వెనుక తరాలు
టూకీగా ప్రపంచ చరిత్ర 26
అక్రమణ కోసం జరిగిన పోరాటాల్లో, ఓటమిపాలైన జాతిలోని పురుషులను హతం చేసి స్త్రీలను స్వాధీనం చేసుకోవడం విజేతల్లో కనిపించే సాధారణ స్వభావం. కానీ, నియాండర్‌తల్ జాతితో క్రోమాన్యాన్ మానవునికి సంకరం జరిగిన జాడలు ఏమాత్రం కనిపించవు. అలా జరిగేవుంటే, నియాండర్‌తల్ లక్షణాలు ఏదోవొకచోట తరువాతి తరాల్లో కనిపించాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ తెగలోనూ నియాండర్‌తల్ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదంటే, వర్ణసంకరం జరగలేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఒళ్ళంతా బొచ్చు, నుదురూ చుబుకమూ లేని ముఖం, పొట్టి మెడ, కురచైన ఆకారం కలిగిన నియాండర్‌తల్ మనిషిని బహుశా క్రోమాన్యాన్ మానవుడు జంతువుగా భావించాడో ఏమో!
తన హయాం కొనసాగిన ఇరవైవేల సంవత్సరాల పొడవునా క్రోమాన్యాన్ మానవుడు ‘పాత రాతియుగం’ అలవాట్ల నుండి బయటికి రాలేదు. వేటాడడమే అతని ప్రవత్తి, రాతిపనిముట్లే ఆయుధాలు. వచ్చిన మార్పల్లా జంతుచర్మాలను ఉడుపులుగా ధరించడం, రాతిపనిముట్లను మరింత నైపుణ్యంగా తయారుచేసుకోవడం. ‘బ్లేడు’కు సమానమైన పదునుండే పనిముట్టును రాతిలోనే రూపొందించాడు. ఉలులూ, కత్తులూ, చాకులూ, ఈటెమొనలవంటి పరికరాలను ఉనికిలోని తీసుకొచ్చాడు. కొయ్యసామగ్రిని నునుపుగా తోసే చిత్రిక (తోపడ)ను తయారుచేసుకున్నాడు. రాతి పరికరాలను తోడుగా జంతువుల కొమ్ములనూ, ఎముకలనూ అనువైన ఆకారానికి మలచి వాటిని ఈటె అలుగలుగా వాడడం నేర్చుకున్నాడు. అతని సరంజామా లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి ఎముకలతో తయారైన సూదులు, గాలాలు. చివరి దశ జీవిత కాలంలో సూదులకు బెజ్జం వేసే వనరు కూడా అతడు తెలుసుకున్నాడు.
వేట ఇప్పుడొక సామూహిక యజ్ఞం.
అందువల్లే ధ్రువపుజింకలూ, కారుదున్నలూ, బొచ్చు ఏనుగుల వంటి పెద్దపెద్ద జంతువులను వేటాడడం అతనికి సాధ్యపడింది. అపాయకరమైన అంతటి ప్రయత్నం నిర్వహించాలంటే వేటగాళ్ళ మధ్య సమన్వయం కుదరాలి. సమన్వయం కుదరాలంటే, ఎంత ప్రాథమికమైనదైనా సరే, భాషంటూ ఒకటి ఏర్పడివుండాలి. క్రోమాన్యాన్ మానవుని మెదడుకు ఆ వసతి ఉంది; గొంతులోనూ అందుకు వసతి ఏర్పడింది. వాళ్ళ భాషలో పొడవాటి వాక్యాలు ఉండకపోయినా, కనీసం కొన్ని నామవాచకాలను కొన్ని క్రియలతో అన్వయించేమేరకు మాటలు ఏర్పడి వుండాలి. అవి కేవలం వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేందుకు పరిమితమైన సంకేతాలే కావచ్చు. లేదా, కొన్ని మాటలూ, జంతువులను అనుకరించే కూతలూ కలిపి, అభినయ ప్రధానంగా - మనకు తెలిసిన ‘పులి ఆట’లాగా - జంతువులను గురించీ వేట గురించీ పిల్లలకు పరిచయం చేసే పాఠాలు చెప్పి ఉండొచ్చు. మొత్తం మీద ఒకరినొకరు గుర్తించుకునేందుకు అవసరమైన నామాలు - అంటే వ్యక్తులకు కేటాయించే ‘పేర్లు’- అప్పట్లో ఏర్పడకపోయేందుకు వీలే కనిపించదు. ఆ పరిధిని దాటి నిర్వహించే వ్యవహారాలు వాళ్ళకు లేవు. వాళ్ళు నివసించింది కేవలం చిన్న చిన్న గుంపులుగా. ఒక గుంపు నివసించే తావుకూ మరో గుంపు నివసించే తావుకూ ఎంతలేదన్నా వందలమైళ్ళు ఎడం. అందువల్ల, గుంపుల మధ్య సంబంధాలు ఏర్పడిన తరువాతగానీ భాషకు వ్యవహారిక స్వరూపం ఏర్పడివుండదు.
క్రోమాన్యాన్ మానవుడు వేటాడిన జంతువుల్లో గుర్రం ఎముకలు అత్యధికంగా కనిపిస్తుండడంతో అతనికి గుర్రం మాంసం ప్రీతిదాయకమని అర్థమౌతుంది. ఫ్రాన్సులోని ‘సాలుత్రే’ లోయలో ధ్రువపుజింక, బొచ్చు ఏనుగు, కారుదున్న అస్థికలతోపాటు కనిపించే గుర్రపు ఎముకల ప్రోవు ఈ సంగతిని నిరూపిస్తుంది. దాన్ని గురించి వివరిస్తూ - ఆ ప్రాంతంలో ఎన్నో తరాల క్రోమాన్యాన్ మానవులు నివసించారనీ, బరిసెలతో కాగడాలతో గుర్రపు మందను చుట్టుముట్టి వడుపుగా ఆ లోయవైపుకు తరుముకుపోయి, అవి అందులో దూకి చనిపోయేలా చేయడం సులువైన వేటమార్గంగా ఆచరించారనీ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి, పొంచి ఉండి జంతువులను అనుసరించడం, వాటి అలవాట్లనూ, ఉద్రేకాలనూ నిశితంగా గమనించడం క్రోమాన్యాన్ మానవుని పరిశోధనలో ప్రధానమైందిగా మనకు అర్థమౌతుంది. బ్రతుకుతెరువుకోసం అనుసరించిన ఆ పరిశీలనే అతన్ని అద్భుతమైన కళాకారునిగాగూడా తీర్చిదిద్దింది.
రచన: ఎం.వి.రమణారెడ్డి