తొడగొట్టకుండానే సవాల్‌! | Social Media Challenges That Went Viral In 2018 | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 29 2018 2:27 PM | Last Updated on Sat, Dec 29 2018 2:51 PM

Social Media Challenges That Went Viral In 2018 - Sakshi

మీసం మెలేసి, తొడగొట్టే సవాళ్లకు కాలం చెల్లింది. సామాజిక మాధ్యమాల్లో సవాల్‌ విసిరితే చాలు ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో సోషల్‌ మీడియా సవాళ్లు ఎక్కువైపోతున్నాయి. 2018లో సోషల్‌ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన చాలెంజ్‌లు వైరల్‌గా మారాయి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సవాళ్లు నెట్లింట్లో హల్‌చల్‌ చేశాయి. కొన్ని సవాళ్లు భయపెట్టగా, మరికొన్ని హాస్యాన్ని పంచాయి. సమాజానికి మేలు చేసే చాలెంజ్‌లు ప్రముఖులతో పాటు సామాన్యులను కదిలించాయి.

కీకీ చాలెంజ్‌
‘హట్‌లైన్‌ బ్లింగ్‌’ సింగర్‌ డ్రేక్‌ తన కొత్త పాట ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ను విడుదల సందర్భంగా ‘కికి చాలెంజ్‌’ను జనాల్లోకి వదిలారు. ఈ చాలెంజ్‌ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి లేదా వాహనంలోనే ఉండి ‘ఇన్‌ మై లైఫ్‌’ పాటకు అనుగుణంగా.. కదులుతున్న వాహహంతోపాటు వారు డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అయితే కింద పడకూడదు, మధ్యలో ఆగకూడదు. అలా చేస్తేనే చాలెంజ్‌ నెగ్గినట్లు. ఈ చాలెంజ్‌ ప్రమాదకరంగా పరిణమించడంతో చాలా రాష్ట్రాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల యువకులు మాత్రం తమదైనా శైలిలో కీకీ చాలెంజ్‌ను స్వీకరించి నవ్వులు పూయించారు.

నిమ్మకాయ సవాల్‌
క్యాన్సర్ బాధితులకు సహాయపడేందుకు సృష్టించిన ‘లెమన్‌ ఫేస్‌ ఛాలెంజ్‌’కు మంచి ఆదరణ లభించింది. డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్‌ ఆర్మీ’ ఈ సవాల్‌ను తెరపైకి తెచ్చింది. సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి. అప్పుడు ముఖంలో కలిగే హావభావాలను వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్‌ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు లేదా మిత్ర బృందంతో కలిసి ఛాలెంజ్‌ చేయవచ్చు. ఛాలెంజ్‌ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ అబ్రైగ్‌ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి.

ఫిట్‌గా ఉన్నారా?
భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర కీడా శాఖ మంత్రి, ఒలింపిక్‌ విజేత రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఫిట్‌ ఇండియా ఫిట్‌’  అనే చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఫిట్‌నెస్‌ కోసం చేసే కసరత్తులకు సంబంధించి వీడియో, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలంటూ ఆయన విసిరిన సవాల్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగిన వారందరు కూడా కసరత్తుల వీడియోలతో తెగ సందడి చేశారు.



మాస్టర్‌ బ్లాస్టర్‌ కూడా..
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు ఓ సవాల్‌ విసిరారు. ఈ చాలెంజ్ పేరు 'కిట్ అప్‌ చాలెంజ్'‌. ఈ చాలెంజ్‌ని స్వీకరించిన వారు తమకిష్టమైన ఆట ఆడుతూ దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేయాలి. తాను క్రికెట్ ఆడుతోన్న వీడియోను షేర్‌ చేయడంతోపాటు భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్‌, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లి పేర్లను ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ ట్యాగ్ చేశారు. సచిన్‌ సవాల్‌కు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు స్పందించారు.



మొక్కలు నాటే చాలెంజ్‌
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ఆరోగ్యకర వాతావరణానికి కృషి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణలో ‘గ్రీన్‌ చాలెంజ్‌’ పుట్టుకొచ్చింది. ఓ స్వచ్చంద సంస్థ విసిరిన ఈ సవాల్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ నుంచి సామాన్య ప్రజల వరకు పెద్ద సంఖ్యలో చాలెంజ్‌ను స్వీకరించి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సెలబ్రిటీలు కూడా ఒకరికొకరు సవాల్‌ విసురుకుంటూ పచ్చదనాన్ని పాదుకొల్పారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా మొక్కలు నాటి స్ఫూర్తి నింపారు.

మోమో.. వామ్మో!
గతేడాది బ్లూవేల్‌ చాలెంజ్‌ నెటిజన్లను భయపెడితే ఈ ఏడాది మోమో చాలెంజ్‌ ఆన్‌లైన్‌ ప్రియులను హడలెత్తించింది. అర్జెంటీనాలో 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అసలు ఈ మోమో అన్నది ఎక్కడ నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు.. దీని వెనక ఎవరున్నారన్న వివరాలు వెల్లడికాలేదు. గేమ్‌లో ముందుగా.. మోమోను కాంటాక్ట్‌ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్‌ ఇచ్చి.. మెసేజ్‌ పంపుతూ చాట్‌ చేయాలంటూ చాలెంజ్‌ విసురుతారు. మనం పంపితే.. భయానక చిత్రాలు.. హింసాత్మక సందేశాలు వస్తాయి. పలు పనులు పూర్తి చేయాలంటూ వరుసగా సవాళ్లు వస్తాయి. స్వీయ హాని చేసుకునేలా ఇవి ప్రోత్సహిస్తుంటాయి. చాలెంజ్‌ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు కూడా వచ్చాయి.

‘వెల్త్‌ ఫ్లాంటింగ్‌ చాలెంజ్‌’
వెల్త్‌ ఫ్లాంటింగ్‌ చాలెంజ్‌ తీసుకున్న వ్యక్తులు తమ నిజ జీవితంలో వేటినైయితే అత్యంత భద్రంగా చూసుకుంటారో.. వేటిని ఎక్కువగా ప్రేమిస్తారో.. ఇంకో రకంగా చెప్పాలంటే తమ సంపదగా భావించే వాటిని రోడ్డు మీద పడేయ్యాలి. క్రెడిట్‌ కార్డ్స్‌, డబ్బు, జ్యూవెలరి, డిజైనర్‌ బట్టలు, చెప్పులు, బ్యాగ్‌లు, వృత్తికి సంబంధించినవి, వస్తువులు, జంతువులు, మనషులతో సహా. వాటిని రోడ్డు మీద పడేయాలి. తర్వాత కార్‌ నుంచి బయటకు వచ్చి పడేసిన వాటి మధ్య పడుకోని ఫోటో దిగాలి. ఏదో ఫోటోషూట్‌కి ఫోజ్‌ ఇస్తున్నట్లు కాకుండా.. స్పృహతప్పి కింద పడిపోయినట్లు పేవ్‌మెంట్‌ వైపుగా ముఖం పెట్టి పడిపోవాలి. తర్వాత ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలి.

లిప్‌ సింక్‌ బాటిల్‌ చాలెంజ్‌, వ్యాట్‌ ది ఫ్లఫ్‌ చాలెంజ్‌, ఇన్‌విజిబుల్‌ చాలెంజ్‌, ది డెలె అలీ హ్యాండ్‌ చాలెంజ్‌, ది నెయ్‌మార్‌ చాలెంజ్‌, స్నూట్‌ సవాళ్లు కూడా సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. వీటిలో ఒకట్రెండు మినహా మిగతావన్నీ యూజర్లకు హాస్యాన్ని పంచాయి. సమాజ హితానికి తోడ్పడే సవాళ్లు ఎన్ని విసిరినా ఫర్వాలేదు గానీ ప్రాణాలతో చెలగాటమాడే చాలెంజ్‌లు మాత్రం వద్దని నెటిజన్లు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో మేలు చేసే సోషల్‌ మీడియా సవాళ్లు వైరల్‌ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement