వాచ్.. వాస్తవాలు...
ప్రస్తుత బిజీ ప్రపంచంలో గడియారం లేకపోతే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం. మనకు క్రమశిక్షణ, కచ్చితత్వం నేర్పించేది గడియారమే. అందుకే గాంధీ గారికి ఇష్టమైన వస్తువుగా ఎప్పుడూ ఆయనతోనే ఉండేది. నిజానికి గడియారాన్ని కనిపెట్టక ముందు నుంచీ సమయాన్ని తెలుసుకోవడానికి మన పూర్వీకులు ఎంతో శ్రమించారు. ప్రాచీన మానవులు సన్ డయల్, క్యాండిల్ వాచ్ లాంటి పరికరాలతో సమయాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. అయితే వాచ్‌ల రాకతో కచ్చితత్వం పెరిగింది.
కొన్ని నిజాలు:
* సమయాన్ని తెలుసుకోవడాన్ని ఈజిప్షియన్లు ప్రారంభించారనడానికి ఆధారాలున్నాయి. పగటిపూట మాత్రమే పనిచేసే ‘సన్ డయల్’ సహాయంతో వీరు సమయాన్ని లెక్కగట్టేవారట!
* ట్యూడర్ రాజుల కాలంలో జేబు గడియారాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకించి నాలుగో హెన్రీ చక్రవర్తి కాలంలో గడియారాలు చాలా పెద్దవిగా ఉండేవట. ఎంతలా అంటే ప్రజలు వాటిని మెడలో వేలాడదీసుకునేంత!
* మొట్టమొదటి చేతిగడియారాన్ని 1868లో పాటిక్ ఫిలిప్పీ అనే వ్యక్తి తయారుచేశాడు.
* మొదటి ప్రపంచయుద్ధం వరకూ చేతిగడియారాలు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటివరకూ ఆడవారి ఆభరణాల్లో ఒకటిగా దీన్ని భావించారు. అయితే ఈ యుద్ధంలో గడియారాలను మెడకు ధరించడానికి బదులుగా చేతికి ధరించాల్సిరావడంతో వీటికి ఎనలేని పాపులారిటీ వచ్చేసింది.
* డిజిటల్ వాచ్‌లను ప్రపంచానికి అందించిన ఘనత దిమిత్రోఫ్ పెట్రోఫ్‌కు దక్కుతుంది. ఈయన నాసాలో ఇంజినీర్‌గా పనిచేశారు.
* మెకానికల్ వాచ్‌లు క్వార్జ్ వాచ్‌లతో పోల్చితే అంత మెరుగైన పనితీరు చూపించవట. క్వార్జ్ వాచ్‌లను తొలిసారిగా 1969లో ప్రవేశపెట్టారు.
* షాపుల్లో అమ్మకానికి పెట్టే గడియారం ఎప్పుడూ 10 గం. 10 నిమిషాలనే సూచిస్తుంది. దీని ఉద్దేశం వినియోగదారుణ్ని ఆకర్షించడమే. ఈ సమయం దగ్గర గడియారం నవ్వు ముఖం పెట్టినట్టుగా కనిపిస్తుందట. దీంతో కష్టమర్లు దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తారనేది వ్యాపారుల భావన!
* ఎలాంటి పరిస్థితుల్లోనైనా కచ్చితమైన సమయాన్ని చూపించే వాచ్‌గా ‘రోలెక్స్’కు పేరుంది. 1953లో తొలిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ ఈ వాచీనే ధరించాడట. 1960లో యూఎస్ నేవీ జలాంతర్గామి 35,798 అడుగుల లోతులో ప్రయాణించినప్పుడు కూడా దీన్ని పరీక్షించారట. అయితే ఒక్క సెకను కూడా తేడా లేకుండా ఇది సమయాన్ని చూపించిందని చెబుతారు.