Neanderthal race
-
Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో
సాక్షి, హైదరాబాద్: మానవ జాతి పుట్టిందెలా? వానరాల నుంచి అని చెప్పడం సులువే కానీ.. మానవులను పోలిన వానరాలూ బోలెడన్ని ఉండగా పరిణామ క్రమంలో కొన్ని నశించిపోయాయి. కొన్ని అవసరాలకు తగ్గట్టుగా పరిణామం చెందుతూ నేటి ఆధునిక మానవుడు ‘హోమో సేపియన్’గా ఎదిగాయి. ఈ అద్భుత పరిణామ క్రమంలో కీలకమైన ఘట్టాలను పరిశోధించి మరీ ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఎప్పుడో అంతరించిపోయిన హోమోసేపియన్ దూరపు చుట్టం ‘నియాండెర్తల్’ జాతి జన్యుక్రమాన్ని నమోదు చేయడంతోపాటు ఇప్పటివరకూ అస్సలు గుర్తించని మరో బంధువు డెనిసోవన్ జాతిని గుర్తించినందుకు ఈ బహుమతి లభించింది. సుమారు 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో మొదలైన హోమో సేపియన్ల ప్రస్థానంలో పరిణామంలో నియాండెర్తల్, డెనిసోవన్ జాతుల జన్యువులూ చేరాయని, ఈ చేరిక ప్రభావం మనపై ఈ నాటికీ ఉందని పాబో గుర్తించారు. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల కారణంగా వచ్చే జబ్బులకు మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు మనలో చేరిన నియాండెర్తల్, డెనిసోవన్ జాతి జన్యువులపై ఆధారపడి ఉందని పాబో పరిశోధనలు చెబుతున్నాయి. ప్రత్యేక శాస్త్ర విభాగం మానవ పరిణామంపై జరుగుతున్న పరిశోధనల్లో పాబో సరికొత్త శకానికి, విభాగానికి దారి వేశానడంలో ఎలాంటి సందేహమూ లేదు. నియాండెర్తల్, డెనిసోవన్ జాతులపై పాబో చేసిన పరిశోధనల కారణంగా ఇప్పుడు ‘పాలియో జినోమిక్స్’ అనే కొత్త శాస్త్ర విభాగం ఒకటి ఉనికిలోకి వచ్చింది. హోమో సేపియన్లను, మానవుల్లాంటి ఇతర జాతులను (హోమినిన్లు) వేరు చేసే జన్యువులను గుర్తించడం ఈ శాస్త్రం ఉద్దేశం. హోమో సేసియన్లలోని ప్రత్యేక లక్షణాలను గుర్తించడం అన్నమాట. అంతరించిపోయిన హోమినిన్ జాతి హోమో సేపియన్లు ఎప్పుడో మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పరిణమించారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే నియాండెర్తల్ జాతి ఆఫ్రికాకు అవతల... స్పష్టంగా చెప్పాలంటే యూరప్, పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన వారు. నాలుగు లక్షల ఏళ్ల క్రితం నుంచి ముప్ఫై వేల ఏళ్ల క్రితం వరకూ వీరి మనుగడ కొనసాగింది. ఆ తరువాత ఈ హోమినిన్ జాతి అంతరించిపోయింది. కానీ, 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మధ్యాసియా ప్రాంతానికి వలస వెళ్లిన హోమో సేపియన్లు నియాండెర్తల్ జాతితో కలిశారని పాబో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాతి కాలంలో హోమో సేపియన్లు క్రమేపీ ప్రపంచమంతా విస్తరించారన్నమాట. ఇరు జాతులు యురేసియా ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల పాటు కలిసి జీవించాయని అంచనా. అయితే ఈ నియాండెర్తల్స్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 1990 చివరి నాటికి మానవ జన్యుక్రమ నమోదు పూర్తి కాగా.. హోమినిన్లతో మనకున్న సంబంధాలను వెతకడం మాత్రం మొదలు కాలేదు. నియాండెర్తల్స్ వంటి హోమినిన్ల జన్యుక్రమం ఏదీ అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పాబో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నియాండెర్తల్స్ డీఎన్ఏను అధ్యయనం చేసేందుకు స్వాంటే పాబో ప్రయత్నించారు. వేల ఏళ్ల క్రితం నాటి.. అంతరించి పోయిన జాతి డీఎన్ఏ దొరకడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కాలక్రమంలో ఎంతో డీఎన్ఏ నాశనమైపోయి లేశమాత్రమే మిగిలి ఉంటుంది. పైగా బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పరిణామ జీవశాస్త్ర నిపుణులు అలన్ విల్సన్ వద్ద స్వాంటే పాబో పోస్ట్ డాక్టరల్ విద్యార్థిగా నియాండెర్తల్ డీఎన్ఏ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. 1990లో జర్మనీలో మ్యూనిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పురాతన డీఎన్ఏపై పరిశోధనలను కొనసాగించిన పాబో నియాండెర్తల్‌ల మైటోకాండ్రియా నుంచి డీఎన్ఏను సేకరించి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. క్రోమోజోముల్లోని డీఎన్ఏతో పోలిస్తే ఈ మైటోకాండ్రియల్ డీఎన్ఏ కాపీలు వేల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి విశ్లేషణ విజయవంతమవుతుందని పాబో అంచనా. సుమారు 40 వేల ఏళ్ల క్రితం నాటి నియాండెర్తల్ ఎముక ముక్క నుంచి తొలిసారి ఈయన మైటోకాండ్రియల్ డీఎన్ఏను వేరు చేయగలిగారు. ఈ జన్యుక్రమంతో మానవులు, చింపాంజీల జన్యుక్రమాన్ని పోల్చి చూడటం సాధ్యమైంది. కణ కేంద్రక డీఎన్ఏను విశ్లేషించి నమోదు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్త టెక్నాలజీల సాయంతో దాదాపు అసాధ్యమనుకున్న నియాండెర్తల్ జన్యుక్రమ నమోదును 2010లో పూర్తి చేశారు. ఈ జన్యుక్రమాన్ని హోమో సేపియన్ల జన్యుక్రమంతో పోల్చి చూసినప్పుడు ఇరుజాతుల ఉమ్మడి పూర్వ జాతి భూమ్మీద సుమారు ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు తెలిసింది. వేర్వేరు ప్రాంతాల్లోని హోమోసేపియన్ల జన్యుక్రమాలను పోల్చి చూడటం ద్వారా మనకున్న ప్రత్యేకతలు తెలిశాయి. యూరోపియన్, ఆసియాకు చెందిన హోమోసేపియన్లలో 1–4 శాతం జన్యుక్రమం నియాండెర్తల్స్‌దని తెలిసింది. సరికొత్త హోమినిన్ గుర్తింపు స్వాంటే పాబో పరిశోధనల్లో అత్యంత కీలకమైంది.. డెనిసోవన్ అనే సరికొత్త హోమినిన్ జాతి గుర్తింపు. సైబీరియా ప్రాంతంలోని ఓ గుహలో లభించిన 40 వేల ఏళ్ల క్రితం నాటి చేతి వేలి ఎముక ఆధారంగా ఇది జరిగింది. మంచులో కప్పబడి ఉండటం వల్ల ఈ ఎముకలోని డీఎన్ఏకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ డీఎన్ఏ జన్యుక్రమాన్ని నమోదు చేసి నియాండెర్తల్స్, హోమోసేపియన్లతో పోల్చి చూసినప్పుడు అది ప్రత్యేకంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సరికొత్త జీవజాతికి డెనిసోవ అని పేరు పెట్టారు. తదుపరి పరిశోధనల్లో డెనిసోవన్, హోమోసేపియన్ల మధ్య జన్యువుల ఆదాన ప్రదానాలు జరిగినట్లు తెలిసింది. హోమో సేపియన్లు ఆఫ్రికా నుంచి బయటకు వచ్చే సమయానికి యూరప్ పశ్చిమ ప్రాంతంలో నియాండెర్తల్స్, తూర్పు ప్రాంతంలో డెనిసోవన్లు ఉండేవారని స్పష్టమైంది. హోమోసేపియన్లు విస్తరిస్తున్న కొద్దీ ఈ రెండు జాతులతో కలవడం కూడా ఎక్కువైంది. పరిణామక్రమంపై పరిశోధనలకు నోబెల్ స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్య శాస్త్ర నోబెల్ స్టాక్‌హోమ్: వైద్య శాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి దక్కింది. 2022 సంవత్సరానికి గాను ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మానవ పరిణామ క్రమంలో ఆయన సాగించిన విశిష్టమైన పరిశోధనలు ఆదిమ మానవుల (హోమినిన్స్) కంటే ఆధునిక మానవులు ఏ విధంగా భిన్నమో తెలియజేస్తాయని పేర్కొంది. అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ గురించి కీలక విషయాలను బహిర్గతం చేస్తాయని వెల్లడించింది. నియాండెర్తల్స్, డెనిసోవన్స్ వంటి హోమినిన్స్ జన్యువును, ఆధునిక మానవుడి జన్యువును సరిపోల్చి చూసి, రెండింటి మధ్య తేడాలను వివరించే నూతన సాంకేతికతను స్వాంటే పాబో అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. స్వాంటే పాబో తండ్రి సూనే బెర్గ్స్ట్రామ్ 1982లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో, మ్యాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో పరిశోధనలు చేశారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతను మంగళవారం, రసాయన శాస్త్రంలో విజేతను బుధవారం, సాహిత్యంలో విజేతను గురువారం, శాంతి బహుమతి విజేతను శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో విజేతను ఈ నెల 10వ తేదీన నోబెల్ కమిటీ ప్రకటించనుంది. నోబెల్ ప్రైజ్ గ్రహీతకు 9 లక్షల డాలర్ల (రూ.7.35 కోట్లు) నగదు అందజేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం జరుగనుంది. -
మనుషులతో లైంగిక సంబంధాల వల్లనే.. ఈ జాతి అంతరించిందా..?
ఓ విషయం తెలియనంత వరకు ప్రతిదీ ఓ మిస్టరీనే.. అసలు మనుషులు ఎలా వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? ఏ విధంగా పరిణామం చెందారు? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే నలభై వేల ఏళ్ల కిందట మనుగడలో ఉన్న నియాండర్తల్స్ జాతి ఎలా అంతరించిపోయిందన్నది ఇప్పటికీ ఓ రహస్యమే. సాక్షి, న్యూఢిల్లీ: 6,00,000 ఏళ్ల కిందట మానవ జాతి రెండు బృందాలుగా చీలిపోయింది. ఒక బృందం ఆఫ్రికాలో ఉండిపోయింది. ఆ బృందం నుంచే మనుషులు పరిణామం చెందినట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే మనుషులతో లైంగిక సంబంధాల వల్ల నియాండర్తల్స్ జాతి అంతరంచిపోయినట్లు తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. పీఎన్‌ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నియాండర్తల్ రక్త నమూనాలు వారి రక్తం నిర్దిష్ట జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నట్లు చూపిస్తుంది. ఇది ‘‘హెమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది ఫీటెస్ అండ్ న్యూబార్న్’’కి గురయ్యే అవకాశం ఉందని, ఈ హెచ్డీఎఫ్ఎన్ రక్తహీనతకు కారణమవుతుందని, సాధారణంగా రెండవ, మూడవ, తదుపరి గర్భధారణతో మరింత తీవ్రమవుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు. మానవులు, నియాండర్తల్‌ల మధ్య లైంగిక సంబంధాల ఫలితంగా.. అరుదైన రక్త రుగ్మత నియాండర్తల్ సంతానంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ వ్యాధి నియాండర్తల్ పిల్లల సంఖ్య తగ్గడానికి దారితీసిందని వారు విశ్వసిస్తున్నారు. కాగా మానవ పూర్వీకులు, నియాండర్తల్‌ల మధ్య లైంగిక సంబంధాల వల్ల హెచ్‌డీఎన్‌ఎఫ్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ రుగ్మత ఇప్పుడు మానవ జాతులలో చాలా అరుదుగా పరిగణిస్తున్నప్పటికీ.. జాతుల జన్యు పూల్ చాలా పరిమితంగా ఉన్నందున ఇది నియాండర్తల్‌లో సర్వసాధారణంగా పరిగణిస్తారు. అసలు నియాండర్తల్స్ ఎవరు? నియాండర్తల్స్ గురించి తెలుసుకుంటే ఆధునిక మనుషుల గురించి తెలుస్తుంది. మానవులకు, నియాండర్తల్స్‌కు చాలా పోలికలున్నాయి. పుర్రె, శరీర నిర్మాణం ఒకలాగే ఉంటాయి. మనుషులకు, వాళ్లకూ డీఎన్ఏలో 99.7% దగ్గరగా ఉంది. ప్రవర్తనలో కూడా నియాండర్తల్స్‌కూ, మనుషులకు చాలా పోలికలున్నాయి. వాళ్లు కూడా మానవుల్లాగే నిప్పు పుట్టించారు. చనిపోయినవారిని ఖననం చేశారు. సముద్రపు చిప్పలు, గవ్వలు, జంతువుల దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారుచేసి ధరించేవారు. మనుషుల్లాగే రాతిమీద చిత్రాలను చెక్కారు. మందిరాలు నిర్మించారని పలు పరిశోధనల్లో పేర్కొన్నారు. మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు..! ఇక నియాండర్తల్స్ మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు. జింకలు, కొండ గొర్రెలు, కణుజులని పిలిచే పెద్ద పెద్ద దుప్పిలు, అడవి దున్నలు, ఖడ్గ మృగాలు, మామత్ ఏనుగులను వేటాడడానికి పదునైన ఈటెలను ఉపయోగించేవారు. వారి కుటుంబాల మీద, నివసించే ప్రాంతాల మీద ఎవరైనా దాడికి దిగితే వారు తయారు చేసుకున్న పదునైన ఆయుధాలను ఉపయోగించేరని, ఇలాంటి సంఘర్షణలు ఆ కాలంలో తరచుగా జరుగుతుండేవని పురావస్తు శాస్త్రం చెబుతోంది. సుమారు 1,00,000 సంవత్సరాలు ఆధునిక మానవుల విస్తరణను ప్రతిఘటిస్తూ వచ్చారు. ఆదిమ మానవులు (హోమో సేపియన్స్) 2,00,000 సంవత్సరాలకు పూర్వమే ఆఫ్రికా నుంచి బయటకు వచ్చినా, నియాండర్తల్స్ నివసించిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి 1,50,000 సంవత్సరాలకి పైనే పట్టిందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. -
వెనుక తరాలు
టూకీగా ప్రపంచ చరిత్ర 26 అక్రమణ కోసం జరిగిన పోరాటాల్లో, ఓటమిపాలైన జాతిలోని పురుషులను హతం చేసి స్త్రీలను స్వాధీనం చేసుకోవడం విజేతల్లో కనిపించే సాధారణ స్వభావం. కానీ, నియాండర్తల్ జాతితో క్రోమాన్యాన్ మానవునికి సంకరం జరిగిన జాడలు ఏమాత్రం కనిపించవు. అలా జరిగేవుంటే, నియాండర్తల్ లక్షణాలు ఏదోవొకచోట తరువాతి తరాల్లో కనిపించాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ తెగలోనూ నియాండర్తల్ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదంటే, వర్ణసంకరం జరగలేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఒళ్ళంతా బొచ్చు, నుదురూ చుబుకమూ లేని ముఖం, పొట్టి మెడ, కురచైన ఆకారం కలిగిన నియాండర్తల్ మనిషిని బహుశా క్రోమాన్యాన్ మానవుడు జంతువుగా భావించాడో ఏమో! తన హయాం కొనసాగిన ఇరవైవేల సంవత్సరాల పొడవునా క్రోమాన్యాన్ మానవుడు ‘పాత రాతియుగం’ అలవాట్ల నుండి బయటికి రాలేదు. వేటాడడమే అతని ప్రవత్తి, రాతిపనిముట్లే ఆయుధాలు. వచ్చిన మార్పల్లా జంతుచర్మాలను ఉడుపులుగా ధరించడం, రాతిపనిముట్లను మరింత నైపుణ్యంగా తయారుచేసుకోవడం. ‘బ్లేడు’కు సమానమైన పదునుండే పనిముట్టును రాతిలోనే రూపొందించాడు. ఉలులూ, కత్తులూ, చాకులూ, ఈటెమొనలవంటి పరికరాలను ఉనికిలోని తీసుకొచ్చాడు. కొయ్యసామగ్రిని నునుపుగా తోసే చిత్రిక (తోపడ)ను తయారుచేసుకున్నాడు. రాతి పరికరాలను తోడుగా జంతువుల కొమ్ములనూ, ఎముకలనూ అనువైన ఆకారానికి మలచి వాటిని ఈటె అలుగలుగా వాడడం నేర్చుకున్నాడు. అతని సరంజామా లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి ఎముకలతో తయారైన సూదులు, గాలాలు. చివరి దశ జీవిత కాలంలో సూదులకు బెజ్జం వేసే వనరు కూడా అతడు తెలుసుకున్నాడు. వేట ఇప్పుడొక సామూహిక యజ్ఞం. అందువల్లే ధ్రువపుజింకలూ, కారుదున్నలూ, బొచ్చు ఏనుగుల వంటి పెద్దపెద్ద జంతువులను వేటాడడం అతనికి సాధ్యపడింది. అపాయకరమైన అంతటి ప్రయత్నం నిర్వహించాలంటే వేటగాళ్ళ మధ్య సమన్వయం కుదరాలి. సమన్వయం కుదరాలంటే, ఎంత ప్రాథమికమైనదైనా సరే, భాషంటూ ఒకటి ఏర్పడివుండాలి. క్రోమాన్యాన్ మానవుని మెదడుకు ఆ వసతి ఉంది; గొంతులోనూ అందుకు వసతి ఏర్పడింది. వాళ్ళ భాషలో పొడవాటి వాక్యాలు ఉండకపోయినా, కనీసం కొన్ని నామవాచకాలను కొన్ని క్రియలతో అన్వయించేమేరకు మాటలు ఏర్పడి వుండాలి. అవి కేవలం వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేందుకు పరిమితమైన సంకేతాలే కావచ్చు. లేదా, కొన్ని మాటలూ, జంతువులను అనుకరించే కూతలూ కలిపి, అభినయ ప్రధానంగా - మనకు తెలిసిన ‘పులి ఆట’లాగా - జంతువులను గురించీ వేట గురించీ పిల్లలకు పరిచయం చేసే పాఠాలు చెప్పి ఉండొచ్చు. మొత్తం మీద ఒకరినొకరు గుర్తించుకునేందుకు అవసరమైన నామాలు - అంటే వ్యక్తులకు కేటాయించే ‘పేర్లు’- అప్పట్లో ఏర్పడకపోయేందుకు వీలే కనిపించదు. ఆ పరిధిని దాటి నిర్వహించే వ్యవహారాలు వాళ్ళకు లేవు. వాళ్ళు నివసించింది కేవలం చిన్న చిన్న గుంపులుగా. ఒక గుంపు నివసించే తావుకూ మరో గుంపు నివసించే తావుకూ ఎంతలేదన్నా వందలమైళ్ళు ఎడం. అందువల్ల, గుంపుల మధ్య సంబంధాలు ఏర్పడిన తరువాతగానీ భాషకు వ్యవహారిక స్వరూపం ఏర్పడివుండదు. క్రోమాన్యాన్ మానవుడు వేటాడిన జంతువుల్లో గుర్రం ఎముకలు అత్యధికంగా కనిపిస్తుండడంతో అతనికి గుర్రం మాంసం ప్రీతిదాయకమని అర్థమౌతుంది. ఫ్రాన్సులోని ‘సాలుత్రే’ లోయలో ధ్రువపుజింక, బొచ్చు ఏనుగు, కారుదున్న అస్థికలతోపాటు కనిపించే గుర్రపు ఎముకల ప్రోవు ఈ సంగతిని నిరూపిస్తుంది. దాన్ని గురించి వివరిస్తూ - ఆ ప్రాంతంలో ఎన్నో తరాల క్రోమాన్యాన్ మానవులు నివసించారనీ, బరిసెలతో కాగడాలతో గుర్రపు మందను చుట్టుముట్టి వడుపుగా ఆ లోయవైపుకు తరుముకుపోయి, అవి అందులో దూకి చనిపోయేలా చేయడం సులువైన వేటమార్గంగా ఆచరించారనీ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి, పొంచి ఉండి జంతువులను అనుసరించడం, వాటి అలవాట్లనూ, ఉద్రేకాలనూ నిశితంగా గమనించడం క్రోమాన్యాన్ మానవుని పరిశోధనలో ప్రధానమైందిగా మనకు అర్థమౌతుంది. బ్రతుకుతెరువుకోసం అనుసరించిన ఆ పరిశీలనే అతన్ని అద్భుతమైన కళాకారునిగాగూడా తీర్చిదిద్దింది. రచన: ఎం.వి.రమణారెడ్డి