సీరమేను కూర | funday story to in this week | Sakshi
Sakshi News home page

సీరమేను కూర

Published Sun, Mar 25 2018 1:18 AM | Last Updated on Sun, Mar 25 2018 1:18 AM

funday story to in this week - Sakshi

ఇపుడొక చిక్కొచ్చి పడింది. పైగా స్వయంకృతాపరాధం. దీన్నుండి ఎలా బయట పడాలి? సమస్యను ఎలా తీర్చాలి?అసలు ఆ రోజు సీరమేను ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది. ఇపుడీ ఇబ్బంది ఉండకపోను. అలా అనుకుంటాం గానీ ఒకానొక ఉబలాటం ఊరుకుంటుందా? బురదలో కాలు పెట్టినట్లయ్యింది. కడుక్కోక తప్పదు. ఈ కథంతా మా తాత గారైన వెంకటపతిరాజుగారి గురించే.  వెంకటపతి తాత మహా చాదస్తుడు. పుట్టి బుద్ధెరిగి నీసు మాంసాలు తినలేదు. జీవుల్ని చంపుకు తినడం పాపం అనేవాడు. సృష్టిలో అవి మనకు ఆహారం కోసం ఎప్పట్నుంచో కేటాయింపబడ్డాయంటే ఊరుకునేవాడు కాదు. తిట్టేవాడు. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి ఇంట్లో వండుకుంటే ఏనాడూ వద్దనలేదు. ఇదే కాదు దేవుడు గురించి కూడా ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారివి అన్నట్టే ఉండేవాడు. ఎవరి అభిప్రాయం ఎలాంటిదైనా గౌరవించేవాడు. వెంకటపతి తాత పొదుపుగా బతికేడు. బోలెడు సంపాదించాడు. పొలాలు కొన్నాడు. అదను పాటించి సేద్యం చేసి పంటలు బాగా పండించాడు.  ఊళ్ళో వాళ్ళకు సరిపడే ధాన్యం ఆడే చిన్న మిల్లు కట్టాడు. పిల్లల్ని చదివించాడు. అందరికీ ఏరికోరి మంచి సంబంధాలు చేశాడు. ఏ విధమైన లోటు పాట్లు లేవు. అంతా బాగానే ఉంది... అంతా బాగానే ఉంది...  ‘‘బాగుందా? బాగానే ఉందా?’’ ఇది మాత్రం రుచి గురించే. ఈ రెండు ప్రశ్నలూ బావుండటంలో హెచ్చుతగ్గులు తెలుసుకోడానికే. ఇంట్లో భోజనం సమయంలో తరచు ఎదురయ్యే ప్రశ్నలే. ఒక రుచి. అన్నట్టు ఏ రుచైనా గొంతు దాకానే కదా. గొంతు దాటింతర్వాత దాని ప్రభావం నాలుక మీద కొంచెంసేపు ఉంటుందేమో. అవునా? అలాగే అనుకుంటే ఈ తాపత్రయం ఎందుకు? జిహ్వ చాపల్యం ఎలా పుట్టింది?అకస్మాత్తుగా సీతారాముడు గుర్తుకొచ్చాడు. ‘వివాహ భోజనంబు... వింతైన వంటకంబు.. అహహ్హా...’’ పాట విన్నపుడూ వాడే గుర్తుకొస్తాడు. 

సీతారాముడు సన్నగా ఉండేవాడు. ఇపుడు లేడు. రెండేళ్ళ క్రితం పోయాడు. కొద్దిగా గొంతు గరగరతో మాట్లాడేవాడు. బొంగురు గొంతు అన్నమాట. వాడి తిండి కనులార చూస్తే ఎవరికైనా మతిపోతుంది. బకాసురుడే. పొరుగూరులో ఉండి నాలుగు రోజులు వరసాగ్గా తినాల్సి వస్తే రోజుకో హోటలు మారేవాడు. మా ఊళ్ళో కుర్రాళ్ళకు ఓ వింత సరదా ఉండేది. ఆడపిల్లోళ్ళ ఇంటికి పెళ్లికి తరలి వెళ్ళినపుడు మర్యాదలు సరిగ్గా జరగకపోతే... భోజనాల్లో ఏదో ఒక పదార్థం లేదనిపించే పని పెట్టుకునేవారు. రెచ్చగొట్టి గొడవ తెచ్చుకునేవారు. అపుడు సీతారాముడ్ని ముందు పెట్టి సవాలు విసిరేవారు. అడిగినంత వడ్డించకపోతే అవమానం కదా. వాళ్ళు కిందా మీదా పడుతుంటే మా కుర్రాళ్ళకు గొప్ప ఆనందం. నిజం చెప్పొద్దూ... వాడు ఉన్నంత కాలమూ తినడం కోసమే జీవించడంలా బతికాడు. అంతెక్కువ తినడం రోగమని వాడికి తెలీదు. తనే కదా ఇంతటి మొనగాడ్ని అనుకునేవాడు. వైద్యం చేసుంటే మరికొన్నాళ్ళు బతికేవాడేమో. మరి... మరి... తక్కువ తినడం కూడా రోగమేనా?ఈ ఎక్కువ తక్కువ మీమాంస అలా ఉంచితే సరిగ్గా ఇప్పుడే... జ్ఞాపకాల్లోంచి ఓ పాత కథొకటి రాలిపడింది.

ఇది అనగనగా ఒక రాజు కథే. రాజు కాస్తంత తమాషా అయినవాడు. ఎవర్నీ సలహా అడక్కుండా నేరం చేసి కొత్తగా బందీ అయినవాడికి ఒక వింత శిక్ష వేశాడు. ‘‘ప్రతిరోజు జైలులో వాడికి పెట్టే తిండి కొంచెం కొంచెం తగ్గించి పెట్టండి’’ అని ఆదేశించాడు. అలాగే చేశారు. పది రోజులయ్యాక ఖైదీ ఎలా ఉన్నాడో అని చూడ్డానికెళ్ళాడు. నేరస్తుడి ముఖం ఎంతో కాంతివంతంగా తేటగా కళకళలాడుతూ కనపడింది. వచ్చేసాడు వెనక్కి. మరో పదిరోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు రాజు. ఖైదీ ముఖం మరింత తేజస్సుతో వెలిగిపోతూంది. రాజుకి మతిపోయింది. అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ‘ఇదేమిటీ...’ అని మంత్రిని అడిగాడు. ‘‘కంగారుపడకండి, మహాప్రభూ... ఒక పని చేయండి... రోజురోజుకూ పెంచుకుంటూ తిండి పెట్టించండి’’ మంత్రి సలహా చెప్పాడు నెమ్మదిగా నవ్వుతూ. అంగీకారంగా తల ఊపాడు రాజు. కొన్ని రోజులకు నేరçస్తుడు చచ్చి ఊరుకున్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. 

‘‘జనాల్ని ఎపుడూ అర్ధాకలితోనే ఉంచాలి. అపుడే మన రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లు లెక్క. చూశారు కదా తిండి ఎక్కువ అయితే చచ్చి పోవడాన్ని’’ వివరించాడు మంత్రి. అయితే మా తాత కోరిక విడ్డూరమైందీ, ఆక్షేపణీయమైందీ కాదు. ఊహించనిది. అకాలమైనది. అంతే కాదు. ఒక రకంగా మా మేనత్త కొడుకు రామం తెచ్చి పెట్టిన తంటా ఇది. కోరికలు అనంతమైనవి. కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. ఋతుధర్మంగా లభ్యమయ్యే దాన్నైతే ఎలాగోలా తీర్చేయవచ్చు. ఆ రోజు – వెంకటపతి తాతకు ఒంట్లో బాగోలేదు. పొద్దుట్నుంచీ నీరసంగా పడుకున్నాడు. ఎనభై ఏడేళ్ళ తాతకు తిండి సయించడం లేదు. అపుడే చూడ్డానికి మా మేనత్త కొడుకు రామం వచ్చాడు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినపుడు ముడుచుకుని పడుకుంటాడు. సహజంగా తెలిసినవాళ్ళు వచ్చినపుడు కళ్ళల్లో కాంతితో... ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఈవేళ ఆ ప్రయత్నం లేదు. రామం మంచం అంచున కూచుని తను తెచ్చిన కమలాఫలం తొనలు తీసి తినిపించాడు. పలకరిస్తుంటే ముభావంగా సమాధానాలు చెబుతున్నాడు తాత. మాట స్పష్టత లేదు. కాసేపటికి వెంకటపతి తాత వెర్రి చూపులు చూస్తున్నాడు. ‘‘డాక్టరు... డాక్టరు...’’ నెమ్మదిగా అంటున్నాడు. వసారా ఆనుకుని ఉన్న చిన్న గది. గదిని చాలా శుభ్రంగా ఉంచుతాం. ప్రతిరోజూ దుప్పట్లు మారుస్తాం. రెండురోజులకొకసారి ఫినాయిల్‌తో గదిని కడిగిస్తాం. రెండు చేతులూ పొట్ట మీద వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు పైన తిరుగుతున్న ఫ్యాన్‌కేసి చూస్తున్నాడు. బలహీనంగా చిక్కిపోయి ఉన్నాడు. కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాను.

కారు రప్పించాను. ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం. ‘‘నేనూ వస్తాను’’ అన్నాడు రామం. బయలుదేరాం. జాగ్రత్తగా తాతను ముందు సీట్లో కూర్చోబెట్టి మేమిద్దరం వెనుక కూర్చున్నాం. రామం నా ఈడువాడే. దైవభక్తుడు. చెట్టూ పుట్టా అని చూడకుండా కొలుస్తాడు. ప్రయాణం ఉంటే రాహుకాలం, వర్జ్యం చూస్తాడు. శకునం చూసుకుని బయటకు కదులుతాడు.  కాకినాడ చేరాలంటే రోడ్డు సరిలేకపోవడం వల్ల గంటన్నర సమయం పడుతుంది. మేమిద్దరం రాజధాని నిర్మాణం... రైతు రుణమాఫీ... పాదయాత్రలు... రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి రామానికి ఈ రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకంటే వాడు యానాంలో ఉంటున్నాడు. అక్కడి ప్రభుత్వం, రాజకీయాలు వేరు. తర్వాత సంభాషణ పులస, సీరమేను మీదకు మళ్ళింది. ‘‘పులస, సీరమేను సంవత్సరంలో కొద్దిరోజులు మాత్రమే దొరుకుతాయి. అందుకే  వాటికి అంత డిమాండు. వాటిని రుచి చూడ్డానికి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. పుస్తెలమ్మైనా పులసలు తినాలనే నానుడి ఉంది. మనకు తెలియదు గానీ సీరమేనుకు కూడా ఏదో సామెత ఉండే ఉంటుంది. వాటి కోసం పడి చస్తారనుకో...’’ అన్నాడు రామం. ‘‘అది సరే. సీరమేను గురించి చెప్పు. రెండు మూడుసార్లు తిన్నాను. బావుంది. అది అసలు ఎలా దొరుకుతుంది?’’ అడిగాను. తాత అటూ ఇటూ తల తిప్పుతూ మా మాటలు వింటున్నాడు. ఏదో గొణుక్కుంటున్నాడు. 

‘‘మంచినీళ్ళు కావాలా?’’ తాతను అడిగాను. వెనక్కి చూసి తల అడ్డంగా ఊపాడు. మా మాటలు కొనసాగుతున్నాయి.‘‘సీరమేను ఆశ్వీయుజ మాసంలో మాత్రమే దొరుకుతుంది. తూర్పు వానలు, గాలులకు సీరమేను పుడుతుంది. పులసల సీజను పూర్తవ్వగానే సీరమేను మొదలవుతుంది. సముద్రంలో తీవ్ర ప్రకంపనలకు అలల తాకిడి వేగవంతమై వీచే తూర్పు గాలులకు సీరమేను దొరకడానికి అనుకూలం. నాగుల చవితికి నాగలోకానికి పోతుందని అంటారు. ఆ తర్వాత ఇక మళ్ళీ సంవత్సరం దాక సీరమేను దొరకదు’’ రామం చెప్పుకుపోతున్నాడు. తల వారగా పెట్టి తాత వింటున్నాడు. రామం చెప్పడాన్ని ఆపాడు. రోడ్డు వెడల్పు చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. పొక్లైనర్లు పనిచేన్తున్నాయి. ఎర్ర జాకెట్టులు, టోపీలు పెట్టుకుని కొంతమంది హడావుడిగా తిరుగుతున్నారు. రోడ్డంతా ఎగుడుదిగుడుగా ఉంది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఎదురుగా లారీలు... ట్రక్కులు.. ఆర్టీసీ బస్సులు... ఆటోలు...తాత చిటికెన వేలు చూపించాడు. ఒకటికి అన్నమాట. కారు ఆపాలి. సరైన చోటు రాగానే కారు ఆపించాను. తాతను రోడ్డు వరకు నడిపించుకుని కూచోబెట్టాం. తిరిగి కారు బయలుదేరింది. రామం కొనసాగించాడు.   ‘‘సీరమేను పట్టడానికి వలలు అక్కర్లేదు. రంగుల చీరలు చాలు. ఒకడు ఒడ్డున నీటిలో ఉంటే మరొకడు కొంచెం దూరంగా నిలబడతాడు. రెండు చీరలు కలిపి కుట్టి అంచులు పట్టుకుని బిగబెట్టి దేవుతారు. నది మధ్యకో లోతుకో వెళ్ళక్కర్లేదు. అంతా తీరాన్నే. బుస్సుమనే శబ్దంతో తెల్లటి పొట్టు మాదిరిగా వస్తున్న సీరమేను రంగులకు ఆకర్షిస్తుంది. జాగ్రత్తగా బిందెల్లోకి పోసుకుంటూ వేట కొనసాగిస్తారు. చీర ఉపయోగిస్తారు గనుక సీరమేనుకు ఆ పేరు. చిరుమీనం అనగా చిన్న చేప అర్థంలో సీరమేను అనే పేరు స్థిరపడిందని కూడా అంటుంటారు’’  రామం చెప్పడం ఆపాడు. వాహనాలు రద్దీ పెరగడంతో నెమ్మదిగా కారు పోతూంది. 

రామం చెప్పే మాటలు కొత్తగా వినడానికి కారణముంది. నేను పుట్టిన తర్వాత మా నాన్న వేరే రాష్ట్రంలోకి మకాం మార్చాల్సివచ్చింది. ఇక్కడి ఆహారపు అలవాట్లు నాకు పెద్దగా తెలియవు. ‘‘ఇప్పుడైతే సీరమేను అపురూపం అయ్యింది గానీ మా చిన్నప్పుడు కొబ్బరి మొదళ్ళకు వేసేవారు. ఆ రోజులే వేరు. అమ్మ చేసే సీరమేను గారెలు ఎంతో బావుండేవి. అన్నానికి రెట్టింపు కూర కలుపుకుని తినేవాళ్ళం.ఇంకో సంగతి తెలుసా?’’ కారు ముందుకు కదలలేని పరిస్థితి. అక్కడేదో ప్రమాదం జరిగినట్లుంది. నగర కూడలిలో వాహనాలు ఆగినట్లుగా... వరుసగా నిలబడిపోయాయి.జరిగింది ప్రమాదం కాదు. ఎదురెదురుగా వస్తున్న బస్సు, లారీ డ్రైవర్లు వాదులాడుకుంటున్నారు. వెనక్కి తిప్పడానికి ఇద్దరూ ఒప్పుకోవడం లేదు. ఆఖరుకు కొంతమంది వెళ్ళి సర్ది చెప్పారు. వాహనాలునెమ్మదిగా కప్పను మింగిన పాముల్లా కదులుతున్నాయి.తాత మంచినీళ్ళు అడిగాడు. ఇచ్చాను. తాగాడు. తనలో తాను తిట్టుకుంటూ చికాకుగా ముఖం పెట్టాడు.  ఇక్కడ్నుంచి రోడ్డు మంచిగానే ఉంది.‘‘సరే...చెప్పు... సీరమేను గురించి...’’ అడిగాను.

‘‘విచిత్రం ఏమిటంటే సీరమేను కూరను అందరూ ఒకేలా వండరు. ఒక్కో కులం వారు ఒక్కోలాగ వండుతారు. పులుపు కోసం కొంతమంది చింతకాయలు వాడతారు. కొంతమంది చింతపండు వాడతారు. ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేదు. తినాలనే కోరిక ఉన్నా ఎక్కువ డబ్బులు వెచ్చించలేక చాలామంది రుచికి దూరమై పాయారనే చెప్పాలి. ఒక సేరు రెండువేల రూపాయిల వరకు పలుకుతున్నది. ఎంత వరకు నిజమో గానీ జాలర్లకు దొరక్కుండా పోయిన సీరమేను పురదొందులుగానో మూనీరుచేపలుగానో పరిణామం చెందుతాయంటారు.’’ అప్పటిదాకా మౌనంగా ఉన్న తాత నోరు విప్పాడు.‘‘మీ సొద కాసేపు ఆపండర్రా... ఒకటే తిండి గొడవ..’’ విసుగ్గా అన్నాడు తాత. భుజం మీద తువ్వాలుతో పెదాలు తుడుచుకున్నాడు. ఇంకా ఏదో అంటున్నాడు. మా చెవులకు చేరడం లేదు. నేను, రామం ముఖ ముఖాలు చూసుకుని చేతితో సైగలు చేసుకుని మా సంభాషణ ఆపేశాం.కాకినాడ చేరేటప్పటికి సాయంత్రం అయిదయ్యింది.డాక్టరు వీర్రాజు గౌరవంగా చనువుగా తాతను పలకరించారు. కుశల ప్రశ్నలడిగారు. తాత కూడా హుషారుగా మాట్లాడాడు. మూలుగుతున్న వాడల్లా డాక్టరును చూడగానే కొత్త శక్తి వచ్చేసింది. యోగక్షేమాలు అడిగి ఆరోగ్యం గురించి భరోసా ఇస్తూ ధైర్యవచనాలు చెబితే చాలు. ఈ వయసు వాళ్ళకు అదే గొప్ప మందు. తాతలో పూర్వపు చలాకీతనంతో బాటు తన మీద తనే జోకులేసుకునేంత కలివిడి మాకు ఆశ్చర్యం కలిగించింది. అలాగే డాక్టరు చేతులు పట్టుకుని చాలాసేపు వరకు వదలలేదు. తర్వాత డాక్టరు తాతను పరీక్షించారు.

‘‘తాతగారూ... మీరు మాకంటే ఆరోగ్యంగా ఉన్నారు. మీకే రోగమూ లేదు. అంతా చక్కగా ఉంది. మనసులో ఏమీ పెట్టుకోకండి. నిండైన సంతృప్తి జీవితం మీది. మీరు కోరుకున్నవి సాధించారు. మీ పిల్లలంతా మంచి పొజిషన్‌లో ఉన్నారు. చాలా అదృష్టవంతులు. రోజూ కాసేపు నడవండి చాలు. బలానికి మందులు రాస్తాను. వాడండి’’ అని డాక్టరు చెప్పడంతో తాత ముఖం వెలిగిపోయింది. ‘‘సంతోషం బాబూ... మీ నాన్నలాగే మంచి పేరు సంపాదించుకో. అన్నట్టు నేనేం తినొచ్చో ఏం తినకూడదో చెప్పలేదు..’’ డాక్టరు చేతులు వదలకుండానే ఆయన ముఖంలోకి చూస్తూ అడిగాడు. ‘‘అరె... నేను ముందే చెప్పాను కదా... ఫలానా పదార్థం తినకూడదని లేదు. అన్నీ బ్రహ్మాండంగా తినొచ్చు. మీరు రుచికి ఇష్టమైనవన్నీ తినండి. మీకు ఏదైనా తినాలనిపిస్తే చేయించుకుని నిరభ్యంతరంగా తినండి. మీకు ఏం కావాలి?’’ అని మృదువుగా అడిగారు డాక్టరు. తాత నా వైపు చూసాడు. ‘‘డాక్టరు గారు చెపుతున్నారు కదా... మీకేం కావాలంటే అది తీసుకురావడానికి నేను సిద్ధం’’ అన్నాను చిరునవ్వుతో. రామం కూడా అదే మాట చెప్పాడు.  ‘‘అలాగే బాబూ... అలాగే...’’ అని ఊరుకున్నాడు. డాక్టరుకు థ్యాంక్స్‌ చెప్పి ఆసుపత్రి బయటకు వచ్చాం. చీకటి పడింది. పట్టణంలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒకటే జనం. ఉరుకులు పరుగులు. కూడళ్ళలో అయితే చెప్పనక్కర్లేదు.         ఇడ్లీలు కట్టించుకుని మరల కారు ఎక్కాం. రామం తను యానాం వెళ్ళిపోతానని చెప్పడంతో అతన్ని బస్టాండ్‌ దగ్గర దింపడానికి నిశ్చయించుకున్నాను. ‘‘తాత గారూ... నేను మరికొద్ది రోజుల్లో వస్తాను. మా ఊరు వెళతాను’’ అని చెప్పాడు రామం. తాత ఒప్పుకోలేదు. ఇంటికి రావాల్సిందే అని పట్టు పట్టాడు. తిరుగు ప్రయాణం మొదలైంది. రామం తాత ఇష్టాయిష్టాల గురించి అడుగుతున్నాడు. ఒకొక్కటి నెమ్మదిగా బోసినోటితో తాత చెబుతున్నాడు. ‘‘డాక్టరు చెప్పింతర్వాత ధైర్యం వచ్చిందిరా... ఇన్నాళ్ళూ తమాయించుకున్నాను. వచ్చే పొద్దా పోయే పొద్దా... నిజం చెప్పాలంటే నేను కోరికలు చంపుకునే బతికానురా... ఎంత ఇష్టం అయినా దూరంగానే ఉన్నాను. మీ అమ్మమ్మ పాకం గారెలు గొప్పగా చేసేదిరా... నోటిలో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే వెన్నపూసలా. అలాగే బందరు లడ్డు. ఇక్కడ చేసినవి కావు. బందరులో తయారు చేసినవే తినాలనుందిరా...’’ ఈ మాటలు ఒకేసారి చెప్పినవి కావు. మొత్తం మీద తాత మాటల సారాంశం ఇది. ‘‘తప్పకుండా తాతా.... రేపే పెరుమాళ్ళపురం పాకం గారెలు తెప్పిస్తాను. అవి మీరు చెప్పినట్లే ఉంటాయి. బందరు నుంచి లడ్డూలు కూడా రప్పిస్తాను. మీరేమీ సందేహించకుండా ఏదైనా సరే చెప్పండి’’ అని చెప్పాను.

ఇంటికి చేరాం. రాత్రి పదయ్యింది.  ఉదయం లేచి తాత గదికి వెళ్ళాను. ఇంకా లేవలేదు. ముసుగు తన్ని పడుకునే ఉన్నాడు. చేతితో తట్టి లేపాను. మెల్లగా కళ్ళు తెరచి చూశాడు. నన్ను చూడగానే లేచి కూర్చున్నాడు. అంతలోనే తలగడ సరిచేసుకుని మరల పడుకున్నాడు.‘‘ముఖం కడుక్కోండి’’ చెంబుతో నీళ్ళు... బ్రష్‌... పేస్టు... టేబుల్‌ మీద పెట్టి గది బయటకు వచ్చాను.ఇంటిని ఆనుకునే మా పొలం. పెరటి గుమ్మం తలుపు తీసుకుని సన్నని బాట మీదుగా కొద్ది దూరం వెళితే పొలం వస్తుంది. రామం నన్ను అనుసరిస్తున్నాడు. నేలపై మొక్కలు తడిగా ఉన్నాయి మంచు పడి. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం. మౌనంగా నడుస్తున్నాం. అలా వెళ్ళామో లేదో ఇంటి నుండి కబురు. తాత మాట్లాడటం లేదని వెంటనే రమ్మని.మా ఆవిడ  ఆందోళనగా నా కోసం ఎదురుచూస్తూంది.‘‘మనిషి మనలో లేడు. బయట గాదెలున్న వసారాలోకి చేరిస్తే మంచిదేమో. అసలే మండువా లోగిలి. పాడు పెట్టాల్సి వస్తే అవతల కాపురం ఉంటున్న మీ బంధువులతో మాట వస్తుంది. చూసుకోండి’’ ఈ మధ్యనే ఊళ్ళోకి వచ్చిన పెద్దాయన అంటున్నాడు.‘‘ఫర్వాలేదు లెండి. అలాంటి అవసరం వచ్చినా సరే ఈ ఇంటికి ఎంతో చేసిన ఆయన్ను ఇక్కడ్నుంచి బయట పెట్టేది లేదు’’ విసురుగా అని తాత దగ్గరకు వెళ్ళాను.ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నాడు. నన్ను చూడగానే కళ్ళు మెరిశాయి. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మాట అర్థం కావడం లేదు. పది నిముషాలయ్యేటప్పటికి తాత మామూలు మనిషి అయ్యాడు. పాలు తాగాడు.చుట్టూ పోగుపడిన తెలిసిన ముఖాల్ని తేరిపార చూశాడు. నన్ను దగ్గరకు రమ్మన్నాడు. వెళ్ళాను.‘‘వీళ్ళందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఏమైందని? వెళ్ళి పొమ్మను. నేనింకా చావనని చెప్పు. నీ ఒక్కడితో మాట్లాడాలి... తలుపులు మూసి రా...’’ అన్నాడు. ‘అమ్మయ్య’ తాతకు ఏం కాలేదు అనుకున్నాను. అందరూ బయటకు వెళ్ళి పోయారు. గదిలో నేనూ రామం మిగిలాం. పెద్ద తలపాగాతో గుబురు మీసాలతో మా ముత్తాత గోడ మీద పాత కాలం నాటి ఫొటోలో నవ్వుతున్నాడు. ‘‘ఒరేయ్‌... తప్పుగా అనుకోకండి. నాకొకటే కోరిక మిగిలిపోయింది రా... సీరమేను తినాలనుంది. నిన్న మీ మాటలు విన్నప్పట్నుంచీ అదే ఆలోచన. రామాన్ని పంపించి తెప్పించరా నాయనా...’’ చిత్రంగా పెదాలు తడుపుకుంటూ అన్నాడు. ఆ ఒక్క మాట అని కళ్ళు మూసుకున్నాడు. మాకు గుండెలు అదిరాయి. జీవితమంతా శాకాహారిగా నిష్టగా బతికినోడికి అసందర్భంగా ఈ కోరికేమిటి? పైగా దొరకని రోజులు. సీరమేనును ఎక్కడ్నుంచి తీసుకురావాలి? మథనపడ్డాం. ఎలా? ఎలా? ఎలా?‘‘సరే.. మా ఊరెళ్ళి నేనొక ప్రయత్నం చేస్తాను. అయిదు మాసాల క్రితమే సీరమేను సీజను అయిపోయింది. ఇపుడు దొరికే ప్రశ్న లేదు. కానీ ఎవరైనా ముచ్చటగా, ఇష్టంగా డీప్‌ ఫ్రిజ్‌లో దాచుకుంటే గనుక బతిమాలి తీసుకురావాలి.... చూద్దాం... తాత కోరిక తీరుతుందో లేదో?’’ అని రామం వెంటనే బయలుదేరడానికి సిద్ధమైనాడు.‘‘దొరికితే... సాయంత్రానికల్లా వస్తాను’’ అన్నాడు రామం.

మధ్యాహ్నం అయ్యింది. తాత పిలిచాడు. ‘‘రామం వచ్చాడా?’’ వస్తున్నాడన్నట్టు తల ఊపాను. రామం తన ప్రయత్నాల గురించి ఎప్పటికప్పుడు ఫోన్‌లో చెబుతూనే ఉన్నాడు. దొరికే ఆశ లేనట్లే.ఈ లోపులో మరోసారి తాత కళ్ళు తేలేశాడు. కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. మాటిమాటికీ ఉలికిపడుతున్నాడు. సన్నగా వణుకుతున్నాడు. తల విదిలిస్తున్నాడు. భయంగా ఉంది. అనుమానంగా ఉంది. ఆఖరి క్షణాలేమో...ఉన్నట్టుండి తాత మళ్ళీ పిలిచాడు. నా వంక తీక్షణంగా చూశాడు. ఆ చూపుకు అర్థం తెలిసింది. కానీ... ఏం చేయగలను? అసలు ఇదంతా ఏమిటి? సీరమేను తినకుండా పోవడాన్ని లోటుగా భావిస్తున్నాడా? ఇన్నేళ్ళుగా కోరికల్ని అణచుకుని బతుకుతున్నాడా? రామం దగ్గర్నుంచి సెల్‌ మోగింది. శుభవార్త అందించాడు. సీరమేను దొరికిందని, అందులోకి ముఖ్యంగా కావల్సిన చింతకాయల కోసం బజారంతా గాలించినా దొరకలేదని కంగారుగా చెప్పాడు. చింతపండు వాడమని సలహా చెప్పాను. వెంటనే వండించుకుని కారులో బయలుదేరి వస్తానని చెప్పాడు. ‘అమ్మయ్య’ అనుకున్నాను. తాత చెవిలోగట్టిగా అరిచి విషయం చెప్పాను. తాతకు తెలిసిపోయింది. అలాగే అన్నట్టు తల ఊపాడు.రాత్రి పది గంటలకు వచ్చాడు రామం.సీరమేను కూర కలిపిన అన్నం ముద్దను పట్టుకొచ్చింది మా ఆవిడ. మగత కమ్మినట్టుగా ఉన్నాడు తాత. తలగడ నిలువుగా వాల్చి కూర్చోబెట్టారు.‘‘మీరడిగిన సీరమేను ఇదిగో తినండి’’ అని చెప్పాను.తాత కళ్ళు మెరిసాయి. ఎంతో ఆనందంగా నోరు తెరిచాడు. ముద్ద అందించింది. సీరమేను మటుక్కి నోటికి చేరింది. గొంతు దిగలేదు. ఆ నోరు అలాగే ఉండిపోయింది.
దాట్ల దేవదానం రాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement