తుగ్లక్ కాలంలోకి..
హ్యూమర్ ప్లస్
ఎవరో పనిలేనాయన ౖటñ ం మెషిన్‌ని కనిపెట్టాడు. ఇది తెలిసి నాకెంతో ఇష్టమైన తుగ్లక్ పాలనని చూడ్డానికి వెళ్లాను. తుగ్లకంటే నాకెందుకు ఇష్టమంటే ఆయన సర్వాంతర్యామి. అన్ని రాజ్యాల్లోనూ ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటుంది.తుగ్లక్ రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా కనిపించారు. కొంతమంది ‘తకిథినథోం’ అని డాన్స్ కూడా చేస్తున్నారు!‘‘మీ ఆనందానికి కారణమేంటి?’’... నాన్ స్టాప్‌గా స్టెప్పులు వేస్తున్న ఒకాయన్ని అడిగాను.‘‘తుగ్లక్ ప్రభువే’’ అన్నాడు డాన్స్ ఆపకుండా.‘‘ఆయన అంత బాగా పాలిస్తున్నాడా?’’‘‘పాలన, దండన ఇక్కడ రెండూ ఒకటే. ఆనందంగా కనబడకపోతే వంద కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.నేను భయంతో ‘హిహిహి’ అని ఇకిలించుకుంటూ ముందుకెళ్లాను. అక్కడ ఒకాయన ఒంటి కంటితో సూర్యుణ్ణి చూస్తున్నాడు.‘‘ఏం చేస్తున్నావ్’’ అని అడిగాను.
‘‘సూర్యుడిపై ఒక కన్నేసి ఉంచుతున్నాను. ఇక్కడి గూఢచారులు సూర్యచంద్రుల్ని కూడా వదలరు’’ అన్నాడు. ‘‘కళ్లు పోతాయి’’ అన్నాను.
‘‘ఇప్పటికి చాలామందికి పోయాయి. నేను కొత్తగా విధుల్లోకి వచ్చాను’’ అన్నాడు. ఇంకో చోటికి వెళితే ఒకాయన నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ పది మంది భటులు కాపలా ఉన్నారు. నన్ను చూసి, ‘‘నిద్రాభంగం కలిగించకు. ఆయన న్యాయాధికారి’’ అన్నాడో భటుడు.‘‘మీ దేశంలో న్యాయం ఇలా నిద్రపోతూ ఉంటుందా?’’‘‘మెలకువల వల్ల అనర్థాలు ఉన్నప్పుడు, నిద్రపోవడమే న్యాయం. ఆయన నిద్రలో కలలు కని, వాటి ఆధారంగా తీర్పులు చెబుతాడు’’.‘‘కలల్ని బట్టి తీర్పులు చెబుతాడా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘కలలతో తీర్పులేంటి, పాలనలే జరుగుతాయి. చాలాసార్లు కలలే పాలిస్తాయి. వ్యవస్థలు నిద్రపోతేనే వ్యక్తులకు న్యాయం జరిగేది’’.ఇంతలో న్యాయాధికారి గురక కూడా ప్రారంభించాడు. ఆ శబ్ధానికి నాలుగైదు గుర్రాలు బెదిరి పరుగులు తీశాయి. ఒక లేఖకుడు గురకని జాగ్రత్తగా వింటూ ఏదో రాసుకుంటూ ఉన్నాడు. గురకలో రాసుకోడానికి ఏముందో నాకర్థం కాలేదు. అదే అడిగాను.‘‘గురక గాఢతకు చిహ్నం. వినడానికి ఒకేలా ఉన్నా అందరూ ఒకేలా గురక పెట్టలేరు. శబ్ధం శబ్ధిస్తే దాన్ని గురక అంటారు. అర్థం కాకపోయినా శబ్ధానికి అర్థం ఉంటుంది. శబ్ధార్థాలు, అర్ధశబ్ధాలు జమిలి పదాలు’’ అన్నాడు. వాడు చెప్పిందాంట్లో అర్థం వెతకడం కంటే యూనివర్సిటీ థీసిస్‌ల్లో అర్థాలు వెతకడం ఈజీ.ఇంతలో ఒకాయన సైన్యంతో కవాతు చేస్తూ ఎదురొచ్చాడు. ‘‘ఎక్కడికి?’’ అని అడిగాను.‘‘యుద్ధానికి’’ కవాతు ఆపకుండా చెప్పాడు.
‘‘ఎవరి మీద?’’‘‘ఈ రాజ్యంలో ఎవరు ఎవరి మీదయినా యుద్ధం చేయవచ్చు. రాజు ప్రజలతో, ప్రజలు రాజుతో, ప్రజలు ప్రజలతో. యుద్ధం ఇక్కడ సర్వనామం. యుద్ధం తెలిసి చేస్తే అది ధర్మయుద్ధం. తెలియకుండా చేస్తే అది యుద్ధవ్యూహం అంటారు’’.నేను తికమకగా నడుస్తూ ఉంటే సాక్షాత్తూ తుగ్లక్ ప్రభువే ఎదురొచ్చాడు. ఆనందంగా దండం పెట్టాను. చిరునవ్వుతో వెలిగిపోతున్నాడు.‘‘చూడ్డానికి ఇంత హూందాగా ఉన్నారే, మీకు పిచ్చి తుగ్లక్ అని పేరెందుకొచ్చింది?’’ అని అడిగాను.‘‘పిచ్చి వాళ్లను పాలించడం వల్ల’’ అన్నాడు. ‘‘అయితే మీకు పిచ్చి లేదా?’’‘‘పిచ్చిలో ఉన్న పిచ్చి గొప్పతనం ఏంటంటే, అది వున్నవాడు లేదనుకుంటాడు. లేనివాడు ఉందనుకుంటాడు. ఇలా ప్రశ్నలు అడిగేవాళ్లను మా రాజ్యంలో యాభై కొరడా దెబ్బలు కొడతారు’’ అన్నాడు.భటుడు కొరడా తీసేలోగా నేను టైం మిషన్‌లో పారిపోయి వచ్చాను.మన కాలంలోకి రాగానే ‘ట్రంపెట్’ మోగింది.మనం ఏ కాలంలో జన్మించినా ఆయా కాలాల్లో తుగ్లక్‌లు పుడుతూనే ఉంటారు. కాలం ఎప్పుడూ ఒక తుగ్లక్‌ని మోస్తూనే ఉంటుంది.
– జి.ఆర్.మహర్షి