పురాతన మనిషికి, మనకు మధ్య ‘డ్రాగన్‌ మ్యాన్‌’ | Scientists examine the skull of a dragon man through carbon dating | Sakshi
Sakshi News home page

పురాతన మనిషికి, మనకు మధ్య ‘డ్రాగన్‌ మ్యాన్‌’

Published Sun, Jun 27 2021 5:23 AM | Last Updated on Sun, Jun 27 2021 7:14 AM

Scientists examine the skull of a dragon man through carbon dating - Sakshi

ఆరేడు అడుగులకుపైనే ఎత్తు.. పెద్ద పెద్ద కళ్లు.. పెద్ద మెదడు.. బలమైన శరీరం.. అతనో ‘డ్రాగన్‌ మ్యాన్‌’. ఇప్పుడున్నట్టు పూర్తి స్థాయి మనిషి కాదు.. అలాగని ఒకనాటి అడవి జీవి వంటివాడూ కాదు. మనకు, పురాతన మానవులకు మధ్యలో వారధి అతడు. మొదట్లో మనుషులు ఎలా ఉండేవారు? ఏం చేసే వారు అన్న దానిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సినిమాటిక్‌గా దొరికాడు. ఈ ‘డ్రాగన్‌ మ్యాన్‌’ విశేషాలు ఏంటో తెలుసుకుందామా?     
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

‘డ్రాగన్‌ మ్యాన్‌’ వెనుక చాలా కథ ఉంది. ఓ హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో చరిత్ర ఉంది. 1933లో చైనాలో చాలా భాగం జపాన్‌ ఆక్రమణలో ఉండేది. జపాన్‌ పరిశోధకులు చైనా ఉత్తర ప్రాంతంలో హేలోంగ్‌ జియాంగ్‌ ప్రావిన్స్‌లోని హర్బిన్‌ పట్టణం వద్ద పురావస్తు తవ్వకాలు చేపట్టారు. చైనాకు చెందిన ఒకాయన (పేరును వెల్లడించలేదు)ను లేబర్‌ కాంట్రాక్టర్‌గా పెట్టుకున్నారు. ఆయన స్థానిక పనివాళ్లను తెచ్చుకుని తవ్వకాలు జరిపేవాడు. ఈ సందర్భంగా ఓసారి పురాతన పుర్రె ఒకటి బయటపడింది. ఆక్రమణదారులకు దానిని ఇవ్వడం ఇష్టం లేని చైనా కాంట్రాక్టర్‌.. పుర్రెను తీసుకెళ్లి ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టాడు. సంపదను అలా పాతి దాచుకోవడం చైనాలో ఓ సాంప్రదాయం. అలా ఆ పుర్రె 85 ఏళ్లు బావిలోనే ఉండిపోయింది. ఆయన చనిపోయే ముందు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో వారు ‘నిధి’ వేటకు బయలుదేరారు. చాలా ఏళ్లు గడిచిపోవడంతో.. ఆయన చెప్పిన ఆనవాళ్లను, మారిన పరిస్థితులను లింక్‌ చేసుకుంటూ వెతకడం మొదలుపెట్టారు. చివరికి 2018లో ఆ పుర్రెను తవ్వి తీశారు. కొద్దిరోజుల తర్వాత చైనాలోని హెబీ జియో యూనివర్సిటీ మ్యూజియానికి అందజేశారు. పుర్రె ‘చరిత్ర’ను తెలుసుకున్న అధికారులు.. శాస్త్రవేత్తలకు సమాచారం ఇవ్వడంతో దాని ప్రాధాన్యత ఏమిటో బయటపడింది. 

పెద్ద కనుబొమ్మలు.. పెద్ద మెదడు 
కాంట్రాక్టర్‌ కుటుంబ సభ్యులు తెచ్చిన పుర్రెను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా గుర్తించని కొత్త జాతికి చెందినదని తేల్చి పరిశోధన చేపట్టారు. మానవ జాతికి చాలా దగ్గరి పోలికలు ఉన్నట్టు గుర్తించారు. ఈ జాతికి ‘హోమో లోంగి’అని.. ముద్దుగా ‘డ్రాగన్‌ మ్యాన్‌’ అని పేరు పెట్టారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్‌ స్ట్రింగర్‌ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘మానవ జాతికి పూర్వీకులుగా ఇప్పటివరకు భావిస్తున్న అన్ని జాతుల్లోనూ మెదడు, కళ్లు బాగా చిన్నగా ఉంటాయి. కానీ ఈ కొత్త జాతిలో మెదడు ఆధునిక మానవుల కంటే కాస్త పెద్దగా ఉంది. కళ్లు, ముక్కు, దవడలు, దంతాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముఖం ఎత్తు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉంది. దవడ ఎముకల నిర్మాణం కూడా ఆధునిక మానవుల తరహాలో ఉంది. తల నిర్మాణాన్ని బట్టి ఆరేడు అడుగుల ఎత్తుతో, బలిష్టమైన శరీరంతో ఉండి ఉండొచ్చు. అయితే కనుబొమ్మల ప్రాంతంలో పుర్రె ఉబ్బెత్తుగా ఉంది. ఇది చాలా విచిత్రం. అది వానరాల నుంచి మనుషులు అభివృద్ధి చెందడం మొదలైన పురాతన కాలం నాటి లక్షణం’’ అని తెలిపారు.
 

ఎవరీ డ్రాగన్‌ మ్యాన్‌..?  
ఈ డ్రాగన్‌ మ్యాన్‌ పుర్రెను కార్బన్‌ డేటింగ్‌ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అది లక్షా 46 వేల సంవత్సరాల కిందటిదని తేల్చారు. సుమారు 50 ఏళ్ల వయసులో మరణించిన మగవాడి పుర్రెగా అంచనా వేశారు. ఆధునిక మానవులకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉండటంతోపాటు ప్రిమిటివ్స్‌ (కోతులు, చింపాంజీల వంటి మూల జాతుల) లక్షణాలు కూడా ‘డ్రాగన్‌ మ్యాన్‌’ పుర్రెలో గుర్తించారు. ఈ జాతివారు జంతువులను, పక్షులను వేటాడేవారని, పండ్లు, కూరగాయలను కూడా ఆహారంగా తీసుకునే వారని పరిశోధనలో పాల్గొన్న హెబీ జియో యూనివర్సిటీ శాస్త్రవేత్త క్సిజెన్‌ ని వెల్లడించారు. పుర్రె దొరికిన ప్రాంతం, పరిస్థితుల ఆధారంగా చూస్తే.. ఈ జాతివాళ్లు కఠినమైన, చలి ఎక్కువగా ఉండే వాతావరణాన్ని కూడా తట్టుకునే వారని అంచనా వేస్తున్నామన్నారు. ఇన్నాళ్లూ మనుషులకు సోదర జాతి నియండెర్తల్‌ మానవులే అన్న అంచనాలు ఉన్నాయని.. ఇప్పుడీ డ్రాగన్‌ మ్యాన్‌ వల్ల మానవ జాతి పరిణామక్రమంలో మార్పులు చేయాల్సి రానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులంతా కూడా హోమో సెపియన్స్‌ అనే ఆధునిక జాతికి చెందినవారని వివరించారు. పరిణామక్రమంలో సుమారు 70 లక్షల ఏళ్లనాటి నుంచి 40 వేల ఏళ్ల కిందటి వరకు సుమారు 21 జాతుల మానవులు జీవించారని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement