చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే.. | Is Sweating Can Be a Sign of These Health Conditions, How Do Prevent Sweating | Sakshi
Sakshi News home page

చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే..

Published Sat, Mar 26 2022 10:08 AM | Last Updated on Sat, Mar 26 2022 10:52 AM

Is Sweating Can Be a Sign of These Health Conditions, How Do Prevent Sweating - Sakshi

చెమట పట్టడం చాలా సాధారణమైన జీవక్రియ. మనం బాగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా బాగా ఆటలాడినప్పుడు లేదా టెన్షన్‌ పడినప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది సాధారణ పరిస్థితులలో. అయితే వేసవిలో మాత్రం ఇలాంటి వాటì తో పనిలేదు. కేవలం వాతావరణంలోని వేడి కారణంగా చెమట పడుతుంది. ఇది చాలా చికాకుగా అనిపిస్తుంది. నిజానికి చెమట పోయడం అనేది మంచి లక్షణమే అయినప్పటికీ వేసవిలో తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలు... 

ఒంటికి చెమటలు పట్టగానే చాలామంది చిరాకు పడతారు. నిజానికి అలా చెమట పట్టడం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఓ అద్భుత ప్రక్రియ. వాతావరణంలోని వేడి వల్ల లేదా, వేసవి ఎండల వల్ల దేహంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని వ్యవస్థలన్నీ విఫలమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో చర్మం మీద చెమట పట్టేలా చేసి, ఆ వేడిమి నుంచి కాపాడి దేహం చల్లగా అయ్యేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. అంటే చెమట మన ప్రాణాలు కాపాడటమే కాదు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చూసి దేహక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూసే అపూర్వమైన ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో అధికంగా చెమట పట్టడం వల్ల కొన్ని ఇబ్బందులూ తలెత్తవచ్చు. వాటికి ఉపశమనం కోసం జాగ్రత్తలను తెలుసుకుందాం. 

చెమట వల్ల సమస్యలు
►నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, శరీర దుర్వాసన. 
►పిల్లల్లో చెమట పట్టడం వల్ల పరీక్షలు రాసే  సమయంలో ఒక్కోసారి జవాబు పత్రం చిరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. 
►టెన్నిస్, క్రికెట్‌ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్‌ లేదా టెన్నిస్‌ రాకెట్‌ జారిపోతుంటాయి. అందువల్ల వారు మాటిమాటికీ  తుడుచుకోవలసి వస్తుంది. 
►ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం
►నలుగురు కలిసే సోషల్‌ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం, షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేకపోవడం
చదవండి: Summer Tips: చెరకురసంలో అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి తాగితే..

► కొందరిలో నడుస్తుండగానే చెమటల కారణంగా చెప్పులు/పాదరక్షలు జారిపోతుంటాయి. అలాంటివారు బూట్లు వేసుకోవడం కొంత మెరుగు. అయితే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన సాక్సులు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటకు తోడు మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి

► రోజుకు రెండుసార్లు స్నానం చేయడం
►మాయిశ్చరైజర్‌ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్‌ సబ్బులు వాడటం మంచిది.
►చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్‌ / నూలు దుస్తులు «ధరించడం మంచిది.
►ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన బట్టలు ధరించాలి.

శరీర దుర్వాసన 
►శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

►అందుకోసం పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. జింక్‌ తగినంత ఉంటే నోటి, శరీర దుర్వాసన తొలగిపోవడంతోపాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. 

►నిమ్మరసం సహజసిద్ధమైన డియోడరెంట్‌ గా పనిచేస్తుంది. ఇది అధిక చెమటనూ తగ్గిస్తుంది.
►గోధుమగడ్డి జ్యూస్‌ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు.
► ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, టీస్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.

► ప్రతిరోజూ ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల చెమట సమస్య చాలా వరకు తగ్గుతుంది.
►బిగుతుగా ఉండే సింథటిక్‌ వస్త్రాలు వద్దు. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయాలి.
► లో దుస్తులను వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టువాలి.
►రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
►డియోడరెంట్‌ వాడవచ్చు. లేదంటే టాల్కమ్‌ పౌడర్‌ రాసుకోవడం.

 

►ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తగ్గించాలి.
తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్‌ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోవాలి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే చెమట సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది.

►ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ‘చెమట’లు పట్టిస్తుంటే ఓసారి స్కిన్‌ స్పెషలిస్ట్‌ను సంప్రదించి వారి సలహాను బట్టి మందులు వాడటం ఉత్తమం. అంతేకానీ, అతిగా పట్టించుకున్నా, అసలు పట్టించుకోపోయినా ఇబ్బందే!

చెమటలు ఎక్కువగా ఎందుకు పడతాయి? 
దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. శరీరం లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్‌ టెన్షన్‌ లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా అధిక చెమటకు కారణమవుతాయి.

ఎలా బయటపడాలి?
ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.
మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్‌ బి ఉండేలా చూసుకోవడం. (అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.)

►రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్, టేబుల్‌ స్పూన్‌ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
►నిమ్మకాయ రసాన్ని బాహుమూలల్లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయాలి.
►కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. 
►అలోవెరా జెల్‌లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్‌ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
►బేకింగ్‌ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్‌ సోడాను కొంచెం నీటిలో కలిసి బాహుమూలల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
► బ్లాక్‌ టీలో ఉండే టానిక్‌ ఆసిడ్‌.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్‌ టీ లో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో బాహుమూలల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement