సంచలనాలు, వివాదాలు.. కోలీవుడ్‌ 2018 | Kollywood Tamil Cinema FlashBack 2018 | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 30 2018 7:23 AM | Last Updated on Sun, Dec 30 2018 7:25 AM

Kollywood Tamil Cinema FlashBack 2018 - Sakshi

సందేశాలు, సాంకేతిక అంశాలు పక్కన పెడితే.. క్షణం తీరికలేని దినచర్యలతో ఉక్కిరిబిక్కిరయ్యే సగటు మనిషి కాస్త స్వాంతన కోసం వచ్చేది సినిమాకే. వారికి రెండు గంటల పాటు ఆహ్లాదాన్ని అందించడమే సినిమా ప్రధాన లక్ష్యం. అందులో ఎంత వరకు చిత్ర పరిశ్రమ సక్సెస్‌ అయ్యిందన్నది ప్రశ్నార్థకమే. ఈ ఏడాది కోలీవుడ్‌ మనుగడ కూడా అలాగే గడిచిపోయింది.

కోలీవుడ్‌ చిత్రపరిశ్రమ 2018లో జీఎస్టీ పన్ను విధానం, చిత్ర పరిశ్రమ సమ్మె వంటి సంఘటనలను ఎదుర్కొంది. దాదాపు 170 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది విజయాల శాతం కొంచెం (10 శాతం) ఎక్కువే అన్నది సంతోషించాల్సిన విషయం. పెద్దా, చిన్న చిత్రాల్లో విజయాలపై అంచనాలు పెట్టుకున్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. ఇక కొన్ని చిత్రాలయితే పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి రాబట్టలేకపోయాయి.  దెయ్యం ఇతివృత్తాలతో హర్రర్, థ్రిల్లర్‌ కథా చిత్రాలు వెల్లువెత్తాయి. తక్కువ ఖర్చు, అధిక లాభార్జన కారణం. చిత్ర జయాపజయాల విశ్లేషణ గురించి ప్రముఖ పంపిణీదారుడు తిరుపూర్‌ సుబ్రమణియం మాట్లాతూ ఈ ఏడాది భారీ బడ్జెట్, చిన్న బడ్జెట్‌ చిత్రాలన్ని కలిసి 170 విడుదలైనా విజయాల సంఖ్య తక్కువేనన్నారు. కొన్ని చిత్రాలైతే నిర్మాణ వ్యయాన్ని సైతం రాబట్టలేక నష్టాలనే మిగిల్చాయన్నారు.

చెన్నైలో ‘2.ఓ’దే అగ్రస్థానం
ఈ ఏడాది అధిక చిత్రాలు విడుదలైనా, చాలా తక్కువ చిత్రాలే లాభాలను తెచ్చిపెట్టాయని చెప్పారు. తమిళనాడు వ్యాప్తంగా చూసుకుంటే విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రమే అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే చెన్నై వరకూ అగ్రస్థానం రజనీకాంత్‌ నటించిన 2.ఓ చిత్రానిదే.  ఇక ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో 2.ఓ చిత్రమే సత్తా చాటుకుంది. ఇక నటుడు కార్తీ నటించిన కడైకుట్టి సింగం వసూళ్ల సాధనలో మూడోస్థానంలో నిలిచింది. విశాల్‌ నటించిన ఇరుంబుతిరై, విజయ్‌సేతుపతి నటించిన 96, నయనతార నటించిన కోలమావు కోకిల, ఇమైకా నోడిగళ్‌ వంటి చిత్రాలు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. చిన్న చిత్రాల్లో అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం రాక్షసన్‌. ఇకపోతే సక్సెస్‌ అనిపించుకున్న చిత్రాల్లో గులేబకావళి, ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్, నాచియార్, కాట్రిన్‌ మొళి, స్కెచ్, కలగలప్పు 2, ఒరు కుప్పకథై, కాలా, టిక్‌ టిక్‌ టిక్, ప్యార్‌ ప్రేమ కాదల్, యూటర్న్, వడచెన్నై, మారి–2  వంటి చిత్రాలు ఉన్నాయి. సూపర్‌స్టార్‌ నటించిన కాలా, కమల్‌హాసన్‌ నటించిన విశ్వరూపం– 2 వంటివి అంచనాలు అందుకోలేకపోయాయి.

సంచలనాలు, వివాదాలు
పలు సంచలనాలకు, వివాదాలకు ఈ ఏడాది నిలయం అయ్యిందనే చెప్పాలి. ఏడాది ఆరంభంలోనే జనవరి 15న గీత రచయిత వైరముత్తు ఆండాళ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. వైరముత్తుపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక సంచలన నటి అమలాపాల్‌ ఖరీదైన కారును కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్‌ చేసి వివాదాల్లో చిక్కుకుంది. జనవరి 28న ఈ వ్యవహారంలో కొచ్చిలో ఆమె అరెస్ట్‌ అయి తరువాత విడుదలైంది. అదే నెల 31న ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కింది.

గాయని చిన్మయి గీత రయియిత వైరముత్తు, నటుడు రాధారవిలపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు వివాదంగా మారాయి. ఇక నటి శ్రీరెడ్డి దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, నటుడు రాఘవ లారెన్స్‌ వంటివారిపై కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కమల్‌హాసన్‌ ఫిబ్రవరి 21న మక్కళ్‌ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. డిజిటల్‌ సంస్థలు అధిక ధరలను వసూలు చేయడాన్ని ఖండిస్తూ నిర్మాతల మండలి  47 రోజుల పాటు సమ్మె చేయడంతో చిత్ర షూటింగ్‌లు రద్దు  కొత్త చిత్రాల విడుదలను నిలిపేశారు.

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహ్మాన్‌ ఏప్రిల్‌ 13న శ్రీదేవి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. జూలై 15న పైయనూర్‌లో ఫెఫ్సీ ఆధ్వర్యంలో స్టూడియోనే ప్రారంభించారు. ఆగస్ట్‌ 29న విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని ప్రారంభించారు. అక్టోబర్‌ 20న నటుడు అర్జున్‌ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ నటి శ్రుతీహరిహరన్‌ ఆరోపణలు చేసింది.

రాజకీయ దుమారం
నవంబర్‌ 8న నటుడు విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రంలో ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను విమర్శించారంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గజ తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీలోకం తరలి వచ్చింది. ఇక సర్కార్‌ చిత్ర వ్యవహారంలో దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ క్షమాపణ చెప్పాలంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెన్నై హైకోర్టులో వాదనలు వినిపించారు. అందుకు ససేమిరా అన్న ఏఆర్‌ మురుగదాస్‌ కేసును ఎదుర్కొంటానని మరు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అధిక చిత్రాల హీరో
ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా విజయ్‌సేతుపతి నిలిచారు. జీవీ.ప్రకాశ్, ప్రభుదేవా, కార్తీక్‌ గౌతమ్,విక్రమ్‌ప్రభు,విక్రాంత్‌ ఉన్నారు.  రజనీ కాంత్, విక్రమ్, విశాల్, ధనుష్, జయంరవి, విష్ణువిశాల్, అధర్వ, అరవిందస్వామి రెండు చిత్రాలే చేశారు. కమల్, సూర్య, విజయ్, శివకార్తి్తకేయన్, కార్తీ, శింబు, జీవా ఒక్క చిత్రంతోనే సరి పెట్టుకున్నారు.

హీరోయిన్లలో కీర్తీదే అధిక్యం
హీరోయిన్లలో ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన రికార్డు యువనటి కీర్తీసురేశ్‌దే. ఈ బ్యూటీ ఏకంగా 5 చిత్రాల్లో నటించింది. వీటిలో మహానటి(నడిగైయార్‌ తిలగం) చిత్రం కీర్తీ సినీ కెరీర్‌లో గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇక నటి ఐశ్వర్యరాజేశ్, వరలక్ష్మీశరత్‌కుమార్‌ కూడా తలా ఐదు చిత్రాల్లో నటించారు. నటి సమంత, సాయిషా, జ్యోతిక 3 చిత్రాలు చేశారు. అగ్రనటి నయనతార, త్రిష, హన్సిక, అమలాపాల్, సాయిపల్లవి రెండేసి చిత్రాల్లో నటించారు. తమన్నా, అంజలి ఒక్కో చిత్రానికే పరిమితం అయ్యారు. కాగా నటి త్రిషకు ‘96’చిత్రం అనూహ్య విజయాన్ని అందించింది. అదే విధంగా సూపర్‌స్టార్‌తో నటించాలనే తన చిరకాల కోరిక ఏడాది ‘పేట’చిత్రంతో నెరవేరింది. 2018 త్రిషకు మరచిపోలేని అనుభవాన్ని మిగిల్చింది.

దివికేగిన తారలు
ఇక విషాద కరమైన సంఘటన ఆగస్ట్‌ 7న డీఎంకే అధినేత, సినీ రచయిత కరుణానిధి తుదిశ్వాస విడిచారు. నిర్మాత పట్టియల్‌ శేఖర్, నటుడు దేసింగురాజా, కొల్లం అజిత్, హాస్య నటుడు నీలు, సిలోన్‌ మనోహర్, నటి శ్రీదేవి, కృష్ణకుమారి, ఎడిటర్‌ పీఎస్‌.నాగరాజ్, ఎడిటర్‌ అనిల్‌మల్నాడ్, ఎడిటర్‌ శేఖర్, చాయాగ్రహకుడు సురేశ్‌కుమార్, సీవీ.రాంజేంద్రన్, గాయని ఎంఎస్‌. రాజ్యలక్ష్మి, రచయిత బాలకుమార్, సీనియర్‌ దర్శక నిర్మాత ముక్తాశ్రీనివాసన్, దర్శకుడు ఆర్‌.త్యాగరాజన్, గాయని రాణి, దర్శకుడు శివకుమార్, నటుడు వెల్లైసుబ్బయ్య, నటుడు రాకెట్‌ రామనాథన్, నిర్మాత ఎంజీ.శేఖర్, నటుడు కోవై.సెంథిల్, నటుడు కెప్టెన్‌రాజు వంటి సినీ ప్రముఖులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement