ఆధునిక సమాజంలో సమాచార రంగంలో మహత్తర విప్లవానికి కారణమైన సోషల్ మీడియా 2018లో ఎన్నో సరికొత్త సంచలనాలకు కేంద్రంగా మారింది. మొబైల్ ఇంటర్‌నెట్ సేవలు గణనీయంగా పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం విస్తృతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సమాచారం చేరవేయడంలో, ప్రజల మధ్య సమాచారం అందించుకోవడంలో సోషల్ మీడియా వహిస్తున్న పాత్ర విశేషంగా పెరిగింది. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్టు, 2018లో ఎన్నో ఉద్యమాలకు పురుడుపోసిన సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తల ప్రచారంతో అపకీర్తిని మూటకట్టుకున్నాయి.
తమ కంటికి తప్పనిపించిందో ఫేస్‌బుక్ సీఈఓ అయినా సరే డేటా చోరి వంటి ఘటనలపై నెటిజనులు నిప్పులు చెరిగారు. సీఎం స్థానాల్లో ఉండి నోరుజారినా, రెండు నాల్కల ధోరణిలను ప్రదర్శించినా సరే ఓ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్‌చేసి వారి నోరు మూయించారు. ఎక్కడో సిరియాలో తుపాకుల తూటాల నడుమ బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలకు నెటిజన్లు చలించారు. జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం వంటి ఘటనలను నెటిజన్లు తమ క్రియేటివిటీ జోడించి ఓ ఆట ఆడుకున్నారు. ఓరకంట చూస్తూ ఒక్క ఫ్లయింగ్ కిస్ ఇస్తే చాలు, ఓవర్ నైట్ స్టార్‌నే చేసేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా సమస్య అయినా, సంఘటనైనా తమకు మంచి అనిపిస్తే పొగడటం, తేడా అనిపిస్తే కడిగిపాడేయడమే అంటూ మూడు కామెంట్లు ఆరు లైకులు అన్నచందంగా నెటిజన్లకు గత ఏడాది గడిచిపోయింది. 2018 ఏడాదిలో సోషల్‌మీడియాలో వైరల్ అయినవి..
జనవరి
1) ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు!
అప్పటివరకూ ఆడుతుపాడుతున్న ఓ చిన్నారి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఓ వ్యక్తి వెంటనే స్పందించి సినిమా సీన్ తరహాలో ఆ బాలికను కాపాడి హీరో అయ్యారు. చైనాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
2) ఎఫ్‌బీలో చూసి ఆ పిచ్చిపని చేశా.. వైరల్
జమ్మూకశ్మీర్‌కు చెందిన మెడిసిన్ విద్యార్థి చేసిన డేరింగ్ ఫీట్‌పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. రైలు పట్టాలపై పడుకుని రైలు వెళ్తుండగా స్నేహితుడితో ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
3)వాట్సప్ క్రాష్ ; న్యూఇయర్ విషెష్ వెల్లువెత్తడంతో..
ప్రఖ్యాత మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సప్ క్రాష్‌డౌన్ కావడంతో 2018 ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలంరేగింది. ఊహకు అందని రీతిలో న్యూఇయర్ విషెస్ వెల్లువత్తడంతో ఏర్పడిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
4)కిరాక్ డాన్స్‌తో కేక పుట్టించిన మాజీ ఎంపీ
వరంగల్ క్లబ్‌లో జరిగిన న్యూఇయర్ వేడుకలో పాల్గొన్న రాజయ్య.. సన్నిహితులతో కలిసి సరదాగా డాన్స్‌చేశారు. రాజయ్య చేసిన కిరాక్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది.
5)నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు.. ప్రదీప్ వైరల్ వీడియో
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్.. తాను తప్పుచేసినట్లు అంగీకరించి, ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
6)పెళ్లికొడుకు వెక్కివెక్కి ఏడుపు.. ఎందుకంటే..
బిహార్‌లో సరదాగా పెళ్లికి వెళ్లి తిరుగు పయనమైన ఓ యువకుడు పెళ్లికొడుగ్గా మారాల్సి వచ్చింది. బోరుమని ఏడుస్తూ తన పక్కన తెలిసిన వారే లేకుండా తనపైకి ఎక్కుపెట్టిన తుపాకీని చూస్తూ తాళికట్టాల్సి వచ్చింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
7)చంద్రబాబు బండారం బయటపెట్టిన వెంకటాచలం
సొంత కంపెనీ హెరిటేజ్ బాగు కోసం చంద్రబాబు వేలాదిమంది రైతుల పొట్టకొట్టాడని స్థానిక ఉద్యమకారుడు వెంకటాచలం నిప్పులు చెరిగిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.
8)సెల్ఫీ పోజు.. అతనికేం కాలేదంట!
వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించి.. ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్టు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే, ఈ ఘటనలో అతనికేం పెద్దగా గాయాలు కాలేదని, అతను బాగానే ఉన్నాడంటూ ఆ తర్వాత తెలిసింది.
ఫిబ్రవరి
1)ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్
గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురిశాయి. మంత్రి కేటీఆర్ వారికి ట్వీటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
2)యువభారత్‌పై ప్రశంసల జల్లు
అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువభారత్‌పై ప్రశంసల జల్లు కురిసింది. దేశం గర్వించదగ్గ సమయమిదని రాజకీయ ప్రముఖుల, క్రికెటర్లు, సినీతారాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తారు.
3)తన పెళ్లిలో కూడా డ్యూటీ చేసిన జర్నలిస్టు
పెళ్లిరోజు సైతం సెలవుపెట్టకుండా ఓ పాకిస్థాన్ జర్నలిస్టు ఉద్యోగం చేశాడు. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా బ్రేకింగ్ న్యూస్ అంటూ పెళ్లికొడుకు కాస్త రిపోర్టర్ అవతారమెత్తాడు. సిటీ 41 చానెల్‌లో పనిచేసే హనాన్ బుకారీ తన పెళ్లినే రిపోర్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు.
4)గోవా సీఎం వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం!
అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని గోవా సీఎం మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమయింది. పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ, పారికర్ వ్యాఖ్యలకు నిరసనగా బీరు తాగే ఫొటోలను పోస్ట్ చేశారు.
5) అబ్బాయిల గుండెల్ని పేల్చేసింది!
‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాలోని ఓ వీడియో సాంగ్ విడుదలై సెన్షన్ క్రియేట్ చేసింది. ఒక్క వీడియోతో ప్రియాప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్ నేషనల్ స్టార్ అయిపోయింది. ఒక ఫ్లయింగ్ కిస్‌ని గన్‌లా మార్చి తూటాలా పేల్చితే.. అది తగిలి ఆమె లవర్ విలవిలలాడుతాడు. నిజానికి ఆమె విసిరిన ఫ్లయింగ్ కిస్‌కు అబ్బాయిల గుండెలు పేలిపోయాయంటూ నెటిజన్లు స్పందించారు.
6)మంత్రివర్యా.. నీకిది తగునా?
స్వచ్ఛ భారత్ కోసం మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్‘స్వచ్చ్ భారత్ అభియాన్’కింద మంచి ర్యాంక్‌ను కొట్టేయాలని చూస్తూంటే.. రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
7)బాత్‌టబ్‌లో రిపోర్టర్.. నెటిజన్ల విస్మయం!
శ్రీదేవి ఆకస్మిక మృతి విషయంలో న్యూస్ చానెళ్లు జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం, బాత్‌టబ్‌లోకి కూరుకుపోయి మరీ కథనాలు ప్రసారం చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు.
8)ఆ చిన్నారుల కోసం తల్లడిల్లుతున్న సోషల్ మీడియా!
సిరియాలో తుపాకుల తూటాల నడుమ, విస్ఫోటన శిథిలాలలో నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలించాయి. యుద్ధక్షేత్రంగా మారిన సిరియాలో అమాయక బాల్యం ఎలా నరకం అనుభవిస్తుందో.. ఎలా నిత్యం రకప్తుటేరుల మధ్య నలిగిపోతుందో చాటుతున్న ఫొటోలు నెటిజన్లను కంటతడి పెట్టించాయి.
9)కాంగ్రెస్ సంతాప ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్
నటి శ్రీదేవి(54) హఠాన్మరణం భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ‘యూపీఏ హయాంలో పద్మశ్రీ అవార్డు’ అని ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.
10) లైవ్‌లోనే న్యూస్ రీడర్ల మధ్య వాగ్వాదం
పాకిస్థాన్‌లో లైవ్‌లోనే ఇద్దరు న్యూస్ రీడర్లు వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి నెట్‌లో జోరుగా చక్కర్లు కొట్టింది. ‘ఈమెతో నేనేలా బులిటెన్ చదవాలి?’ అంటూ యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోను తెగ వైరల్ అయింది.
11)శోకాన్ని దిగమింగుకొని భర్త అంత్యక్రియలకు..
ఓ మహిళా ఆర్మీ అధికారి శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మార్చి
1) వీర్యంతో దాడులా?.. ఛాన్సే లేదు
హోలి వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే అదసలు సాధ్యమయ్యే పనే కాదంటూ నెటిజన్లు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
2)నిన్నటి వరకు గొప్ప కవి.. నేడు వేశ్యనా?
సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై మలయాళ మోడల్ గిలు జోసెఫ్ ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు గొప్ప కవి అని కొనియాడినవారే ఇప్పడు వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మీ’ఓ సంచికను విడుదల చేసిన విషయం తెలిసిందే.
3) అందుకే దూరంగా ఉన్నా: యాంకర్ అనసూయ
‘రంగస్థలం’ సినిమా విడుదల అనంతరం సోషల్ మీడియాలోకి వస్తానని బుల్లితెర యాంకర్ అనసూయ స్పష్టం చేశారు. సెల్ఫీ అడిగిన ఓ బాలుడి మొబైల్ పగలగొట్టడంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు కొంత కాలం దూరంగా ఉన్నారు.
4)అద్వానీని అవమానించిన మోదీ! వైరల్ వీడియో
త్రిపురలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ వీడియో వైరల్ అయింది. అద్వానీ చేతులు దండం పెడుతూనే ఉన్నా.. మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో‘గురువును విస్మరించిన శిశ్యుడు..’,, ‘అద్వానీని అవమానించిన మోదీ..’ , ‘పెద్దాయనను చూస్తే జాలేస్తోంది..’ అంటూ ఈ వీడియోకు నెటిజన్లు రకరకాల భాష్యాలు జోడించారు.
5)‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌కు తలొగ్గిన బీసీసీఐ
‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌తో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు చేసిన ఉద్యమానికి బీసీసీఐ దిగొచ్చింది. ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్ కోసం పాడుచేయడం ఏమిటని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ వేదికను మార్చారు.
6) స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా!
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా ( బ్రెయిన్ ఫేడ్) అంటూ గత భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ వివాదాన్ని గుర్తు చేస్తున్నారు.
ఏప్రిల్
1) ఫేస్‌బుక్ సీఈఓపై జోకులే జోకులు..
డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు జవాబులు చెప్పడం చాలా కష్టమైంది. 44 మంది సెనేటర్లు దాదాపు 5 గంటలకు పైగా జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎదురైన పరిణామాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనూహ్యంగా స్పందించారు.
2) రైలింజన్ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్!
కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, కరెంట్ షాక్ తగిలి, మంటలు అంటుకున్నాయి.
3)తివారి బౌలింగ్ యాక్షన్‌పై జోకులే జోకులు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా కొత్త అవతారమెత్తాడు.. కింగ్స్‌పంజాబ్ ఆటగాడు మనోజ్ తివారి. యువరాజ్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వినూత్న శైలితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం తివారి బౌలింగ్ యాక్షన్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చారు.
మే
1) నువ్వు ఆగు మిత్రమా.. నేను వెళతాను..!!
బాహుబలి-ది కంక్లూజన్ పార్ట్‌కు చైనీయులు ఫిదా అయిపోయారు. హీరో ప్రభాస్‌ను ఏకంగా హాలీవుడ్ స్టార్స్‌తో పోల్చుతూ ఓ చైనీయుడు చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బ్లాక్ పాంథర్‌ను కలిసిన ప్రభాస్.. తాను ముందు వెళ్తానని ఆపుతున్నట్లు, శత్రువును చీల్చిచెండాటానికి వెళ్తున్న ఎవెంజర్స్ సీరియస్‌గా చూస్తుంటే.. ప్రభాస్ మాత్రం చిరునవ్వుతో శత్రువును చూస్తున్నట్లు ఫొటోషాప్ చేసిన ఫొటోలు ఆకట్టుకున్నాయి.
2) చంద్రబాబు డబుల్ గేమ్ : నాడు అలా.. నేడు ఇలా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణి మరోమారు బయటపడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో ఉన్నప్పుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడిన చంద్రబాబు.. తిరిగి నోట్ల రద్దు వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అందుకు మోదీనే కారణమని ఆరోపించారు. బాబు రెండు నాల్కల ధోరణిపై నెటిజన్లు మండిపడ్డారు.
3)మీరు ఫిట్‌గా ఉన్నారా? చాలెంజ్
‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’అనే చాలెంజ్‌కు కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌లకు సవాల్ విసిరారు.
జూన్
1) అంకుల్... ఇరగదీశావ్ పో!
40 ఏళ్లకు పైబడిన ఓ ఇండియన్ అంకుల్ డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ‘ఆప్ కే ఆ జానే సే...’ పాటలో గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పించారు.
2) తెలుగుకు తెగులు పట్టించిన లోకేష్
తన సహజ ధోరణితో మంత్రి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. కాకినాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో తెలుగు భాషకు తెగులు పట్టించారు. తెలుగును సరిగ్గా ఉచ్ఛరించలేక పలుమార్లు అర్థ రహితంగా మాట్లాడారు. దీంతో సభలో ఉన్న మహిళలు లోకేష్ ప్రసంగిస్తుండగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
3) వామ్మో.. వరుసబెట్టి హగ్ ఇచ్చిన యువతి.!
రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి లక్నోలోని ఓ షాపింగ్ మాల్ దగ్గర యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో యువతి హగ్ కోసం యువకులు పోటీ పడ్డారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
4) ఎక్కడికి పోతారు సార్?
తమిళనాడులో తాము ఎంతగానో అభిమానించే ఉపాధ్యాయుడు ట్రాన్స్‌ఫర్‌పై మరో చోటకు బదిలీపై వెళుతుండగా, మిమల్ని వెళ్లనివ్వం సార్.. అంటూ విద్యార్థులు ఏడుపు అందుకున్నారు. అంతే వారిని చూసి అతను కూడా ఏడవటం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియా ఛానెళ్లలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో అధికారుల్లో కూడా కదలిక వచ్చింది.
జూలై
1) ట్రైలర్‌కు బదులుగా ఫుల్ మూవీ అప్‌లోడ్..
రెడ్ బ్యాండ్ మూవీ ట్రైలర్ లింక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉండగా.. జాన్ మథ్యూస్ దర్శకత్వం వహించిన ‘ఖాళీ ద కిల్లర్’ మూవీ లింక్‌ను సోని సంస్థ పొరపాటున షేర్ చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్‌నెట్‌లో మూవీని చూసిన ఉత్సాహంలో కొందరు సోనీ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.
2) ఒక్క ట్వీట్‌తో 26 మంది బాలికలకు విముక్తి
సోషల్ మీడియా పుణ్యమా అని 26 మంది మైనర్ బాలికలు అక్రమ రవాణా ముఠా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మజఫర్ నగర్-బాంద్రాల మధ్య నడిచే అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌పై స్పందించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ భద్రతా దళాలు సత్వరం రంగంలోకి దిగి బాలికలను రక్షించాయి.
3) తప్పు నాదే.. మన్నించండి
ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో 12 మంది సభ్యులున్న ఫుట్‌బాల్ టీమ్.. థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లి, ఒక్కసారిగా భారీ వర్షాలు కురియటంతో వారంతా లోపలే ఇరుక్కుపోయారు. అయితే చిమ్మచీకట్లో వారందరినీ కంటికి రెప్పలా వాళ్లను కాపాడిన కోచ్.. ఓ భావోద్వేగమైన సందేశాన్ని ప్రపంచానికి విడుదల చేయడంతో అది వైరల్ అయింది.
4) యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్
ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ అధికారి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముందు యూనిఫాంలో మోకరిల్లిన సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్‌లైన్‌లో సీఐను ట్రోల్ చేశారు.
5) ఆధార్ నంబర్ ట్వీట్ చేసి.. చాలెంజ్ !
ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తన ఆధార్ నంబర్‌ను ట్వీట్ చేసి.. సవాల్ విసిరారు. 12 అంకెల తన ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఎలా తనకు హాని చేయగలరో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. అయితే, శర్మ ట్వీట్ చేసిన ఆధార్ నెంబర్ ఆధారంగా ఆయన ఇంటి చిరునామా, జన్మదినం, ఫోన్ నంబర్, పాన్ నెంబర్ తదితర వివరాలు రాబట్టినట్టు పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తుండటం కొసమెరుపు.
ఆగష్టు
1) పంద్రాగస్టు: కోహ్లి సరికొత్త చాలెంజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha చాలెంజ్‌ను తీసుకొచ్చాడు.
2) అనుష్కశర్మపై కుళ్లు జోకులు!
వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘సూయి ధాగా’. చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఓ సన్నివేశంలో అనుష్కశర్మ భావోద్వేగానికి లోనైన ఫొటోకు నెటిజన్లు క్యాప్షన్లు జతచేసిన ఫోటోలు తెగవైరల్ అయ్యాయి.
3) వైరల్ వీడియో : హ్యాట్సాప్ ఇండియన్ ఆర్మీ
భారీ వర్షాలతో అతలాకుతలమయిన కేరళలో భారత ఆర్మీ అందించిన సేవలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. గర్బిణీ, దివ్యాంగుడు, బాలుడు ఇలా చాలామందిని హెలికాప్టర్ సహాయంతో కాపాడిని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
4) హరికృష్ణతో సెల్ఫీ.. నెటిజన్ల ఫైర్
సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎప్పుడు, ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తించారు. నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోశారు.
5) కీకీ ఛాలెంజ్.. అవార్డు మనోళ్లదే
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కీకీ ఛాలెంజ్‌కు తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన యువకులు దేశీ టచ్ ఇచ్చారు. ఒక్కసారిగా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
సెప్టెంబర్
1)వైరల్‌గా సమంత ‘కర్మ థీమ్’ చాలెంజ్
నటి సమంత సరికొత్త చాలెంజ్‌ను పరిచయం చేశారు. ‘యూటర్న్’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ రూపొందించిన కర్మ థీమ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన సమంత #యూటర్న్‌డాన్స్‌చాలెంజ్ పేరిట సవాల్ విసిరారు.
2) ఫేస్‌బుక్ వేదికగా అమృత పోరాటం
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి న్యాయం కోసం తన పోరాటాన్ని సోషల్‌మీడియాలో ప్రారంభించారు. అమృత ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించి తొలి అడుగేసింది.
3) స్వలింగ సంపర్కం నేరం కాదు
రాజ్యాంగంలోని సెక్షన్ 377 పౌరుల సమానత్వ, గౌరవ హక్కులను ఉల్లంఘిస్తున్నదని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది. వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సోషల్‌మీడియాలో ఎల్‌జీబీటీక్యూ వర్గానికి అభినందనలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో #Section377Verdict ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌గా నిలిచింది.
అక్టోబర్
1) బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు
బిగ్‌బాస్ సీజన్-2 తెలుగు టైటిల్‌ను కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది.
2) సీఎం రమేశ్ రాజభవనం చూశారా?
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్‌లో తన నివాసానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. రమేష్ నివాసంలోని అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న హోంథియేటర్, స్విమ్మింగ్‌పూల్, డైనింగ్ టేబుల్, బెడ్ రూం ఫొటోలు వైరల్ అయ్యాయి.
3) ఓటుకు నోట్లు ఇంగ్లీష్ రిపీట్
మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్.. లాంటి పదాలు వినగానే గుర్తొచ్చే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఇంగ్లీష్‌లో ప్రసంగించారు. చంద్రబాబు ఇంగ్లీష్‌పైనే కాకుండా వాయిస్‌పైన సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపించారు. ఓటుకు నోట్లు కేసు తాలుకూ ఇంగ్లీష్ మళ్లీ రిపీటైంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకున్నారు.
4) మావోల దాడి: డీడీ ఉద్యోగి సెల్ఫీ వీడియో
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తన తల్లిని ఉద్దేశించి లైట్ అసిస్టెంట్ మొర్ముక్త్ శర్మ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నవంబర్
1) డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు!
భారత్, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో సమన్వయ లోపంతో హోప్ అవుటయ్యాడు. అయితే హెట్‌మైర్, హై హోప్‌లు పరుగు కోసం ఒకేవైపు పరుగెత్తడంతో డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు’అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2) ఈ ఎయిర్ హోస్టెస్‌కు సోషల్ మీడియా సలాం!
ఆకలితో గుక్కపట్టిన ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్ హోస్టెస్. దీంతో ఎవ్వరికీ తెలియని ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
3) ఐర్లాండ్‌లో అండర్‌వేర్ ఉద్యమం.!
అండర్‌వేర్ ఉద్యమం ఐర్లాండ్‌ను కుదిపేసింది. ThisIsNotConsent... అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆ దేశ మహిళలు అండర్‌వేర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ 17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని నిలదీశారు.
4) బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్!
ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ బాలయ్య మాత్రం అన్న మరణంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడట.. ఇది ఆయన నోట నుంచి వచ్చిన మాటే. ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేసింది.
5) బుల్లెట్లు దించినవాడి కడుపులో తలపెడతావా?
ఒకప్పుడు విప్లవ రాజకీయాలతో మమేకమై.. తన ఆటాపాటతో చైతన్యం తీసుకొచ్చి.. ప్రజాయుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. ఇటీవల పంథా మార్చుకున్నారు. ఒకప్పుడు తన కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబునాయుడు కడుపులోనే గద్దర్ తాజాగా తలపెట్టడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.
డిసెంబర్
1) వాట్సాప్‌లో ఎన్నికల లొల్లి!
తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో వాట్సాప్ గ్రూప్‌లు దద్దరిల్లాయి.
2) వైరల్: బుల్‌బుల్ బాలయ్య..!
మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహించిన నందమూరి బాలకృష్ణ మరోసారి నవ్వుల పాలయ్యారు. హిందీలో మాట్లాడాలని ప్రయత్నించి.. సారేజహాసె అచ్చా పాటను ఖూనీ చేయడంతో..బుల్‌బుల్ బాలయ్య అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందించారు.
3) మస్తానమ్మకు గుడ్ బై: వీడియో వైరల్
ఇంటర్నెట్ సంచలనం కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ (107) ఇక లేరన్న వార్త ఆమె అభిమానులను బాధించింది. కంట్రీఫుడ్స్ వెబ్‌సైట్‌లో గతంలో పోస్ట్ చేసిన ‘ది స్టోరీ ఆఫ్ గ్రాండ్‌మా ’ వీడియో వైరల్‌గా మారింది. మస్తానమ్మ జీవిత ప్రస్తానంలోని సాధక బాధకాలను ఈ వీడియోలో పొందుపర్చారు.
4) వైరలవుతున్న వజ్రాల విమానం..!?
ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి నెటిజన్లలో ఒకటే అనుమానం.. ‘ఇది నిజమేనా’.. ‘ఇంత ఖరీదైన విమానమా’.. ‘ఎంత ఖర్చు చేశారు’ అనే ప్రశ్నలు క్యూ కట్టాయి.
5)బండ్ల గణేశా.. ఎక్కడా?
బండ్ల గణేశ్‌పై సోషల్‌మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలాయి. తెలంగాణ ఎన్నికల ముందు నుంచి టీవీ చానెళ్లలో హడావుడి చేస్తూ అందరిదృష్టిని ఆకర్షించిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఇప్పుడు కనబడటం లేదంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
6) వైరల్: చంద్రుడు ఐయామ్ కమింగ్
‘‘ఔర్ మిష్టర్ చంద్రుడూ.. నీ గురించి మరిచిపోయా.. చంద్రుడూ ఐయామ్ కమింగ్ టూ ఆంధ్రప్రదేశ్.. సిద్దంగా ఉండూ’’ అంటూ సినిమాటిక్ స్టైల్‌లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన డైలాగ్ నెట్టింట హల్‌చల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment