ఆది మానవుడు ఆహారాన్ని వండుకుని కాకుండా పచ్చిగానే తినేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చిమాంసం, ఆకులు అలములు తిన్నట్లు కూడా చదువుకున్నాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకుని తినడం నేర్చుకున్నాడు. అయితే, మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?!
దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసింది. ఇప్పటివరకు మానవుడు తొలిసారి వండిన ఆహారం ఎప్పుడు తిన్నాడన్న దానిపై పలు అధ్యయనాలు జరిగాయి. అయితే, ఇప్పటిదాకా దొరికిన ఆధారాలను బట్టి 1,70,000 సంవత్సరాల క్రితం తొలిసారి వండిన ఆహారం తిన్నట్లు వెల్లడైంది.
తాజాగా, టెల్ అవివ్ యూనివర్సిటీ, హెబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం, బార్–ఇలాన్ యూనివర్సిటీలు స్టీన్‌హార్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్‌హిస్టరీ, ఒరేనిమ్ అకడమిక్ కాలేజ్, ఇజ్రాయెల్ ఓషినోగ్రఫిక్ అండ్ లిమ్నోలాజికల్, లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం, మైన్జ్‌లోని జొహాన్నెస్ గుటెన్‌బర్గ్ యూనివర్సిటీలతో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దీనికి సంబంధించి తిరుగులేని విషయాలు వెల్లడయ్యాయి.
7,80,000 క్రితమే మానవులు మంటను నియంత్రిస్తూ ఆహారం వండినట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ఇప్పటిదాకా వెల్లడైన అధ్యయనాల ఫలితాలకు తాజా అధ్యయనం తెరదించినట్లయింది. ఈ అధ్యయనానికి టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇరిట్ జొహర్ అనే పరిశోధకుడి నేతృత్వం వహించారు. ‘అన్ని రకాల పరికరాలున్న ఇప్పటికాలంలో మంటను నియంత్రిస్తూ వంట చేయడం చాలా సులభమే అనుకోవచ్చు. అయితే ఎలాంటి పరికరాలు లేని ఆరోజుల్లోనే మంటను నియంత్రిస్తూ వంట చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఆది మానవులు తమ ఆహారం కోసం చేపలకు చాలా ప్రాధాన్యమిచ్చేవారని ఈ అధ్యయనం చాటుతోంది. గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో మాకు దొరికిన చేప అవశేషాలను ఒకచోట చేర్చి పరిశీలించగా, పురాతన హులా సరస్సులో ఈ రకం చేపలున్నట్లు తెలిసింది. ఎప్పుడో అంతరించిపోయిన ఈ చేపలు దాదాపు రెండు మీటర్ల వరకు పొడవుంటాయి. గెషర్ బొనోట్ యాకోవ్‌లో పెద్ద ఎత్తున దొరికిన చేపల అవశేషాలను బట్టి చూస్తే ఆది మానవులు తరచుగా వీటిని తిన్నట్లు తెలుస్తోంది. వారే వంట చేసే పద్ధతులను అభివృద్ధి చేసినట్లు అవగతమవుతోంది. అలాగే, చేపను వండి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా ఆనాడే వారు గుర్తించినట్లు తెలుస్తోంది’ అని జొహర్ చెప్పారు.
–సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment