అన్నీ బాగుండాలి.. అందులో మనముండాలి! | One Health Program Aims Improve Well Being Living Things Including Humans | Sakshi
Sakshi News home page

అన్నీ బాగుండాలి.. అందులో మనముండాలి!

Published Mon, Sep 26 2022 1:49 AM | Last Updated on Mon, Sep 26 2022 3:07 AM

One Health Program Aims Improve Well Being Living Things Including Humans - Sakshi

మలేరియా, చికెన్‌ గున్యా, డెంగీ వ్యాధుల వ్యాప్తికి దోమలు కారణం! ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరి వీధి కుక్కల వెంట్రుకల్లో ఉండే పేనుతో మనకు ప్రమాదం లేదా? పాడి పశువులకు వచ్చే రోగాలు మనకు అంటవా? పోనీ మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా, వైరస్‌లతో జంతువులకు జబ్బులు రావా?

అంతెందుకు నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మూలాలు జంతువులే! ఒక్కమాటలో చెప్పాలంటే మనకొచ్చే వ్యాధుల వ్యాప్తికి సగం కారణం జంతువులే! ఈ విషయాన్ని గుర్తించడంలో ఆలస్యమైతే జరిగిందిగానీ.. పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వన్‌ హెల్త్‌’ కార్యక్రమం మాత్రం వేగంగా అడుగులేస్తోంది 

(కంచర్ల యాదగిరిరెడ్డి) 
ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మనుషులకు కొత్త కొత్త రోగాలు, ఆరోగ్య సమస్యలు పరిచయమవుతున్నాయి. దశాబ్దం క్రితం మనకు చికెన్‌ గున్యా అంటే ఏమిటో తెలియదు. డెంగీ మాట కూడా చాలా మంది విని ఉండరు. హెచ్‌1ఎన్‌1, హెచ్‌1ఎన్‌5 వంటివి కనీవినీ ఎరుగం. కానీ ఇప్పుడివన్నీ ఏటా పలకరించే చుట్టాల్లా మారిపోయాయి. ఎందుకిలా అంటే కారణాలు బోలెడు. ముఖ్యమైనది మాత్రం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడమే. అందుకే ఐదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ‘వన్‌ హెల్త్‌’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోంది. 

‘సర్వే సంతు నిరామయ’ 
వేదాల్లోని శాంతి మంత్రంలో ఓ చిన్న భాగమిది. భూమ్మీద ఉన్న వారెవరికీ వ్యాధుల బాధ లేకుండా ఉండు గాక అని అర్థం. అంటే మనుషులతోపాటు జీవజాలం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటం. యూఎన్‌ ‘వన్‌ హెల్త్‌’ లక్ష్యం కూడా ఇదే. మానవుల ఆరోగ్యం బాగుండేందుకు.. కరోనా, ఎబోలా, వెస్ట్‌ నైల్‌ వంటి భయంకర వ్యాధులు ప్రబలకుండా, కొత్త కొత్త వ్యాధులు అంటకుండా చూసుకునేందుకు.. మన చుట్టూ ఉన్న జంతువులు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని చెబుతుంది ‘వన్‌ హెల్త్‌’. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే ఇటీవలికాలంలో పెచ్చుమీరుతున్న జంతు వ్యాధుల నేపథ్యంలో మరింత ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. 

విస్తరిస్తూ పోతున్న కొద్దీ.. 
భూమ్మీద జనాభా పెరుగుతోంది. మనిషి కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ఈ క్రమంలో మనుషులకు, అడవి జంతువులకు మధ్య ఉన్న దూరం తగ్గిపోతోంది. ఇలా ఆ జంతువులకు దగ్గరవుతున్న కొద్దీ వాటిలో ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, పర్యావరణం దెబ్బతినడం దానికి ఊతమిస్తోంది. వ్యాపార, వాణిజాల్లో వృద్ధి కారణంగా వ్యాధులు ఒకచోటి నుంచి ఇంకో చోటకు ప్రయాణించడం సులువైపోయింది.

అందుకే ఇటీవలికాలంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎక్కువైందన్నమాట. కుక్కల నుంచి వచ్చే రేబిస్‌ మొదలుకొని సాల్మోనెల్లా, వెస్ట్‌నైల్‌ ఇన్ఫెక్షన్లు, క్యూ ఫీవర్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, లైమ్, రింగ్‌వర్మ్, ఎబోలా వంటివి మనం ఎదుర్కొంటున్న జునోటిక్‌ (జంతువుల నుంచి సోకేవి) వ్యాధుల్లో కొన్ని మాత్రమే. మారిన పరిస్థితులు జంతువులకూ మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తూండటం ఆసక్తికరమైన అంశం. 

ఏయే అంశాలపై ‘వన్‌ హెల్త్‌’ దృష్టి 
‘వన్‌ హెల్త్‌’ కార్యక్రమం కేవలం జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధులపై మాత్రమే దృష్టిపెట్టడం లేదు. ఈ వ్యాధులకు కారణమైన ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. యాంటీ బయాటిక్‌లకు లొంగని సూక్ష్మజీవులు వీటిలో ఒకటి. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించని పక్షంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది.

ఆస్పత్రులు, ఆహారం, మట్టి, నీరు వంటి పలు మార్గాల ద్వారా మందులకు లొంగని వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధికారక సూక్ష్మజీవులను మోసుకెళ్లే క్రిమికీటకాలు (దోమలు, పశువులు, జంతువులపై ఆధారపడి బతికే పేన్లు, ఇతర కీటకాలు)లను నియంత్రించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారంగా ఉపయోగించుకునే జంతువుల (కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల్లాంటివి) సంరక్షణ, ఆరోగ్యం కూడా ‘వన్‌హెల్త్‌’ కార్యక్రమంలో భాగమే. 

వన్‌ హెల్త్‌ కింద ఏం చేస్తున్నారు? 
వన్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మానవ, జంతు వ్యాధుల నిపుణులు, పర్యావరణవేత్తలు కలిసికట్టుగా రకరకాల వ్యాధుల వ్యాప్తి ఎలా జరుగుతోందో తెలుసుకుంటున్నారు. పశువులతోపాటు మనుషుల్లోనూ యాంటీ బయాటిక్‌ల విచ్చలవిడి వాడకానికి చెక్‌ పెట్టేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పెంపుడు జంతువుల యజమానులు, రైతుల్లోనూ వన్‌హెల్త్‌ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు, జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలు చేపడుతున్నారు. కంబోడియాలో రేబిస్, ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాల నివారణ కోసం వ్యవసాయ, మత్స్య, అటవీ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అమెరికాలోని అట్లాంటా అక్వేరియంలోని జలచరాలు కొన్నింటికి కరోనా సోకింది. వాటికెలా సోకిందో తెలుసుకునేందుకు వన్‌హెల్త్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఇది ఇతర జంతువులకు మనుషులకు మళ్లీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

నవంబర్‌ మూడు.. వన్‌హెల్త్‌ డే! 
1964లో కాల్విన్‌ ష్వాబ్‌ అనే పశువైద్యుడు తొలిసారి ‘వన్‌ మెడిసిన్‌’ పేరుతో రాసిన ఒక పరిశోధన వ్యాసంలో జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధుల్లోని సారూప్యతలను ప్రస్తావించారు. పశు, మానవ వైద్యులు కలిసికట్టుగా పనిచేస్తే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ష్వాబ్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈ అంశంపై కృషి చేయడం మొదలుపెట్టింది.

2004లో వైల్డ్‌ లైఫ్‌ కన్సర్వేషన్‌ సొసైటీ, రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీలు ‘వన్‌ వరల్డ్‌.. వన్‌హెల్త్‌’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని సూచించాయి. సాంక్రమిక వ్యాధులను అరికట్టేందుకు జంతువులు, పర్యావరణం రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాయి.

అమెరికన్‌ హెల్త్‌ అసోసియేషన్‌ 2007లో మానవ, జంతు వైద్య పరిశోధన సంస్థల మధ్య సహకారానికి తీర్మానం చేయగా.. తర్వాతి కాలంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్, వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌ (యునిసెఫ్‌), ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు ‘వన్‌ హెల్త్‌’ కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను రూపొందించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కూడా పలు అంతర్జాతీయ స్థాయి సదస్సులు, చర్చలు, విధానాల రూపకల్పనతో 2016లో ‘వన్‌ హెల్త్‌ కమిషన్, వన్‌ హెల్త్‌ ప్లాట్‌ఫామ్, వన్‌ హెల్త్‌ ఇనిషియేటివ్‌’ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. నవంబరు మూడో తేదీని ‘వన్‌ హెల్త్‌ డే’గా ప్రకటించాయి. 

నైజీరియాలో సీసంతో.. 
2010లో నైజీరియాలో అకస్మాత్తుగా డజన్ల కొద్దీ బాతులు చచ్చిపోయాయి. కారణాలేవీ తెలియలేదు. బాతులే కదా అని ప్రజలూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అదే ప్రాంతంలో వందలాది మంది పిల్లలు జబ్బు పడటం మొదలైంది. సమస్య ఎక్కడుందో వెతికేందుకు జరిగిన ప్రయత్నంలో.. ఆ ప్రాంతంలోని వారు ఎక్కువమంది ముతక పద్ధతుల్లో బంగారాన్ని అన్వేషిస్తున్నారని.. ఈ క్రమంలో విడుదలైన సీసం నీళ్లలో చేరి పిల్లల అనారోగ్యానికి కారణమైందని తేలింది. 

నమీబియా చీతాలతో లాభం 
నమీబియా చీతాలు ఇటీవలే ఇండియాకు వచ్చాయి. దశాబ్దాలపాటు భారత్‌లో కనుమరుగైపోయిన చీతాలు మళ్లీ కనిపించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు కూడా. అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనమూ ఉంది. వేటాడి బతికే చీతాలు క్షీణించిపోతున్న గడ్డి మైదానాలను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వేటాడే జంతువులు లేకపోవడం వల్ల గడ్డి తిని బతికే జంతువులు ఎక్కువై మైదానాలు లేకుండా చేస్తున్నాయని, చీతాల ప్రవేశంతో సమతౌల్యత ఏర్పడి గడ్డి మైదానాలు మళ్లీ పుంజుకుంటాయని అంటున్నారు.  

కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ
2007లో కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ చోటు చేసుకుంది. మోంటెరీబే ప్రాంతంలో సీఒట్టర్స్‌ (సీల్‌ల తరహాలో ఉంటాయి) అని పిలిచే జలచరాలు కొన్ని జబ్బుపడ్డాయి. మరికొన్ని ప్రాణాలు కోల్పో­యాయి. వాటి చిగుళ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోయాయి. కాలేయం ఉబ్బి ఉంది. మామూలు జబ్బులేవీ ఈ లక్షణాలకు కారణం కాదు.

వన్‌హెల్త్‌ కార్యక్రమం కింద సముద్ర, మత్స్య శాఖల అధికారులు పరిశోధన మొదలుపెడితే.. పజారో నది నుంచి పింటో సరస్సుకు అక్కడి నుంచి సముద్రంలోకి కలుస్తున్న నీళ్లలో కొట్టుకొస్తున్న నాచులోని ఓ రసాయనం సీఒట్టర్స్‌ల మరణానికి కారణమని తెలిసింది. పింటో సరస్సులో విపరీతంగా పెరిగిన నాచులోని నత్తగుల్లలు తినడం సీఒట్టర్స్‌ ప్రాణాలమీదకు తెచ్చిందని స్పష్టమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement