కంకాళకేయుడి కథ | Humor plus | Sakshi
Sakshi News home page

కంకాళకేయుడి కథ

Published Wed, Aug 19 2015 11:20 PM | Last Updated on Thu, Dec 27 2018 4:27 PM

కంకాళకేయుడి కథ - Sakshi

కంకాళకేయుడి కథ

హ్యూమర్ ఫ్లస్
 
ఫ్లాష్‌బ్యాక్‌లు వినివిని మైండ్ బ్లాకయిపోయిన ఆజానుబాహుబలి రిలీఫ్ కోసం వంటల పోటీకి వెళ్లాడు. గాడి పొయ్యి అంటించి అగ్గిరాముడై వెలుగుతుండగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి ‘బాహుబలి’ అని గొణిగాడు. ఒళ్లంతా తారు పూసుకుని ఒక కంటికి గాజు కన్నుని ఎకస్రా ్టఫిట్టింగ్ చేసుకుని ఉన్నాడతను. అతని పక్కనున్న వ్యక్తి గంగాళంలోకి గరిటెకి బదులు చెయ్యిని పెట్టి కెవ్వున అరిచి ‘బాహుబలా?’ అన్నాడు. దాంతో అందరూ పూనకం పట్టినట్టు ‘బాహుబలి’ అని అరిచారు. ఇది చూసి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ప్రమాదముందని గ్రహించిన బలి పారిపోడానికి ప్రయత్నించాడు. గాజు కన్ను అడ్డుగా నిలబడ్డాడు.

 ‘‘తప్పేముంది స్టార్ట్ చెయ్యి’’ అన్నాడు బలి నిస్సహాయంగా. ‘‘నా పేరు కంకాళకేయుడు. కంటితో చూసిందేదీ నిజం కాదని గ్రహించిన నేను ఈ గాజుకన్నుతో లోకాన్ని చూస్తున్నాను. మీ నాన్న చేతిలో మానం పోయి నగ్నసత్యాన్ని తెలుసుకున్న కళావర్‌కేయుడు మా అన్న. అరటి ఆకులు కప్పుకుని ఎదుట నిలబడిన మా అన్నని చూసి ఏం జరిగిందని అడిగాను. ‘హరహర మహాదేవ సాంబశివగామి’ అని అరిచాడు. నేను జడుసుకుని ఆ శబ్దానికి అర్థమేమిటని అడిగాను. ఆమె ఒక స్త్రీమూర్తని, ఆమెతో ఏం మాట్లాడినా ప్రమాదమని చెప్పి, ప్రపంచంలో ఎవరికీ అర్థంకాని భాషలో ఆమెతో మాట్లాడితే బతికి బట్టకట్టొచ్చన్నాడు.

 దాంతో మా రాజ్యంలో నిఘంటువులు అమ్మేవాడిని పిలిచి ఎవరికీ అర్థం కాని భాష తయారు చేయమన్నాను. ఐదు నిముషాల్లో వాడు కిలకిల భాషని రెడీ చేశాడు. శాంపిల్‌గా ‘మిన్‌కిన్ డంకిన్, చెన్‌బన్ డమాడమాన్’ అని ఒక వాక్యం వదిలాడు. ఆకారాలను చూసి కాకుండా నకారాలను చూసి భయపడ్డం అదే మొదలు.
 యుద్ధానికి బయలుదేరాం. అనుకున్నట్టుగానే సాంబశివగామి చర్చలకు వచ్చింది.
 ‘‘లకలకన్, మకన్‌టెకన్, నిన్‌నన్‌కున్’’ అని అన్నాను. శివగామి చిరునవ్వు నవ్వి తమకు నమ్మకంగా ఉంటూ శత్రువులకి అతినమ్మకంగా రహస్యాలు చేరవేసే ఆఠీన్ జాకీని అనువాదకునిగా ప్రవేశపెట్టింది. వాడు తుండు గుడ్డని నోట్లో కుక్కుకుని ‘నా నోటితో చెప్పలేనమ్మగారూ’ అంటూ బోరున ఏడవసాగాడు. నేను తత్తరపడ్డాను.

 ‘‘మీ మీద వాడు మనసుపడ్డాడు అమ్మగారు’’ అని వాడు అనువాదం చేశాడు. నేను కోపంతో ‘‘చెత్తనా... (బీప్) నా లాంగ్వేజ్‌కి అర్థమే లేనపుడు ఎలా అనువాదం చేస్తావురా’’ అని బండబూతులు తిట్టాను. ‘‘మీ బాడీ లాంగ్వేజి ద్వారా అనువాదం చేశాను. ప్రపంచంలో అసలైన ప్రమాదం అనువాదమే. అనువాదకుడికి అర్థాలతో పనేలేదు. అసలు ఏ భాషా రాకుండా తెలుగులో పుస్తకాలే అనువాదం చేసినవాళ్లు ఎందరో వున్నారు తెలుసా’’ అన్నాడు జాకీ. వాడికి ఏ కీలుకాకీలు విరుద్దామనుకుంటూ ఉంటే శివగామి పళ్లునూరింది. కొడుకులు కత్తులు నూరారు. వాళ్ల వ్యూహాలన్నింటిని నేను చిత్తు చేస్తూ వుంటే శివగామి ‘గుర్రప్పా’ అని అరిచింది.

 గుర్రప్ప గుర్రంలా దబేలుమని దూకి అశ్వవ్యూహం అమలు చేశాడు. గుర్రం ఆకారంలో సైన్యం నిలబడి మమ్మల్ని వెనుక కాళ్లతో తన్నసాగింది. మా సైన్యంలో యుద్ధం చేసేవాళ్ల కంటే చూసేవాళ్లు ఎక్కువ ఉండడంతో తన్నులు తిని ఓడిపోయాం. అవమాన జ్వాలతో తిరిగి వెళ్లలేక ఇలా మంటముందు వంటవాడిగా మిగిలిపోయాను’’ అని కంకాళకేయుడు ముగించాడు. ఆజానుబాహుబలి కోపంతో ఊగిపోతూ ‘‘ప్రతివాడు ఫ్లాష్‌బ్యాక్‌లు చెప్పడమే కానీ ఇంతకూ మా నాన్న, వంటవాడు ఎలా అయ్యాడో చెప్పిచావండి’’ అని అరిచాడు. ‘‘అది మీ అమ్మ చారుసేన మాత్రమే చెప్పగలదు. పుట్టిన వెంటనే కేర్‌కేర్ మనకుండా చారుచారు మనడంతో ఆమెకాపేరు. డైమండ్ బళ్లాలుడి కోటలో ఉంది వెళ్లి అడుగు.’’ ‘‘ఎలా గుర్తుపట్టడం?’’ ‘‘కాలికి సంకెళ్లు వేసుకుని, ఎవరైతే కట్టెపుల్లలు ఏరి, పొయ్యిలో పెట్టి కాఫీ చేస్తూ ఉంటారో ఆమే చారుసేన.’’
 - జి.ఆర్.మహర్షి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement