చింపాంజీలకు తప్పొప్పులు తెలుసు
న్యూయార్క్: మనుషులు తాము చేసే పని సరైనదే అయినప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనుషుల్లాగే చింపాంజీలు కూడా తాము చేసే పని సరైనదైనప్పుడు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. చింపాంజీలను మనుషులకు పూర్వ జీవులుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో, తెలుసుకొని అర్థం చేసుకోవడంలో అవి మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే గుణం కూడా చింపాజీలకు ఉంది. ఏదైనా పరిస్థితుల్లో మనకు ఆ విషయం గురించి అవగాహన ఉంటే ఒకలా, లేకుంటే మరోలా ప్రవర్తిస్తాం.
మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో స్పందిస్తాం. మనకు ఎంత తెలుసు అనేదాన్ని బట్టే మన ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మానసిక స్థితే జంతువుల్లో కూడా ఉంటుందా అనే అంశంపై జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం సాగించారు. చింపాంజీలపై వీరు సాగించిన అధ్యయనంలో అవి కూడా మనుషుల్లాగే స్పందిస్తాయని రుజువైంది. ఈ అధ్యయనంలో చింపాంజీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షలో సమాధానం ఇవ్వగానే వాటికి ఆహారాన్ని వేరే చోట ఏర్పాటు చేసినట్లు కంప్యూటర్‌లో తెలిపేవారు. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వాటికి అక్కడ ఆహారాన్ని అందించేవారు. సమాధానం చెప్పిన వెంటనే చింపాంజీలు ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్లేవి. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు ఆహారాన్ని తీసుకునేందుకు త్వరగా వెళ్లగా, సమాధానం తప్పుగా చెప్పినప్పుడు మెల్లగా వెళ్లేవి. సమాధానం సరైనదని అనిపించినప్పుడు అవి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించాయి. దీన్ని బట్టి అవి కూడా మనుషుల్లాగే తాము చేసేది సరైనదైతే ఆత్మవిశ్వాసంతో ఉంటాయని రుజువైంది.