ఓ విషయం తెలియనంత వరకు ప్రతిదీ ఓ మిస్టరీనే.. అసలు మనుషులు ఎలా వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? ఏ విధంగా పరిణామం చెందారు? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే నలభై వేల ఏళ్ల కిందట మనుగడలో ఉన్న నియాండర్తల్స్ జాతి ఎలా అంతరించిపోయిందన్నది ఇప్పటికీ ఓ రహస్యమే.
సాక్షి, న్యూఢిల్లీ: 6,00,000 ఏళ్ల కిందట మానవ జాతి రెండు బృందాలుగా చీలిపోయింది. ఒక బృందం ఆఫ్రికాలో ఉండిపోయింది. ఆ బృందం నుంచే మనుషులు పరిణామం చెందినట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే మనుషులతో లైంగిక సంబంధాల వల్ల నియాండర్తల్స్ జాతి అంతరంచిపోయినట్లు తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. పీఎన్‌ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నియాండర్తల్ రక్త నమూనాలు వారి రక్తం నిర్దిష్ట జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నట్లు చూపిస్తుంది. ఇది ‘‘హెమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది ఫీటెస్ అండ్ న్యూబార్న్’’కి గురయ్యే అవకాశం ఉందని, ఈ హెచ్‌డీఎఫ్‌ఎన్ రక్తహీనతకు కారణమవుతుందని, సాధారణంగా రెండవ, మూడవ, తదుపరి గర్భధారణతో మరింత తీవ్రమవుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు.
మానవులు, నియాండర్తల్‌ల మధ్య లైంగిక సంబంధాల ఫలితంగా.. అరుదైన రక్త రుగ్మత నియాండర్తల్ సంతానంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ వ్యాధి నియాండర్తల్ పిల్లల సంఖ్య తగ్గడానికి దారితీసిందని వారు విశ్వసిస్తున్నారు. కాగా మానవ పూర్వీకులు, నియాండర్తల్‌ల మధ్య లైంగిక సంబంధాల వల్ల హెచ్‌డీఎన్‌ఎఫ్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ రుగ్మత ఇప్పుడు మానవ జాతులలో చాలా అరుదుగా పరిగణిస్తున్నప్పటికీ.. జాతుల జన్యు పూల్ చాలా పరిమితంగా ఉన్నందున ఇది నియాండర్తల్‌లో సర్వసాధారణంగా పరిగణిస్తారు.
అసలు నియాండర్తల్స్ ఎవరు?
నియాండర్తల్స్ గురించి తెలుసుకుంటే ఆధునిక మనుషుల గురించి తెలుస్తుంది. మానవులకు, నియాండర్తల్స్‌కు చాలా పోలికలున్నాయి. పుర్రె, శరీర నిర్మాణం ఒకలాగే ఉంటాయి. మనుషులకు, వాళ్లకూ డీఎన్ఏలో 99.7% దగ్గరగా ఉంది. ప్రవర్తనలో కూడా నియాండర్తల్స్‌కూ, మనుషులకు చాలా పోలికలున్నాయి. వాళ్లు కూడా మానవుల్లాగే నిప్పు పుట్టించారు. చనిపోయినవారిని ఖననం చేశారు. సముద్రపు చిప్పలు, గవ్వలు, జంతువుల దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారుచేసి ధరించేవారు. మనుషుల్లాగే రాతిమీద చిత్రాలను చెక్కారు. మందిరాలు నిర్మించారని పలు పరిశోధనల్లో పేర్కొన్నారు.
మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు..!
ఇక నియాండర్తల్స్ మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు. జింకలు, కొండ గొర్రెలు, కణుజులని పిలిచే పెద్ద పెద్ద దుప్పిలు, అడవి దున్నలు, ఖడ్గ మృగాలు, మామత్ ఏనుగులను వేటాడడానికి పదునైన ఈటెలను ఉపయోగించేవారు. వారి కుటుంబాల మీద, నివసించే ప్రాంతాల మీద ఎవరైనా దాడికి దిగితే వారు తయారు చేసుకున్న పదునైన ఆయుధాలను ఉపయోగించేరని, ఇలాంటి సంఘర్షణలు ఆ కాలంలో తరచుగా జరుగుతుండేవని పురావస్తు శాస్త్రం చెబుతోంది. సుమారు 1,00,000 సంవత్సరాలు ఆధునిక మానవుల విస్తరణను ప్రతిఘటిస్తూ వచ్చారు. ఆదిమ మానవులు (హోమో సేపియన్స్) 2,00,000 సంవత్సరాలకు పూర్వమే ఆఫ్రికా నుంచి బయటకు వచ్చినా, నియాండర్తల్స్ నివసించిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి 1,50,000 సంవత్సరాలకి పైనే పట్టిందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment