రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్ తదితర 14 మంది స్టార్ హీరోల చిత్రాల విడుదలకు నిర్మాతల మండలి సలహా కమిటీ ఆంక్షలు విధించింది. ఈ మేరకు కమిటీ మంగళవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. అందులో తమిళ నిర్మాతల మండలి సలహా కమిటీ, సేలం డిస్ట్రిబ్యూటర్ల సంఘం సమావేశం అయ్యి ఒక తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. సినిమాలు విడుదలలో ఏర్పడుతున్న సమస్యలు, కష్టాలు, చిన్న చిత్రాల విడుదలకు థియేటర్ల కొరత తదితర విషయాల గురించి చర్చించారు.
అందులోని లోపాలను సరిదిద్దే విధంగా కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా నటులు రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, విక్రమ్, విశాల్, ధనుష్, శివకార్తీకేయన్, శింబు, విజయ్‌సేతుపతి, జయంరవి, రాఘవలారెన్స్ వంటి హీరోల చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు సేలంలో 45 డిజిటల్ ప్రింట్‌లతోనే విడుదల చేయాలి. అదే విధంగా సేలం టౌన్‌లోని 7 థియేటర్లలోనూ, హోసూర్, ధర్మపురి, కృష్ణగిరి, నామక్కల్, కుమారపాళైయం, తిరుసెంగోడు ప్రాంతాల్లో రెండేసి థియేటర్లలోనూ ఇతర ఊర్లలో ఒక్కో థియేటర్‌లో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయం చేసినట్లు తెలిపారు.
అదే విధంగా ఇతర నటుల చిత్రాలను 36 డిజిటల్ ప్రింట్‌లతోనే విడుదల చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. సేలం జిల్లాలో వ్యాపారం జరగని చిన్న చిత్రాలను సేలం డిస్ట్రిబ్యూటర్ల కౌన్సిలే బాధ్యత తీసుకుని 3 శాతం సర్వీస్ చార్జీలు మాత్రమే తీసుకుని విడుదల చేసే విధంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమలులోకి వస్తుందని కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment