కొలతలే వేరు
ప్రపంచంలో పుణ్యాత్ములకు కొదువలేదు కానీ నైపుణ్యాలకు మాత్రం కొదువే. మా ఊళ్లో ఒక టైలరుండేవాడు. ఆయన కొలతలే వేరుగా ఉండేవి. షర్ట్‌ని జాకెట్‌లా, ప్యాంట్‌ని నిక్కర్‌లా కుట్టేవాడు. డాక్టర్ స్టెతస్కోప్ మెడలో వేసుకున్నట్టు, టేప్‌ని మెడలో నాగుపాములా అటూ ఇటూ తిప్పేవాడు. కొలతలు తీసుకునేటప్పుడు కితకితలు పెట్టేవాడు. ప్రతిదీ లెక్కప్రకారం ఉండాలనేది ఆయన వాదన. కానీ లెక్కలు తప్పేవి. లోకంలో ఎవడి లెక్కలు వాడికుంటాయి. అవి మనకు మ్యాచ్ కాకపోతేనే ప్రాబ్లమ్. ఆ టైలర్‌కెంత ఆత్మవిశ్వాసమంటే తాను బొంబాయిలో ఉండాల్సినవాడినని (అప్పటికింకా బొంబాయే) బతికున్నంత కాలం నమ్మాడు.
మనమెన్నడూ చూడనివాడికి పీకని అప్పగించడం ఒక్క బార్బర్ షాప్‌లోనే జరుగుతుంది. ఈ మధ్య ఒక షాపుకెళితే ఒక కుర్రాడు టీవీలోని సినిమా చూస్తూ నావైపు చూడకుండానే నా భుజానికి ఒక టవల్ కప్పాడు. టీవీని చూస్తూనే నా గడ్డాన్ని నిమిరాడు. మొక్కలకు నీళ్లు చిలకరించినట్టు ముఖానికి నీళ్లు కొట్టాడు. నేను తేరుకుని... వచ్చింది షేవింగ్‌కి కాదు, కటింగ్‌కని చెప్పాను. టీవీలో జోక్‌కి కిలకిల నవ్వుతూ, చేతినిండా నురగ తీసుకుని రెండు చెంపలూ టపా టపా వాయించాడు. నోరు తెరిచేలాగా పీకకి కత్తిపెట్టాడు. నోరు మూసుకున్నాను, కళ్లు మూసుకోడానికి భయమేసింది.
స్క్రీన్‌పై బ్రహ్మానందం రాగానే గట్టిగా నవ్వుతూ కత్తిని పీకకి అదిమిపెట్టాడు. పీక నుంచి కత్తిని తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉండగా కరెంట్ పోయింది. అప్పుడు కుర్చీలో ఒక శాల్తీ ఉందని అతను గ్రహించి గడ్డాన్ని చదును చేస్తూ ఉండగా కరెంట్ వచ్చింది. చివరికి రక్తపు చారికలతో ఎలాగోలా బయటపడ్డాను.
అప్పటినుంచి టీవీలు ఉన్న షాపులకు దూరంగా ఉంటూ, టీవీ లేని షాపుకి వెళ్లాను. అక్కడున్న ఆసామి శాలువాలాగా నాకో తెల్లటి వస్త్రాన్ని ఒళ్లంతా కప్పి చేతికి కత్తెర తీసుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. అవతలివాడితో గట్టిగా అరుస్తూ భరతనాట్యం, కూచిపూడి ఆడుతూ చివరికి ఏదో హరికథ చెప్పి వందన సమర్పణ చేస్తూనే కత్తెర టకటకలాడించాడు. క్రాఫు కాస్తా గుండైంది. తన నైపుణ్యాన్ని వెనుకాల ఒక అద్దం ద్వారా చూపించాడు.
ఈ మధ్య స్కానింగ్ కోసం నెట్ సెంటర్‌కెళితే అక్కడున్న అమ్మాయి నా కాగితాలపై అనేక ప్రయోగాలు చేసి చివరికి తనకు స్కానింగ్ రాదని చెప్పింది. టికెట్ రిజర్వేషన్ కోసం వెళితే ఫేస్‌బుక్‌లో మునిగితేలుతున్న ఆ కుర్రాడు చెన్నైకి బుక్ చేశాడు. వాడిని ఫోన్‌లో నుంచి బయటకు లాగి నేను వెళ్లాల్సింది బెంగళూరుకని చెప్పేసరికి తాతలు దిగొచ్చారు. మా బంధువుకి ఆరోగ్యం బాగాలేక బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పిస్తే గ్లూకోమీటర్ ద్వారా షుగర్ పరీక్ష చేయడానికి అక్కడున్న నర్సుకి చేతకాక మూడు నాలుగుసార్లు రక్తాన్ని కళ్లజూసింది.
మనకు మనుషులకు కొదువలేదు కానీ అందులో పనిమంతులెందరు అన్నదే ప్రశ్న. అరకొరగా పని తెలిసినవాళ్లు రోగ నిర్ధారణ కేంద్రాల్లో ఎందరికి ఎన్ని అనవసర జబ్బులు తెచ్చిపెడుతున్నారో డాక్టర్లకే ఎరుక.మనమెంత జాగ్రత్తగా ఉన్నా ఈ బ్యాడ్ ఎక్స్‌పర్ట్‌లు మనకు తగులుతూనే ఉంటారు. ఇది పుణ్యభూమి కానీ నిపుణుల భూమి కాదు.
- జి.ఆర్.మహర్షి