48 గంటలకోసారి ‘కీ’ ఇవ్వాలి..
చార్‌కమాన్ వైపు వినిపించే గంటల చప్పుడు
చెక్కతో వాచ్ ముల్లులు తయారు
చార్మినార్: నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ కట్టడానికి నలువైపుల ఏర్పాటు చేసిన గడియారాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి రిపేర్‌కి వచి్చంది. వాచ్‌లోని 4–5 అంకెల నడుమ సిరామిక్ మెటల్ పగిలిపోవడంతో 12 గంటల పాటు సమయం నిలిచిపోయింది. వెంటనే బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ గడియారాల పనితీరును ఒకసారి పరిశీలిస్తే...
నిజాం కాలంలో...
నిజాం కాలంలో అంటే.. 1889లోనే చార్మినార్ కట్టడానికి నలువైపులా ఈ గడియారాన్ని నిర్మించారు. అప్పట్లో స్థానిక ప్రజలకు సమయం తెలియడం కోసం నిర్మించిన ఈ గడియారంలోని సెరామిక్ మెటల్ ఇటీవల పగిలిపోవడంతో దాదాపు 12 గంటల పాటు సమయం నిలిచిపో యింది. నాలుగింట్లో జీహెచ్‌యంసీ సర్దార్ మహాల్ భవనం (తూర్పు) వైపు ఉన్న ఈ గడియారం మొరాయించింది.
1942 నుంచి వాహెద్ వాచ్ కంపెనీ పర్యవేక్షణలో...
1942 నుంచి లాడ్‌బజార్‌లోని వాహెద్ వాచ్ కంపెనీ యాజమాన్యం చార్మినార్ గడియారం పని తీరును పర్యవేక్షిస్తుంది. అప్పట్లో మోతీగల్లిలో ఉండే సికిందర్ ఖాన్ ఈ గడియారాలకు మరమ్మతులు, పర్యవేక్షణ బాధ్యతలను చూసే వారు. ఆయన మరణానంతరం 1962 నుంచి లాడ్‌బాజర్‌లోని గులాం మహ్మద్ రబ్బానీ మరమ్మతు పనులను చూస్తున్నారు.
పావురాలు తిష్ట వేయడంతో..
విషయం తెలిసిన వెంటనే చార్మినార్ కట్టడం కన్జర్వేషన్ క్యూరేటర్ రాజేశ్వరి సంబంధిత వాహెద్ వాచ్ కంపెనీ టెక్నీషియన్స్‌తో మరమ్మతులు చేయించడంతో సమయం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గడియారాన్ని మూసి వేయడానికి అవకాశాలు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో అప్పుడప్పుడు సమయం చూపించే ముల్లులపై పావురాలు కూర్చుంటుండడంతో వాటి బరువుకు సమస్యలు తలెత్తుతున్నాయని క్యూరేటర్ రాజేశ్వరి స్పష్టం చేశారు. నాలుగింట్లో చార్‌కమాన్ వైపు గంటల శబ్దం వినిపించే గడియారం.. ఐదు అడుగుల వ్యాసార్ధంతో గుండ్రంగా ఐరన్ మెటల్‌తో ఏర్పాటు చేశారు.
లోపల సిరామిక్ మెటల్‌తో రూపొందించారు. గడియారంలోని అంకెలను చెక్కతో ఏర్పాటు చేశారు. ఇక గంటల ముల్లులను ఐరన్ మెటల్‌తో తయారు చేయించి అమర్చారు. గంట ముల్లు దాదాపు మూడు అడుగుల పొడవు, నిముషాల ముల్లు నాలుగ అడుగుల పొడవు ఉన్నట్లు వాహెద్ వాచ్ కంపెనీ యజమాని గులాం మహ్మద్ రబ్బానీ తెలిపారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, సర్దార్ మహాల్ వైపు నాలుగు గడియారాలను ఏర్పాటు చేయగా.. ఇందులో కేవలం చార్‌కమాన్ వైపు గడియారం ప్రతి గంటకూ శబ్దం చేస్తుంది. అయితే నాలుగు గడియారాల్లో ఈ ఒక్కదానికే సౌండ్ సిస్టం ఉందంటున్నారు.
48 గంటలకోసారి...
నలువైపుల ఉన్న గడియారాలకు ప్రతి 48 గంటలకొకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘కీ’వాహెద్ వాచ్ కంపెనీ వద్ద ఉంటుంది. దాదాపు అర గంటలో ఈ ‘కీ’ ఇవ్వడం పూర్తి చేస్తారు సిబ్బంది. చేతితో ఇచ్చే ఈ ‘కీ’ని సకాలంలో ఇవ్వకపోతే గడియారాలు పనిచేయవు.
నిరంతర పర్యవేక్షణలో...
ఏళ్ల తరబడి తమ వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో చార్మినార్ గడియారాల పని తీరును పర్యవేక్షిస్తున్నాం. వాచ్ మోరాయిస్తుందని తెలిసిన వెంటనే మరమ్మతు చేస్తాం. 1995లో సాలార్‌జంగ్ మ్యూజియం గడియారం పనిచేయకపోతే.. మేమే మరమ్మతు చేశాం.
– గులాం మహ్మద్ రబ్బానీ–వాహెద్ వాచ్ కంపెనీ యజమాని
Comments
Please login to add a commentAdd a comment