ఉన్న చిన్న గది. గదిని చాలా శుభ్రంగా ఉంచుతాం. ప్రతిరోజూ దుప్పట్లు మారుస్తాం. రెండురోజులకొకసారి ఫినాయిల్‌తో గదిని కడిగిస్తాం. రెండు చేతులూ పొట్ట మీద వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు పైన తిరుగుతున్న ఫ్యాన్‌కేసి చూస్తున్నాడు. బలహీనంగా చిక్కిపోయి ఉన్నాడు. కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. కారు రప్పించాను. ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం. ‘‘నేనూ వస్తాను’’ అన్నాడు రామం. బయలుదేరాం. జాగ్రత్తగా తాతను ముందు సీట్లో కూర్చోబెట్టి మేమిద్దరం వెనుక కూర్చున్నాం. రామం నా ఈడువాడే. దైవభక్తుడు. చెట్టూ పుట్టా అని చూడకుండా కొలుస్తాడు. ప్రయాణం ఉంటే రాహుకాలం, వర్జ్యం చూస్తాడు. శకునం చూసుకుని బయటకు కదులుతాడు. కాకినాడ చేరాలంటే రోడ్డు సరిలేకపోవడం వల్ల గంటన్నర సమయం పడుతుంది. మేమిద్దరం రాజధాని నిర్మాణం... రైతు రుణమాఫీ... పాదయాత్రలు... రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి రామానికి ఈ రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకంటే వాడు యానాంలో ఉంటున్నాడు. అక్కడి ప్రభుత్వం, రాజకీయాలు వేరు. తర్వాత సంభాషణ పులస, సీరమేను మీదకు మళ్ళింది. ‘‘పులస, సీరమేను సంవత్సరంలో కొద్దిరోజులు మాత్రమే దొరుకుతాయి. అందుకే వాటికి అంత డిమాండు. వాటిని రుచి చూడ్డానికి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. పుస్తెలమ్మైనా పులసలు తినాలనే నానుడి ఉంది. మనకు తెలియదు గానీ సీరమేనుకు కూడా ఏదో సామెత ఉండే ఉంటుంది. వాటి కోసం పడి చస్తారనుకో...’’ అన్నాడు రామం. ‘‘అది సరే. సీరమేను గురించి చెప్పు. రెండు మూడుసార్లు తిన్నాను. బావుంది. అది అసలు ఎలా దొరుకుతుంది?’’ అడిగాను. తాత అటూ ఇటూ తల తిప్పుతూ మా మాటలు వింటున్నాడు. ఏదో గొణుక్కుంటున్నాడు. ‘‘మంచినీళ్ళు కావాలా?’’ తాతను అడిగాను. వెనక్కి చూసి తల అడ్డంగా ఊపాడు. మా మాటలు కొనసాగుతున్నాయి.‘‘సీరమేను ఆశ్వీయుజ మాసంలో మాత్రమే దొరుకుతుంది. తూర్పు వానలు, గాలులకు సీరమేను పుడుతుంది. పులసల సీజను పూర్తవ్వగానే సీరమేను మొదలవుతుంది. సముద్రంలో తీవ్ర ప్రకంపనలకు అలల తాకిడి వేగవంతమై వీచే తూర్పు గాలులకు సీరమేను దొరకడానికి అనుకూలం. నాగుల చవితికి నాగలోకానికి పోతుందని అంటారు. ఆ తర్వాత ఇక మళ్ళీ సంవత్సరం దాక సీరమేను దొరకదు’’ రామం చెప్పుకుపోతున్నాడు. తల వారగా పెట్టి తాత వింటున్నాడు. రామం చెప్పడాన్ని ఆపాడు. రోడ్డు వెడల్పు చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. పొక్లైనర్లు పనిచేన్తున్నాయి. ఎర్ర జాకెట్టులు, టోపీలు పెట్టుకుని కొంతమంది హడావుడిగా తిరుగుతున్నారు. రోడ్డంతా ఎగుడుదిగుడుగా ఉంది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఎదురుగా లారీలు... ట్రక్కులు.. ఆర్టీసీ బస్సులు... ఆటోలు...తాత చిటికెన వేలు చూపించాడు. ఒకటికి అన్నమాట. కారు ఆపాలి. సరైన చోటు రాగానే కారు ఆపించాను. తాతను రోడ్డు వరకు నడిపించుకుని కూచోబెట్టాం. తిరిగి కారు బయలుదేరింది. రామం కొనసాగించాడు. ‘‘సీరమేను పట్టడానికి వలలు అక్కర్లేదు. రంగుల చీరలు చాలు. ఒకడు ఒడ్డున నీటిలో ఉంటే మరొకడు కొంచెం దూరంగా నిలబడతాడు. రెండు చీరలు కలిపి కుట్టి అంచులు పట్టుకుని బిగబెట్టి దేవుతారు. నది మధ్యకో లోతుకో వెళ్ళక్కర్లేదు. అంతా తీరాన్నే. బుస్సుమనే శబ్దంతో తెల్లటి పొట్టు మాదిరిగా వస్తున్న సీరమేను రంగులకు ఆకర్షిస్తుంది. జాగ్రత్తగా బిందెల్లోకి పోసుకుంటూ వేట కొనసాగిస్తారు. చీర ఉపయోగిస్తారు గనుక సీరమేనుకు ఆ పేరు. చిరుమీనం అనగా చిన్న చేప అర్థంలో సీరమేను అనే పేరు స్థిరపడిందని కూడా అంటుంటారు’’ రామం చెప్పడం ఆపాడు. వాహనాలు రద్దీ పెరగడంతో నెమ్మదిగా కారు పోతూంది. రామం చెప్పే మాటలు కొత్తగా వినడానికి కారణముంది. నేను పుట్టిన తర్వాత మా నాన్న వేరే రాష్ట్రంలోకి మకాం మార్చాల్సివచ్చింది. ఇక్కడి ఆహారపు అలవాట్లు నాకు పెద్దగా తెలియవు. ‘‘ఇప్పుడైతే సీరమేను అపురూపం అయ్యింది గానీ మా చిన్నప్పుడు కొబ్బరి మొదళ్ళకు వేసేవారు. ఆ రోజులే వేరు. అమ్మ చేసే సీరమేను గారెలు ఎంతో బావుండేవి. అన్నానికి రెట్టింపు కూర కలుపుకుని తినేవాళ్ళం.ఇంకో సంగతి తెలుసా?’’ కారు ముందుకు కదలలేని పరిస్థితి. అక్కడేదో ప్రమాదం జరిగినట్లుంది. నగర కూడలిలో వాహనాలు ఆగినట్లుగా... వరుసగా నిలబడిపోయాయి.జరిగింది ప్రమాదం కాదు. ఎదురెదురుగా వస్తున్న బస్సు, లారీ డ్రైవర్లు వాదులాడుకుంటున్నారు. వెనక్కి తిప్పడానికి ఇద్దరూ ఒప్పుకోవడం లేదు. ఆఖరుకు కొంతమంది వెళ్ళి సర్ది చెప్పారు. వాహనాలునెమ్మదిగా కప్పను మింగిన పాముల్లా కదులుతున్నాయి.తాత మంచినీళ్ళు అడిగాడు. ఇచ్చాను. తాగాడు. తనలో తాను తిట్టుకుంటూ చికాకుగా ముఖం పెట్టాడు. ఇక్కడ్నుంచి రోడ్డు మంచిగానే ఉంది.‘‘సరే...చెప్పు... సీరమేను గురించి...’’ అడిగాను. ‘‘విచిత్రం ఏమిటంటే సీరమేను కూరను అందరూ ఒకేలా వండరు. ఒక్కో కులం వారు ఒక్కోలాగ వండుతారు. పులుపు కోసం కొంతమంది చింతకాయలు వాడతారు. కొంతమంది చింతపండు వాడతారు. ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేదు. తినాలనే కోరిక ఉన్నా ఎక్కువ డబ్బులు వెచ్చించలేక చాలామంది రుచికి దూరమై పాయారనే చెప్పాలి. ఒక సేరు రెండువేల రూపాయిల వరకు పలుకుతున్నది. ఎంత వరకు నిజమో గానీ జాలర్లకు దొరక్కుండా పోయిన సీరమేను పురదొందులుగానో మూనీరుచేపలుగానో పరిణామం చెందుతాయంటారు.’’ అప్పటిదాకా మౌనంగా ఉన్న తాత నోరు విప్పాడు.‘‘మీ సొద కాసేపు ఆపండర్రా... ఒకటే తిండి గొడవ..’’ విసుగ్గా అన్నాడు తాత. భుజం మీద తువ్వాలుతో పెదాలు తుడుచుకున్నాడు. ఇంకా ఏదో అంటున్నాడు. మా చెవులకు చేరడం లేదు. నేను, రామం ముఖ ముఖాలు చూసుకుని చేతితో సైగలు చేసుకుని మా సంభాషణ ఆపేశాం.కాకినాడ చేరేటప్పటికి సాయంత్రం అయిదయ్యింది.డాక్టరు వీర్రాజు గౌరవంగా చనువుగా తాతను పలకరించారు. కుశల ప్రశ్నలడిగారు. తాత కూడా హుషారుగా మాట్లాడాడు. మూలుగుతున్న వాడల్లా డాక్టరును చూడగానే కొత్త శక్తి వచ్చేసింది. యోగక్షేమాలు అడిగి ఆరోగ్యం గురించి భరోసా ఇస్తూ ధైర్యవచనాలు చెబితే చాలు. ఈ వయసు వాళ్ళకు అదే గొప్ప మందు. తాతలో పూర్వపు చలాకీతనంతో బాటు తన మీద తనే జోకులేసుకునేంత కలివిడి మాకు ఆశ్చర్యం కలిగించింది. అలాగే డాక్టరు చేతులు పట్టుకుని చాలాసేపు వరకు వదలలేదు. తర్వాత డాక్టరు తాతను పరీక్షించారు. ‘‘తాతగారూ... మీరు మాకంటే ఆరోగ్యంగా ఉన్నారు. మీకే రోగమూ లేదు. అంతా చక్కగా ఉంది. మనసులో ఏమీ పెట్టుకోకండి. నిండైన సంతృప్తి జీవితం మీది. మీరు కోరుకున్నవి సాధించారు. మీ పిల్లలంతా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా అదృష్టవంతులు. రోజూ కాసేపు నడవండి చాలు. బలానికి మందులు రాస్తాను. వాడండి’’ అని డాక్టరు చెప్పడంతో తాత ముఖం వెలిగిపోయింది. ‘‘సంతోషం బాబూ... మీ నాన్నలాగే మంచి పేరు సంపాదించుకో. అన్నట్టు నేనేం తినొచ్చో ఏం తినకూడదో చెప్పలేదు..’’ డాక్టరు చేతులు వదలకుండానే ఆయన ముఖంలోకి చూస్తూ అడిగాడు. ‘‘అరె... నేను ముందే చెప్పాను కదా... ఫలానా పదార్థం తినకూడదని లేదు. అన్నీ బ్రహ్మాండంగా తినొచ్చు. మీరు రుచికి ఇష్టమైనవన్నీ తినండి. మీకు ఏదైనా తినాలనిపిస్తే చేయించుకుని నిరభ్యంతరంగా తినండి. మీకు ఏం కావాలి?’’ అని మృదువుగా అడిగారు డాక్టరు. తాత నా వైపు చూసాడు. ‘‘డాక్టరు గారు చెపుతున్నారు కదా... మీకేం కావాలంటే అది తీసుకురావడానికి నేను సిద్ధం’’ అన్నాను చిరునవ్వుతో. రామం కూడా అదే మాట చెప్పాడు. ‘‘అలాగే బాబూ... అలాగే...’’ అని ఊరుకున్నాడు. డాక్టరుకు థ్యాంక్స్ చెప్పి ఆసుపత్రి బయటకు వచ్చాం. చీకటి పడింది. పట్టణంలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒకటే జనం. ఉరుకులు పరుగులు. కూడళ్ళలో అయితే చెప్పనక్కర్లేదు. ఇడ్లీలు కట్టించుకుని మరల కారు ఎక్కాం. రామం తను యానాం వెళ్ళిపోతానని చెప్పడంతో అతన్ని బస్టాండ్ దగ్గర దింపడానికి నిశ్చయించుకున్నాను. ‘‘తాత గారూ... నేను మరికొద్ది రోజుల్లో వస్తాను. మా ఊరు వెళతాను’’ అని చెప్పాడు రామం. తాత ఒప్పుకోలేదు. ఇంటికి రావాల్సిందే అని పట్టు పట్టాడు. తిరుగు ప్రయాణం మొదలైంది. రామం తాత ఇష్టాయిష్టాల గురించి అడుగుతున్నాడు. ఒకొక్కటి నెమ్మదిగా బోసినోటితో తాత చెబుతున్నాడు. ‘‘డాక్టరు చెప్పింతర్వాత ధైర్యం వచ్చిందిరా... ఇన్నాళ్ళూ తమాయించుకున్నాను. వచ్చే పొద్దా పోయే పొద్దా... నిజం చెప్పాలంటే నేను కోరికలు చంపుకునే బతికానురా... ఎంత ఇష్టం అయినా దూరంగానే ఉన్నాను. మీ అమ్మమ్మ పాకం గారెలు గొప్పగా చేసేదిరా... నోటిలో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే వెన్నపూసలా. అలాగే బందరు లడ్డు. ఇక్కడ చేసినవి కావు. బందరులో తయారు చేసినవే తినాలనుందిరా...’’ ఈ మాటలు ఒకేసారి చెప్పినవి కావు. మొత్తం మీద తాత మాటల సారాంశం ఇది. ‘‘తప్పకుండా తాతా.... రేపే పెరుమాళ్ళపురం పాకం గారెలు తెప్పిస్తాను. అవి మీరు చెప్పినట్లే ఉంటాయి. బందరు నుంచి లడ్డూలు కూడా రప్పిస్తాను. మీరేమీ సందేహించకుండా ఏదైనా సరే చెప్పండి’’ అని చెప్పాను. ఇంటికి చేరాం. రాత్రి పదయ్యింది. ఉదయం లేచి తాత గదికి వెళ్ళాను. ఇంకా లేవలేదు. ముసుగు తన్ని పడుకునే ఉన్నాడు. చేతితో తట్టి లేపాను. మెల్లగా కళ్ళు తెరచి చూశాడు. నన్ను చూడగానే లేచి కూర్చున్నాడు. అంతలోనే తలగడ సరిచేసుకుని మరల పడుకున్నాడు.‘‘ముఖం కడుక్కోండి’’ చెంబుతో నీళ్ళు... బ్రష్... పేస్టు... టేబుల్ మీద పెట్టి గది బయటకు వచ్చాను.ఇంటిని ఆనుకునే మా పొలం. పెరటి గుమ్మం తలుపు తీసుకుని సన్నని బాట మీదుగా కొద్ది దూరం వెళితే పొలం వస్తుంది. రామం నన్ను అనుసరిస్తున్నాడు. నేలపై మొక్కలు తడిగా ఉన్నాయి మంచు పడి. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం. మౌనంగా నడుస్తున్నాం. అలా వెళ్ళామో లేదో ఇంటి నుండి కబురు. తాత మాట్లాడటం లేదని వెంటనే రమ్మని.మా ఆవిడ ఆందోళనగా నా కోసం ఎదురుచూస్తూంది.‘‘మనిషి మనలో లేడు. బయట గాదెలున్న వసారాలోకి చేరిస్తే మంచిదేమో. అసలే మండువా లోగిలి. పాడు పెట్టాల్సి వస్తే అవతల కాపురం ఉంటున్న మీ బంధువులతో మాట వస్తుంది. చూసుకోండి’’ ఈ మధ్యనే ఊళ్ళోకి వచ్చిన పెద్దాయన అంటున్నాడు.‘‘ఫర్వాలేదు లెండి. అలాంటి అవసరం వచ్చినా సరే ఈ ఇంటికి ఎంతో చేసిన ఆయన్ను ఇక్కడ్నుంచి బయట పెట్టేది లేదు’’ విసురుగా అని తాత దగ్గరకు వెళ్ళాను.ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నాడు. నన్ను చూడగానే కళ్ళు మెరిశాయి. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మాట అర్థం కావడం లేదు. పది నిముషాలయ్యేటప్పటికి తాత మామూలు మనిషి అయ్యాడు. పాలు తాగాడు.చుట్టూ పోగుపడిన తెలిసిన ముఖాల్ని తేరిపార చూశాడు. నన్ను దగ్గరకు రమ్మన్నాడు. వెళ్ళాను.‘‘వీళ్ళందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఏమైందని? వెళ్ళి పొమ్మను. నేనింకా చావనని చెప్పు. నీ ఒక్కడితో మాట్లాడాలి... తలుపులు మూసి రా...’’ అన్నాడు. ‘అమ్మయ్య’ తాతకు ఏం కాలేదు అనుకున్నాను. అందరూ బయటకు వెళ్ళి పోయారు. గదిలో నేనూ రామం మిగిలాం. పెద్ద తలపాగాతో గుబురు మీసాలతో మా ముత్తాత గోడ మీద పాత కాలం నాటి ఫొటోలో నవ్వుతున్నాడు. ‘‘ఒరేయ్... తప్పుగా అనుకోకండి. నాకొకటే కోరిక మిగిలిపోయింది రా... సీరమేను తినాలనుంది. నిన్న మీ మాటలు విన్నప్పట్నుంచీ అదే ఆలోచన. రామాన్ని పంపించి తెప్పించరా నాయనా...’’ చిత్రంగా పెదాలు తడుపుకుంటూ అన్నాడు. ఆ ఒక్క మాట అని కళ్ళు మూసుకున్నాడు. మాకు గుండెలు అదిరాయి. జీవితమంతా శాకాహారిగా నిష్టగా బతికినోడికి అసందర్భంగా ఈ కోరికేమిటి? పైగా దొరకని రోజులు. సీరమేనును ఎక్కడ్నుంచి తీసుకురావాలి? మథనపడ్డాం. ఎలా? ఎలా? ఎలా?‘‘సరే.. మా ఊరెళ్ళి నేనొక ప్రయత్నం చేస్తాను. అయిదు మాసాల క్రితమే సీరమేను సీజను అయిపోయింది. ఇపుడు దొరికే ప్రశ్న లేదు. కానీ ఎవరైనా ముచ్చటగా, ఇష్టంగా డీప్ ఫ్రిజ్‌లో దాచుకుంటే గనుక బతిమాలి తీసుకురావాలి.... చూద్దాం... తాత కోరిక తీరుతుందో లేదో?’’ అని రామం వెంటనే బయలుదేరడానికి సిద్ధమైనాడు.‘‘దొరికితే... సాయంత్రానికల్లా వస్తాను’’ అన్నాడు రామం. మధ్యాహ్నం అయ్యింది. తాత పిలిచాడు. ‘‘రామం వచ్చాడా?’’ వస్తున్నాడన్నట్టు తల ఊపాను. రామం తన ప్రయత్నాల గురించి ఎప్పటికప్పుడు ఫోన్లో చెబుతూనే ఉన్నాడు. దొరికే ఆశ లేనట్లే.ఈ లోపులో మరోసారి తాత కళ్ళు తేలేశాడు. కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. మాటిమాటికీ ఉలికిపడుతున్నాడు. సన్నగా వణుకుతున్నాడు. తల విదిలిస్తున్నాడు. భయంగా ఉంది. అనుమానంగా ఉంది. ఆఖరి క్షణాలేమో...ఉన్నట్టుండి తాత మళ్ళీ పిలిచాడు. నా వంక తీక్షణంగా చూశాడు. ఆ చూపుకు అర్థం తెలిసింది. కానీ... ఏం చేయగలను? అసలు ఇదంతా ఏమిటి? సీరమేను తినకుండా పోవడాన్ని లోటుగా భావిస్తున్నాడా? ఇన్నేళ్ళుగా కోరికల్ని అణచుకుని బతుకుతున్నాడా? రామం దగ్గర్నుంచి సెల్ మోగింది. శుభవార్త అందించాడు. సీరమేను దొరికిందని, అందులోకి ముఖ్యంగా కావల్సిన చింతకాయల కోసం బజారంతా గాలించినా దొరకలేదని కంగారుగా చెప్పాడు. చింతపండు వాడమని సలహా చెప్పాను. వెంటనే వండించుకుని కారులో బయలుదేరి వస్తానని చెప్పాడు. ‘అమ్మయ్య’ అనుకున్నాను. తాత చెవిలోగట్టిగా అరిచి విషయం చెప్పాను. తాతకు తెలిసిపోయింది. అలాగే అన్నట్టు తల ఊపాడు.రాత్రి పది గంటలకు వచ్చాడు రామం.సీరమేను కూర కలిపిన అన్నం ముద్దను పట్టుకొచ్చింది మా ఆవిడ. మగత కమ్మినట్టుగా ఉన్నాడు తాత. తలగడ నిలువుగా వాల్చి కూర్చోబెట్టారు.‘‘మీరడిగిన సీరమేను ఇదిగో తినండి’’ అని చెప్పాను.తాత కళ్ళు మెరిసాయి. ఎంతో ఆనందంగా నోరు తెరిచాడు. ముద్ద అందించింది. సీరమేను మటుక్కి నోటికి చేరింది. గొంతు దిగలేదు. ఆ నోరు అలాగే ఉండిపోయింది. దాట్ల దేవదానం రాజు -
కొక్కోరోకో
హ్యూమర్ ప్లస్ మన నమ్మకాలే నమ్మకాలు. ఎదుటివాళ్ళ నమ్మకాలు మూఢనమ్మకాలు. లోకం సజావుగా నడవాలంటే మన మీద మనకి విశ్వాసం, ఎదుటివాళ్ళ మీద అవిశ్వాసం ఉండాలి. నిప్పు పట్టుకుంటే కాలదని వెనకటికి మావూళ్ళో ఒకాయన వాదించేవాడు. కాలుతుందని మనం నమ్మడం వల్లే అది కాలుస్తుందని అనేవాడు. కానీ బొబ్బలు ఎక్కడినుంచి వస్తాయని అడిగితే పెడబొబ్బలు పెట్టి తన సిద్ధాంతాన్ని విడమర్చి చెప్పేవాడు. నొప్పి అనేది స్పందనా లోపమని, గాయం ఒక దృశ్య లోపమని, భావనే ప్రపంచాన్ని నడిపిస్తుందని అనేవాడు. తర్కం తర్కించడానికే తప్ప పరీక్షించడానికి కాదని కూడా ఆయనకి తెలుసు. అందుకే నిప్పుని ఎప్పుడూ ముట్టుకోలేదు. నమ్మించడానికి పెద్ద ప్రపంచమే వుంటుంది. కానీ నమ్మడానికి మనది చాలా చిన్న జీవితం. రసాయన సిద్ధాంతాన్ని ఎంత బోధించినా భౌతికశాస్త్రాన్ని విస్మరించరాదు. అందుకే గతితార్కిక భౌతిక అధివాస్తవిక, సూత్ర చలన, గమనశీల అనే ఉపన్యాసాలతో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళంతా నయా రివిజనిస్ట్, బూర్జువా, భూస్వామ్య ఫ్యూడల్ అవశేష పదజాలంలో కలిసిపోయారు. కోడిపుంజుని మనం వంటకంగా భావిస్తాం కానీ, అది మాత్రం తనని తాను మేధావిగా భావిస్తూ పుంజుకుంటూ వుంటుంది. తన కూతతోనే సూర్యుడు కళ్ళు తెరుస్తాడని నమ్ముతుంది. ఈ లోకానికి తానే వెలుగు ప్రసాదిస్తున్నాననే జ్ఞాన కాంతిపుంజంతో రెక్కలు విప్పుకుంటూ వుంటుంది. జ్ఞానులని నమ్మిన ప్రతివాడ్ని ఈ ప్రపంచం గొంతుకోసి చంపుతుంది. ఆయుధాన్ని కనుగొన్నప్పుడే మనిషి జ్ఞానాన్ని వేటాడ్డం మొదలుపెట్టాడు.సత్యాన్ని ఆవిష్కరించాలనుకున్న తన పూర్వీకులంతా కత్తికి ఎరగా మారారని ఒక కోడిపుంజు గ్రహించింది. తన స్వరమహిమ చాటాలని బయలుదేరింది. ఒక రాతి బండ కింద గుటకలు మింగుతున్న కప్ప కనిపించింది. తనకి, సూర్యుడికి గల అవినాభావ సంబంధాన్ని ‘కొరకొర’ శబ్దంతో వివరించింది. అంతా విన్న కప్ప నాలుగు అడుగులు ముందుకి, రెండు అడుగులు వెనక్కి గెంతింది. ‘‘నీ గురించి నీకెంత తెలుసో, నా గురించి నాకు అంతే తెలుసు. బండచాటు నుంచి నేను బయటకు వచ్చిన ప్రతిసారి వర్షం వస్తుంది. అంటే ఈ లోకానికి జలాన్ని ప్రసాదించే శక్తి నాకు మాత్రమే వుంది. చిటపట చినుకులకి, బెకబెకలకి సంబంధముంది. ఈ సత్యాన్వేషణ గురించి లోకానికి తెలియజేయాలనుకుని యాత్రార్ధులై వెళ్ళిన నా పూర్వీకులందరూ చైనీస్ హోటళ్ళలో తేలారు. ప్రకృతి శక్తి గురించి తెలిసిన ప్రతివాడ్ని ఈ లోకం వండుకు తింటుంది జాగ్రత్త’’ అని కప్ప రాతిలో జరిగే జీవపరిణామం, తద్వారా ఉద్భవించే పురుగుల అన్వేషణకి బయలుదేరింది. ప్రతివాడికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మనది మనం చెప్పడానికి ప్రయత్నిస్తే అవతలివాడు వాడిది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రెండింటి వైరుధ్యాల మధ్య యుద్ధం జరిగి కొత్తది పుడుతుంది. ఇతరుల్ని మనం అంగీకరిస్తే, మనల్ని అంగీకరించేవాడు ఎక్కడో తగలకపోడని నమ్మి పుంజు బయలుదేరింది. ఒక తొండ తగిలింది. సూర్య సిద్ధాంతాన్ని వివరించేలోగా అది అందుకుంటూ ‘‘ఈ లోకానికి వ్యాయామాన్ని నేర్పించిందే నేను. తొలి సిక్స్‌ప్యాక్ రూపకర్తను నేను’’ అంటూ బస్కీలు మొదలుపెట్టింది. ఈసారి ఊసరవెల్లి తగిలింది. డ్రామాలో ఫోకసింగ్ లైట్లని మార్చినట్టు ఒంటిమీద రంగుల్ని మార్చింది. ‘‘ప్రపంచాన్ని వర్ణశోభితం చేసింది నేనే. పెయింటర్లందరికీ నేనే స్ఫూర్తి’’ అని డబ్బా అందుకుంది.పుంజుకి తత్వం బోధపడింది. ఎవరికి వాళ్ళు తామే ఈ లోకాన్ని నడుపుతుంటామని భావిస్తారని, స్వీయజ్ఞానం అంటే ఇదేనని అర్థమైంది. దుఃఖంతో కోళ్ళ గంప చేరుకుంది. మరుసటిరోజు మబ్బులు పట్టి సూర్యుడు రాలేదు. తాను కూయకపోతే సూర్యుడు రాడని మారుజ్ఞానం పొందింది. – జి.ఆర్. మహర్షి -
సాంఘిక చరిత్ర మన చరిత్రయే!
గ్రంథం చెక్క రాజుల యుద్ధాలు, తంత్రాలు, దౌష్ట్యాలు సంఘానికి నష్టం కలిగించినట్టివే. ఈ విషయం గుర్తించిన పాశ్చాత్యులు సాంఘిక చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇదియే సరియగు పద్ధతి. రాజుల చరిత్రలు మనకు అంతగా సంబంధించినవి కావు. సాంఘికచరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ ఆటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన అభిలషింతురు. తేలిన సారాంశమేమన... సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! సాంఘిక చరిత్ర మానవ చరిత్ర. ప్రజల చరిత్ర. అది మన సొంత కథ!! అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లుండెనో తెలుపునట్టిది. అది మన తాతముత్తాల చరిత్ర! - సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నుంచి (సురవరం ప్రతాపరెడ్డి ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. రేపు ఆయన జయంతి) -
మూడనమ్మకంతో నాలుకకు వాతలు
-
నమ్మకం: నమ్మలేని నమ్మకాలు!
నమ్మకాలనేవి చాలా బలంగా ఉంటాయి కదా! అదేంటో గానీ, కొన్ని నమ్మకాలు విచిత్రంగా కూడా ఉంటాయి. వాటిని నమ్మాలో వద్దో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి కొన్ని నమ్మకాలు ఇవి... ముక్కు దురద పెడితే, తమను ఎవరో ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నారని రొమేనియన్లు నమ్ముతారు! క్యాబేజీ తింటే పిల్లలు పుట్టరని ఆంగ్లేయులు ఒకప్పుడు నమ్మేవారు. కానీ కాలక్రమంలో ఆ నమ్మకం పోయింది! జపనీయులు బొటనవేలును ‘పేరెంట్స్ ఫింగర్’ అంటారు. అందుకే శ్మశానం ముందు నుంచి వెళ్లేప్పుడు బొటనవేలును బయటకు కనబడకుండా దాచెయ్యాలని, లేదంటే తల్లిదండ్రులకు ప్రాణాపాయం సంభవిస్తుందని అంటారు వారు! వైవాహిక జీవితం కలకాలం ఆనందంగా సాగాలంటే... వెడ్డింగ్ కేక్‌లోని చిన్న ముక్కను దాచుకోవాలని అమెరికాలోని కొన్ని ప్రాంతాల వారు నమ్ముతారు! యువ్వనస్తులు డైనింగ్ టేబుల్‌కి మూలన కూర్చోకూడదంటారు రష్యన్లు. అలా చేస్తే వారికి పెళ్లి కాదట! శీతాకాలంలో గుమ్మంలో కూర్చుని లేసు అల్లకూడదని, అలా చేస్తే చలి మరింత పెరిగిపోతుందని, చలికాల వ్యవధి కూడా పెరుగుతుందని ఐస్‌ల్యాండ్‌లో నమ్ముతారు! {పసవ సమయంలో చాకుని దిండు కింద పెట్టుకుంటే, నొప్పులు తక్కువగా వస్తాయని, సుఖ ప్రసవం అవుతుందని చాలా దేశాల్లో విశ్వసిస్తారు! ఈజిప్టులో ముగ్గురు కలసి ఫొటో దిగరు. అలా చేస్తే మధ్యలో ఉన్న వ్యక్తి అతి త్వరలో చనిపోతాడని వారి భయం! ఇంట్లోకి ప్రవేశించిన ద్వారం గుండా కాకుండా, మరో ద్వారం గుండా బయటకు వెళ్తే మరణం వెంటాడుతుందనే నమ్మకం ఆఫ్రికా దేశాల్లో ఉంది!