ఆర్ట్ ఆఫ్ డ్రామా | human plus | Sakshi
Sakshi News home page

ఆర్ట్ ఆఫ్ డ్రామా

Published Sun, Feb 28 2016 10:25 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఆర్ట్ ఆఫ్ డ్రామా

ఆర్ట్ ఆఫ్ డ్రామా

హ్యూమర్ ప్లస్
 
మా చిన్నప్పుడు నాటకాలు ఆడేవాళ్లు. రాగం తీస్తే జీడిపాకమే. ఎంతకూ తెగదు. నోట్లోకి నాలుగైదు రెక్కల పురుగులు వెళ్లి కాసేపు సరాగాలు ఆడుకున్నా చలించేవాళ్లం కాదు. రాగానికి రాగానికి మధ్య కొంతమంది కునుకు కూడా తీసేవాళ్లు. రాగం వేగం పుంజుకునే కొద్దీ హార్మోనిస్ట్ వేళ్లు మెట్ల మీద నాట్యం చేసేవి. మా ఊళ్లో సాంబశివయ్య అనే హార్మోనిస్టు ఉండేవాడు. మంచి సంగీత విద్వాంసుడే కానీ, మందు పడితే హార్మోన్లు పని చేయవు. ఈ మందుకున్న గొప్పతనం ఏమంటే నిజమైన కళాకారుల్ని నిద్రపుచ్చుతుంది. డూప్లికేట్ కళాకారుల్ని మేల్కొలుపుతుంది. అందుకే వైన్‌షాపుల్లో బోలెడంత మంది మంచింగ్‌తో పాటు సింగింగ్‌ని కూడా నంజుకుంటారు. స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులకంటే కూడా ఎక్కువ ఇంగ్లిష్ వినిపించేది ఇక్కడే.

ఇంతకూ మన సాంబశివయ్య ఏం చేశాడంటే, నాటకం పరదాలు ఎత్తుతున్న సమయంలో బాటి ల్ మూత తీశాడు. మందుని బిగించాడు. మైక్ టెస్టింగ్‌లు జరుగుతూ ఉండగా నిశ్శబ్దంగా స్టేజి కిందికెళ్లి నిద్రపోయాడు. గురకలు తీశాడు కానీ అది మైక్ శబ్దం అనుకున్నారు.

తబలావాడు ‘తదిగిణతోం’ అని దరువేసి హార్మోనిస్టుని కేకేశాడు. యముడి మహిషపు లోహపు గంటలు వినిపించినా లేచే పరిస్థితిలో లేడు సాంబశివుడు. తబలాకి అర్థమైంది, తనని వదిలి హార్మోనియం మందేసిందని. ‘తక్కిట తక్కిట’ అని కోపాన్నంతా తబలాపై తీర్చుకున్నాడు. మద్యం వల్ల పద్యానికి ఇబ్బంది వచ్చిందని నిర్వాహకులు గ్రహించారు. ప్రతి ఇల్యూజన్‌కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అందువల్ల రామదాస్ రంగంలోకి వచ్చాడు. రామడోస్ అని ఆయనకో ముద్దు పేరు కూడా ఉంది. తనకి హార్మోనియం వస్తుందన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావని అడిగారు. ఎక్కడా నేర్చుకోలేదని చెప్పాడు. సంగీతాన్ని కొందరు విని నేర్చుకుంటారు, కొందరు చూసి నేర్చుకుంటారు. మన రామదాస్ హార్మోనియం వాయించడాన్ని చూశాడంతే. లోకంలోని మహా పండితులంతా గొప్ప గొప్ప విద్యల్ని ఇలాగే నేర్చుకున్నారు. కనీసం వరుసలైనా తెలుసా అని రామదాసుని అడిగితే తనకి వావి వరసలు లేవన్నాడు. వెళ్లి హార్మోనియం ముందు కూర్చున్నాడు.

హార్మోనియంలు రెండు రకాలు. చేత్తో గాలిని తోసేవి. కుట్టు మిషన్ తొక్కినట్టు కాలితో తొక్కేవి. టెంట్ హాల్లో లాగా ఇలా రెండు క్లాసులు ఉంటాయని మనవాడికి తెలియదు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసేసి రామదాసు బర్రుమని సౌండ్ చేశాడు. మందు వల్ల ఆల్రెడీ వణుకుతున్నందు వల్ల ఇతని ప్రమేయమేమీ లేకుండానే అవి మెట్ల మీద అటు ఇటు దొర్లాయి.

తాము ఏమి పాడారో, వీడేం వాయించాడో నటులకు అర్థం కాలేదు. ప్రేక్షకులకు ఏవో గావు కేకలు, పెడబొబ్బలు వినిపించాయి. స్టేజ్ టు లో ఉన్న సాంబశివుడు ఎంత నికార్సయిన కళాకారుడంటే తన హార్మోనియంపై ఎవరో దాడి చేసి హింసిస్తున్నారని అతను నిద్రలోనే గ్రహించాడు. వస్త్రాపహరణం నాటకంలో ద్రౌపదిలాగా తన పెట్టె వేడుకుంటూ ఉందని కలలోనే తెలుసుకుని మేల్కొన్నాడు. లేచి చూస్తే రామదాసు సైకిల్ తొక్కినట్టు హార్మోనియాన్ని తొక్కుతున్నాడు. వేళ్లు దబేల్ దబేల్ మని బాదుతుంటే కొన్ని మెట్లు ముక్కలు చెక్కలై ఉన్నాయి. తబలాకి ఏం వాయించాలో తెలియక మౌనం వహించింది. సాంబశివుడు మూడో కన్ను తెరిచాడు.

 స్టేజి పైన స్తంభంలోంచి రావాల్సిన నరసింహస్వామి స్టేజి కింద నుంచి వచ్చాడు. ప్రమాదం గ్రహించిన రామదాసు, హార్మోనియంని గాలికొదిలి సేఫ్టీ కోసం స్టేజి ఎక్కాడు. పెద్ద దుడ్డుకర్ర తీసుకుని వెంటపడి కొండంత రాగం తీస్తున్న నటులకి కూడా సాంబశివుడు రెండు వడ్డించాడు. రామదాసు మాత్రం దొరకలేదు. డోస్‌లో ఉన్నా జోష్ తగ్గకుండా పారిపోయాడు.

ఇప్పుడు స్టేజి మీద ఆడే నాటకాలు తగ్గిపోయాయి. అవి జీవితాన్ని ఆక్రమించేశాయి. ఎవడికి వాడే మహా నటుడుగా మారిపోతున్నాడు. కొత్త నాటకాలకి తెరలు, రంగులు అక్కర్లేదు. ప్రాంప్టింగ్‌తో పని లేదు. డైలాగ్‌లు ఇన్‌స్టంట్‌గా తయారైపోతున్నాయి. నటుడు, ప్రేక్షకుడు ఒకే మనిషిలో కనిపించే ఆధునిక నాటకాలు ఇవి.
 
- జి.ఆర్. మహర్షి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement