మా డ్రిల్లు కథ
హ్యూమర్ ఫ్లస్
పెద్దయింతరువాత ఏదేదో అయిపోతామని చిన్నప్పుడు అనుకుంటాం, ఏమీ కాకుండానే పెద్దవాళ్లమైపోతాం. రంగుల కలలు మాయమై గడ్డాలు మీసాలు బ్లాక్ అండ్ వైట్‌గా మారిపోతాయి. బ్లాక్‌ని వైట్‌మనీ చేసే మోడీ పథకాలుగా, వైట్‌ని బ్లాక్ హెయిర్ చేసే పథకాన్ని గోద్రేజ్‌వారు ఎప్పుడో ప్రవేశపెట్టారు. జుత్తుకి రంగేసిన తరువాత ఏదోఒకరోజు దురద తప్పదు. బాస్‌తో సీరియస్‌గా మాట్లాడుతున్నప్పుడే అది మొదలవుతుంది. గోక్కుంటే కొరివితో తల గోక్కున్నట్టే. వాడు మాట్లాడే పిచ్చివాగుడు అర్థం కాక తల గోక్కుంటున్నామని అనుకుంటాడు. కథకి సంబంధం లేకుండా మన సినిమాల్లో ఓపెనింగ్ సీన్ ఉన్నట్టు నేనిప్పటివరకు చెప్పిన హెయిర్‌డైకి ఇప్పుడు చెప్పబోయే దానికి ఏమీ సంబంధం లేదు. ప్రజలతో ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించినట్టు, కార్యకారణాలు లేకుండా జీవితం గడిచిపోతుంది.
చిన్నప్పుడు నాకు ఆటలంటే ఇష్టం. చదువుకోవాలంటే బుర్ర కావాలి. అది మన దగ్గర లేదు. లేనిది ఉన్నట్టు అభినయించాలంటే కొంచెం వయసు రావాలి. గోలీలు, బొంగరాలు, కోతికొమ్మచ్చి ఇవి మన ఆటలు. బుద్ధున్న ఏ డ్రిల్లు అయ్యవారూ ఇవి నేర్పడు. ఏమీ నేర్పకపోగా వూరికే గ్రౌండ్‌లో పరిగెత్తమనేవాడు. పరిగెత్తకపోతే బెత్తంతో పిర్రలపై కొట్టేవాడు. వూరికే విజిల్ వూదడం తప్ప ఏ ఆటా నేర్పించేవాడు కాదు. ఎప్పుడైనా డిఇవో వచ్చినప్పుడు, మెడకో డోలు తగిలించుకుని దబ్‌దబ్‌మని బాదుతూ మాతో డ్రిల్లు చేయించేవాడు.
ఒకసారి లేడీ డిఇవో వచ్చింది. మేము లెఫ్ట్ రైట్ కొట్టి, ఎప్పుడో ఒకసారి కనిపించే డిఇవో కంటే ఎప్పుడూ కనిపించే మా డ్రిల్లు అయ్యవారే గొప్పవాడని భావించి ఆయనకు మాత్రమే సెల్యూట్ చేశాం. ఆమె ఇగో హర్టయింది. ఇడియట్, బ్రూట్, స్టుపిడ్.. ఇంకా మాకు అర్థంకాని అనేక ఇంగ్లీష్ పదాలతో తిట్టింది. (ఇంగ్లిష్‌లో మాకు ప్రావీణ్యం లేకపోవడానికి కారణం మా ఇంగ్లిష్ మాస్టార్లకి ఇంగ్లిష్ రాకపోవడమే. అసలే ఇంగ్లిష్, ఆయనేం చెబుతున్నాడో ఆయనకే తెలియదు. ఇక మాకేం తెలుస్తుంది? స్కూళ్లలో ఇంగ్లిష్ ప్రవేశపెట్టకపోయినట్టయితే బ్రిటిష్ వాళ్ల మీద మనకు అంత ద్వేషం వుండేది కాదు. ఇంకో రెండొందల ఏళ్లు మనకు అర్థంకాని రీతిలో మనల్ని పాలించే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నారు).
ఆ స్త్రీమూర్తి తిడుతున్నప్పుడు మా డ్రిల్లు అయ్యవారు సియాచిన్‌లో ఐస్‌వాటర్ తాగుతున్నట్టు గజగజ వణికాడు. ఆయన మోకాళ్లు టకటక కొట్టుకున్నాయి. ఆయన బెత్తం దెబ్బలతో బండబారిన మా ఒళ్లు ఆనందంతో పులకించింది. ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నందువల్ల మరుసటిరోజు నుంచి బెత్తాన్ని నాట్యం చేయించాడు. మమ్మల్ని ఆడుకోవడం తప్ప, మాకు ఆటలు నేర్పే అవకాశమే లేదని అర్థమై స్పోర్ట్స్‌మన్‌షిప్‌ని స్వయంకృషితో సాధించాలనుకున్నాం.
ఎక్కడినుంచో ఓ చిరిగిపోయిన ఫుట్‌బాల్ తీసుకొచ్చి చెప్పులు కుట్టే ఆయన దగ్గర కుట్టించాం. సైకిల్ షాప్‌లో గాలి కొట్టించాం. గేమ్స్ ఆడేవాళ్ళు బూట్లు వేసుకోవాలనే విషయం కూడా మాకు తెలియదు. కాళ్లకి స్లిప్పర్లు కూడా లేని బ్యాచ్ మాది.
ఫుట్‌బాల్ చూసిన ఆనందంలో యాహూ అని అరిచి కిక్ కొట్టాను. బాల్ ఎటుపోయిందో తెలియదు కానీ ఒక హృదయవిదారకమైన కెవ్వుకేక వినిపించింది. మాలో ఒకడికి తగలరాని చోట తగిలింది. అందరం పరారీ. వెతికి పట్టుకుని మరీ ఫుట్‌బాల్ ఆడారు.
ఈసారి క్రికెట్ మీద మీద పడ్డాను. కొంతమంది స్టయిల్‌గా సోల్‌కర్, గవాస్కర్, పటౌడీ అని ఏవేవో గొణిగేవారు. మనకి పకోడీ తప్ప పటౌడీ ఏం తెలుసు. ఇంకొంతమంది ట్రాన్సిస్టర్‌లో కామెంట్రీ వినేవాళ్లు. ఆ రేడియో మా తాత గురకలాగా కాసేపు, ఫుల్‌గా తినొస్తే వచ్చే త్రేన్పుల్లా కాసేపు రకరకాల సౌండ్స్ చేసేది. కామెంట్రీ ఇంగ్లిష్ అక్షరం అర్థం కాకపోయినా, మన తెలుగు సినిమా యంగ్ హీరోల్లా సంబంధం లేని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేవాళ్లు.
ఏ ఆటా ఆడకుండానే టెన్త్ పాసయ్యాం. ఇంటర్‌లో నో డ్రిల్లు. యూనివర్సిటీలో ఏదో ఒక ఆటలో మాస్టర్ కావాలని డిసైడై పేకాట నేర్చుకున్నాం. చిన్నప్పుడు మాకు కనీసం గ్రౌండ్స్, డ్రిల్లు అయ్యవార్లు అయినా వుండేవాళ్లు. ఇప్పటి పిల్లలకి అదీ లేదు. కంప్యూటర్ గేమ్స్ తప్ప ఇంకొకటి తెలియనివాళ్లు లక్షల్లో వున్నారు. సింధు మెడల్ తెచ్చినప్పుడు మనందరం చప్పట్లు కొట్టి ఆనందంతో టీవీల ముందు కన్నీళ్లు కార్చాం. తెలుగు అమ్మాయి సింధుని చూసి గర్వపడడం మన హక్కు. కానీ టిఫిన్ కారియర్ సర్దుకుని, బరువైన పుస్తకాల సంచితో ఆటోల్లో వేలాడుతూ వెళుతున్న మీ అమ్మాయిల్లో కూడా సింధు దాగివుందేమో ఎప్పుడైనా గమనించారా?
- జి.ఆర్. మహర్షి