నా ఫ్రెండ్ హన్మంతరావు మెసేజ్ చూసి దిమ్మతిరిగిపోయింది నాకు. ఏమైందో ముందు అర్ధం కాలేదు. కానీ ప్రాబ్లం ఎంతో సీరియస్ అని మెసేజ్ పూర్తిగా చదివాక అర్థమై కొంతసేపు అయోమయం అనిపించింది. ఆమధ్యే కదా తను ఎమ్మెస్సీ కంప్లీట్ చేసింది. ఇంతలోనే ఇలా ఎలా అయుంటుంది? ఎంత నాకు నేను ప్రశ్నించుకున్నా సమాధానం దొరకదని, నేరుగా వాడిని కలిస్తే తప్ప ఏదీ తేలదని అనిపించింది. అంత కష్టంలో ఉన్న వాడిని కలిసి ఓదార్చడం కనీస బాధ్యత అని నిర్ణయించుకున్నాను.రేపు హైదరాబాద్ వెళ్తున్నానని రెండుమూడు రోజులదాకా రానని నా సహచరికి చెప్పాను. తెల్లారి పట్నానికి బయల్దేరాను. మాకు పట్నం అని పిలవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మాది ఒకప్పటి ఖమ్మం జిల్లా. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల ప్రాంతం. పేర్చినట్టుండే కొండలు, గుట్టల మధ్య మా ఊరుంటుంది. ఊరిని కాపాడుతున్నాయా అన్నట్టు గంభీరంగా నిలబడి నాలుగు దిక్కులూ జాగ్రత్తగా పహారా కాసే తాళ్లు. చుట్టూ రకరకాల పూలు, పళ్ళ తోటలు. నా అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందీ ఊరు. ఇక్కడికి ట్రాన్స్‌ఫరైన దగ్గర్నుంచీ నేను మరే ఊరికీ వెళ్ళలేదు. నా ఇన్‌ఫ్లుయన్స్ అంతా ఉపయోగించి ట్రాన్స్‌ఫర్ కాకుండా చూసుకుంటాను. బహుశా నేను నా జీవితంలో చేసిన ఒకే ఒక్క అవినీతి పని ఇదే.
మా ఊరు నుంచి హెడ్‌క్వార్టర్‌కు అక్కడి నుంచి పట్నం బస్ దొరికి వాడింటికి వెళ్ళేసరికి సాయంత్రమైంది. పోష్ ఏరియా. గేటెడ్ కమ్యునిటీలో మంచి అపార్ట్‌మెంట్. అందమైన ఫ్లాట్. అద్భుతమైన ఫర్నిచర్. మంచి పెయింటింగ్స్‌తో అలంకరించిన గోడలు. వాడి సంపాదన ఇల్లు కట్టడంలో అడుగడుగునా, అంగుళం అంగుళంలో వాడు తీసుకున్న శ్రద్ధలో ఉట్టిపడుతోంది. కుటుంబ సభ్యులందరికీ తలా ఓ గది. రూమ్స్ అన్నింటికీ గ్లాస్ డోర్స్. టీపాయ్‌లతో సహా అంతా గాజుమయం. నాకు చిన్నప్పుడు చదువుకున్న మయసభ గుర్తొచ్చింది.
చాలా సేపు వాడేం మాట్లాడలేదు. తరువాత నేనే ‘‘ఎక్కడుంది తను’’ అని అడిగాను. ‘‘ఇంక ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకొచ్చేశాం. తన గదిలోనే ఉంది. మీ చెల్లెలు తనను కంటికి రెప్పలా చూసుకుంటోంది’’ అన్నాడు దుఃఖం తోడు వచ్చిన గొంతుతో. ‘‘చూద్దాం పద’’ అంటూ తన గదిలోకి వెళ్లాం.జిట్రేగుతో చేయించిన డబుల్‌కాట్ బెడ్‌మీద అచేతనంగా పడి ఉంది ఆద్య. చూస్తూనే ఉంది, కానీ ఆ చూపులో కాంతి లేదు. చూడ్డానికి బానే ఉంది కానీ ఎవరితోనూ మాటామంతీ లేదు. దాదాపు నాలుగైదు నెలలుగా ఇదే పరిస్థితట. మమ్మల్ని చూడగానే హన్మంతుగాడి భార్య లక్ష్మి కళ్ళంబడి నీళ్లు. కుర్చీలోంచి లేచి నుంచుంది– ‘‘మీకిష్టమయిన ఆద్య అన్నయ్యా! బొమ్మలా ఉంటుంది అనేవారు కదా అన్నయ్యా.. చివరికిలా బొమ్మలా అయిపోయింది.’’ అంటూ వెక్కిళ్లు పెట్టింది. ‘‘ఊర్కోమ్మా. అంతా సర్దుకుంటుంది’’ అంటూ ఆమెను నామ్‌కేవాస్తే ఓదార్చి, అలా సాధ్యం కాదేమోనని లోపల మనసు మొత్తుకుంటుంటే బయటికొచ్చేశాం.‘‘అసలేమయిందిరా..’’ బాధ నిండిన వాయిస్‌తో అడిగాను నేను. ఆద్యను అలా చూసిన షాక్‌లోనే ఉన్నాను.‘‘నాకూ అర్థం కాలేదురా. హాస్టల్ వార్డెన్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళాను. తీరా చూస్తే ఇలా ఉంది పరిస్థితి. ఎందుకిలా అయిందో తెలీడం లేదు. అక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను, లవ్ ఎఫైర్ లాంటిదేమన్నా ఉందేమోనని. కానీ అది కూడా కాదని తెలిసింది. ఇంకా ఏం జరిగిందో తెలీదు. మీ చెల్లెలేమో ఎవరైనా ఏదైనా చేశారేమోనండీ అంటుంది. నాకలాంటి నమ్మకాలు లేవు.’ అంటూ ఆగాడు కళ్ళు తుడుచుకుంటూ. ‘‘మరి ట్రీట్‌మెంట్?’’ అంటూ ఆగాను.
‘‘హైదరాబాద్‌లో అన్నిచోట్లా తిప్పాం. మంచి సైకియాట్రిస్ట్‌లందరికీ చూపించాం. చివరికి మా కజిన్ వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటే అక్కడకు కూడా తీసుకెళ్లాం. రెండు నెలలు ఉంచి ట్రీట్‌మెంట్ చేయించి వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఇంక ఏం చేయాలో కూడా తెలీని పరిస్థితి. ఇక మీ చెల్లెలు చెప్పినట్లు బాబాలకు, మంత్రగాళ్ళకు చూపించడం ఒకటే మిగిలింది’’ అంటూ నిట్టూర్చాడు.‘‘అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోకురా. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం దారి తెలుసుకోగలగాలి అంతే..’’ అంటూ వాణ్ణి సముదాయించాను కానీ నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోయాను. అసలేం జరిగుంటుంది? అన్న ప్రశ్న నన్ను ఆ రాత్రంతా తొలిచేసింది.తెల్లారి లేచింతరువాత వాణ్ణి అడిగాను – ‘‘ఆద్య గురించి నాకింకా వివరంగా చెప్పరా..’’ అని.వాడు చెప్తూనే ఉన్నాడు గంట వరకూ. ‘‘అందరికంటే ముందుండాలని ఆద్య అని పేరు పెట్టుకున్నాంరా. నీకు తెలుసు కదా, తను చిన్నప్పటి నుంచి ఎంత యాక్టివో. చదువు మీద ఎంత శ్రద్ధో. ఏది చేసినా మనసు పెట్టి చేసేది. పైపైన చేసి అయిపోయిందనే మనస్తత్వం కాదు తనది. పూర్తిగా తెలుసుకుని చేసేది. అయితే నాకు తెలీని విషయం ఏంటంటే, ఆద్య ఆర్ట్ బాగా వేస్తుందని. ఎప్పుడూ నాకు చెప్పలేదు, తన పెయింటింగ్సేవి నాకు చూపించనూ లేదు. హాస్టల్ ఖాళీ చేసినప్పుడు దాదాపు యాభై అరవై పెయింటింగ్స్ దొరికాయి. చాలా ఆశ్చర్యమేసింది. అవన్నీ తీసుకొచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టాం. ఇప్పుడిక వాటితో పనేం ఉంది?’’ అన్నాడు హన్మంతు బాధగా.
నాకు ఆద్య గీసిన బొమ్మలు చూడాలని అనిపించింది. హన్మంతుని అడిగాను చూపించమని. వాడు నాకేసి ఆశ్చర్యంగా చూసి ‘పద’ అన్నాడు. అక్కడ అల్మారా కనిపిస్తే డోర్ తీసి చూశాను. డైరీ కనిపించింది. దాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టోర్‌రూమ్‌లో నుంచి పెయింటింగ్స్ హాల్‌లోకి తీసుకొచ్చాం ఇద్దరం. నన్ను చూస్తుండమని చెప్పి వాడు లోపలికెళ్ళాడు. నేను ఒక్కొక్కటి తీసి చూశాను.పచ్చని ప్రకృతినంతా పెయింటింగ్స్‌గా మార్చేసింది ఆద్య. నాకు చాలా అపురూపంగా అనిపించాయి. దట్టమైన మబ్బులు, వాటి మధ్యలో చిక్కిన స్పష్టాస్పష్టమైన చంద్రుడు, రకరకాల పక్షులు, తుమ్మెదలు, రంగురంగు పూలు, తోటలు, పళ్ళు, పచ్చని చిలకలు వాలిన చెట్లు, చెట్లమీద నుంచి ఆకాశంలోకి ఎగరబోతున్న పక్షుల గుంపులు... ఇంకా నాకు బాగా నచ్చిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి అందులో. చిన్న సన్నజాజి పందిరి దానిమీద పిట్టగూడు, పక్కనే వాలిన పిట్టలు, మొక్కజొన్న తోటలు, కాల్వల్లో ఈత కొడుతున్న పిల్లలు, నాకొక విషయం అర్థం కాలేదు – సిటీలో పెరిగిన అమ్మాయికి ఇవన్నీ ఎలా పరిచయం?ఒక పెయింటింగ్ మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా చూస్తుండిపోయాను దానివైపు! ఆ తరువాత ఆద్య డైరీ తిరగేశాను.
జూన్ 14. శుక్రవారం.‘వేసవి సెలవులొస్తే అంతా హైదరాబాద్‌కో, పక్కన ఉన్న ఏదో ఒక సిటీకో వెళ్ళిపోతారు. కానీ అదే సిటీవాళ్ళు పిల్లల్ని తీసుకుని పల్లెలకు వెళ్ళి అక్కడి వాతావరణాన్ని, పంటల్ని వాటి ప్రాముఖ్యతని ఎందుకు పరిచయం చెయ్యరు?’జూలై 20. ఆదివారం.‘అసలు ఈ సిటీలో నాకు ఊపిరాడ్డం లేదు. ఎటు చూసినా సిమెంట్, లేదంటే గ్లాస్..! ఎవరికి వారు వేసుకుంటున్న ఛేదించలేని పరదాలు..! ఓజోన్ పలచబడుతోంది. యూవీ రేస్‌ని రాకుండా ఆపగలిగేది ఒక్క ఓజోనే. ఊపిరితిత్తుల్లో పేరుకుంటున్న కాలుష్యం. ఇక్కడే కొన్నాళ్ళు ఉంటే బహుశా తెలియని రోగాలు కూడా అంటుకుంటాయేమో. అకిరో డ్రీమ్స్ ఎంత బాగా తీశాడు! అణుబాంబు పడ్డ దేశం మళ్లీ మామూలు స్థితికి రావాలంటే ఎంత కష్టం! కాలుష్యం కూడా మనకు మనమే సృష్టించుకుంటున్న అణుబాంబు! దీని ఫలితం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇదెవడికీ పట్టదు.’ఆగస్టు 4. శనివారం.‘ఇంత పచ్చని ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. భవిష్యత్తరాలు ఎలా మనుగడ సాగిస్తాయి? ఎక్కడ చూసినా అడవులని నాశనం చేస్తున్నారు. సిమెంట్ కట్టడాలతో నింపేస్తున్నారు. కాలుష్యంతో పాడు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో భూమి సర్వనాశనం అవుతోంది. యాసిడ్ రెయిన్స్. ఇదంతా మనిషి భూమికి చేస్తున్న రాచపుండు. ఇది నయమవాలంటే భూమికి ఆకుపచ్చని పసరు పూయాలి. అదే మందు. అది కేవలం అడవుల్ని సంరక్షిస్తేనే సాధ్యం! కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎంతసేపూ సంతానం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులయ్యారా లేదా! దేశాంతరం వెళ్తున్నారా లేదా! అనే కానీ కనీసం ఇంట్లోనయినా రెండు మొక్కల్ని నాటుదాం అనుకునే వారెంతమంది? కొన్నాళ్లకి ఆక్సిజన్ సిలిండెర్లు కొనుక్కుని బతకాలి, వాటర్‌ని కొంటున్నట్లు.’ఆగస్టు 31. గురువారం. ‘విశ్వంలో జీవగ్రహం అంటే లివింగ్ ప్లానెట్ ఒక్క భూమే! దాన్ని కూడా నిర్జీవం చేస్తున్నాం. ఒక్క జీవం పుట్టుకకు ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో తెలుసుకున్న మనిషి ఎందుకింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు? ఈ భూమి కాలుష్యం వల్ల నాశనమైతే మళ్ళీ ఒక జీవం పుట్టడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికి తెలుసు? అన్నీ తెలిసిన మనిషి ఎందుకింత దిగజారిపోయాడు? పనికిరాని డబ్బుని కూడబెట్టుకుంటున్న మనుషులకు భూమిని కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? భూమ్మీద ఇన్ని కోట్ల జీవరాశులుంటే కేవలం తన గురించి, తన వంశం గురించి మాత్రమే ఎందుకాలోచిస్తున్నారు? ప్రకృతిలో మనం భాగం అయినపుడు మరి మనల్ని మనమే కాదు, అన్ని జీవరాశుల్ని కాపాడుకోవడం మన కనీస బాధ్యత కదా? అందరూ గ్రీన్ కార్డు కలలే కంటే గ్రీన్ ప్లానెట్‌కలలు ఎవరు కనాలి?’ ఇలా సాగింది డైరీ! నిజానికి అది ఆద్య ఒక్కరి డైరీ కాదు. కాకూడదు. పట్నం బతుకుల సామూహిక డైరీ కావాలి కదా అనిపించింది.ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అస్పష్టంగా ఏవేవో ఆలోచనలు. నా మెదడు నాకేవో సంకేతాలివ్వసాగింది. చివరికి నేనో నిర్ణయానికి వచ్చాను.
తెల్లారగానే హన్మంతుగాణ్ణి పిలిచి నా నిర్ణయం గురించి చెప్పాను. వాడు షాక్ అయ్యాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. నామీద వాడికి నమ్మకం కలగలేదు. వాడి ముఖంలో అది స్పష్టంగా కనిపించింది. వాడు లక్ష్మితో మాట్లాడి చెప్తానన్నాడు. సరేనన్నాను. ఇద్దరూ కలిసి చాలాసేపు చర్చించి, హాస్పిటల్స్‌తో విసిగిపోయి ఉండటంతో చివరికి ఓకే అన్నారు నా ప్రతిపాదనకు. నాకు సంతోషం వేసింది. ‘‘ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఎందుకు, ఏమిటి అని అడగొద్దు. మా ఊరికి ఆద్యను తీసుకెళదాం. రెండు లేదా మూడు నెలలు నా ప్రయత్నం నేను చేస్తాను. ఫలితం ఉంటే మన అదృష్టం’’ అన్నదే నా నిర్ణయం.పట్నం నుంచి బయల్దేరిన కారు మా ఊరిలో మా ఇంటిముందు ఆగింది. ముందు నేను దిగి వీధి గేటు తీసుకుని మొక్కల మధ్యలోంచి మా ఇంటి తలుపు తట్టాను. నా సహచరి వచ్చి తలుపు తీసింది. ఇంటి ముందు కారు ఆగి ఉండటంతో సందేహంగా ఆగిపోయింది. ‘‘మనింటికి గెస్ట్‌లొచ్చారు. ఇక్కడే రెండు మూడు నెలలు ఉంటారు.’’ అన్నాను. కారులోంచి దిగిన హన్మంతు, లక్ష్మిలను చూసి ఆనందంగా పలకరిస్తూ లక్ష్మిని ఆలింగనం చేసుకుంది నా సహచరి. దాదాపు శవంలా ఉన్న ఆద్యను చూసి కంటతడి పెట్టింది. ఆద్యను హాల్‌లో ఉన్న పక్క మీద పడుకోబెట్టాం అందరం కలిసి.
అనుకున్న ప్రకారం వీల్‌చైర్, అంతకు ముందు ఆద్యకు డాక్టర్ రాసిన కొన్ని మందులు.. అన్నీ తీసుకుని వచ్చాం మా ఊరికి.పాలతనికి చెప్పాను, రోజూ ఎక్కువ పాలు తీసుకురమ్మని. ఉంటే జున్నుపాలు కూడా తెచ్చివ్వమ్మని. ఊర్లో ఉన్న బంతిపూల తోటకి, చెరుకు తోటకి, మామిడి తోటకి, ఇలా రోజుకో చోటుకి వెళుతున్నాం మేమంతా. ఆద్యను ఆ తోటల మధ్యలో ఆ పూల మధ్యలో వీల్‌చైర్‌లో తిప్పుతున్నాం. కనకాంబరాలు, లిల్లీలు, పొద్దుతిరుగుడు పూలు, ఎన్నో రకాల పూలు, తీగలు, మొక్కలు.. ఓహ్.. దేవలోకం అంటే ఇదేనేమో అన్నట్లుగా వాతావరణం.. ముందు హన్మంతు, వాడి భార్యలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకటి నీరసం కనిపించడంలేదు. ఉత్సాహం కనపడుతోంది ఇద్దరిలో. పెరట్లో కూరగాయలు కోయడం వాళ్లకు ఇష్టమైన వ్యాపకం అయింది. హన్మంతు భార్య, నా సహచరి కలిసి ఇంటిముందు ఉన్న పూలు కోసి మాలలు అల్లి పెట్టుకోవడం.. కబుర్లు చెప్పుకోడం.. యజ్ఞం చేస్తున్నంత ఏకాగ్రతతో మేము ఆద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకోరోజు ఒకో తోటలో తిప్పుతున్నాం. ఇరువైపులా చెట్లున్న కాలిబాటలో వీల్ చైర్‌ను తీసుకుని వెళ్తున్నాం. అలా అలా రెండు నెలలు గడిచిపోయాయి. మెల్లమెల్లగా హన్మంతు, లక్ష్మిల్లో ఈ ఆశ కూడా సన్నగిల్లింది. ఇక వెళ్ళిపోతాం అన్నారొకసారి. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. మరో నాలుగు రోజులు చూద్దామన్నాను. సరేనన్నారు.ఆ తర్వాత ఒక రోజు–బంతిపూల తోటలో స్వేచ్ఛగా తిరుగుతున్న సీతాకోక చిలుకతో పాటు ఆద్య చూపు కొద్దికొద్దిగా ఆకాశంలోకి ఎగిరింది. అంతే. మా ఆనందానికి హద్దులు లేవు. మా మనసులు అంబరాన్ని తాకాయి సంతోషంతో. మా ఆవిడ గడ్డితో నిండిన భూమే జానిమాజ్‌గా భావించి అక్కడే దువా చేసింది. చాలా చిన్న కదలికే. కానీ అదే బహుశా కొద్దిరోజుల్లో సీతాకోక చిలుక వేగం పుంజుకుంటుందని నాకు బలమైన ఆశ కలిగింది.
ఇదెలా సాధ్యమయ్యిందని ఆరోజు అడిగారు, హన్మంతు, లక్ష్మి.నేను ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టాను–‘‘నాకు ఆద్య పెయింటింగ్స్ చూశాక, అందులోనూ నన్ను బాగా డిస్టర్బ్ చేసిన ఒక పెయింటింగ్ పరిశీలించాక ఆద్య వ్యాధి సగం అర్థమయినట్టు అనిపించింది. ఆ పెయింటింగ్‌లో – గాజు పలకల పంజరంలో ఒక సీతాకోక చిలుక పడి ఉంది. అది చనిపోయిందో, బతికి ఉందో చెప్పడం కష్టం. అర్థం కావడం లేదు. నిస్తేజంగా ఉంది. ఆ గాజు పలకల పంజరం చుట్టూ పచ్చదనం పరుచుకుని ఉంది. నన్ను బాగా కలవరపెట్టింది ఆ పెయింటింగ్. నాకెందుకో బెడ్ మీదున్న ఆద్య కళ్ళముందు మెదిలింది. తరువాత ఆద్య డైరీ చదివాను. ఒక్కో పేజీ తీస్తుంటే ఆద్య మనసు ఆవిష్కృతమవుతూ వచ్చింది. ఆమె ఆలోచనలు ఒక్కొక్కటిగా విశదమవుతూ వచ్చాయి.హన్మంతుతో జరిగిన చర్చల్లో చెప్పాడు, ఆద్య చాలాసార్లు ఊర్లకు పోదాం డాడీ అని అడిగిందని. కానీ ఊళ్ళో ఎవరూ లేకపోవడంతో తీసుకెళ్లలేకపోయాడని. కానీ ఆద్య సినిమాల్లో, కథల్లో చదివి ప్రకృతిపైన ప్రేమ పెంచుకుంది. ఆమె మిగతా పెయింటింగ్స్ చూసినప్పుడు కూడా నాకర్థమైంది ఇదే. అంటే ఆమెని ఆమె ప్రేమించింది. ప్రకృతిని ప్రేమించింది. తనని తాను ప్రకృతితో పోల్చుకున్నప్పుడు తానూ ఓ గాజుగదిలో బందీగా ఉన్నట్లు అనిపించి ఉంటుంది ఆమెకు. ఆ గాజు పలకల్ని బద్దలు కొట్టాలి. అప్పుడు సీతాకోక చిలుకకు ఆక్సిజన్ అందుతుంది. బటర్‌ఫ్లై బతుకుతుంది.ఎస్, ఆమె ‘నేచర్ మిíస్సింగ్ డిజార్డర్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అనిపించింది. మీరు ఇన్ని ప్రయోగాలు చేశారు కదా! నాకు ప్రకృతి వైద్యం చేసి చూద్దామనిపించింది. అంటే మనిషికి ప్రకృతిని పరిచయం చేయడం. నిజానికి ఇద్దరూ ఒకటే అనుకుంటాం, అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నామని ఆద్యని చూస్తే తెలిసింది. ఆమెకు ప్రకృతి వైద్యం చేస్తే కోలుకుంటుందేమోనని నా మనసులో ఏదో మూల ఆశ మొలకెత్తింది.
ఈ విషయం చెబితే మీరు నవ్వుతారేమోననిపించింది. అందుకే మీకివేమీ చెప్పకుండా మిమ్మల్ని ఒప్పించి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చింది. మొత్తానికి నా ఆశ ఫలించింది!’’ అన్నాను సంతోషంగా.హన్మంతు లేచి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. చూస్తే ఏడుస్తున్నాడు వాడు – ‘‘నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదురా!’’ అన్నాడు గొంతు పెగుల్చుకొని. లక్ష్మి కూడా దగ్గరికొచ్చి నిలుచుంది. తన కళ్ళ నుండి కూడా కన్నీళ్లు కారిపోతున్నాయి! పగిలిపోయిన గాజుబొమ్మ ప్రాణం పోసుకున్న సంతోషంలో ఉన్నారిద్దరు. కొంతసేపటికి హన్మంతు అన్నాడు – ‘‘అరేయ్ యూసుఫ్! నాక్కూడా ఇక్కడొక ఇల్లు చూడరా! తరువాత చిన్నగా తోటలూ అవీ ప్లాన్ చేద్దాం’’. వాడి గొంతులో నిజాయితీతో కూడిన ఉద్వేగం. ట్రీట్‌మెంట్ చేసింది ఆద్యకా? హన్మంతుకా?! అన్న సందేహం కలిగింది నాకు.
- షాజహానా
పత్రహరిత
Published Sun, Aug 12 2018 1:03 AM | Last Updated on Sun, Aug 12 2018 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment