Ancient humans
-
మనుషులతో లైంగిక సంబంధాల వల్లనే.. ఈ జాతి అంతరించిందా..?
ఓ విషయం తెలియనంత వరకు ప్రతిదీ ఓ మిస్టరీనే.. అసలు మనుషులు ఎలా వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? ఏ విధంగా పరిణామం చెందారు? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే నలభై వేల ఏళ్ల కిందట మనుగడలో ఉన్న నియాండర్తల్స్ జాతి ఎలా అంతరించిపోయిందన్నది ఇప్పటికీ ఓ రహస్యమే. సాక్షి, న్యూఢిల్లీ: 6,00,000 ఏళ్ల కిందట మానవ జాతి రెండు బృందాలుగా చీలిపోయింది. ఒక బృందం ఆఫ్రికాలో ఉండిపోయింది. ఆ బృందం నుంచే మనుషులు పరిణామం చెందినట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే మనుషులతో లైంగిక సంబంధాల వల్ల నియాండర్తల్స్ జాతి అంతరంచిపోయినట్లు తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. పీఎన్‌ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నియాండర్తల్ రక్త నమూనాలు వారి రక్తం నిర్దిష్ట జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నట్లు చూపిస్తుంది. ఇది ‘‘హెమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది ఫీటెస్ అండ్ న్యూబార్న్’’కి గురయ్యే అవకాశం ఉందని, ఈ హెచ్డీఎఫ్ఎన్ రక్తహీనతకు కారణమవుతుందని, సాధారణంగా రెండవ, మూడవ, తదుపరి గర్భధారణతో మరింత తీవ్రమవుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు. మానవులు, నియాండర్తల్‌ల మధ్య లైంగిక సంబంధాల ఫలితంగా.. అరుదైన రక్త రుగ్మత నియాండర్తల్ సంతానంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ వ్యాధి నియాండర్తల్ పిల్లల సంఖ్య తగ్గడానికి దారితీసిందని వారు విశ్వసిస్తున్నారు. కాగా మానవ పూర్వీకులు, నియాండర్తల్‌ల మధ్య లైంగిక సంబంధాల వల్ల హెచ్‌డీఎన్‌ఎఫ్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ రుగ్మత ఇప్పుడు మానవ జాతులలో చాలా అరుదుగా పరిగణిస్తున్నప్పటికీ.. జాతుల జన్యు పూల్ చాలా పరిమితంగా ఉన్నందున ఇది నియాండర్తల్‌లో సర్వసాధారణంగా పరిగణిస్తారు. అసలు నియాండర్తల్స్ ఎవరు? నియాండర్తల్స్ గురించి తెలుసుకుంటే ఆధునిక మనుషుల గురించి తెలుస్తుంది. మానవులకు, నియాండర్తల్స్‌కు చాలా పోలికలున్నాయి. పుర్రె, శరీర నిర్మాణం ఒకలాగే ఉంటాయి. మనుషులకు, వాళ్లకూ డీఎన్ఏలో 99.7% దగ్గరగా ఉంది. ప్రవర్తనలో కూడా నియాండర్తల్స్‌కూ, మనుషులకు చాలా పోలికలున్నాయి. వాళ్లు కూడా మానవుల్లాగే నిప్పు పుట్టించారు. చనిపోయినవారిని ఖననం చేశారు. సముద్రపు చిప్పలు, గవ్వలు, జంతువుల దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారుచేసి ధరించేవారు. మనుషుల్లాగే రాతిమీద చిత్రాలను చెక్కారు. మందిరాలు నిర్మించారని పలు పరిశోధనల్లో పేర్కొన్నారు. మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు..! ఇక నియాండర్తల్స్ మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు. జింకలు, కొండ గొర్రెలు, కణుజులని పిలిచే పెద్ద పెద్ద దుప్పిలు, అడవి దున్నలు, ఖడ్గ మృగాలు, మామత్ ఏనుగులను వేటాడడానికి పదునైన ఈటెలను ఉపయోగించేవారు. వారి కుటుంబాల మీద, నివసించే ప్రాంతాల మీద ఎవరైనా దాడికి దిగితే వారు తయారు చేసుకున్న పదునైన ఆయుధాలను ఉపయోగించేరని, ఇలాంటి సంఘర్షణలు ఆ కాలంలో తరచుగా జరుగుతుండేవని పురావస్తు శాస్త్రం చెబుతోంది. సుమారు 1,00,000 సంవత్సరాలు ఆధునిక మానవుల విస్తరణను ప్రతిఘటిస్తూ వచ్చారు. ఆదిమ మానవులు (హోమో సేపియన్స్) 2,00,000 సంవత్సరాలకు పూర్వమే ఆఫ్రికా నుంచి బయటకు వచ్చినా, నియాండర్తల్స్ నివసించిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి 1,50,000 సంవత్సరాలకి పైనే పట్టిందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. -
పురాతన మనిషికి, మనకు మధ్య ‘డ్రాగన్ మ్యాన్’
ఆరేడు అడుగులకుపైనే ఎత్తు.. పెద్ద పెద్ద కళ్లు.. పెద్ద మెదడు.. బలమైన శరీరం.. అతనో ‘డ్రాగన్ మ్యాన్’. ఇప్పుడున్నట్టు పూర్తి స్థాయి మనిషి కాదు.. అలాగని ఒకనాటి అడవి జీవి వంటివాడూ కాదు. మనకు, పురాతన మానవులకు మధ్యలో వారధి అతడు. మొదట్లో మనుషులు ఎలా ఉండేవారు? ఏం చేసే వారు అన్న దానిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సినిమాటిక్‌గా దొరికాడు. ఈ ‘డ్రాగన్ మ్యాన్’ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ‘డ్రాగన్ మ్యాన్’ వెనుక చాలా కథ ఉంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్లో చరిత్ర ఉంది. 1933లో చైనాలో చాలా భాగం జపాన్ ఆక్రమణలో ఉండేది. జపాన్ పరిశోధకులు చైనా ఉత్తర ప్రాంతంలో హేలోంగ్ జియాంగ్ ప్రావిన్స్‌లోని హర్బిన్ పట్టణం వద్ద పురావస్తు తవ్వకాలు చేపట్టారు. చైనాకు చెందిన ఒకాయన (పేరును వెల్లడించలేదు)ను లేబర్ కాంట్రాక్టర్‌గా పెట్టుకున్నారు. ఆయన స్థానిక పనివాళ్లను తెచ్చుకుని తవ్వకాలు జరిపేవాడు. ఈ సందర్భంగా ఓసారి పురాతన పుర్రె ఒకటి బయటపడింది. ఆక్రమణదారులకు దానిని ఇవ్వడం ఇష్టం లేని చైనా కాంట్రాక్టర్.. పుర్రెను తీసుకెళ్లి ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టాడు. సంపదను అలా పాతి దాచుకోవడం చైనాలో ఓ సాంప్రదాయం. అలా ఆ పుర్రె 85 ఏళ్లు బావిలోనే ఉండిపోయింది. ఆయన చనిపోయే ముందు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో వారు ‘నిధి’ వేటకు బయలుదేరారు. చాలా ఏళ్లు గడిచిపోవడంతో.. ఆయన చెప్పిన ఆనవాళ్లను, మారిన పరిస్థితులను లింక్ చేసుకుంటూ వెతకడం మొదలుపెట్టారు. చివరికి 2018లో ఆ పుర్రెను తవ్వి తీశారు. కొద్దిరోజుల తర్వాత చైనాలోని హెబీ జియో యూనివర్సిటీ మ్యూజియానికి అందజేశారు. పుర్రె ‘చరిత్ర’ను తెలుసుకున్న అధికారులు.. శాస్త్రవేత్తలకు సమాచారం ఇవ్వడంతో దాని ప్రాధాన్యత ఏమిటో బయటపడింది. పెద్ద కనుబొమ్మలు.. పెద్ద మెదడు కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు తెచ్చిన పుర్రెను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా గుర్తించని కొత్త జాతికి చెందినదని తేల్చి పరిశోధన చేపట్టారు. మానవ జాతికి చాలా దగ్గరి పోలికలు ఉన్నట్టు గుర్తించారు. ఈ జాతికి ‘హోమో లోంగి’అని.. ముద్దుగా ‘డ్రాగన్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ స్ట్రింగర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘మానవ జాతికి పూర్వీకులుగా ఇప్పటివరకు భావిస్తున్న అన్ని జాతుల్లోనూ మెదడు, కళ్లు బాగా చిన్నగా ఉంటాయి. కానీ ఈ కొత్త జాతిలో మెదడు ఆధునిక మానవుల కంటే కాస్త పెద్దగా ఉంది. కళ్లు, ముక్కు, దవడలు, దంతాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముఖం ఎత్తు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉంది. దవడ ఎముకల నిర్మాణం కూడా ఆధునిక మానవుల తరహాలో ఉంది. తల నిర్మాణాన్ని బట్టి ఆరేడు అడుగుల ఎత్తుతో, బలిష్టమైన శరీరంతో ఉండి ఉండొచ్చు. అయితే కనుబొమ్మల ప్రాంతంలో పుర్రె ఉబ్బెత్తుగా ఉంది. ఇది చాలా విచిత్రం. అది వానరాల నుంచి మనుషులు అభివృద్ధి చెందడం మొదలైన పురాతన కాలం నాటి లక్షణం’’ అని తెలిపారు. ఎవరీ డ్రాగన్ మ్యాన్..? ఈ డ్రాగన్ మ్యాన్ పుర్రెను కార్బన్ డేటింగ్ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అది లక్షా 46 వేల సంవత్సరాల కిందటిదని తేల్చారు. సుమారు 50 ఏళ్ల వయసులో మరణించిన మగవాడి పుర్రెగా అంచనా వేశారు. ఆధునిక మానవులకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉండటంతోపాటు ప్రిమిటివ్స్ (కోతులు, చింపాంజీల వంటి మూల జాతుల) లక్షణాలు కూడా ‘డ్రాగన్ మ్యాన్’ పుర్రెలో గుర్తించారు. ఈ జాతివారు జంతువులను, పక్షులను వేటాడేవారని, పండ్లు, కూరగాయలను కూడా ఆహారంగా తీసుకునే వారని పరిశోధనలో పాల్గొన్న హెబీ జియో యూనివర్సిటీ శాస్త్రవేత్త క్సిజెన్ ని వెల్లడించారు. పుర్రె దొరికిన ప్రాంతం, పరిస్థితుల ఆధారంగా చూస్తే.. ఈ జాతివాళ్లు కఠినమైన, చలి ఎక్కువగా ఉండే వాతావరణాన్ని కూడా తట్టుకునే వారని అంచనా వేస్తున్నామన్నారు. ఇన్నాళ్లూ మనుషులకు సోదర జాతి నియండెర్తల్ మానవులే అన్న అంచనాలు ఉన్నాయని.. ఇప్పుడీ డ్రాగన్ మ్యాన్ వల్ల మానవ జాతి పరిణామక్రమంలో మార్పులు చేయాల్సి రానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులంతా కూడా హోమో సెపియన్స్ అనే ఆధునిక జాతికి చెందినవారని వివరించారు. పరిణామక్రమంలో సుమారు 70 లక్షల ఏళ్లనాటి నుంచి 40 వేల ఏళ్ల కిందటి వరకు సుమారు 21 జాతుల మానవులు జీవించారని తెలిపారు. -
జయ్యారంలో ఆదిమానవుల ఆనవాళ్లు
మరిపెడ : మండలంలోని జయ్యారంలో ఆదిమానవులు జీవించినట్లుగా భావిస్తున్నా రు. ఈ మేరకు సమాధులు బయటపడినట్లు చెబుతుండ గా.. ఆచార్య నాగార్జున యూ నివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఇస్లావత్ సుధాకర్ ఆదివారం వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తన పరిశోధనలో భా గంగా గతంలోనూ పలుచోట్ల ఆదిమ మానవుల సమా«ధులను గుర్తించానన్నారు. ప్రస్తుతం జయ్యారంలో గుర్తించినవి కూడా మూడు వేల ఏళ్ల క్రితం నాటివన్నారు. అప్పట్లో ఓ వ్యక్తి మృతి చెందితే గొయ్యి తవ్వి మృతదేహాన్ని నాలుగు రాళ్ల మధ్య ఉంచి చుట్టూ బండలు ఏర్పాటు చేసేవారని, మృతుల ఆయుధాలు, పరికరాలు సమాధిలో పూడ్చేవారన్నారు. వీటిని ఇనుపయుగం సమాధులుగా పిలుస్తారన్నారు. ఇలాంటి సమాధులు జయ్యారం శివారులో వంద వరకు ఉండగా.. పలువురు రైతులు వ్యవసాయం చేయడంతో యాభై వరకు మిగిలాయి. -
వాచ్.. వాస్తవాలు...
ప్రస్తుత బిజీ ప్రపంచంలో గడియారం లేకపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం. మనకు క్రమశిక్షణ, కచ్చితత్వం నేర్పించేది గడియారమే. అందుకే గాంధీ గారికి ఇష్టమైన వస్తువుగా ఎప్పుడూ ఆయనతోనే ఉండేది. నిజానికి గడియారాన్ని కనిపెట్టక ముందు నుంచీ సమయాన్ని తెలుసుకోవడానికి మన పూర్వీకులు ఎంతో శ్రమించారు. ప్రాచీన మానవులు సన్ డయల్, క్యాండిల్ వాచ్ లాంటి పరికరాలతో సమయాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. అయితే వాచ్‌ల రాకతో కచ్చితత్వం పెరిగింది. కొన్ని నిజాలు: * సమయాన్ని తెలుసుకోవడాన్ని ఈజిప్షియన్లు ప్రారంభించారనడానికి ఆధారాలున్నాయి. పగటిపూట మాత్రమే పనిచేసే ‘సన్ డయల్’ సహాయంతో వీరు సమయాన్ని లెక్కగట్టేవారట! * ట్యూడర్ రాజుల కాలంలో జేబు గడియారాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకించి నాలుగో హెన్రీ చక్రవర్తి కాలంలో గడియారాలు చాలా పెద్దవిగా ఉండేవట. ఎంతలా అంటే ప్రజలు వాటిని మెడలో వేలాడదీసుకునేంత! * మొట్టమొదటి చేతిగడియారాన్ని 1868లో పాటిక్ ఫిలిప్పీ అనే వ్యక్తి తయారుచేశాడు. * మొదటి ప్రపంచయుద్ధం వరకూ చేతిగడియారాలు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటివరకూ ఆడవారి ఆభరణాల్లో ఒకటిగా దీన్ని భావించారు. అయితే ఈ యుద్ధంలో గడియారాలను మెడకు ధరించడానికి బదులుగా చేతికి ధరించాల్సిరావడంతో వీటికి ఎనలేని పాపులారిటీ వచ్చేసింది. * డిజిటల్ వాచ్‌లను ప్రపంచానికి అందించిన ఘనత దిమిత్రోఫ్ పెట్రోఫ్కు దక్కుతుంది. ఈయన నాసాలో ఇంజినీర్‌గా పనిచేశారు. * మెకానికల్ వాచ్‌లు క్వార్జ్ వాచ్‌లతో పోల్చితే అంత మెరుగైన పనితీరు చూపించవట. క్వార్జ్ వాచ్‌లను తొలిసారిగా 1969లో ప్రవేశపెట్టారు. * షాపుల్లో అమ్మకానికి పెట్టే గడియారం ఎప్పుడూ 10 గం. 10 నిమిషాలనే సూచిస్తుంది. దీని ఉద్దేశం వినియోగదారుణ్ని ఆకర్షించడమే. ఈ సమయం దగ్గర గడియారం నవ్వు ముఖం పెట్టినట్టుగా కనిపిస్తుందట. దీంతో కష్టమర్లు దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తారనేది వ్యాపారుల భావన! * ఎలాంటి పరిస్థితుల్లోనైనా కచ్చితమైన సమయాన్ని చూపించే వాచ్‌గా ‘రోలెక్స్’కు పేరుంది. 1953లో తొలిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ ఈ వాచీనే ధరించాడట. 1960లో యూఎస్ నేవీ జలాంతర్గామి 35,798 అడుగుల లోతులో ప్రయాణించినప్పుడు కూడా దీన్ని పరీక్షించారట. అయితే ఒక్క సెకను కూడా తేడా లేకుండా ఇది సమయాన్ని చూపించిందని చెబుతారు.