దెయ్యాల గ్రామం | Rajasthan ghost village - Kuldhara | Sakshi
Sakshi News home page

దెయ్యాల గ్రామం

Published Sun, Aug 23 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

దెయ్యాల గ్రామం

దెయ్యాల గ్రామం

మిస్టరీ
* ఊరు ఉంది
* మనుషులు మాత్రం లేరు
* వాళ్లంతా ఏమయ్యారు?!
గుజరాత్‌లోని కుల్‌ధారా గ్రామ శివారు ప్రాంతం...
ఓ స్కార్పియో వేగంగా వచ్చి ఆగింది. ఆ వేగానికి రోడ్డుమీది ఎర్రటి మట్టి అంతె త్తున ఎగసి మబ్బులా కమ్ముకుంది.
 
‘‘ఓ గాడ్... ఏంటిది సందీప్. కాస్త మెల్లగా ఆపొచ్చు కదా?’’... దడదడా కొట్టుకుంటోన్న గుండె మీద చేయి వేసుకుని అంది రూప.
 ‘‘నువ్వు మరీను రూపా... నేనేమైనా కావాలని బ్రేక్ వేశాననుకున్నావా? అదే ఆగింది’’ అన్నాడు సందీప్ కాస్త విసుగ్గా.
 ‘‘ఆగిందా? అలా ఎలా ఆగుద్ది?’’ అంది రూప అయోమయంగా. ఈసారి మరింత విసుగు వచ్చింది సందీప్‌కి.
 ‘‘ఉండు... దాన్నే అడిగి చెప్తాను’’ అంటూ కిందికి దిగాడు. టైర్లు చెక్ చేశాడు. బాగానే ఉన్నాయి. బానెట్ తెరిచి అన్నీ పరిశీలించాడు. ఎక్కడా ఏ లోపమూ లేదు. డీజిలు కూడా ఉంది. మరి ఏమయినట్టు? ఉన్నట్టుండి కారు ఎందుకు ఆగిపోయినట్టు?!  
 
మళ్లీ కారు స్టార్ట్ చేయాలని ప్రయ త్నించాడు. స్టార్ట్ కాలేదు. ట్రై చేసి ట్రై చేసి విసిగిపోయి వదిలేశాడు.
 ‘‘ఏంటి దీపూ... ఏం జరిగింది?’’... అడిగింది రూప. ‘‘ఏమో తెలియడం లేదు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ కారు మాత్రం స్టార్ట్ కావట్లేదు.’’
 ‘‘పోనీ ఇక్కడెక్కడైనా మెకానిక్ షెడ్ ఉందేమో చూడు’’ అంది కారు దిగుతూ. ఇక అదే చేయాలి అనుకుంటూ తనూ దిగాడు సందీప్. ఇద్దరూ ఐదు నిమిషాలు నడిచాక ‘కుల్‌ధారా’ అన్న బోర్డు కనిపించింది. ప్రవేశద్వారమూ ఉంది.
 
‘‘హమ్మయ్య... ఏదో ఊరు ఉందిక్కడ. కచ్చితంగా మెకానిక్ ఉండే ఉంటాడు’’ అంటూ హుషారుగా అటువైపు నడిచాడు సందీప్. రూప అతణ్ని అనుస రించింది. నాలుగడుగులు వేయగానే ఓ పాతికేళ్ల అమ్మాయి ఎదురొచ్చింది. వీళ్లని చూసినా చూడనట్టుగా వెళ్లిపోసాగింది.
 ‘‘హలో ఆగండి’’ అంటూ ఆమె దగ్గరకు పరుగెత్తారు ఇద్దరూ. ఏమిటన్నట్టు చూసిందామె.
 ‘‘మా కారు ఆగిపోయింది. ఈ ఊళ్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా?’’
 ఆమె మాట్లాడలేదు. వాళ్లవైపు రెండు క్షణాలు తీక్షణంగా చూసింది. ఊళ్లోకి వెళ్లమన్నట్టు చేతితో చూపించింది.
 
‘‘థాంక్ గాడ్... ఉన్నట్టున్నారు. పద దీపూ వెళ్దాం’’ అంది రూప ఊపిరి పీల్చు కుంటూ. ఇద్దరూ మళ్లీ నడకందుకున్నారు.
 ఊళ్లోకి నడుస్తుంటే విచిత్రంగా అని పించసాగింది. ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అన్ని ఇళ్ల తలుపులూ వేసి ఉన్నాయి. వెళ్లి కొడితే ఎవ్వరూ తీయడం లేదు. ఎవరైనా ఉన్నారా  అని అడిగితే బదులు రావట్లేదు.
 
సమయం గడిచిపోతోంది. వెలుగు దూరమవుతోంది. చీకటి కమ్ముకుంటోంది. అయినా వాళ్లు వెతుకుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు కనిపించకపోతారా అని ఆశగా వీధి వీధీ తిరుగుతూనే ఉన్నారు. వారి ప్రయత్నమైతే ఫలించలేదు. కానీ ఉన్నట్టుండి ఒక మహిళ స్వరం మాత్రం వినిపించింది.
 ‘‘దీపూ.. ఒక్కసారి విను’’ అంది రూప చెవులు రిక్కిస్తూ. సందీప్ నడక ఆపేశాడు. శ్రద్ధగా వింటున్నాడు. ఎవరిదో ఏడుపు. చిన్నగా మొదలైంది. ఉండేకొద్దీ పెద్దదవుతోంది. కాసేపటికి చెవులు చిల్లులు పడేంతగా వినిపించసాగింది.

గుండెలు జారిపోయాయి ఇద్దరికీ. ఆ ఏడుపు మామూలుగా లేదు. బాధా కరంగా, భయానకంగా... అసలు మనిషి ఏడుపులానే లేదది.
 ఇక ఆలస్యం చేయలేదు సందీప్. రూప చేయి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి పరుగందుకున్నాడు. ఇద్దరూ ఆగకుండా పరిగెడుతున్నారు. అంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. ఉన్నట్టుండి నవ్వు మొదలైంది. ఆమె పగలబడి నవ్వుతోంది. తెరలు తెరలుగా నవ్వుతోంది.
 
గుండెను చిక్కబట్టుకుని పరిగెడు తూనే ఉన్నారు ఇద్దరూ. అలసిన కాళ్లు సలుపుతున్నాయి. కానీ అవేమీ పట్టించు కునే స్థితిలో లేరు. ఎలాగైనా అక్కడ్నుంచి బయటపడాలి... అంతే. ఎట్టకేలకు కారు దగ్గరకు చేరుకున్నారు. కానీ ఏం లాభం? కారు పనిచేయడం లేదుగా! ఆ విషయం గుర్తు రాగానే గుండె జారిపోయింది. మళ్లీ పరుగందుకున్నారు. ఎలాగో హైవే మీదికి చేరుకున్నారు. అటుగా వెళ్తోన్న ఓ కారును ఆపారు. లిఫ్ట్ అడిగి ఎక్కేశారు.
 
చెమటతో ముద్దయిపోయి, ఆయాసంతో రొప్పుతోన్న ఆ ఇద్దరినీ చూసి కారులోని వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏమైంది సర్? యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా?’’ అన్నాడు ఆదుర్దాగా.
 లేదన్నట్టు తలూపింది రూప. జరి గింది చెప్పాడు సందీప్. అంతే... హడలి పోయి కారు ఆపేశాడా వ్యక్తి. ‘‘ఏ ఊరు?’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.
 ‘‘కుల్‌ధారా’’... చెప్పాడు సందీప్.
 ‘‘కుల్‌ధారా వెళ్లారా? అసలు మీకా ఊరి గురించి తెలుసా? అక్కడ మూడు వందల యేళ్లుగా ఎవరూ ఉండడం లేదు. ఉండాలన్నా ఉండలేరు. ఎందుకంటే అది ఊరు కాదు. దెయ్యాల స్థావరం.’’
 
తుళ్లిపడ్డారు సందీప్, రూపలు. మూడు వందల యేళ్లుగా ఎవరూ ఉండటం లేదా? మరి ఊళ్లోకి వెళ్లమని తమకు దారి చెప్పిన స్త్రీ ఎవరు? అదే సందేహాన్ని వెలిబుచ్చారు.
 ‘‘మీకు ఇంకా అర్థం కాలేదా... మీకు దారి చూపింది, ఏడ్చింది, నవ్వింది ఎవరో! అసలు అక్కడ ఇళ్లే ఉండవు. మొండిగోడలు మాత్రమే ఉంటాయి. మనుషులు ఉండరు. దెయ్యాలు మాత్రమే తిరుగుతుంటాయి. మరి మీరు ఎవరిని చూశారు? ఏ ఇంటి తలుపులు కొట్టారు?’’
 పై ప్రాణాలు పైనే పోయాయి సందీప్, రూపలకు. ఆ ఊరిలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ భయం వేయ సాగింది. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే చూశారు. నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయారు.
 నిజమే. ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికీ వాస్తవం. రాజస్థాన్ లోని కుల్‌ధారా గ్రామానికి వెళ్తే ఇలాంటి అనుభవాలు బోలెడు ఎదురౌతాయి. ఎందుకంటే అది ఒక హాంటెడ్ విలేజ్!
   
రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేర్‌కి పది హేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్‌ధారా. ఒకప్పుడు నిండా జనంతో, అందమైన గృహాలతో కళక ళలాడేది. పండుగలు పబ్బాలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. ఎందుకని? అసలా ఊరికి ఏమయ్యింది?
 
మూడు వందల యేళ్ల క్రితం కుల్ ధారాలో పలివాల్ బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. అందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ రాత్రికి రాత్రే ఊరిలోని జనమంతా మాయమై పోయారు. దానికి కారణం... ఒకరోజు ఆ గ్రామానికి దురదృష్టం నడచుకుంటూ వచ్చింది... ప్రధాని సలీమ్ సింగ్ రూపంలో (అప్పట్లో గ్రామ ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)!
 
కుల్‌ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగ బడ్డారు. తమ కులం కానివాడికి అమ్మా యిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయాడు సలీమ్. ఊరివాళ్ల మీద పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు.

అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు... ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్‌ధారా అలా అయిపోయిందని అంటూ ఉంటారు.
 అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్ సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడిం చడం మొదలు పెట్టారనీ మరో వాదన.
 
ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడా తెలియక మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రిళ్లు ఎవరో తలుపులు బాధేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి.

ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారి పోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియ డంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్‌ధారా ఒక ఘోస్ట్ విలేజ్ అని తేల్చి చెప్పేశారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ఎందుకంటే... తమ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం గానీ... అక్కడికి వెళ్లి తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకునే ధైర్యం గానీ ఎవరికీ లేవు కాబట్టి!
 
కుల్‌ధారా ముఖద్వారం
ఢిల్లీలోని పారాపార్మల్ సొసైటీకి చెందిన పన్నెండు మంది సభ్యులు కుల్‌ధారా గ్రామానికి వెళ్లారు. వాళ్లు అక్కడ ఉన్న ఆ రాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఏవేవో నీడలు కనిపించాయి. ఏవేవో స్వరాలు వినిపించి భయపెట్టాయి. వారి వాహనాల మీద చిన్నపిల్లల చేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోయేది. ఉన్నట్టుండి పెరిగిపోయేది. దాంతో వాళ్లు కూడా కుల్‌ధారా గురించి అంతవరకూ ఉన్నవన్నీ వదంతులు కావని, వాస్తవాలేనని నమ్మే పరిస్థితి వచ్చింది. నాటి నుంచీ కుల్‌ధారా అంటే అందరికీ మరీ భయం పట్టుకుంది. ప్రభుత్వం కుల్‌ధారాని సందర్శనా స్థలంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. సందర్శకులు కూడా బాగానే వస్తున్నారు. కానీ చీకటి పడే సరికల్లా పరారైపోతురు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement