
ఆధునిక టెక్నాలజీ..
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీ లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేం. ప్రపంచంలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటున్న టెక్నాలజీ.. మానవ జీవితాన్ని ఓ వైపు అత్యంత శోభాయమానంగా, సుఖవంతంగా తీర్చిదిద్దుతూనే మరో వైపు దుర్భర సమస్యల సుడిగుండలోకి నెడుతోంది. దీన్ని సమన్వయం చేసుకుని నైతికత పాటిస్తే.. వ్యక్తి, సమాజం, దేశం అభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తిరుపతి ఎడ్యుకేషన్ : రోజురోజుకూ వాయువేగంతో అభివృద్ధి చెందున్న టెక్నాలజీ వాడకంలో విచక్షణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సమస్యలను మరింత సౌకర్యవంతంగా వేగంగా పరిష్కరించుకునే వీలుంటుందని చెబుతున్నారు.
విద్యావిధానంలోనూ ఆధునిక టెక్నాలజీ..
టెక్నాలజీ విద్యావిధానంలోనూ పెను మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు నల్లబోర్డుపై తెల్లటి రాతలు. బట్టీ పట్టే విద్య. నేడు తెల్ల బోర్డుపై డిజిటల్ విద్య. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డిజిటల్ తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. బట్టీకి స్వస్తి పలుకుతూ ప్రాక్టికల్‌గా విద్యనభ్యసించేలా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వాలు సైతం విద్యావిధానంలో విప్లవాత్మక సాంకేతిక మార్పులు తీసుకొస్తూ నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతోంది.
సెల్‌ఫోన్లు వినియోగంతో..
డెస్క్‌టాప్(కంప్యూటర్), ల్యాప్‌టాప్‌లానే మనం నిత్యం ఇతరులతో సంభాషించడానికి వినియోగించే సెల్‌ఫోన్లూ(స్మార్ట్‌ఫోన్) విజ్ఞాన కేంద్రాలయ్యాయి. సెల్‌ఫోన్లు వచ్చిన తరువాత అరచేతిలో ప్రపంచాన్ని బంధించి అంతులేని విజ్ఞానాన్ని అందిస్తోంది. ప్రస్తుత ప్రాక్టికల్ విద్యావిధానంలో ఇదొక మంచి సాధనం. విద్యాపరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త యాప్‌లు వస్తున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, పాఠ్యాంశాల్లోని అంశాలను తరవుగా నేర్చుకుని మేథస్సును పదును పెట్టడానికి దోహదపడుతున్నాయి. అయితే సక్రమ మార్గంలో వినియోగించుకోకుంటే సమయాన్ని తినేసే కిల్లర్‌గా సెల్‌ఫోన్ మారిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరైన పద్ధతిలో వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సృష్టించడమే కాకుండా విద్యాపరమైన అభివృద్ధి సాధించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
విపరీత పరిణామాలు
అతిగా సాంకేతికతపై ఆధారపడడం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానిసిక రుగ్మతలు, శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. సాంకేతికతకు బానిస అవ్వడం, అనారోగ్యకరమైన, అసాంఘిక సైట్లను వీక్షించే దురలవాట్లకు లోనై సమయాన్ని వృథా చేసుకోవడం జరుగుతుంది. తగిన విచక్షణ, విజ్ఞతతో వ్యవహరించి, అవసరం మేరకు కావాల్సిన విజ్ఞానాన్ని సమకూర్చుకోవడం వరకే సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రస్తుతం పిల్లలు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లతో అధిక సమయం వెచ్చిస్తున్నారు. చెడుదోవ పట్టకుండా సక్రమ మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండడం ఉత్తమం.
– ఓంప్రకాష్ కోటపాటి, స్టేట్ రిసోర్స్ పర్సన్, విద్యారంగ విశ్లేషకులు
తల్లిదండ్రులు గుర్తించాలి..
తమ పిల్లాడు కంప్యూటర్లో గేమ్‌లు, సెల్‌ఫోన్ను పొద్దస్తమానం ఆపరేట్ చేస్తుంటాడని ఆవేదనతో చెబుతున్న తల్లిదండ్రులు కొందరైతే.. ‘మా పిల్లాడు చాలా గ్రేటండి... కంప్యూటర్, సెల్‌ఫోన్‌లో తెలియని అంశాలే లేవు’ అని గర్వంగా చెప్పే తల్లిదండ్రులు మరి కొందరు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తదనం పిల్లలకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. సృజనాత్మకత కలిగిన విద్యార్థులు కొత్తదనం శోధించాలనే తపనతో నిరంతరం కుస్తీ పడుతుంటారు. అవధులు దాటనంత వరకు ఇది మంచి విషయమే. విచ్చలవిడి అయితేనే ప్రమాదం. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment