యాక్టింగ్‌లో మేటి.. యాసలో ఒకటే!
వెబ్‌డెస్క్: ఏరంగంలోనైనా పురుషులతో సమానంగా మహిళలు రాణించాలంటే అదనపు నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాల్సిందే. అలా తమదైన సొంత ప్రతిభతో పురుషులకు ధీటుగా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సినీరంగంలో,అందులోనూ హాస్య పాత్రల్లో రాణించడమంటే కత్తిమీదే సామే. అలాంటి వారిలో అలనాటి సూర్యకాంతం, ఛాయాదేవి మొదలు, రమాప్రభ, శ్రీలక్ష్మి, 90ల దశకం నాటి తెలంగాణా శకుంతల, ఇంకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కోవై సరళ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.
ముఖ్యంగా పరభాషా నటి అయినా తెలుగులో అద్భుతంగా రాణించిన కోవై సరళ, ‘తెలంగాణా’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తెలంగాణ శకుంతల మధ్య ఉన్న వివిధ సారూప్యతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా శకుంతల, కోవై సరళ ఇద్దరూ తెలుగు తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్టులుగా రాణించారు. తెలుగు సినీరంగంలో వీరిద్దరి మధ్యా ఉన్న సారూప్యత కేవలం హాస్యాన్ని పండించడం ఒక్కటే కాదు. అద్భుతమైన నటన, విలక్షణమైన భాషతో వీరు తెరపైగా కనిపించిగానే థియేటర్లలో నవ్వులు పూయాల్సిందే. సీటీలు మారు మోగాల్సిందే. నటనా శైలి, భాష, యాస, పంచ్ డైలాగులు వీరికి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అపహాస్యం, అసభ్యత లేని కామెడీ వీరి సొంతం.కుటుంబంలో ఆడపిల్లగా కుటుంబ బాధ్యత తనపై వేసుకుని నిబద్దతతో కుటుంబాన్నిపైకి తీసుకు రావడం మరో సారూప్యత.
కడియాల శంకుతల (తెలంగాణా శకుంతల)
మహారాష్ట్రలో పుట్టి పెరిగిన కడియాల శంకుతల 250కి పైగా చిత్రాల్లో నటనతో అజరామరంగా నిలిచిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్లో తెలంగాణ యాస, రాయలసీమ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒంటి కాలిపరుగుతో రంగస్థల నటిగా తన నటనాప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఆ తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిరు. అది మొదలు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఒకదశలో తన కోసమే పాత్రలను సృష్టించే స్థాయికి ఎదిగిన గొప్ప నటి ఆమె.
రవీంద్ర భారతిలో ప్రదర్శించిన నాటకం ద్వారా నటన మొదలు పెట్టిన ఆమె చాలా నాటకాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆ తరువాత. గౌతమ్ ఘోస్ దర్శకత్వం వహించిన 1979 నాటి చిత్రం ‘మా భూమి’ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ ‘నీ తల్లి..ఇంకోపాలి నా ఇలాకలో..’ డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె ఆ తరువాత ఎన్నో పంచ్ డైలాగులతో ప్రేక్షకుల మెప్పుపొందారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’లోని ఆమె నటన, ఆమె పలికన తీరు, నోట్లో లావుపాటి చుట్టతో ఆమె ఆహార్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతేనా లక్ష్మి సినిమాలో, మరో హాస్యనటుడు వేణు మాధవ్‌తో కలిసి నటించిన కామెడీ సీన్ గుర్తొస్తే పగలబడి నవ్వాల్సిందే. ‘‘తమ్మీ పైసలు దెస్తివా..మరి ఏమే.. పోవే.. శక్కూ.. అంటివి గదరా’‘ లాంటి ఎన్నో విలక్షణ డైలాగులతో శకుంతల ఎంతో ప్రాచుర్యం పొందారు.
పెళ్లాంతో పనేంటి సినిమాలో కొండవలసకు జోడిగా ఆమె అమాయకపు నటన, ఆ తరువాత చూపించిన నట విశ్వరూపం, ఒరిజినల్ కారెక్టర్‌ను ప్రదర్శించిన తీరు అద్భుతం. అలాగే దివంగత దర్శకుడు దాసరి నారాయణ దర్శకత్వంలోవచ్చిన చిత్రం ఒసేయ్ రాములమ్మతోపాటు, కొమురం భీం, ఎర్ర సైన్యం లాంటి చిత్రాలు ఆమె కరియర్లో భాగం. అంతేకాదు పురుషులతో పోటీ పడి మరీ విలనిజాన్ని పండించిన ఘనత శకుంతల సొంతం. కుక్క సినిమాలో నటనకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు, కష్టపడే మనస్తత్వంతోనే మహిళలు రాణిస్తారని నమ్మి ఆచరించిన ధీర మహిళ శకుంతల. రవి తేజ నటించిన వీడే మూవీలో ఆమె ఒక పాట పాడటం విశేషం.
‘‘భయం అనేదే నాకు తెలియదు..అమ్మకు నేనే అబ్బాయిని. నన్ను మగరాయుడిలా పెంచారు..నలుగురి అక్క చెలెళ్లకు నేను అన్న..నేనే తమ్ముడిని. డేరింగ్ అండ్ డేషింగ్ మహిళను’’ అని స్వయంగా శకుంతలగారే చెప్పుకున్నారు. తండ్రి చనిపోవడంతో నటననే వృత్తిగా ఎంచుకుని కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లి చేసిన తరువాత మాత్రమే ఆమె పెళ్లి చేసుకున్నారు. రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్లు, రెండుకాళ్లు విరిగిపోయినా మృత్యుంజయురాలై, ఫీనిక్స్ పక్షిలా పడిలేచిన కెరటం శకుంతల. కానీ 2014, జూన్ 14న తీవ్ర గుండెపోటుతో కన్నుమూయడం విషాదం.
కోవై సరళ
1962 ఏప్రిల్ 7న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జన్మించిన కోవై సరళ తమిళం తెలుగు భాషల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. రెంటిలోనూ ఇప్పటి దాకా సుమారు 750 సినిమాల్లో నటించారు. కామెడీనీ పండించడంలో ఈమెకు ఈమే సాటి. ముఖ్యంగా కమల్ హాసన్‌కు జోడీగా ‘సతీ లీలావతి’, స్టైలిష్‌స్టార్ అర్జున్ నటించిన దేశముదురుమూవీలో కోవై సరళ నటనను ఎలా మర్చిపోతాం. అంతేకాదు బ్రహ్మానందానికి తోడుగా తిరుమల తిరుపతి వెంకటేశా, 2002లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా సందడే సందడి మూవీలో ఆమె చేసిన కామెడీ హైలెట్‌గా చెప్పొచ్చు. అలాగే లారెన్స్ మూవీ కాంచనలో కోవై సరళ అమాయక నటనకు జేజేలు చెప్పాల్సిందే. నాగార్జున నుంచి మొదలు ఈ తరం యంగ్ హీరోలు అందరి సినిమాల్లోను ఆమె నటించారు. ముఖ్యంగా కిక్-2 , గ్రీకు వీరుడు, హీరో, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ఎలా చెప్పను, శ్రీరామచంద్రులు, ఎంత బావుందో!, ఫూల్స్ , అక్కా బావెక్కడ సినిమాల్లోని పాత్రలతో తనదైన శైలితో ఆకట్టుకున్నారు.
పదినేళ్ల వయసులోనే కేఆర్ విజయ సరసన వెల్లి రథం అనే తమిళ సినిమాలో నటించారు. ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగాను, మరో రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించిన మెప్పించిన ఘనత ఆమె సొంతం. కోవై సరళ కుటుంబ బాధ్యతల నిమిత్తం అవివాహితగానే మిగిలిపోయారు. నలుగురు అక్కచెల్లెళ్లున్న కుటుంబంలో పెద్ద కుమార్తె సరళ. వారి చదువు సంధ్యా వివాహాల సందడిలో పడి పెళ్లి అన్న మాటనే మర్చిపోయారామె. తనకు ఒంటరిగా ఉండడం ఇష్టమని, అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని ఒక సందర్భంగా ఆమె చెప్పుకున్నారు. ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) సినిమాకు ఉత్తమ హాస్యనటి నంది పురస్కారాన్ని, తమిళనాడు ప్రభుత్వం నుంచి మూడుసార్లు ఉత్తమ హాస్యనటి అవార్డును సొంతం చేసుకున్నారు. తరతరాలకి ఎవర్గ్రీన్ కామెడీ క్వీన్ కోవై సరళ అనడంలో ఎలాంటి సందేహం లేదు.