
కుక్కలూ మనలాగే ఆలోచిస్తాయి!
లండన్: కుక్కలు మనిషికి విశ్వాసపాత్రమైన నేస్తాల్లా ఎందుకుంటాయి? అవి మనుషుల మాటలను అర్థంచేసుకుంటూ వారి భావోద్వేగాలకు అనుగుణంగా ఎలా మసలుకుంటాయి? మనలాగే ఆలోచిస్తాయి కాబట్టి.. అంటున్నారు హంగేరియన్ శాస్త్రవేత్తలు. అవును.. కుక్కల మెదడులో ధ్వనులు, మాటలను విశ్లేషించే భాగం మనిషి మెదడులోని భాగం మాదిరిగానే ఉంటుందని వారు వెల్లడించారు. మనిషితోపాటు ఇతర ప్రైమేట్స్ (కోతిజాతి)లలో మెదడు దాదాపు ఒకేలా ఉంటుంది. అయితే కుక్కల్లో కూడా ధ్వనిని విశ్లేషించే భాగం మనిషిని పోలి ఉందని, అందుకే అవి 30 వేల ఏళ్లుగా మనిషిని అర్థం చేసుకుంటూ బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధనలో భాగంగా.. 11 కుక్కలకు మనుషులు, కుక్కలు చేసే 200 రకాల శబ్దాలను వినిపిస్తూ ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. ఇందులో సంతోషం, బాధ, అరుపు, ఏడుపు, ఇతర ధ్వనులూ వినిపించారు. దీంతో వాటి మెదడులో ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ భాగం మనుషుల్లో మాదిరిగానే స్పందిస్తోందని తేలింది.
మనుషులు ఇతర మనుషుల శబ్దాలకు, కుక్కలు ఇతర కుక్కల శబ్దాల కే.. ముఖ్యంగా సంతోషకరమైన శబ్దాలకే ఎక్కువగా స్పందించడం విశేషం. అన్న ట్టూ.. ఆహారం ఇచ్చినందుకే కాకుండా.. ఇతర అంశాలను బట్టి కూడా యజమానులను కుక్కలు ప్రేమిస్తాయని, అనురాగంతో బంధాలు ఏర్పర్చుకుంటాయని ఇటీవల జార్జియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కుక్కల మెదడులో సానుకూల భావోద్వేగాలకు సంబంధించిన భాగం మనుషుల మాదిరిగానే స్పందిస్తోందని వారు తేల్చారు కూడా.